గోదావరి ఉప్పొంగుతుండటంతో అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశం
భద్రాచలంలో పర్యటన.. వరద ఉధృతి, సహాయ కార్యక్రమాలపై సమీక్ష
పెద్దవాగు ప్రాజెక్టు బాధితులకు పరామర్శ.. సాయంపై హామీ..
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గోదావరి నదికి వరదలు పోటెత్తుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. సోమవా రం మంత్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పర్య టించారు. గోదావరి తీరంలో కరకట్టలను పరిశీలించి, జిల్లా అధికారులతో సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయ శిబిరాలకు తరలించాలని.. వరద తగ్గేవరకు కూనవరం– భద్రాచలం– దుమ్ముగూడెం రోడ్ల మీదుగా రాకపోకలను నిలిపేయాలని సూచించారు. భద్రాచలంలోకి చేరే వరద నీటిని నదిలోకి ఎత్తిపోసేలా మోటార్లు సిద్ధం చేయాలన్నారు. అనంతరం బూర్గంపాడు మండలంలో పొలాలను పరిశీలించారు.
‘పెద్దవాగు’పై అధికారుల వైఫల్యం
అశ్వారావుపేట మండలంలో పెద్దవాగు ప్రాజెక్టుకు గండ్లు పడటానికి ఇంజనీర్ల నిర్లక్ష్యమే కారణమని పొంగులేటి పేర్కొన్నారు. పెద్దవాగు ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. భారీ వరద వస్తుంటే అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టలేదని.. ప్రాజెక్టులోని నీటిని ఖాళీ చేయించలేదని మండిపడ్డారు. అధికారులకు నోటీసులు ఇచ్చామని, తప్పు చేసినవారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం గత పదేళ్లుగా తగినంత శ్రద్ధ పెట్టలేదని విమర్శించారు.
ప్రాజెక్టు విషయంలో తప్పు జరిగిన విషయాన్ని అంగీకరిస్తున్నామన్నారు. ఇరు రాష్ట్రాల సీఎంలు మాట్లాడుకుని తిరిగి ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయతి్నస్తారని తెలిపారు. ఆలోగా ఫీడర్ చానల్ లేదా రింగ్‌బండ్ నిర్మించి ఆయకట్టు రైతులకు నీరు అందించేందుకు ప్రయతి్నస్తామన్నారు. ప్రాజెక్టు గండ్లు, వరదలతో నష్టపోయిన వారిని మంత్రి పరామర్శించారు. ప్రభుత్వంతోపాటు తన తండ్రి పేరిట ఏర్పాటు చేసిన ట్రస్ట్ ద్వారా సాయం అందిస్తామని ప్రకటించారు. వరద కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి రెండు నెలల్లో ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.
ముగ్గురు ఇంజనీర్లపై చర్యలకు సిఫారసు
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదిపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఏకైక ఉమ్మడి ప్రాజెక్టు ‘పెద్దవాగు’. 16 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేలా 1981లో దీనిని నిర్మించారు. 40,500 క్యూసెక్కుల వరదను విడుదల చేసేలా స్పిల్‌వేను డిజైన్ చేశారు. కానీ 1989లో 70 వేల క్యూసెక్కుల వరద రావడంతో స్పిల్‌వేకు ఎడమవైపు 200 మీటర్ల వరకు కట్టకు గండిపడింది. ఇప్పుడు 75వేల క్యూసెక్కుల వరద రావడంతో మళ్లీ గండ్లు పడ్డాయి.
దీనికి నిర్వహణ లోపమే కారణమని.. ఎగువ నుంచి భారీ వరద రానుందని సమాచారమున్నా ఇంజనీర్లు సకాలంలో గేట్లు ఎత్తలేదని.. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ముందస్తు హెచ్చరికలేవీ జారీ చేయకుండా నీటిని విడుదల చేశారని అధికారులు గుర్తించారు. ప్రాజెక్టు నిర్వహణలో విఫలమైన డీఈఈ, ఏఈఈ, ఏఈలపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ప్రాజెక్టుకు గండ్లు పడటంతో 16 గ్రామాలు నీట మునిగాయి. రూ.100 కోట్ల మేర నష్టం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు.
Comments
Please login to add a commentAdd a comment