సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవలి వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున సాయం అందించనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. వరదలతో ప్రభావితమైన ప్రతి కుటుంబానికి రూ. 16,500 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాలు ఇటీవలి వర్షాలకు ప్రభావితం అయ్యాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 మంది ప్రాణాలు కోల్పోయారని, వారి కుటుంబాలకు సాయం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల ప్రభావంపై సోమవారం సచివాలయంలో మంత్రి పొంగులేటి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎస్ శాంతికుమారి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్‌లతోపాటు మున్సిపల్, వ్యవసాయం, పంచాయతీరాజ్, విద్యుత్, విద్య, రహదారులు, భవనాలు, హౌసింగ్, ఇరిగేషన్ అధికారులు ఇందులో పాల్గొన్నారు.
సమీక్షలో వరద నష్టాన్ని అంచనా వేయడంతోపాటు దాన్ని పూడ్చుకునేందుకు ఎన్ని నిధులు కావాలన్న దానిపై చర్చించారు. వరదలు, నష్టంపై కేంద్రానికి పంపాల్సిన నివేదికలో పొందుపర్చాల్సిన అంశాలపై మంత్రి పొంగులేటి అధికారులకు పలు సూచనలు చేశారు. వరద బాధితులకు యుద్ధ ప్రాతిపదికన సాయం అందించాలని ఆదేశించారు. బాధితులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
మానవతా దృక్పథంతో సాయం పెంపు
సమీక్షలో అధికారులు మాట్లాడుతూ.. వరదల కారణంగా ఖమ్మం జిల్లాలో ఆరుగురు, కొత్తగూడెంలో ఐదుగురు, ములుగులో నలుగురు, కామారెడ్డి, వనపర్తిలలో ముగ్గురి చొప్పున చనిపోయారని మంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి పొంగులేటి.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయంతోపాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలతో పూర్తిగా, పాక్షికంగా కూలిపోయిన ఇళ్లను గుర్తించి.. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సూచించారు. వరదలతో ప్రభావితమైన ప్రతి కుటుంబానికి రూ.16,500 చొప్పున సాయం అందించాలని.. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా నేరుగా బాధితుల ఖాతాల్లోనే జమ చేయాలని ఆదేశించారు. తొలుత రూ.10 వేల ఆర్థిక సాయం అనుకున్నప్పటికీ.. మానవతా దృక్పథంతో దాన్ని రూ.16,500కు పెంచామని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా వరద ముంపునకు గురైన పంట భూములకు ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు. ఇక మైనింగ్ వ్యర్థాలను ప్రభుత్వ భూముల్లో వేయడం వల్ల వరద వెళ్లక సూర్యాపేట, పాలేరులకు భారీగా నష్టం జరిగిందని అధికారులు సమీక్షలో మంత్రికి వివరించారు. దీంతో ఆ నష్టాన్ని మైనింగ్ ఏజెన్సీల నుంచే వసూలు చేయాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని పౌర సరఫరాల శాఖ ద్వారా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని సూచించారు.
శాశ్వత మరమ్మతులు చేపట్టండి
సమీక్షలో భాగంగా అధికారులు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 358 గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయని, దాదాపు 2 లక్షల మంది ప్రభావితమయ్యారని వివరించారు. 158 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని, 13,494 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు. వర్షాలు, వరదలతో ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ రోడ్లు వేల కిలోమీటర్ల పొడవునా దెబ్బతిన్నాయని అధికారులు వివరించగా.. వెంటనే తాత్కాలిక మరమ్మతులు చేపట్టి రోడ్లను పునరుద్ధరించాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు.
శాశ్వత మరమ్మతులకు అవసరమైన కార్యాచరణను రెండు రోజుల్లో తయారు చేయాలని సూచించారు. పెద్ద, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల మరమ్మతులను కూడా వేగంగా చేపట్టాలన్నారు. అంగన్‌వాడీ, ప్రభుత్వ పాఠశాలలు, పీహెచ్‌సీలు ఏ మేరకు దెబ్బతిన్నాయనే వివరాలను సేకరించాలని సూచించారు. ఇక వర్షాలు, వరదల కారణంగా ఇండ్లలోకి నీరు చేరి.. ఇంటి పత్రాలు, ఆస్తి పత్రాలు, కుటుంబ సభ్యుల ఆధార్, రేషన్‌కార్డులు, విద్యార్థుల సర్టిఫికెట్లు తడిచిపోయాయని, కొన్నిచోట్ల కొట్టుకుపోయాయని అధికారులు వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి... డాక్యుమెంట్లు పోయిన బాధితులు స్థానిక పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని, వీలైనంత త్వరగా వారికి డూప్లికేట్ పత్రాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
వరద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల సాయం
Published Tue, Sep 10 2024 5:22 AM | Last Updated on Tue, Sep 10 2024 3:35 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment