సాక్షి, హైదరాబాద్: దేశంలో ఏటా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో వేల మంది ప్రాణాలు కోల్పోతుండగా లక్షల మంది క్షతగాత్రులుగా మారుతున్నారు. ఈ యాక్సిడెంట్స్‌లో ప్రధానంగా జాతీయ రహదారులపై, కమర్షియల్ వాహనాల కారణంగా జరుగుతున్నవీ పెద్ద సంఖ్యలోనే ఉంటున్నాయి. నిబంధనలు తుంగలో తొక్కుతున్న కమర్షియల్ వాహనాల డ్రైవర్ల వైఖరి ప్రమాదహేతువుగా మారుతోంది. పరిమితికి మించి ప్రయాణికుల్ని ఎక్కించుకోవడం, సరుకు రవాణా వాహనంలో ప్రయాణికుల్ని తీసుకువెళ్ళడం, మద్యం మత్తులో, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిలో ఆయా వాహనాలకు చెందిన డ్రైవర్ తదితరులే కాకుండా ఏ పాపం ఎరుగని ఎదుటి వాహనాల వారు, పాదచారులు బాధితులుగా మారుతున్నారు. ఈ తరహా ప్రమాదాలు నిరోధించడానికి వాటి డ్రైవర్లపై సెంటిమెంట్ ప్రయోగించాలని కేంద్రం ఆధీనంలోని మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ (ఎంఓఆర్‌టీహెచ్) యోచిస్తోంది. గత ఏడాది దేశ వ్యాప్తంగా జరిగిన మొత్తం ప్రమదాలతో పోలిస్తే లారీలు వంటి కమర్షియల్ వాహనాల వల్ల జరిగిన ప్రమాదాల్లోనే 20.1 శాతం మంది మరణించారు. ఈ నేపథ్యంలోనే నిబంధనల్ని బేఖాతరు చేయడం, దూకుడుగా వ్యవహరించడం చేస్తున్న కమర్షియల్ వాహనాల డ్రైవర్లకు ఓపక్క అవగాహన కల్పించడంతో పాటు మరోపక్క వారిపై సెంటిమెంట్‌ను ప్రయోగించనున్నారు.
ఆయా వాహనాల్లో డ్యాష్‌బోర్డులపై డ్రైవర్లకు ఎదురుగా వారి కుటుంబీకుల ఫోటోలు ఉంచడం తప్పనిసరి చేయాలని ఎంఓఆర్‌టీఎహెచ్ యోచిస్తోంది. తద్వారా తన కోసం ఇంట్లో ఎదురు చూస్తున్న కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకునే డ్రైవర్లు జాగ్రత్తగా వాహనాలు పడుపుతారని ఆ విభాగం భావిస్తోంది. ఈ విధానాన్ని ఆయా రాష్ట్రాలకు చెందిన ఆర్టీఏతో కలిసి చేపట్టాలని భావిస్తోంది. దీనికి సంబంధించి ప్రాథమికంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి అభిప్రాయాన్ని తీసుకోవాలని భావిస్తోంది. ఇందులో వచ్చిన మెజార్టీ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోనుంది. ఆపై అవసరమైతే మోటారు వాహన చట్టంలో సవరణలు ప్రతిపాదించాలని ఎంఓఆర్‌టీఎహెచ్ అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. కమర్షియల్ వాటితో పాటు ఇతర వాహనాల వల్ల జరుగతున్న ప్రమాదాలను నిరోధించడానికీ పటిష్ట కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడానికి ఎంఓఆర్‌టీఎహెచ్ సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఏడాది నుంచి ఈ విధానాలు అమలులోకి తీసుకురావడానికి వీలుగా అవసరమైతే రాష్ట్రాలకు ప్రత్యేకంగా నిధులు సైతం కేటాయించాలని యోచిస్తోంది. వీటితో ఆయా రాష్ట్ర పోలీసు, ఆర్టీఏ విభాగాలు తమకు అవసరమైన పరికరాలు, ఉపకరణాలను సమీకరించుకుని రంగంలోకి దిగేలా ఆదేశాలు జారీ చేయనుంది. ఇవి ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అమలులో ఉన్నప్పటికీ దేశ వ్యాప్తంగా యూనిఫామిటీలో అమలయ్యేలా చూడాలని భావిస్తోంది. కీలక సవరణలతో కూడిన మోటారు వాహనాల చట్టం సవరణ బిల్లు అమలులో రావడంలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలోనే ఎంఓఆర్‌టీహెచ్ ఈ ఆలోచన చేసి ఉండచ్చని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.
ఎంఓఆర్‌టీఎహెచ్ యోచిస్తున్న ముఖ్య చర్యలివీ...
♦ పరిమితికి మించిన లోడుతో ప్రయాణిస్తున్న వాహనాలను గుర్తించడానికి చెక్‌పోస్టుల సమీపంలోని వేయింగ్ మిషన్ల వద్ద ప్రత్యేక తనిఖీలు ఏర్పాటు చేయాలి. అన్ని వాహనాల పైనా ఒకే రకమైన చర్యలు తీసుకోవడం కాకుండా... అందులో ఉన్న లోడును బట్టి జరిమానా విధించడమో, వాహనాన్ని జప్తు చేయడమో చేసేలా విధానం రూపొందించనుంది.
♦ మైనర్లు వాహనాలు నడపటానికి అర్హులు కాదు. ఈ నేపథ్యంలోనే స్కూళ్ళు, జూనియర్ కాలేజీల యాజమాన్యాలతో కలిసి స్పెషల్ డ్రైవ్స్ చేపట్టేలా ఆర్టీఏ, పోలీసు విభాగాలకు సిఫార్సు చేయనుంది. వీటికి వాహనాలను డ్రైవ్ చేసుకుంటూ వచ్చే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులనూ పిలిపించి కౌన్సిలింగ్ చేయడం, కేసులు నమోదు తప్పనిసరి చేసేలా ఆదేశించనుంది.
♦ జాతీయ రహదారులను ప్రతి 40 కిమీకి ఒక సెక్టార్‌గా ఏర్పాటు చేయించి... హైవే పెట్రోలింగ్ వాహనాలతో నిరంతరం గస్తీ ఉండాలంటూ రాష్ట్రాలకూ సూచించనుంది. ఈ వాహనాలు అక్కడ నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించి, ప్రమాదకారకాలను గుర్తించడంతో పాటు నిరోధించడానికి తీసుకోవాల్సిన చర్యల్నీ సిఫార్సు చేయాల్సి ఉంటుంది.
♦ వరుసగా మూడేళ్ళ గణాంకాలను పరిగణలోకి తీసుకుని పోలీసుస్టేషన్ల వారీగా ఒకటి కంటే ఎక్కువ ప్రమాదాలు జరిగిన ప్రాంతాలను గుర్తించడం, వాటిలో లోపాలను సరిచేయడానికి నివేదికలు రూపొందించాల్సిన బాధ్యతా స్థానిక పోలీసు, ఆర్టీఏ అధికారులకు అప్పగించేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.
♦ మద్యం తాగి వాహనాలు నడిపే డ్రైవర్లకు చెక్ చెప్పడానికి జాతీయ రహదారుల్లోనూ తనిఖీలు తప్పనిసరి చేయించనుంది. దీనికోసం టోల్‌ప్లాజాలు, చెక్‌పోస్టుల్లో ప్రత్యేకంగా పోలీసులు సిబ్బందిని నియమించేలా, వారికి బ్రీత్ అనలైజర్లుతో పాటు ఇతర పరికరాలు ఇచ్చేలా చర్యలకు యోచిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment