
సాక్షి, హైదరాబాద్: తనపై వస్తున్న అవినీతి ఆరోపణలను టీఎస్‌పీఎస్సీ చైర్మన్ మహేందర్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆయనపై ఇటీవల సోషల్‌మీడియాలో పలు అవినీతి ఆరోపణలు వ్యాప్తి చెందాయి. దీంతో మహేందర్‌రెడ్డి మంగళవారం తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై వివరణ ఇచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అబద్ధాలు, నిరాధారమైనవి, సత్యానికి దూరంగా ఉన్నవని తెలియజేశారు.
‘నేను 36 ఏళ్ళకు పైగా ఎలాంటి కళంకం లేకుండా పదవీ విరమణ వరకు అంకిత భావంతో పనిచేశా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రంలో పోలీసు శాఖలో సుధీర్ఘ కాలం పనిచేశా. నా కెరీర్ మొత్తంలో.. నేను క్లీన్ రికార్డ్, ఖ్యాతిని కొనసాగించాను. పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత నా ప్రతిష్టను దిగజార్చాలనే ఉద్దేశ్యంతో తప్పుడు ప్రచారం జరుగుతోంది.
సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేయడం దురదృష్టకరం. చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా అబద్ధాలు, నిరాధారమైనవి, సత్యానికి దూరంగా ఉన్నాయి. నా ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు ఆరోపణలు చేస్తున్న/ సర్క్యులేట్ చేస్తున్న వారందరిపై క్రిమినల్ చర్యలు, పరువునష్టం దాఖలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని మహేందర్‌రెడ్డి తెలిపారు.