ధ్వంసమైన టోల్ గేట్...
సాక్షి, చెన్నై: ప్రభుత్వ రవాణా సంస్థ బస్సు డ్రైవర్, కండక్టర్‌పై టోల్ గేట్ సిబ్బంది వీరంగం వివాదానికి దారి తీసింది. బస్సును రోడ్డుకు అడ్డంగా డ్రైవర్ నిలిపి వేయడంతో గంటల కొద్ది వాహనాలు బారులు తీరాయి. ప్రయాణికుల ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో చెంగల్పట్టు టోల్‌గేట్ పూర్తిగా ధ్వంసమైంది. దీంతో ఆదివారం టోల్‌గేట్‌ను ఎత్తి వేసినట్టుగా పరిస్థితి మారింది. రాష్ట్రంలోని జాతీయ రహదారుల్లో 44 టోల్ గేట్లు ఉన్నాయి. నిర్ణీత కిలోమీటర్ల దూరంలో ఈ టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతి వాహనం టోల్‌చార్జ్ చెల్లించాల్సిందే. ద్విచక్రవాహనాలకు మినహాయింపు ఉంది. గుమ్మిడిపూండి నుంచి కన్యాకుమారి వరకు, ఈ ప్రధాన రహదారికి అనుబంధంగా ఉన్న సేలం – కోయంబత్తూరు, పూందమల్లి – శ్రీపెరంబదూరు – బెంగళూరు, మదురై – విరుదునగర్ , తేనిల వైపుగా ఈ టోల్ చార్జీల వసూళ్లు సాగుతున్నాయి. ఏడాదిలో రెండు విడతలుగా టోల్‌చార్జీల పెంపు ప్రక్రియ ఆది నుంచి సాగుతోంది. ఈ టోల్ వడ్డనపై రాష్ట్రంలోని వాహన దారులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో టోల్‌గేట్లలో పనిచేస్తున్న సిబ్బంది దురుసుగా వ్యవహరించడం, రాజకీయ పక్షాల నేతల్ని సైతం లెక్క చేయని రీతిలో ముందుకు సాగుతుండడం వంటి పరిణామాలు నిత్యం ఏదో ఒక వివాదానికి దారి తీస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి ప్రయాణికుల ఆగ్రహానికి ఓ టోల్ గేట్ పూర్తిగా ధ్వంసమైంది.
వివాదం..
చెన్నై కోయంబేడు నుంచి శనివారం రాత్రి తిరుచ్చికి ప్రభుత్వ రవాణా సంస్థకు చెందిన ఎక్స్‌ప్రెస్ బస్సు బయలుదేరింది. చెంగల్పట్టు సమీపంలోని పరనూర్ టోల్‌గేట్‌లో ప్రభుత్వ బస్సుల మార్గంలో ఈ బస్సు దూసుకెళ్లింది. అయితే, ఈ బస్సు ముందుకు వెళ్లకుండా టోల్ గేట్ సిబ్బంది అడ్డుకున్నారు. టోల్ చార్జీ చెల్లించి ముందుకు వెళ్లాలని డ్రైవర్‌ను నిలదీశారు. ఇది ప్రభుత్వ బస్సు అని టోల్ సిబ్బందికి డ్రైవర్, కండక్టర్ చెప్పినా వాళ్లు వినిపించుకోలేదు. అక్కడి భద్రతా సిబ్బంది డ్రైవర్‌పై దూకుడుగా వ్యవహరించడం వివాదానికి దారి తీసింది. ఆ బస్సును డ్రైవర్ టోల్ గేట్‌కు మార్గాలకు అడ్డంగా నిలిపి వేయడంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగాయి. దీంతో ఆగ్రహించిన టోల్ గేట్ సిబ్బంది డ్రైవర్, కండక్టర్‌పై దాడి చేయడంతో వివాదం మరింతగా ముదిరింది. అటు వైపుగా వెళ్లే అన్ని ప్రభుత్వ బస్సులు ఎక్కడిక్కడ ఆగాయి. నాలుగు గంటల పాటు వాహనాలు టోల్ గేట్‌ను దాటలేని పరిస్థితి. దీంతో గమ్యస్థానాలకు సకాలంలో చేరుకుంటామో లేదో అన్న ఆందోళన ప్రయాణికుల్లో రేగింది. తీవ్ర ఆగ్రహానికి లోనైన ప్రయాణికులు టోల్ గేట్ సిబ్బందిని ప్రశ్నించారు. ప్రయాణికులపై సైతం ఆ సిబ్బంది దురుసుగా వ్యవహరించడంతో ఆ పరిసరాలు రణరంగానికి దారి తీశాయి. టోల్ గేట్‌పై ప్రయాణికులు దాడి చేశారు. అక్కడున్న సీసీ కెమెరాలు, గేట్లు, కంపూటర్లు అన్ని «ధ్వంసం చేశారు. టోల్ గేట్ సిబ్బందికి చెందిన 20 ద్విచక్ర వాహనాల్ని ధ్వంసం చేసి, ఆందోళనకు దిగారు. ఈ సమాచారం అందుకున్న చెంగల్పట్టు డీఎస్పీ కందన్ నేతృత్వంలోని బృందం అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. విధుల్లో ఉన్న 20 మంది టోల్ గేట్‌సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ రవాణా సంస్థ డ్రైవర్లు శాంతించడంతో ఐదు గంటల అనంతరం ఆటోల్ గేట్‌ను అన్ని వాహనాలు దాటాయి. ఇక, ఆదివారం ఆ టోల్ గేట్‌ను మూసే అంతగా పరిస్థితి మారింది. టోల్ గేట్‌లో టోల్ వసూళ్లు చేసే వాళ్లు లేక పోవడంతో, వాహనాలన్నీ వేగంగా ముందుకు దూసుకెళ్లాయి.
పెళ్లి బృందంపై దాడి..
చెంగల్పట్టు టోల్ గేట్ వివాదం ఓ వైపు సాగుతుంటే, మరో వైపు నాంగునేరి టోల్‌గేట్లో పనిచేస్తున్న సిబ్బంది ఓ పెళ్లి బృందం మీద దాడి చేసింది. మహిళతో పాటు పదిమంది గాయపడడంతో పోలీసులు కన్నెర్ర చేశారు. కన్యాకుమారి జిల్లా మనవాల కురిచ్చికి చెందిన షేక్ సులేమాన్ కుటుంబం వివాహ కార్యక్రమం నిమిత్తం రెండు కారల్లో ఆదివారం ఉదయం తూత్తుకుడికి బయలు దేరారు. మార్గమధ్యంలోని నాంగునేరి టోల్‌గేట్లో సిబ్బంది దూకుడుగా వ్యవహరించడం, టోల్‌చార్జీల వసూళ్లలో జాప్యం చేయడంతో వాహనాలు బారులు తీరాయి. తాము వివాహ వేడుకకు వెళ్లాల్సిందని, త్వరితగతిన టోల్ చార్జీ వసూలు చేసి తమను పంపించాలని ఆ బృందం విజ్ఞప్తి చేసింది. ఇందుకు టోల్ సిబ్బంది దురుసుగా వ్యవహరించడం వాగ్వివాదానికి దారి తీసింది. దీంతో అక్కడున్న భద్రతా సిబ్బంది ఆ పెళ్లి బృందంపై దాడి చేశారు. సులేమాన్ , సర్బుద్దిన్, అల్ అమీద్, ఆయన భార్య సమీమా, సల్మా బీవి తో పాటుగా పది మందికి రక్తగాయాలు అయ్యాయి. టోల్ గేట్ సిబ్బంది దూకుడును ఇతర వాహనాదారులు అడ్డుకునే యత్నం చేయగా, వారిపై సైతం తిరగబడడం ఉద్రిక్తతకు దారి తీసింది. సమాచారం అందుకున్న నాంగునేరి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడ్డ పది మంది నాంగునేరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఐదుగురు టోల్ గేట్ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment