ఆమె... అగణిత మేధావి | Neena Gupta won Ramanujan Prize Guest Column Dr T Nagaiah | Sakshi
Sakshi News home page

ఆమె... అగణిత మేధావి

Published Wed, Dec 22 2021 12:58 AM | Last Updated on Wed, Dec 22 2021 1:30 AM

Neena Gupta won Ramanujan Prize Guest Column Dr T Nagaiah - Sakshi

గణితశాస్త్రంలో డెబ్భై యేళ్లుగా ప్రపంచానికి అంతుపట్టకుండా ఉన్న అత్యంత క్లిష్టమైన జరిస్కి క్యాన్సిలేషన్‌ ప్రాబ్లమ్‌కు పరి ష్కారం సూచించారు 32 ఏళ్ల నీనా గుప్తా. అందుకుగాను ఆమె 2021 డిసెంబర్‌లో, ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్‌ జ్ఞాపకార్థం ఇచ్చే ప్రతిష్ఠాత్మకమైన ‘ది రామానుజన్‌ ప్రైజ్‌’ పురస్కారానికి ఎంపికయ్యారు. కోల్‌కతాలో జన్మించిన నీనా గుప్తా , బెతున్‌ కళాశాల నుండి గణిత శాస్త్ర ఆనర్స్‌లో పట్టా తీసుకున్నారు. ఇప్పుడు తాను పాఠాలు బోధిస్తున్న ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇనిస్టిట్యూట్‌ (ఐఎస్‌ఐ) సంస్థ నుంచే పీహెచ్‌డీ తీసుకున్నారు. తన పరిశోధనలకు గాను ఆమె ఇప్పటికే డజను అవార్డులు పొందారు. 40 ఏళ్ల లోపు ఉండే యువ గణిత శాస్త్రవేత్తలకు ఇచ్చే ప్రతిష్ఠాత్మకమైన రామానుజన్‌ అవార్డును ఇటీవలే నీనా గుప్తాకు ఇచ్చారు.

అకడమిక్‌ రంగంలో గౌరవనీయమైన అవార్డును గెలుచుకున్న నాల్గవ భారతీయురాలు ఆమె.  కోల్‌కతాలోని ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రొఫెసర్‌గా ఉన్న ఆమె అఫైన్‌ ఆల్జీబ్రాక్‌ జ్యామితిలో, కమ్యుటేటివ్‌ ఆల్జీబ్రాలో చేసిన అత్యుత్తమ కృషికి,  ప్రత్యేకించి అఫైన్‌ స్పేస్‌ల కోసం జారిస్కీ రద్దు సమస్యపై కనిపెట్టిన పరిష్కారం కోసం ఈ విశిష్ట బహుమతిని అందుకున్నారు. జారిస్కీ రద్దు సమస్యకు ఆమె చూపిన పరిష్కారం తనకు గతంలోనే ఇండియన్‌ నేషనల్‌ సైన్స్‌ అకాడమీ 2014 యంగ్‌ సైంటిస్ట్స్‌ అవార్డును సంపాదించి పెట్టింది. 2019లో శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ ప్రైజ్‌ అందుకున్నారామె.

గణితం అభివృద్ధిలో భారతీయుల పాత్ర ఎంతో ఉంది అని వేద గణితం చెబుతుంది. సంఖ్యామానానికి పట్టుగొమ్మ అయిన సున్నా ఆవిష్కరణే దీనికి నిదర్శనం. ఇది ప్రపంచ గణిత శాస్త్రా నికి భారతీయుల అద్భుత కానుక. గణితం కష్టం కాదు. ఇతర సబ్జెక్టులులాగా దీన్ని కంఠస్థం చేయలేరు. మీకు గణిత భావనపై స్పష్టత ఉంటే, మీరు కూడా క్లిష్టమైన గణిత సమస్యలను పరిష్కరించగలరు. ప్రాక్టీస్‌ కీలకం,  అది మినహా వేరే మంత్రం లేదు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ 32 ఏళ్ల నీనా గుప్తా. 

శ్రీనివాస రామానుజన్‌ అయ్యంగార్‌ 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకరు. తనకు పదేళ్ల వయసులోనే గణితశాస్త్రంతో అనుబంధం ఏర్పడింది. పదమూడేళ్లు నిండేసరికల్లా ఎస్‌.ఎల్‌. లోనీ... త్రికోణమితి మీద రాసిన పుస్తకాలను ఆపోశన పట్టడమే కాకుండా సొంతంగా సిద్ధాం తాలు కూడా రూపొందించడం ప్రారంభించాడు. రామానుజన్‌ లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన హార్డీ, అసలు తాను గణిత శాస్త్రానికి చేసిన అత్యుత్తమ సేవ రామానుజాన్ని కనుగొనడమే అని వ్యాఖ్యానించారు.

శుద్ధ గణితంలో నంబర్‌ థియరీలోని ఇతని పరిశోధనలు, స్ట్రింగ్‌ థియరీ, క్యాన్సర్‌ పరిశోధనల వంటి ఆధునిక విషయాలలో ఉపయోగపడుతూ ఉన్నాయి. రామానుజన్‌ చివరిదశలో మ్యాక్‌–తీటా ఫంక్షన్స్‌పై చేసిన పరిశో ధనలు చాలా ప్రసిద్ధమైనవి. 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకరైన శ్రీనివాసన్‌ రామానుజన్‌ పేరు మీద ఉన్న ‘రామానుజన్‌ అవారు’్డ నీనా గుప్తాకు రావడం పట్ల దేశ ప్రజలందరూ హర్షిస్తున్నారు.  

డాక్టర్‌ టి. నాగయ్య
వ్యాసకర్త అసిస్టెంట్‌ ప్రొఫెసర్,
కాకతీయ విశ్వవిద్యాలయం ‘ మొబైల్‌ : 97012 75354
(నేడు జాతీయ గణిత దినోత్సవం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement