సామాన్యులతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలి..
దేశానికే రోల్‌మోడల్‌గా కొత్త రెవెన్యూ చట్టం తెస్తున్నాం
డిప్యూటీ కలెక్టర్లతో ముఖాముఖిలో రెవెన్యూ మంత్రి పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: ‘ప్రభుత్వానికి కళ్లు, చెవులు మీరే. మీరు బాగా పనిచేస్తే ప్రజలకు మేలు జరగడమే కాదు.. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. సామాన్యులతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలి. గతానికి, ప్రస్తుతానికి తేడా కనపడాలి’అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రెవెన్యూ ఉద్యోగులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని 272 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లతో మంత్రి పొంగులేటి ఆదివారం హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో ముఖా ముఖి సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదేళ్లుగా రాష్ట్ర ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న రెవెన్యూ సమస్యల నుంచి విముక్తి కలిగించేలా దేశానికే రోల్‌మోడల్‌గా ఉండే కొత్త రెవెన్యూ చట్టాన్ని త్వరలో తీసుకొస్తామని తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకొనేలా రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామన్నారు.
వ్యవస్థలో ఒకరిద్దరి తప్పుల కారణంగా అందరికీ చెడ్డపేరు వస్తోందని, అలాంటి పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తగా పనిచేయాలని, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు వేసే ప్రతి అడుగు రెవెన్యూ వ్యవస్థకు వన్నె తెచ్చేలా ఉండాలన్నారు.
రెవెన్యూ సేవల్లో అంతరాయాన్ని నివారించేలా నల్లగొండ జిల్లా తిరుమలగిరి, రంగారెడ్డి జిల్లా యాచారం మండలాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టామని.. ఈ క్రమంలో ఎదురైన అనుభవాలను పరిగణనలోకి తీసుకొని కొత్త ఆర్‌వోఆర్ చట్టాన్ని రూపొందించే ప్రక్రియ తుదిదశకు చేరుకుందని వివరించారు. కొత్త చట్టం వచ్చేలోగానే ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తామన్నారు.
3 నెలలకోసారి లీగల్ సమావేశాలు..
ప్రభుత్వ భూముల పరిరక్షణలో రెవెన్యూ యంత్రాంగం రాజీపడవద్దని మంత్రి పొంగులేటి సూచించారు. భూముల పరిరక్షణ కోసం మూడు నెలలకోసారి రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో లీగల్ టీంలతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. భవిష్యత్తులో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. రెవెన్యూ మంత్రిగా ఎవరున్నా భూముల రికార్డులను టాంపరింగ్ చేసేందుకు వీల్లేకుండా రెవెన్యూ రికార్డుల డిజిటైజేషన్ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన చేపడతామని తెలిపారు.
రెవెన్యూ కార్యాలయాలకు సొంత భవనాలు లేకపోయినా పట్టించుకోని గత ప్రభుత్వం.. అప్పు చేసి మరీ ఉన్న సచివాలయాన్ని కూలగొట్టి కొత్తది కట్టిందని విమర్శించారు. కొన్ని జిల్లాల్లో కలెక్టరేట్‌లు ఉన్నా కొత్తవి నిర్మించిందని.. తానైతే అలాంటి పనులు చేయబోనని పొంగులేటి స్పష్టం చేశారు.
అందరికీ శిక్షణ తప్పనిసరి..
రెవెన్యూ శాఖలో ఉద్యోగంలో చేరిన వారితోపాటు సర్వీసులో ఉన్న వారికి కూడా శిక్షణ తప్పనిసరి చేస్తామని.. ఇందుకోసం రెవెన్యూ అకాడమీని ఏర్పాటు చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. రెవెన్యూ ఉద్యోగుల జాబ్ చార్ట్ నిర్ధారణకు కమిటీని ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాల్లోని ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి జాబ్ చార్ట్ రూపొందిస్తామన్నారు.
ఆర్థికేతర అంశాలకు తక్షణమే పరిష్కారం
రెవెన్యూ ఉద్యోగుల సమస్యల్లో ఆర్థికేతర అంశాలను తక్షణమే పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. 33 జిల్లాల్లో సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులను ఏర్పాటు చేస్తామని, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల కేడర్ స్ట్రెంగ్త్ పెంచుతామని, 17 మంది రెవెన్యూ అధికారులకు ఐఏఎస్ హోదా కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల సమయంలో బదిలీ అయిన తహసీల్దార్లను పూర్వ జిల్లాలకు పంపడంపై దసరాలోపే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, తెలంగాణ స్టేట్ సివిల్ సర్వీసెస్ డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు కె. చంద్రమోహన్, ప్రధాన కార్యదర్శి డి. శ్రీనివాస్‌రెడ్డి, కోశాధికారి భాస్కరరావు, డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు వి. లచ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ, ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment