తిరుమల యాత్రలో రామానుజులు | Ramanujulu is the Tirumala Yatra | Sakshi
Sakshi News home page

తిరుమల యాత్రలో రామానుజులు

Published Sun, Feb 11 2018 12:45 AM | Last Updated on Sun, Feb 11 2018 12:46 AM

Ramanujulu is the Tirumala Yatra - Sakshi

సహస్రాబ్ది ధారావాహిక – 17

రామానుజుడు బోధించిన భగవద్గుణాలను వివరించే హరి మేలుకొలుపు గీతాలు ఒక ఇంటినుంచి చాలా వీనుల విందుగా వినిపిస్తుంటే గోవిందుడు అక్కడే ఆగిపోయి, ఆ అరుగుమీద కూచుని తన్మయుడై వింటూ ఉన్నాడు. నిజానికి అది ఒక వేశ్య ఇల్లు. వెంటనే మరికొందరు శిష్యులు ఈ విషయాన్ని గురువుగారికి చేరవేశారు. ఇదేమి వింత గోవిందా, నీవు వేశ్య ఇంటి అరుగుమీద కూచోవడమేమిటి? అని రామానుజులు ప్రశ్నించారు. ‘‘మీ భగవద్గుణాలను వింటున్నానే గాని నాకు అదెవరి గృహమో తెలియదు ఆచార్యా’’  గోవిందుని నిష్కల్మష భక్తిని రామానుజుడు ప్రశంసించాడు.గోవిందుడికి అప్పటికే వివాహమైంది. భార్య రుతుమతి అయిన తరువాత గోవిందుని తల్లి కుమారుని దగ్గరకు వచ్చి గృహస్థాశ్రమ ధర్మానికి అనుగుణంగా సంసార బాధ్యత స్వీకరించి కోడలికి గర్భాదానం చేయాలని కుమారునికి ప్రబోధించింది. సరేనని ఒక రాత్రికి కోడలిని తీసుకురమ్మన్నాడు. ఆమె పాపం తీసుకువచ్చింది. కాని గోవిందుడు రానే రాలేదు. ఎంతసేపటికి భగవన్నామ స్మరణే కాని సంసారం ధ్యాసే లేకుండా పోయిందని రామానుజుడికి విన్నవించింది ఆయన తల్లి. నేను కనుక్కుంటానమ్మా అన్నారు రామానుజుడు.

‘‘గోవిందా నీవు సంసార జీవితంలో ఉంటే భార్యతో కాపురం చేయాలి కదా’’ అని అడిగారు.  ‘‘అవును ఆచార్యా కాని ఏకాంతం దొరికితే కదా సంసారం చేసేది. నాకు అన్ని సమయాల్లోనూ అన్ని కాలాల్లోనూ మీ దివ్యబోధలే వినిపిస్తున్నాయి. సూర్యుడిపై మీరే వెలుగుతున్నారు. ఇక చీకటే లేదు. ఏకాంతమే లేదు. ఇంత వెలుగులో సంసారమూ  కాపురమూ సాధ్యమేనంటారా?’’ అన్నాడు గోవిందుడు. తన శిష్యునికిసన్యాసాశ్రమమే సరైందని నిర్ధారించి రామానుజుడు అతణ్ని సన్యాసాశ్రమంలో చేర్పించి ఎంబార్‌ అనే నామాన్ని ఇచ్చారు. దాశరథికంచి మఠంలో ఉన్నపుడే మేనమామ కుమారుడు దాశరథి (మొదలియాండన్‌) శిష్యుడైనాడు. మరొక ముఖ్యశిష్యుడి పేరు కురేశుడు. అతను కుర్‌ అనే అగ్రహారానికి రాజు. అత్యంతసంపన్నుడైన కురేశుడు తన సతి ఆండాళమ్మతో కలసి రామానుజుని పాదాలను ఆశ్రయించాడు. తిరుమారి మార్బన్‌ అనే నామాన్నిచ్చారు రామానుజులు.  ఇదే సందర్భంలో ఒకనాటి గురువు యాదవప్రకాశులు తన తల్లి ఆజ్ఞమేరకు రామానుజుని శిష్యుడుగా గోవింద దాసు అనే కొత్త నామంతో ఆశ్రమప్రవేశం చేశారు. ముగ్గురికీ పంచ సంస్కారాలు చేశారు. యతిధర్మసముచ్ఛయము అనే పుస్తకం రాసిన తరువాత కొద్దికాలానికి యాదవ ప్రకాశులు పరమపదించారు.  తిరుమలను పుష్పవనంగా మార్చిన రామానుజులుద్వారక శ్రీ కృష్ణ క్షేత్రాన్ని వస్త్రధామంగానూ, పూరీ జగన్నాథ క్షేత్రాన్ని అన్నధామంగానూ కీర్తిస్తారు. ఆవిధంగానే తిరుమల పుష్పధామం అంటారు. పూలవనాలకు పెట్టింది పేరు తిరుమల. అందుకు కారణం రామానుజుడు.
 
ఒకసారి రామానుజుడు తిరువాయిమొళిలో ఒక పాశురం పారాయణం చేస్తూ ఉన్నారు.  వైకుంఠ వాసులైన నిత్యసూరులు కూడా పరమపదం నుంచి వచ్చి తిరుమల స్వామిని సేవిస్తారు అని ఆ పాశురంలో వివరించారు. ‘‘శ్రీ వేంకటేశ్వరస్వామికి నిత్యకైంకర్యం చేయాలి, సర్వకాలాలలో సర్వావస్థలలో కైంకర్యం ఆగకూడదు’’ అంటూ ఎవరైనా తిరుమల వెళ్లి అక్కడే ఉండి ఆ చలికి ఓర్చి పూలవనాలు పెంచుతూ స్వామికి పుష్పకైంకర్యం చేస్తారా అని రామానుజులు అడిగారు. అనంతసూరి (అనంతాళ్వారు) నేను వెళ్తానన్నాడు. అందుకు మెచ్చుకుని ఆశీర్వదించి పంపారు. తిరుమలలో అంతకుముందు యామునాచార్యుల వారు కొన్నాళ్లు పూల సేవ చేసేవారు. ఆయన శిష్యులైన శ్రీశైలపూర్ణుల వారి నేతృత్వంలో అనంతాళ్వార్‌ ఆ సేవ కొనసాగించాలని సూచించారు.  తిరుమల కొండలలో రకరకాల పూల మొక్కలను పెంచారు అనంతసూరి. దానికి యామునోత్తర పుష్పవనం అని పేరు పెట్టారు. కాని ఆ మొక్కలు ఇచ్చే పూలు సరిపోవనీ, ప్రత్యేకంగా ఒక ఉద్యానవనమే స్వామివారికి ఉండాలని, అందుకు ఒక చెరువు కూడా అవసరం అని అనంతాళ్వారు అనుకున్నారు. చెరువు తవ్వకంలో తన భార్య తప్ప మరెవరి సాయం తీసుకోకూడదని నేల తవ్వడం మొదలు పెట్టారు. భార్య తట్టలో ఎత్తి మన్ను దూరంగా పారబోసేది. వీరి దీక్ష పరీక్షించాలని శ్రీనివాసుడే బాలుడి రూపంలో వచ్చి నేను మీకు సాయం చేస్తానని పేచీ పెట్టాడు. ససేమిరా వీల్లేదన్నారు అనంతాళ్వార్లు. గర్భవతి అయిన భార్య చెమటోడ్చి తట్టల్లో మట్టి ఎత్తుతూ ఉంటే కొంతదూరంలో ఆ తట్టలను అందుకుని దూరంగా గుమ్మరించి తట్టను అమ్మగారికి ఇచ్చేస్తున్నాడు బాల బాలాజీ. కాస్సేపటి తరువాత భార్య వేగంలో అంతరార్థం ఆయనకు అర్థమైంది. పట్టుకుందామని వెంటపడ్డాడు. దొరకలేదు. తన చేతిలో ఉన్న గునపం విసిరినాడు. అది ఆయన గదుమకు గాయం చేసింది. పరుగెత్తిపోయాడు. వెంట తానూ పరిగెత్తివెళ్లాడు. ఆ బాలుడు ఆనందనిలయంలోకి వెళ్లి అంతర్థానమైనాడు. గర్భగుడిలో వేంకటేశుని మూలమూర్తి గదుమనుంచి రక్తం కారుతున్నది. అర్చకులు స్వామివారి చుబుకానికి పచ్చ కర్పూరం పెడుతున్నారు. తను గాయపరిచింది సాక్షాత్తూ వేంకటేశ్వరుడినే అని తెలిసి ఏడుస్తూ అనంతాళ్వార్‌ పడిపోయారు. క్షమించమని వేడుకున్నారు. ‘‘నీ భక్తికైంకర్యాన్ని లోకానికి చాటడానికే ఈ లీల. బాధపడకు అనంతాళ్వార్‌ నీ భక్తికి గుర్తుగా నేనీ పచ్చకర్పూరాన్ని నిత్యమూ నా గదుమ మీద ధరిస్తాను’’ అని స్వామి పలికారు.  

చెరువు పూర్తయింది. పక్కనే పెద్ద తోట. రకరకాల పూల మొక్కలతో అలరారుతున్నది. రామానుజం అని ఆ తోటకు పేరు పెట్టారు. స్వామికి రెండుపూటలా సుగంధ సుమమాలలు అందుతున్నాయి. ఈ పూలు పూచే తోట చూడాలని స్వామి అలమేలు మంగతో కలిసి రాత్రి తోటకు వచ్చిన కథ మరొకటి వాడుకలో ఉంది. దంపతులిద్దరూ తోటలో పూలు తెంపి వాసన చూసి కొప్పులో ముడిచి వెళ్లినట్టు మరునాడు అనంతాళ్వార్‌కు స్పష్టంగా కనిపిస్తున్నది. తన తోటనెవరో పాడు చేస్తున్నారని భావించి రాత్రి కాపలా ఉన్నారు. తొమ్మిదో రాత్రి నవయువ దంపతులిద్దరూ కనిపించారు. అమ్మవారిని పట్టుకుని మల్లెతీగలతో చెట్టుకు కట్టి, పరుగెత్తుతున్న యువకుడి వెంట పడ్డారు. ఆయన అప్రదిక్షణంగా తిరుగుతూ మాయమైపోయారట. సుప్రభాతం తరువాత గర్భాలయంలో ప్రవేశిస్తే స్వామి వక్షస్థలంమీద అమ్మవారి విగ్రహం మాయమై కనిపించింది. అర్చకులు ఆందోళన పడుతుంటే స్వామి కంఠధ్వని వినిపించింది. అలమేలు మంగమ్మ అనంతాళ్వార్‌ తోటలో ఉంది తీసుకుని రమ్మన్నారట. ఛత్ర చామర వాహన మంగళ వాయిద్యాలతో తోటకు వెళ్లి సాక్షాత్తూ అమ్మవారినే కట్టివేసిన గొప్పదనం నీదే అనంతాళ్వార్‌ అని చెప్పడంతో ఆశ్చర్యపోయాడాయన. క్షమించమని ప్రాథేయపడి ఆమెను పూలబుట్టలో కూర్చుండబెట్టి, ఆనందనిలయంలో స్వామికి అప్పగించారు. అప్పటినుండి ఆయన అమ్మవారికి మేనమామ అయ్యారని కొందరు, కాదు కాదు స్వామికి కన్యాదానం చేసినట్టు అమ్మవారినిచ్చి ఆయన స్వామికే మామ అయ్యాడనీ అంటారు. 

రామానుజులు ఆ పాశురం చదివినప్పటినుంచి వేంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకోవాలనే తపన పెరిగింది. కంచి, తిరుమలక్షేత్రాలకు వెళ్లేందుకు అనుమతించాలని రామానుజులు శ్రీరంగనాథుని కోరారు. కంచికి వచ్చి కాంచీపూర్ణులను కలిసి సాష్టాంగ నమస్కారం చేశారు. ఆయన అపరిమితానందపరవశుడై అప్యాయంతో లేవనెత్తి ఆలింగనం చేసుకుని వరదుడి దర్శనానికి తీసుకు వెళ్లారు. గోపురానికి నమస్కరించి, అనంతసరస్సులో స్నానమాచరించి, ప్రాకారంలో నెలకొన్న వరాహస్వామిని దర్శించి తరువాత ఆళ్వార్లకు, బలిపీఠానికి, ద్వారపాలకులైన జయవిజయులకు మొక్కి, అనంతునికి ప్రణమిల్లి, సభామండపంలో ప్రవేశించారు. ఆ సభలోనే మొదటిసారి యామునాచార్యులు రామానుజుని చూసి సంతోషించారు. ఆ విషయం గుర్తుచేసుకుంటూ భాష్పపూరిత లోచనాలతో రామానుజుడు 
నమోనమో యామునాయ యామునాయ నమోనమః 
నమోనమో యామునాయ యామునాయ నమోనమః 

అని స్తుతించాడు. కంచి విమానాన్ని దర్శించారు. వరదుడి పట్టమహిషి పేరుందేవిని కీర్తించాడు. చక్రత్తాళ్వారునిదర్శించి, పెరియ తిరువడికి (గరుడునికి) నమస్కరించి హస్తగిరి 24 మెట్లు ఎక్కుతూ వరదుడి ప్రాంగణానికి చేరుకున్నారు. వరదరాజస్వామి ముందు నిలిచి, ఎంత కాలం తరువాత నీ దర్శనం పెరుమాళ్‌ అనుకుంటూ వేయికళ్లు చేసుకుని చూసుకున్నారు. తీర్థ శఠగోప ప్రసాదాలను స్వీకరించి, మహానంద భరితుడైనాడు. తనతో పాటు నడిచి దర్శనం ఇప్పించిన కాంచీ పూర్ణులకు రామానుజుడు వందనమొనర్చినారు. తిరుమలనాథుడిని దర్శించాలన్న ప్రగాఢమైన వాంఛ ఉందని కాంచీపూర్ణులకు తెలియజేశారు. కాంచీపూర్ణులు దర్శన ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించారు. శిష్యగణంతో కాషాయవస్త్రధారియై త్రిదండధారియై ఆచార్య రామానుజుడు తిరుమలకు బయలుదేరారు. కొంతదూరం నడిచిన తరువాత దారి తోచడం లేదు. ఎవరూ దారి ఏదో చెప్పలేకపోతున్నారు. అక్కడ బావిలో నీరుతోడుకుంటున్న ఒక వ్యక్తిని దారి అడిగాడు. అతను చాలా ఓపికగా గుర్తులు చెబుతూ దారి అర్థమయ్యేట్టు చెప్పాడు. రామానుజుడు అతనికి కృతజ్ఞతలు చెప్పడం ఏ విధంగా అని ఒక క్షణం ఆలోచించి సాష్టాంగ నమస్కారం చేశారు. తమ ఆచార్యులు నేలమీద సాగిలపడే సరికి ఆయన శిష్యులంతా అక్కడే ఆ బావిదగ్గర, తామూ నేల మీద పడి దండాలు పెట్టారు. ఇంత పెద్ద స్వాములోరు తనకు దండాలు పెడుతుంటే ఏం చేయాలో తెలియక అతనూ ప్రతినమస్కారం చేశాడు. అక్కడి వారంతా ఆశ్చర్యపోయి చూస్తున్నారు.  ఆ మార్గంలో ప్రయాణించి తిరుపతి చేరుకున్నారు. తిరుమల కొండ కింద తిరుపతి దగ్గర ఆళ్వారుతీర్థంలో నెలకొన్న పదిమంది ఆళ్వారులను సేవించారు. ఆళ్వార్‌ తీర్థాన్నే కపిల తీర్థం, దివ్యసూరి తీర్థమనీ అంటారు. వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి వచ్చిన ఆళ్వారులంతా అక్కడ ఆగి, తిరుమల కొండమీదనుంచి జాలువారుతున్న కపిల తీర్థంలో స్నానం చేసి తిరుమల పర్వతానికి మొక్కి ఇక్కడినుంచే మంగళ శాసనం పాడి తిరిగి వెళ్లిపోయేవారు. అందుకని అది ఆళ్వార్‌ తీర్థం అయింది. శేషాచలం అంటే ఆదిశేషుడే అక్కడ పర్వతమై నిలిచి ఉన్నాడు. అంతటి శేషుడిపైన కాలుపెట్టడం అపచారమనీ, సాలగ్రామ మయమైన తిరుమలను తమ పాదాలతో తొక్కరాదని రామానుజుడు అక్కడే నిలబడి పోయినాడు. 

రామానుజులు తిరుమల తిరుపతికి బయలుదేరి వస్తున్నారనే వార్త అక్కడ వైష్ణవులందరికీ తెలిసిపోయింది. తన మేనల్లుడు ఆచార్యుడై వస్తున్నాడని సంతోషించి శ్రీశైలపూర్ణుడు రామానుజుడిని తోడ్కొని రావడానికిగాను కొండదిగి వచ్చారు. స్వాగతం చెప్పి ‘‘రా నాయనా కొండమీదికి వెళ్దాం. వేంకటేశ్వరుని దర్శనం చేసుకుందాం పద’’ అన్నారు.  ‘‘ఆచార్యవర్యా, పరమపావనమైన ఈ తిరుమల శిఖరాలను నేను కాలితో తొక్కడమా, అది భావ్యమా? నేను ఇక్కడే ఆగిపోతాను. నేనిక్కడినుంచే మంగళాశాసనం పాడుతాను...’’అన్నారు ఆ కొండనే చూస్తూ..శ్రీశైలపూర్ణులు చాలా సేపు రామానుజుడికి నచ్చజెప్పారు. కాని ఆయన వినలేదు. ‘‘సరే అయితే మీరు చేయగూడని పని అనుకున్న పని మేము మాత్రం చేయడమెందుకు. మేమూ వెళ్లం రామానుజా’’ అని కూర్చుండిపోయారు. ‘‘అయ్యా మీ ఆజ్ఞ, మీతోపాటే నేనూ ఈ వైష్ణవ బృందం వస్తాం. ఇక ఆయనదే భారం. ఈ దివ్య పర్వతాన్ని కాలితో తాకుతున్నందుకు నన్ను క్షమించుగాక...పదండి స్వామీ’’ అని రామానుజులు అన్నారు. అందరూ గోవిందనామం చేస్తూ బయలుదేరారు. రామానుజుడు భయభక్తులతో మోకాలు మోపి అపరాధ క్షమాపణ కోరి నడిచారు. చివరికొండనయితే ఆయన మోకాళ్లమీదుగానే ఎక్కారని, అందుకే అది మోకాళ్ల పర్వతం అనే పేరు సంతరించుకుందని అంటారు. 
∙ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement