ఖగోళ శాస్త్రం వంటివాటిల్లో పరిశోధనలు చేస్తూనే బ్రహ్మ గుప్తుడు లాంటి భారతీయ గణిత మేధావులు ప్రపంచానికి సున్నా (0) ను అందించారు. సున్నా (0) విలువ కూడా భారతీయ గణిత వేదవేదాంగ సాహిత్యవేత్తే కనిపెట్టాడు. అయితే అది ఇంకా వెలుగులోకి రాలేదు. దీనికి కారణం గణితం, భౌతిక, రసాయనిక జీవ శాస్త్రాదులను బాగా కప్పివేసిన ఆధ్యాత్మిక, జ్యోతిష్య సంబంధ భావజాలం. ఆ ముసుగును తీసి భారతీయ గణిత, భౌతిక, రసాయనిక, జీవ శాస్త్రాదుల తేజాన్ని ప్రయోగశాలలో చూపించాలన్న ఆసక్తితో ముందుకు వెళ్ళేవారికి ఇక్కడ సరైన ఆదరణ లభించడం లేదు.
సమస్త విజ్ఞానం మన వేదాలలోనే ఉందని మన ఆధ్యాత్మిక, ఖగోళ, జ్యోతిష శాస్త్రవేత్తలు ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా... ప్రయోగ శాలలో నిలవని విజ్ఞానం తుదకు అజ్ఞానంగానే మిగిలిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రయోగశాలలో నిలవాలని తపించే భారతీయ వేదవేదాంగ శాస్త్రాలలో నిపుణులైనవారికి ఆర్థిక శక్తి లేమి అడ్డు వస్తోంది. కాస్త సైన్స్ చదువుకున్నవారు ఆధ్యాత్మిక జ్యోతిష్యాదులను అడ్డు పెట్టుకొని మాట్లాడే మాయగాళ్ళను సూడో సైన్స్‌గాళ్ళు అంటే, వీరు వారిని మరో విధంగా వెక్కిరిస్తారు. ఈ చర్చోపచర్చలు కాలక్షేపానికి తప్ప మరెందుకూ పనికిరావు. భారతీయ వేదవేదాంగ పురాణేతిహాసాలలో ఏ శాస్త్రం ఎంత ఉంది అనే విషయాన్ని పక్కన పెడితే ఆ యా విషయాల గురించి మాట్లాడటానికి తగినంత పారిభాషిక (టెర్మినాలజీ) పదజాలం లేదన్నది అక్షర సత్యం.
వేదవేదాంగ పురాణేతిహాసాల విజ్ఞానం కథా రూపంలో ఉంటుంది. కథా భాష, ప్రయోగ శాల భాష ఒక రీతిన ఉండదు. ఉదాహరణకు రాజకుమారి ఉద్యానవనంలో చెలికత్తెలతో ఆడుకుంటోంది. ఆకాశంలోని పక్షుల వరుసలను చూసింది. మొదటి వరుసలో ఒకటి, రెండవ వరుసలో రెండు ఇలా... పదవ వరుసలో పది! మొత్తం పక్షులు ఎన్ని అంటే అందరి పప్పులు ఉడికాక రాజకుమారి 55 అని సమాధానం చెబుతుంది.
n(n+1/2) అనే ఆధునిక గణిత సూత్రం రాజకుమారికి తెలియకపోవచ్చును. అయితే వేగంగా 10+(9+1=10)+(8+2=10)+(7+3=10)+(6+4=10) +5=55 అని నోటితో గణించే మేధ రాజకుమారికి ఉండి ఉండవచ్చు. పదికి దగ్గరకు వచ్చి కూడికలు, తీసివేతలు వంటివి చేస్తే లెక్క సులభం అవుతుంది అని ఆమెకు తెలిసి ఉండవచ్చు. ఏదేమైనప్పటికీ రాజకుమారి మేధను సూత్ర బద్ధం చేస్తే, భారతీయ గణితం అందరికీ అర్థమవుతుంది. అయితే సూత్ర బద్ధం చేయడానికి కావలిసినంత టెర్మినాలజీని మనవారు మనకు అందించలేదన్నది నిజం. టెర్మినాలజీ లేకుండా ఆధ్యాత్మికతతో, జ్యోతిష్యాది గణింపుతో ఎన్ని చెప్పినా ప్రయోజనం ఉండదు.
మన వేదవేదాంగ పురాణేతిహాసాల శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని ప్రపంచానికి తెలియచేయడానికి కావల్సినంత టెర్మినాలజీని మనం పెంచుకోవాలంటే... మన పండితులు చాంధస భావాలకు అతీతంగా, అసూయాద్వేషాలకు అతీతంగా మెలగాలి. రేపటి తరానికన్నా మన శాస్త్రవిజ్ఞానాన్ని తెలిపే టెర్మినాలజీని పెంచే దిశగా పోయేటందుకు ఇంగ్లిష్ మీడియం వైపునకు వెళ్ళాలంటే కొందరు తెలుగు భాషాభిమానులకు కోపం వస్తుంది. మన సంప్రదాయం, మన పద్యం, మన ఛందస్సు అంటూ ఆవేశ పడిపోతారు.
నిజమే... కొన్ని వందల ఏళ్ళ నుండి మన ఛందస్సులో కొందరు మహా కవులు, కవులు పద్యాలు రాస్తున్నారు. సంతోషమే. కానీ అదే ఛందస్సులో కంప్యూటర్‌కు చెందిన ద్విసంఖ్యా మానాది గణితాంశాలు ఉన్నాయని ఎందరికి తెలుసు? పోనీ కొందరికి తెలుసు అనుకుందాం. తెలిసినవారు ఆ యా అంశాలను ప్రయోగశాల వద్ద ఎంత మేర సక్సెస్ చేశారు? వారికి తెలిసినదానిని ఎంత మంది గణిత సూత్రాలుగా మలచారు?
రేపటి తరమన్నా ఇంగ్లిష్ మీడియం వైపు నకు వెళ్ళి మన వేదాంగాదులలో ఉన్న విజ్ఞాన ఛాయలకు చక్కని టెర్మినాలజీ తయారుచేస్తే, మనం పశ్చిమ దేశాల కంటే ముందే ఉంటాము. మాతృభాష లోనే ఈ పని చెయ్యవచ్చు కదా అని కొందరు అనవచ్చు. అది సాధ్యం కాని పని. ఎందుకంటే మన మాతృభాషా పదజాలం కొంచెం ముందుకు వెళితే అది ఆధ్యాత్మికతలో కూరుకుపోతుంది. లేదా ఖగోళం, జ్యోతిషం అంటూ కాలక్షేపం చేస్తుంది.
ఇంగ్లిష్ మీడియం విషయంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి డేరింగ్ స్టెప్ వేశారు. దానిని అలాగే కొనసాగించాలి. ఛందస్సు కేవలం పద్యాలు రాసుకోవడానికి పుట్టింది కాదనీ, అందులో ద్విసంఖ్యా మాన గణితం, ఇంకా ఆధునిక గణితంలోకి ప్రవేశించని ఉదాత్తానుదాత్తాదుల గణితం ఉందనీ రేపటి తరమన్నా గమనించాలి.
రెండు రెళ్ళు ఆరు అన్నది సాహిత్యంలో చెప్పుకోవడానికి ఆహ్లాదంగా ఉండవచ్చు. కానీ రెండు రెళ్ళు నాలుగు అన్నది నిజం. ఆ నిజం మాటున ఉన్న సైన్స్, మాథ్స్ వైపు వెళ్ళాలంటే ఆయా భారతీయ సబ్జెక్టులకు సరిపడ టెర్మినాలజీ తప్పక ఉండాలి.
అభిప్రాయం: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు, వ్యాసకర్త విశ్రాంత ఉపాధ్యాయులు, 9849448947
Comments
Please login to add a commentAdd a comment