డ్యాష్ బోర్డు పై నీలినీడలు
రెండు నెలలుగా కసరత్తు
ఇండికేటర్లకు రెవెన్యూ శాఖ దూరం
సిటీబ్యూరో: జిల్లా అధికార యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘డ్యాష్ బోర్డు’ రూపకల్పనపై నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. గత మూడు నెలలుగా ఇందుకు సంబందించి కసరత్తు సాగుతూనే ఉంది. పరిపాలన యంత్రాంగంలో కీలకమైన రెవెన్యూ శాఖ నుంచి ఇప్పటి వరకు ఇండికేటర్ల సమాచారం అందక పోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఏపీ తరహాలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల గణాంకాల డాటా బేస్ తో జిల్లా స్థాయి ’డ్యాష్ బోర్డు’ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా తొలివిడత ప్రయోగాత్మకంగా రంగారెడ్డి, మహాబూబ్‌నగర్, వరంగల్ అర్బన్, వనపర్తి జిల్లాలను ఎంపిక చేసింది. ఈ మేరకు ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. తొలివిడతలో హైదరాబాద్ జిల్లా లేనప్పటికి కలెక్టర్ రాహుల్ బొజ్జా ప్రత్యేక శ్రద్దతో డ్యాష్ బోర్డు ఏర్పాటును ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందస్తుగా రూపకల్పనకు సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో జిల్లా స్థాయి అధికారులతో సమావేశం ఏర్పాటుచేసి తమ శాఖలకు సంబంధించిన నాలుగు లేదా ఐదు ముఖ్యమైన ఇండికేటర్లను గుర్తించి పంపాలని సూచించారు. ఇందుకుగాను సీజీజీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఇండికేటర్ల ప్రొఫార్మాను సైతం జిల్లా ప్రణాళిక విభాగం ద్వారా వివిధ శాఖలకు పంపారు. జిల్లాల్లో మొత్తం 48 శాఖలు ఉండగా 31 శాఖల నుంచి సమాచారం అందింది. అధికార యంత్రాంగం ముఖ్యమైన నాలుగైదు ఇండికేటర్లను పంపాలని సూచించగా, పలు శాఖలు ఏకంగా నివేదికలు సమర్పించడం గమనార్హం. మరికొన్ని శాఖలు గణాంకాల వివరాలను అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి.
డాటా బేస్‌తో డ్యాష్ బోర్డు
జిల్లా సమాచారం సమస్తం అప్ డేట్ గా అందుబాటులో ఉండే విధంగా డ్యాష్ బోర్డు ఏర్పాటు చేస్తున్నారు. రెవెన్యూ, విద్యా, ఆరోగ్య, సంక్షేమ, ఇతరాత్ర శాఖల ద్వారా అమలవుతున్న పథకాలు, కార్యక్రమాల సమగ్ర వివరాలు గణాంకాల రూపంలో గల డాటా బేస్‌ను ఒక పోర్టర్ లో పొందుపర్చాలన్నది డ్యాష్ బోర్డు లక్ష్యం. కలెక్టర్ రాహుల్ బొజ్జ, జాయింట్ కలెక్టర్ ప్రశాంతి ప్రతి సమావేశంలో డ్యాష్ బోర్డు కోసం ముఖ్యమైన ఇండికేటర్ల సమాచారాన్ని పంపించాలని అధికారులను సూచిస్తున్న ఎవరూ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు.
డే టూ డే అప్‌డేట్..
డ్యాష్ బోర్డులో వివిధ శాఖల సమాచారాన్నంతా ప్రతిరోజు అప్‌డేట్ చేస్తారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని అప్‌డేట్ చేసేందుకు ప్రతి శాఖ కార్యాలయం నుంచి సాంకేతిక పరిజ్ఞానం కలిగిన సిబ్బందిని ప్రత్యేకంగా నియమించి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అప్‌డేట్ సమాచారం ఉండే విధంగా చర్యలు చేపడుతున్నారు. కలెక్టర్ మొత్తం డ్యాష్ బోర్డుపై, జిల్లా స్థాయి అధికారులు తమ శాఖల పనితీరు ఎప్పటి కప్పుడు పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. శాఖల పనితీరు, వెనుకబాటును గుర్తించి ప్రోత్సహించేందుకు అవకాశం ఏర్పడుతుంది. అయితే సాక్షాత్తు రెవెన్యూ శాఖ సమాచారం అందించక పోవడంతో డ్యాష్ బోర్డు రూప కల్పనకు అడ్డంకులు తప్పడం లేదు.