Dash board
-
‘డ్యాష్ క్యామ్’లకు డిమాండ్
తేలికపాటి, భారీ వాహనాలకు డ్యాష్ బోర్డుల వద్ద కెమెరాల ఫిక్సింగ్ 2016 ఫిబ్రవరి 21.... కుషాయిగూడలోని పోలీసుస్టేషన్ ఎదురుగా ఉన్న రోడ్డు...ఏపీ 29 బీటీ 6615 లారీ వల్ల జరిగిన ప్రమాదంలో నల్లగొండ జిల్లా చీకటిమామిడికి చెందిన భూపతి మధుసూదనరావు చనిపోయారు. అది ప్రమాదంకాదంటూ లారీ డ్రైవర్ నెత్తి నోరు బాదుకున్నారు. ఘటనాస్థలికి సమీపంలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను అధ్యయనం చేసిన పోలీసులు..మధుసూదనరావు ఆత్మహత్య చేసుకున్నట్లు తేల్చారు. ⇒ ఈ ఉదంతం చోటు చేసుకున్న చోట సీసీ కెమెరాలు లేకపోతే..! ‘ఆనవాయితీ’ ప్రకారం లారీ డ్రైవర్ కేసు విచారణను ఎదుర్కోవాల్సి వచ్చేది. ఇలాంటి వాటితో పాటు డ్రైవర్లకు ఎదురయ్యే ఎన్నో సమస్యలకు పరిష్కారంగా అందుబాటులోకి వచి్చనవే డ్యాష్ క్యామ్స్గా పిలిచే డ్యాష్ బోర్డు కెమెరాలు. నగరంలో వీటి వినియోగం ఇటీవల కాలంలో 30 శాతం పెరిగినట్లు కార్ డెకార్స్ వ్యాపారులు చెబుతున్నారు. ఉదంతాలతో పాటు మోసాలు ఎన్నో... కుషాయిగూడలో జరిగిన మధుసూదన్ రావు తరహా ఉదంతాలతో పాటు ప్రమాదాల పేరుతో కొందరు చేసే మోసాలు అనునిత్యం చోటు చేసుకుంటున్నాయి. తమ వారిని ఉద్దేశపూర్వకంగా వాహనాలకు ఎదురుగా, పక్కన నుంచి సమీపంలోకి పంపించే వాళ్లు ఉన్నారు. ఇలా వెళ్లిన వాళ్లను ఆ వాహనాలు తాకితే చాలు తక్షణం కింద పడిపోతారు. అక్కడే ఉండే వారి సంబం«దీకులు యాక్సిడెంట్ అంటూ హడావుడి చేస్తారు. మరికొన్ని ముఠాలైతే నిర్మానుష్య, రద్దీ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వాహనాలను ఆపుతున్నారు. ఫలానా చోట యాక్సిడెంట్ చేసి, పట్టించుకోకుండా వచ్చేస్తున్నావంటూ డ్రైవర్లను మోసం చేస్తున్నారు. ఈ రెండు తరహాలకు చెందిన వారి ప్రధాన ఉద్దేశం..బెదిరించి డబ్బు గుంజడమే. హైఎండ్ వాహనాలకు ఇన్‌బుల్ట్‌గా... కీలక సందర్భాల్లో వినియోగించడంతో పాటు ఇలాంటి వారికి చెక్ చెప్పడానికి ఉద్దేశించినవే డ్యాష్ క్యామ్‌లు. ఇటీవల అనేక హైఎండ్ వాహనాల్లో నలు వైపులా దృశ్యాలను రికార్డు చేయడానికి ఉద్దేశించిన కెమెరాలు ఇన్బుల్ట్గానే వస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం ఖరీదు చేసిన వాటితో పాటు పాత మోడల్స్‌కు చెందిన, సాధారణ వాహనాలను మాత్రం కేవలం వెనుక వైపు మాత్రమే కెమెరా ఉంటోంది. కొన్నింటిలో అసలు కెమెరానే ఉండట్లేదు. దీనివల్ల జరుగుతున్న నష్టాన్ని పరిగణలోకి తీసుకున్న అనేక కంపెనీలు ఈ డ్యాష్ క్యామ్‌లు అందుబాటులోకి తీసుకువచ్చాయి. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు... ఏది పెద్ద వాహనమైతే దాని చోదకుడిదే తప్పు అన్నట్లు నమోదు చేసే ‘ఆనవాయితీ’ ఏళ్లుగా కొనసాగుతోంది. దీనికి ఈ డ్యాష్ క్యామ్స్ చెక్ చెబుతున్నాయి. డ్యాష్ క్యామ్స్ వల్ల ఉపయోగాలు ఎన్నో... ఇటీవల కాలంలో వాహన చోదకులు వినియోగిస్తున్న డ్యాష్ క్యామ్స్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఏదైనా ఉదంతం జరిగినప్పుడు ఆద్యంతం ఏమి జరిగిందో ఈ వీడియో రుజువులను అందిస్తుంది. తప్పు ఎవరిది అనేది నిర్ధారించడంలో, బీమా క్లెయిమ్‌లను పొందడానికి ఉపయోగపడుతుంది. వాహనాలను యజమానులకు అప్పగించినప్పుడు వారి ప్రవర్తన తదితరాలను ఎప్పటికప్పుడు యజమానికి తెలిసేలా చేస్తుంది. పార్కింగ్ మోడ్‌లోనూ పనిచేసే కెమెరాల వల్ల హిట్–అండ్–రన్ కేసుల్లో కీలక సాక్ష్యాలు లభిస్తాయి. కొత్త డ్రైవర్లు వారి నైపుణ్యాలను మెరుగుపరచడంలోనూ వీటిలో నమోదైన ఫీడ్ కీలకపాత్ర పోషిస్తుంది. కొన్ని బీమా కంపెనీలు డాష్ క్యామ్‌లు ఉన్న వాహనాలకు ప్రీమియంల్లో డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నాయి. పార్కింగ్ మోడ్‌లో పని చేసేవీ వాడాలి ఈ డ్యాష్ క్యామ్ వాహనం డ్యాష్ బోర్డ్ లేదా విండ్ïÙల్డ్ పైన, రియర్ వ్యూ మిర్రర్ పక్కన/కింద ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. వీటిలో ప్రధానంగా రెండు రకాలు ఉన్నట్లు కోఠికి చెందిన కార్ డెకార్స్ నిపుణులు సయ్యద్ ముస్తాఖ్ చెప్తున్నారు. కొన్ని కేవలం ఇంజన్ ఆన్‌లో ఉన్నప్పుడు మాత్రమే పని చేస్తాయి. వీటి వల్ల వాహనం పార్క్ చేసి ఉన్నప్పుడు చోటు చేసుకునే ఉదంతాల్లో ఉపయోగం ఉండదు. ఈ నేపథ్యంలోనే బ్యాటరీ ఆధారంగా వాహనం పార్కింగ్ చేసి ఉన్నప్పుడూ పని చేసేవి బిగించుకోవాలని సూచిస్తున్నారు. నిర్ణీత స్టోరేజ్ కెపాసిటీ, మంచి క్యాలిటీ ఉన్న వీడియోను అందించే వాటికే మొగ్గు చూపాలని స్పష్టం చేస్తున్నారు. -
వలస కూలీల కోసం ఆన్లైన్ డాష్‌బోర్డు
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో వలస కూలీలకు రవాణా వసతి కల్పించేందుకు రాష్ట్రాల మధ్య సమన్వయానికి వీలుగా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఆన్లైన్ డాష్‌బోర్డు ఏర్పాటు చేసింది. నేషనల్ మైగ్రెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(ఎన్ఎంఐఎస్) పేరుతో ఎన్డీఎంఏ–జీఐఎస్ పోర్టల్‌లో ఈ ఆన్లైన్ డాష్‌బోర్డు ఏర్పాటు చేశారు. వలస కూలీలకు సంబంధించిన సమాచారం రాష్ట్రాలు, జిల్లాల మధ్య ఇచ్చిపుచ్చుకుంటూ వారికి అవసరమైన రవాణా వసతి కల్పించడంలో సమన్వయం చేసుకునేందుకు గాను ఆన్లైన్ డేటా క్రోడీకరణకు ఈ డాష్‌బోర్డు వీలు కల్పిస్తుంది. ఆన్లైన్లోనే రాష్ట్రాలు, జిల్లాల మధ్య సమాచారం ఇచ్చి పుచ్చుకునే వీలుంది. అలాగే వలస కూలీల కాంటాక్ట్ ట్రేసింగ్‌కు కూడా ఈ డేటా ఉపయోగపడుతుంది. ఈనేపథ్యంలో ఈ డాష్‌బోర్డు కోసం వలస కూలీల వివరాలను నమోదు చేయాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు శనివారం లేఖ రాశారు. రాష్ట్రాలు ఇప్పటికే వలస కూలీల సమాచారాన్ని సేకరించినందున, బ్యాచుల వారీగా కూలీల వ్యక్తిగత వివరాలను ఈ పోర్టల్‌లో అప్లోడ్ చేయవచ్చు. ఆయా కూలీల పేర్లు, వయస్సు, మొబైల్ నెంబర్, ప్రస్తుతం ఉన్న ప్రాంతం, వెళ్లాలనుకుంటున్న ప్రాంతం, వెళ్లాలనుకుంటున్న తేదీ తదితర వివరాలను రాష్ట్రాలు ఇప్పటికే సేకరిస్తున్నాయి. దీని వల్ల రాష్ట్రాలు ఆయా శ్రామికుల వివరాలపై అంచనాకు వచ్చే వీలుంది. ఎంత మంది వెళుతున్నారు? ఎంత మంది వేరే ప్రాంతాల నుంచి వస్తున్నారన్న వివరాలు అందుబాటులోకి వస్తాయి. వారికి అవసరమైన ప్రయాణ సదుపాయాలు కల్పించేందుకు వీలుంటుంది. కోవిడ్–19 నేపథ్యంలో వారి కదలికలపై పర్యవేక్షణకు వీలుంటుంది. ప్రతి వలస కూలీకి సంబంధించి ఒక గుర్తింపు నెంబర్ జనరేట్ అవుతుంది. ఈ నెంబర్ ఆధారంగానే భవిష్యత్తు లావాదేవీలు జరుపుతారు. వలస కూలీల కదలికలపై ఈ పోర్టల్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కూడా పర్యవేక్షణకు వీలు కలుగుతుంది. -
సెంటిమెంట్ టచ్
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఏటా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో వేల మంది ప్రాణాలు కోల్పోతుండగా లక్షల మంది క్షతగాత్రులుగా మారుతున్నారు. ఈ యాక్సిడెంట్స్‌లో ప్రధానంగా జాతీయ రహదారులపై, కమర్షియల్ వాహనాల కారణంగా జరుగుతున్నవీ పెద్ద సంఖ్యలోనే ఉంటున్నాయి. నిబంధనలు తుంగలో తొక్కుతున్న కమర్షియల్ వాహనాల డ్రైవర్ల వైఖరి ప్రమాదహేతువుగా మారుతోంది. పరిమితికి మించి ప్రయాణికుల్ని ఎక్కించుకోవడం, సరుకు రవాణా వాహనంలో ప్రయాణికుల్ని తీసుకువెళ్ళడం, మద్యం మత్తులో, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిలో ఆయా వాహనాలకు చెందిన డ్రైవర్ తదితరులే కాకుండా ఏ పాపం ఎరుగని ఎదుటి వాహనాల వారు, పాదచారులు బాధితులుగా మారుతున్నారు. ఈ తరహా ప్రమాదాలు నిరోధించడానికి వాటి డ్రైవర్లపై సెంటిమెంట్ ప్రయోగించాలని కేంద్రం ఆధీనంలోని మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ (ఎంఓఆర్టీహెచ్) యోచిస్తోంది. గత ఏడాది దేశ వ్యాప్తంగా జరిగిన మొత్తం ప్రమదాలతో పోలిస్తే లారీలు వంటి కమర్షియల్ వాహనాల వల్ల జరిగిన ప్రమాదాల్లోనే 20.1 శాతం మంది మరణించారు. ఈ నేపథ్యంలోనే నిబంధనల్ని బేఖాతరు చేయడం, దూకుడుగా వ్యవహరించడం చేస్తున్న కమర్షియల్ వాహనాల డ్రైవర్లకు ఓపక్క అవగాహన కల్పించడంతో పాటు మరోపక్క వారిపై సెంటిమెంట్‌ను ప్రయోగించనున్నారు. ఆయా వాహనాల్లో డ్యాష్‌బోర్డులపై డ్రైవర్లకు ఎదురుగా వారి కుటుంబీకుల ఫోటోలు ఉంచడం తప్పనిసరి చేయాలని ఎంఓఆర్‌టీఎహెచ్ యోచిస్తోంది. తద్వారా తన కోసం ఇంట్లో ఎదురు చూస్తున్న కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకునే డ్రైవర్లు జాగ్రత్తగా వాహనాలు పడుపుతారని ఆ విభాగం భావిస్తోంది. ఈ విధానాన్ని ఆయా రాష్ట్రాలకు చెందిన ఆర్టీఏతో కలిసి చేపట్టాలని భావిస్తోంది. దీనికి సంబంధించి ప్రాథమికంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి అభిప్రాయాన్ని తీసుకోవాలని భావిస్తోంది. ఇందులో వచ్చిన మెజార్టీ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోనుంది. ఆపై అవసరమైతే మోటారు వాహన చట్టంలో సవరణలు ప్రతిపాదించాలని ఎంఓఆర్‌టీఎహెచ్ అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. కమర్షియల్ వాటితో పాటు ఇతర వాహనాల వల్ల జరుగతున్న ప్రమాదాలను నిరోధించడానికీ పటిష్ట కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడానికి ఎంఓఆర్‌టీఎహెచ్ సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఏడాది నుంచి ఈ విధానాలు అమలులోకి తీసుకురావడానికి వీలుగా అవసరమైతే రాష్ట్రాలకు ప్రత్యేకంగా నిధులు సైతం కేటాయించాలని యోచిస్తోంది. వీటితో ఆయా రాష్ట్ర పోలీసు, ఆర్టీఏ విభాగాలు తమకు అవసరమైన పరికరాలు, ఉపకరణాలను సమీకరించుకుని రంగంలోకి దిగేలా ఆదేశాలు జారీ చేయనుంది. ఇవి ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అమలులో ఉన్నప్పటికీ దేశ వ్యాప్తంగా యూనిఫామిటీలో అమలయ్యేలా చూడాలని భావిస్తోంది. కీలక సవరణలతో కూడిన మోటారు వాహనాల చట్టం సవరణ బిల్లు అమలులో రావడంలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలోనే ఎంఓఆర్టీహెచ్ ఈ ఆలోచన చేసి ఉండచ్చని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఎంఓఆర్‌టీఎహెచ్ యోచిస్తున్న ముఖ్య చర్యలివీ... ♦ పరిమితికి మించిన లోడుతో ప్రయాణిస్తున్న వాహనాలను గుర్తించడానికి చెక్‌పోస్టుల సమీపంలోని వేయింగ్ మిషన్ల వద్ద ప్రత్యేక తనిఖీలు ఏర్పాటు చేయాలి. అన్ని వాహనాల పైనా ఒకే రకమైన చర్యలు తీసుకోవడం కాకుండా... అందులో ఉన్న లోడును బట్టి జరిమానా విధించడమో, వాహనాన్ని జప్తు చేయడమో చేసేలా విధానం రూపొందించనుంది. ♦ మైనర్లు వాహనాలు నడపటానికి అర్హులు కాదు. ఈ నేపథ్యంలోనే స్కూళ్ళు, జూనియర్ కాలేజీల యాజమాన్యాలతో కలిసి స్పెషల్ డ్రైవ్స్ చేపట్టేలా ఆర్టీఏ, పోలీసు విభాగాలకు సిఫార్సు చేయనుంది. వీటికి వాహనాలను డ్రైవ్ చేసుకుంటూ వచ్చే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులనూ పిలిపించి కౌన్సిలింగ్ చేయడం, కేసులు నమోదు తప్పనిసరి చేసేలా ఆదేశించనుంది. ♦ జాతీయ రహదారులను ప్రతి 40 కిమీకి ఒక సెక్టార్‌గా ఏర్పాటు చేయించి... హైవే పెట్రోలింగ్ వాహనాలతో నిరంతరం గస్తీ ఉండాలంటూ రాష్ట్రాలకూ సూచించనుంది. ఈ వాహనాలు అక్కడ నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించి, ప్రమాదకారకాలను గుర్తించడంతో పాటు నిరోధించడానికి తీసుకోవాల్సిన చర్యల్నీ సిఫార్సు చేయాల్సి ఉంటుంది. ♦ వరుసగా మూడేళ్ళ గణాంకాలను పరిగణలోకి తీసుకుని పోలీసుస్టేషన్ల వారీగా ఒకటి కంటే ఎక్కువ ప్రమాదాలు జరిగిన ప్రాంతాలను గుర్తించడం, వాటిలో లోపాలను సరిచేయడానికి నివేదికలు రూపొందించాల్సిన బాధ్యతా స్థానిక పోలీసు, ఆర్టీఏ అధికారులకు అప్పగించేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ♦ మద్యం తాగి వాహనాలు నడిపే డ్రైవర్లకు చెక్ చెప్పడానికి జాతీయ రహదారుల్లోనూ తనిఖీలు తప్పనిసరి చేయించనుంది. దీనికోసం టోల్‌ప్లాజాలు, చెక్‌పోస్టుల్లో ప్రత్యేకంగా పోలీసులు సిబ్బందిని నియమించేలా, వారికి బ్రీత్ అనలైజర్లుతో పాటు ఇతర పరికరాలు ఇచ్చేలా చర్యలకు యోచిస్తోంది. -
డ్యాష్ బోర్డు పై నీలినీడలు
రెండు నెలలుగా కసరత్తు ఇండికేటర్లకు రెవెన్యూ శాఖ దూరం సిటీబ్యూరో: జిల్లా అధికార యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘డ్యాష్ బోర్డు’ రూపకల్పనపై నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. గత మూడు నెలలుగా ఇందుకు సంబందించి కసరత్తు సాగుతూనే ఉంది. పరిపాలన యంత్రాంగంలో కీలకమైన రెవెన్యూ శాఖ నుంచి ఇప్పటి వరకు ఇండికేటర్ల సమాచారం అందక పోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఏపీ తరహాలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల గణాంకాల డాటా బేస్ తో జిల్లా స్థాయి ’డ్యాష్ బోర్డు’ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా తొలివిడత ప్రయోగాత్మకంగా రంగారెడ్డి, మహాబూబ్‌నగర్, వరంగల్ అర్బన్, వనపర్తి జిల్లాలను ఎంపిక చేసింది. ఈ మేరకు ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. తొలివిడతలో హైదరాబాద్ జిల్లా లేనప్పటికి కలెక్టర్ రాహుల్ బొజ్జా ప్రత్యేక శ్రద్దతో డ్యాష్ బోర్డు ఏర్పాటును ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందస్తుగా రూపకల్పనకు సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో జిల్లా స్థాయి అధికారులతో సమావేశం ఏర్పాటుచేసి తమ శాఖలకు సంబంధించిన నాలుగు లేదా ఐదు ముఖ్యమైన ఇండికేటర్లను గుర్తించి పంపాలని సూచించారు. ఇందుకుగాను సీజీజీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఇండికేటర్ల ప్రొఫార్మాను సైతం జిల్లా ప్రణాళిక విభాగం ద్వారా వివిధ శాఖలకు పంపారు. జిల్లాల్లో మొత్తం 48 శాఖలు ఉండగా 31 శాఖల నుంచి సమాచారం అందింది. అధికార యంత్రాంగం ముఖ్యమైన నాలుగైదు ఇండికేటర్లను పంపాలని సూచించగా, పలు శాఖలు ఏకంగా నివేదికలు సమర్పించడం గమనార్హం. మరికొన్ని శాఖలు గణాంకాల వివరాలను అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. డాటా బేస్‌తో డ్యాష్ బోర్డు జిల్లా సమాచారం సమస్తం అప్ డేట్ గా అందుబాటులో ఉండే విధంగా డ్యాష్ బోర్డు ఏర్పాటు చేస్తున్నారు. రెవెన్యూ, విద్యా, ఆరోగ్య, సంక్షేమ, ఇతరాత్ర శాఖల ద్వారా అమలవుతున్న పథకాలు, కార్యక్రమాల సమగ్ర వివరాలు గణాంకాల రూపంలో గల డాటా బేస్‌ను ఒక పోర్టర్ లో పొందుపర్చాలన్నది డ్యాష్ బోర్డు లక్ష్యం. కలెక్టర్ రాహుల్ బొజ్జ, జాయింట్ కలెక్టర్ ప్రశాంతి ప్రతి సమావేశంలో డ్యాష్ బోర్డు కోసం ముఖ్యమైన ఇండికేటర్ల సమాచారాన్ని పంపించాలని అధికారులను సూచిస్తున్న ఎవరూ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. డే టూ డే అప్డేట్.. డ్యాష్ బోర్డులో వివిధ శాఖల సమాచారాన్నంతా ప్రతిరోజు అప్డేట్ చేస్తారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని అప్డేట్ చేసేందుకు ప్రతి శాఖ కార్యాలయం నుంచి సాంకేతిక పరిజ్ఞానం కలిగిన సిబ్బందిని ప్రత్యేకంగా నియమించి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అప్డేట్ సమాచారం ఉండే విధంగా చర్యలు చేపడుతున్నారు. కలెక్టర్ మొత్తం డ్యాష్ బోర్డుపై, జిల్లా స్థాయి అధికారులు తమ శాఖల పనితీరు ఎప్పటి కప్పుడు పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. శాఖల పనితీరు, వెనుకబాటును గుర్తించి ప్రోత్సహించేందుకు అవకాశం ఏర్పడుతుంది. అయితే సాక్షాత్తు రెవెన్యూ శాఖ సమాచారం అందించక పోవడంతో డ్యాష్ బోర్డు రూప కల్పనకు అడ్డంకులు తప్పడం లేదు.