
సాక్షి, తిరుమల: టీటీడీ ఉద్యోగుల నిరసన ఫలించింది. టీటీడీ బోర్డుపై ఉద్యోగ సంఘాల నేతలు విజయం సాధించారు. టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్‌తో ఉద్యోగికి క్షమాపణలు చెప్పించారు ఈవో. దీంతో, ఉద్యోగులు నిరసనను నిలిపివేసినట్టు తెలుస్తోంది.
టీటీడీ ఉద్యోగుల నిరసన నేపథ్యంలో పాలక మండలి దిగొచ్చింది. ఎట్టకేలకు బోర్డు సభ్యుడు నరేష్‌తో ఉద్యోగికి క్షమాపణలు చెప్పించారు. అయితే, ఉద్యోగిపై దురుసు ప్రవర్తన నేపథ్యంలో పాలక మండలి సభ్యుడి వ్యవహారంపై భక్తుల నుంచి విమర్శలు వచ్చాయి. నరేష్ వెంటనే క్షమాపలు చెప్పాలని ఉద్యోగులు 48 గంటల పాటు నిరసనల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే నరేష్ వారిని క్షమాపణలు చెప్పారు.
ఇదిలా ఉండగా.. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద టీటీడీ ఉద్యోగిపై బోర్డు మెంబర్ నరేష్ బూతులతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. కర్ణాటకకు చెందిన పాలకమండలి సభ్యుడు నరేష్ ఆలయం వెలుపలి నుంచి వస్తున్న సమయంలో అక్కడే ఉన్న టీటీడీ ఉద్యోగి గేటు తీయలేదు. మహా ద్వారం ముందున్న గేటు తీసేందుకు సదరు ఉద్యోగి నిరాకరించాడు. అయితే, ప్రోటోకాల్ పరిధిలో టీటీడీ బోర్డు సభ్యుడికి గేటు తెరవలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు బోర్డు మెంబర్ నరేష్. అనంతరం, సదరు ఉద్యోగిపై బూతులతో మండిపడ్డారాయన. బయటకు పోవాలని చిర్రుబుర్రులాడారు. ఇలాంటి వారిని ఇక్కడ విధుల్లో ఎందుకు ఉంచారని ఆగ్రహంతో రగిలిపోయారు. అతడిని వెంటేనే అక్కడ నుంచి పంపించి వేయాలని అధికారులకు సూచించారు. అనంతరం, అక్కడి నుంచి టీటీడీ బోర్డు మెంబర్ నిష్క్రమించారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.
