తేలికపాటి, భారీ వాహనాలకు డ్యాష్ బోర్డుల వద్ద కెమెరాల ఫిక్సింగ్ 2016 ఫిబ్రవరి 21.... కుషాయిగూడలోని పోలీసుస్టేషన్ ఎదురుగా ఉన్న రోడ్డు...ఏపీ 29 బీటీ 6615 లారీ వల్ల జరిగిన ప్రమాదంలో నల్లగొండ జిల్లా చీకటిమామిడికి చెందిన భూపతి మధుసూదనరావు చనిపోయారు. అది ప్రమాదంకాదంటూ లారీ డ్రైవర్ నెత్తి నోరు బాదుకున్నారు. ఘటనాస్థలికి సమీపంలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను అధ్యయనం చేసిన పోలీసులు..మధుసూదనరావు ఆత్మహత్య చేసుకున్నట్లు తేల్చారు.
⇒ ఈ ఉదంతం చోటు చేసుకున్న చోట సీసీ కెమెరాలు లేకపోతే..! ‘ఆనవాయితీ’ ప్రకారం లారీ డ్రైవర్ కేసు విచారణను ఎదుర్కోవాల్సి వచ్చేది. ఇలాంటి వాటితో పాటు డ్రైవర్లకు ఎదురయ్యే ఎన్నో సమస్యలకు పరిష్కారంగా అందుబాటులోకి వచి్చనవే డ్యాష్ క్యామ్స్‌గా పిలిచే డ్యాష్ బోర్డు కెమెరాలు. నగరంలో వీటి వినియోగం ఇటీవల కాలంలో 30 శాతం పెరిగినట్లు కార్ డెకార్స్ వ్యాపారులు చెబుతున్నారు.
ఉదంతాలతో పాటు మోసాలు ఎన్నో...
కుషాయిగూడలో జరిగిన మధుసూదన్ రావు తరహా ఉదంతాలతో పాటు ప్రమాదాల పేరుతో కొందరు చేసే మోసాలు అనునిత్యం చోటు చేసుకుంటున్నాయి. తమ వారిని ఉద్దేశపూర్వకంగా వాహనాలకు ఎదురుగా, పక్కన నుంచి సమీపంలోకి పంపించే వాళ్లు ఉన్నారు. ఇలా వెళ్లిన వాళ్లను ఆ వాహనాలు తాకితే చాలు తక్షణం కింద పడిపోతారు. అక్కడే ఉండే వారి సంబం«దీకులు యాక్సిడెంట్ అంటూ హడావుడి చేస్తారు. మరికొన్ని ముఠాలైతే నిర్మానుష్య, రద్దీ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వాహనాలను ఆపుతున్నారు. ఫలానా చోట యాక్సిడెంట్ చేసి, పట్టించుకోకుండా వచ్చేస్తున్నావంటూ డ్రైవర్లను మోసం చేస్తున్నారు. ఈ రెండు తరహాలకు చెందిన వారి ప్రధాన ఉద్దేశం..బెదిరించి డబ్బు గుంజడమే.
హైఎండ్ వాహనాలకు ఇన్‌బుల్ట్‌గా...
కీలక సందర్భాల్లో వినియోగించడంతో పాటు ఇలాంటి వారికి చెక్ చెప్పడానికి ఉద్దేశించినవే డ్యాష్ క్యామ్‌లు. ఇటీవల అనేక హైఎండ్ వాహనాల్లో నలు వైపులా దృశ్యాలను రికార్డు చేయడానికి ఉద్దేశించిన కెమెరాలు ఇన్‌బుల్ట్‌గానే వస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం ఖరీదు చేసిన వాటితో పాటు పాత మోడల్స్‌కు చెందిన, సాధారణ వాహనాలను మాత్రం కేవలం వెనుక వైపు మాత్రమే కెమెరా ఉంటోంది. కొన్నింటిలో అసలు కెమెరానే ఉండట్లేదు. దీనివల్ల జరుగుతున్న నష్టాన్ని పరిగణలోకి తీసుకున్న అనేక కంపెనీలు ఈ డ్యాష్ క్యామ్‌లు అందుబాటులోకి తీసుకువచ్చాయి. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు... ఏది పెద్ద వాహనమైతే దాని చోదకుడిదే తప్పు అన్నట్లు నమోదు చేసే ‘ఆనవాయితీ’ ఏళ్లుగా కొనసాగుతోంది. దీనికి ఈ డ్యాష్ క్యామ్స్ చెక్ చెబుతున్నాయి.
డ్యాష్ క్యామ్స్ వల్ల ఉపయోగాలు ఎన్నో...
ఇటీవల కాలంలో వాహన చోదకులు వినియోగిస్తున్న డ్యాష్ క్యామ్స్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఏదైనా ఉదంతం జరిగినప్పుడు ఆద్యంతం ఏమి జరిగిందో ఈ వీడియో రుజువులను అందిస్తుంది. తప్పు ఎవరిది అనేది నిర్ధారించడంలో, బీమా క్లెయిమ్‌లను పొందడానికి ఉపయోగపడుతుంది. వాహనాలను యజమానులకు అప్పగించినప్పుడు వారి ప్రవర్తన తదితరాలను ఎప్పటికప్పుడు యజమానికి తెలిసేలా చేస్తుంది. పార్కింగ్ మోడ్‌లోనూ పనిచేసే కెమెరాల వల్ల హిట్–అండ్–రన్ కేసుల్లో కీలక సాక్ష్యాలు లభిస్తాయి. కొత్త డ్రైవర్లు వారి నైపుణ్యాలను మెరుగుపరచడంలోనూ వీటిలో నమోదైన ఫీడ్ కీలకపాత్ర పోషిస్తుంది. కొన్ని బీమా కంపెనీలు డాష్ క్యామ్‌లు ఉన్న వాహనాలకు ప్రీమియంల్లో డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నాయి.
పార్కింగ్ మోడ్‌లో పని చేసేవీ వాడాలి
ఈ డ్యాష్ క్యామ్ వాహనం డ్యాష్ బోర్డ్ లేదా విండ్ïÙల్డ్ పైన, రియర్ వ్యూ మిర్రర్ పక్కన/కింద ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. వీటిలో ప్రధానంగా రెండు రకాలు ఉన్నట్లు కోఠికి చెందిన కార్ డెకార్స్ నిపుణులు సయ్యద్ ముస్తాఖ్ చెప్తున్నారు. కొన్ని కేవలం ఇంజన్ ఆన్‌లో ఉన్నప్పుడు మాత్రమే పని చేస్తాయి. వీటి వల్ల వాహనం పార్క్ చేసి ఉన్నప్పుడు చోటు చేసుకునే ఉదంతాల్లో ఉపయోగం ఉండదు. ఈ నేపథ్యంలోనే బ్యాటరీ ఆధారంగా వాహనం పార్కింగ్ చేసి ఉన్నప్పుడూ పని చేసేవి బిగించుకోవాలని సూచిస్తున్నారు. నిర్ణీత స్టోరేజ్ కెపాసిటీ, మంచి క్యాలిటీ ఉన్న వీడియోను అందించే వాటికే మొగ్గు చూపాలని స్పష్టం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment