Mathematics teacher
-
పారిభాషిక పదాలు.. సృష్టించుకోవాలి!
ఖగోళ శాస్త్రం వంటివాటిల్లో పరిశోధనలు చేస్తూనే బ్రహ్మ గుప్తుడు లాంటి భారతీయ గణిత మేధావులు ప్రపంచానికి సున్నా (0) ను అందించారు. సున్నా (0) విలువ కూడా భారతీయ గణిత వేదవేదాంగ సాహిత్యవేత్తే కనిపెట్టాడు. అయితే అది ఇంకా వెలుగులోకి రాలేదు. దీనికి కారణం గణితం, భౌతిక, రసాయనిక జీవ శాస్త్రాదులను బాగా కప్పివేసిన ఆధ్యాత్మిక, జ్యోతిష్య సంబంధ భావజాలం. ఆ ముసుగును తీసి భారతీయ గణిత, భౌతిక, రసాయనిక, జీవ శాస్త్రాదుల తేజాన్ని ప్రయోగశాలలో చూపించాలన్న ఆసక్తితో ముందుకు వెళ్ళేవారికి ఇక్కడ సరైన ఆదరణ లభించడం లేదు.సమస్త విజ్ఞానం మన వేదాలలోనే ఉందని మన ఆధ్యాత్మిక, ఖగోళ, జ్యోతిష శాస్త్రవేత్తలు ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా... ప్రయోగ శాలలో నిలవని విజ్ఞానం తుదకు అజ్ఞానంగానే మిగిలిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రయోగశాలలో నిలవాలని తపించే భారతీయ వేదవేదాంగ శాస్త్రాలలో నిపుణులైనవారికి ఆర్థిక శక్తి లేమి అడ్డు వస్తోంది. కాస్త సైన్స్ చదువుకున్నవారు ఆధ్యాత్మిక జ్యోతిష్యాదులను అడ్డు పెట్టుకొని మాట్లాడే మాయగాళ్ళను సూడో సైన్స్గాళ్ళు అంటే, వీరు వారిని మరో విధంగా వెక్కిరిస్తారు. ఈ చర్చోపచర్చలు కాలక్షేపానికి తప్ప మరెందుకూ పనికిరావు. భారతీయ వేదవేదాంగ పురాణేతిహాసాలలో ఏ శాస్త్రం ఎంత ఉంది అనే విషయాన్ని పక్కన పెడితే ఆ యా విషయాల గురించి మాట్లాడటానికి తగినంత పారిభాషిక (టెర్మినాలజీ) పదజాలం లేదన్నది అక్షర సత్యం.వేదవేదాంగ పురాణేతిహాసాల విజ్ఞానం కథా రూపంలో ఉంటుంది. కథా భాష, ప్రయోగ శాల భాష ఒక రీతిన ఉండదు. ఉదాహరణకు రాజకుమారి ఉద్యానవనంలో చెలికత్తెలతో ఆడుకుంటోంది. ఆకాశంలోని పక్షుల వరుసలను చూసింది. మొదటి వరుసలో ఒకటి, రెండవ వరుసలో రెండు ఇలా... పదవ వరుసలో పది! మొత్తం పక్షులు ఎన్ని అంటే అందరి పప్పులు ఉడికాక రాజకుమారి 55 అని సమాధానం చెబుతుంది.n(n+1/2) అనే ఆధునిక గణిత సూత్రం రాజకుమారికి తెలియకపోవచ్చును. అయితే వేగంగా 10+(9+1=10)+(8+2=10)+(7+3=10)+(6+4=10) +5=55 అని నోటితో గణించే మేధ రాజకుమారికి ఉండి ఉండవచ్చు. పదికి దగ్గరకు వచ్చి కూడికలు, తీసివేతలు వంటివి చేస్తే లెక్క సులభం అవుతుంది అని ఆమెకు తెలిసి ఉండవచ్చు. ఏదేమైనప్పటికీ రాజకుమారి మేధను సూత్ర బద్ధం చేస్తే, భారతీయ గణితం అందరికీ అర్థమవుతుంది. అయితే సూత్ర బద్ధం చేయడానికి కావలిసినంత టెర్మినాలజీని మనవారు మనకు అందించలేదన్నది నిజం. టెర్మినాలజీ లేకుండా ఆధ్యాత్మికతతో, జ్యోతిష్యాది గణింపుతో ఎన్ని చెప్పినా ప్రయోజనం ఉండదు.మన వేదవేదాంగ పురాణేతిహాసాల శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని ప్రపంచానికి తెలియచేయడానికి కావల్సినంత టెర్మినాలజీని మనం పెంచుకోవాలంటే... మన పండితులు చాంధస భావాలకు అతీతంగా, అసూయాద్వేషాలకు అతీతంగా మెలగాలి. రేపటి తరానికన్నా మన శాస్త్రవిజ్ఞానాన్ని తెలిపే టెర్మినాలజీని పెంచే దిశగా పోయేటందుకు ఇంగ్లిష్ మీడియం వైపునకు వెళ్ళాలంటే కొందరు తెలుగు భాషాభిమానులకు కోపం వస్తుంది. మన సంప్రదాయం, మన పద్యం, మన ఛందస్సు అంటూ ఆవేశ పడిపోతారు.నిజమే... కొన్ని వందల ఏళ్ళ నుండి మన ఛందస్సులో కొందరు మహా కవులు, కవులు పద్యాలు రాస్తున్నారు. సంతోషమే. కానీ అదే ఛందస్సులో కంప్యూటర్‌కు చెందిన ద్విసంఖ్యా మానాది గణితాంశాలు ఉన్నాయని ఎందరికి తెలుసు? పోనీ కొందరికి తెలుసు అనుకుందాం. తెలిసినవారు ఆ యా అంశాలను ప్రయోగశాల వద్ద ఎంత మేర సక్సెస్ చేశారు? వారికి తెలిసినదానిని ఎంత మంది గణిత సూత్రాలుగా మలచారు?రేపటి తరమన్నా ఇంగ్లిష్ మీడియం వైపు నకు వెళ్ళి మన వేదాంగాదులలో ఉన్న విజ్ఞాన ఛాయలకు చక్కని టెర్మినాలజీ తయారుచేస్తే, మనం పశ్చిమ దేశాల కంటే ముందే ఉంటాము. మాతృభాష లోనే ఈ పని చెయ్యవచ్చు కదా అని కొందరు అనవచ్చు. అది సాధ్యం కాని పని. ఎందుకంటే మన మాతృభాషా పదజాలం కొంచెం ముందుకు వెళితే అది ఆధ్యాత్మికతలో కూరుకుపోతుంది. లేదా ఖగోళం, జ్యోతిషం అంటూ కాలక్షేపం చేస్తుంది.ఇంగ్లిష్ మీడియం విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి డేరింగ్ స్టెప్ వేశారు. దానిని అలాగే కొనసాగించాలి. ఛందస్సు కేవలం పద్యాలు రాసుకోవడానికి పుట్టింది కాదనీ, అందులో ద్విసంఖ్యా మాన గణితం, ఇంకా ఆధునిక గణితంలోకి ప్రవేశించని ఉదాత్తానుదాత్తాదుల గణితం ఉందనీ రేపటి తరమన్నా గమనించాలి.రెండు రెళ్ళు ఆరు అన్నది సాహిత్యంలో చెప్పుకోవడానికి ఆహ్లాదంగా ఉండవచ్చు. కానీ రెండు రెళ్ళు నాలుగు అన్నది నిజం. ఆ నిజం మాటున ఉన్న సైన్స్, మాథ్స్ వైపు వెళ్ళాలంటే ఆయా భారతీయ సబ్జెక్టులకు సరిపడ టెర్మినాలజీ తప్పక ఉండాలి.అభిప్రాయం: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు, వ్యాసకర్త విశ్రాంత ఉపాధ్యాయులు, 9849448947 -
ఇదేం ‘లెక్క’
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పనిచేసే ఫిజిక్స్ టీచర్లు ఇక నుంచి ఆరు, ఏడు తరగతుల విద్యార్థులకు గణితం సబ్జెక్టు బోధించాలని ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇది అన్యాయమంటూ ఫిజిక్స్ టీచర్లు ఉన్నతాధికారులను కలిశారు. దీనివల్ల తమకు తీవ్ర మానసికఒత్తిడి కలుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.గణితం బోధించే ఉపాధ్యాయులకు తక్కువ పనిగంటలు ఉంటాయని, తామే ఎక్కువ గంటలు పనిచేస్తామని, అయినా అదనంగా గణితం బోధించమనడం ఏమిటని ప్రశ్నించారు. అసలిది పాత విషయమేనని అనవసరంగా పెద్దది చేస్తున్నారని గణితం టీచర్లు అంటున్నారు. పరస్పర వాదనల నేపథ్యంలో ఈ ఏడాది బోధనకు ఏ స్థాయిలో సమస్య తలెత్తుతుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాలూ ఆందోళన చెందుతున్నాయి. అసలేంటీ పంచాయితీ గతంలో ఫిజిక్స్ సబ్జెక్టు గణితం వారు, కెమిస్ట్రీ సబ్జెక్టు బయలాజికల్ సైన్స్ వారు చెప్పేవారు. 2000లో ఫిజికల్ సైన్స్ పోస్టులు మంజూరు చేసి, 2002లో భర్తీ చేశారు. ఆ సమయంలో ప్రభుత్వం ఓ టైంటేబుల్తో సర్క్యులర్ ఇచ్చింది. ఇందులో 8, 9, 10 ఫిజిక్స్ చెప్పాలని, 6, 7 తరగతులకు గణితం చెప్పాలని పేర్కొంది. 2017 వరకూ ఈ విధానం కొనసాగింది. 2017 తర్వాత సిలబస్‌లో మార్పులొచ్చాయి. గణితం వారికి ఎక్కువ బోధన, సైన్స్ వారికి తక్కువ బోధన క్లాసులు ఉన్నాయనే వాదన తెరమీదకొచ్చింది.అప్పట్లో ఎస్ఈఆర్టీ 2017లో 6వ తరగతి గణితంను ఫిజిక్స్ టీచర్లు, 7వ తరగతి గణితంను 10 వరకూ చెప్పే గణితం టీచర్లే చెప్పాలని కొత్త ఆదేశాలు జారీ చేసింది. దీనిపై గణితం టీచర్లు ఆందోళనకు దిగారు. గణితం సబ్జెక్టులోనే ఎక్కువ మంది ఫెయిల్ అ వుతున్నారని, మరింత శ్రద్ధ అవసరమని తెలిపారు. దీంతో ఎస్సీఈఆర్టీ ఇచ్చిన ఆదేశాలు నిలిపివేసింది. అప్పట్నుంచీ వివాదం అలాగే కొనసాగింది. స్థానిక హెచ్ఎంలు సర్దుబాటు చేసుకొని క్లాసులు నిర్వహిస్తున్నారు. తాజాగా మళ్లీ ఫిజికల్ సైన్స్ టీచర్లు 6, 7 క్లాసుల గణితం చెప్పాలని ఆదేశాలివ్వడంతో వివాదం మొదలైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పం ఎట్టి పరిస్థితుల్లోనూ 6, 7 తరగతులకు గణితం సబ్జెక్టు బోధించం. దీనివల్ల 8, 9, 10 తరగతుల విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. సైన్స్ యాక్టివిటీ అయిన ఇన్స్పైర్ అవార్డులు, స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్,, నేషనల్ చిల్డ్రన్స్ కాంగ్రెస్ తదితర ముఖ్యమైన వాటిపై దృష్టి పెట్టడం కష్టం. గణితం కన్నా భౌతిక, రసాయన శా్రస్తాల బోధనే కష్టం. డిగ్రీలో, బీఈడీలో గణితం చదవాలన్న అర్హత నిబంధనలు లేవు. ఇలా గణితం నేపథ్యం లేని ఫిజిక్స్ అధ్యాపకులూ ఉన్నారు. వారిని గణితం బోధించమంటే ఎలా వీలవుతుంది? తక్షణమే ప్రభుత్వం పునరాలోచన చేయాలి. – అజయ్‌సింగ్, రాష్ట్ర ఫిజికల్ సైన్స్ టీచర్ల ఫోరం అధ్యక్షుడు జరిగే నష్టం ఏమిటి?ప్రభుత్వ ఉపాధ్యాయులు బీఈడీ చేసిన సమయంలో ఇప్పుడున్న సిలబస్ లేదు. ఈ కారణంగా ఫిజిక్స్ మినహా 6, 7 తరగతుల గణితం చెప్పాలంటే కొంత ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సమయాన్ని ఇలా వెచి్చస్తే కీలకమైన 9, 10 తరగతుల విద్యార్థులకు సైన్స్ సబ్జెక్టులో అన్యాయం జరుగుతుందనేది వారి వాదన. జాతీయస్థాయిలో జరిగే నీట్‌కు హాజరయ్యే విద్యార్థులకు 8వ తరగతి నుంచే సైన్స్‌లో గట్టి పునాది పడాలని ఫిజిక్స్ టీచర్లు చెబుతున్నారు.రాష్ట్రంలో ఉన్న టీచర్లలో 25 శాతం మంది ఫిజిక్స్ టీచర్లు ఉన్నారు. వీరికన్నా 20 శాతం గణితం టీచర్లు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. అలాంటప్పుడు వారికే 6,7 మేథ్స్ బోధన అప్పగించాలని కోరుతున్నారు. స్కూళ్లు తెరిచేలోగా సమస్య పరిష్కరించకపోతే విద్యార్థులు నష్టపోయే ప్రమాదం కనిపిస్తోంది. -
ఈయనే ఆ ఇమ్రాన్‌ఖాన్!
అల్వార్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం రాత్రి లండన్‌లోని వెంబ్లే స్టేడియంలో ప్రసంగిస్తూ.. ప్రముఖంగా ప్రస్తావించిన పేరు ఇమ్రాన్‌ఖాన్. విద్యాపరమైన 52 యాప్‌లు తయారుచేసి ఉచితంగా పంపిణీ చేసిన ఇమ్రాన్‌ఖాన్ సేవలను ఘనంగా కీర్తించారు. ఆయన సేవలో నిజమైన భారతీయత నాకు కనిపిస్తున్నదని మోదీ ప్రశంసల్లో ముంచెత్తారు. ఇంతకీ ఆ ఇమ్రాన్‌ఖాన్ ఎవరు? రాజస్థాన్‌లోని అల్వార్‌కు చెందిన ఆయన గణిత ఉపాధ్యాయుడు. సంస్కృత ప్రభుత్వ పాఠశాలలో గణితాన్ని బోధిస్తున్న 37 ఏళ్ల ఇమ్రాన్‌ఖాన్ అందరికీ విద్యనందించేందుకు అలుపులేకుండా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే 50కిపైగా మొబైల్ యాప్‌లను రూపొందించి ఉచితంగా పంపిణీ చేశారు. ప్రధాని మోదీ తన పేరు ప్రస్తావించడంతో ప్రముఖంగా వెలుగులోకి వచ్చిన ఇమ్రాన్‌ఖాన్ శనివారం విలేకరులతో మాట్లాడుతూ 'ఉపాధ్యాయుడిగా నేను చేసిన కృషి చాలా చిన్నది. దీనికి నన్ను ప్రధాని పొగడటం చాలా గొప్ప విషయం' పేర్కొన్నారు. 'డిజిటల్ ఇండియా మిషన్‌లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు మనం ట్యాబెట్లు, కంప్యూటర్లు, ఐటీ సాధనాలు సమకూర్చాల్సిన అవసరముంది. వాటిలో ప్రాంతీయ భాషల్లో సమాచారం అందించే యాప్, స్టాప్వేర్లు అందుబాటులో ఉంచాలి. ఇంగ్లిష్ భాషలో ఎంతోమంచి సాఫ్ట్వేర్లు ఉన్నాయి. కానీ ఆ సేవలు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉపయోగపడటం లేదు. కాబట్టి హిందీ వంటి ప్రాంతీయ భాషల్లోనూ ఆ సేవలను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరముంది' అని ఆయన చెప్పారు. -
గుర్రు..వు
భయం నుంచి వచ్చేది నిస్పృహ... నిస్పృహ పెంచేది అచేతనం. గౌరవం నుంచి పుట్టేది భక్తి... భక్తి నుంచి పెరిగేది శ్రద్ధ. స్కూలు పిల్లలకు కావలసింది టీచర్లంటే భయం కాదు... భక్తి. చదువులపై అనాసక్తి కాదు... శ్రద్ధ. రోజూ స్కూలుకు వెళ్లాలనిపించే చదువులు... రోజూ చదువుకోవాలనిపించే స్కూళ్లు. తల్లిదండ్రులను మించిన దైవం గురువు అంటారు. శిక్షకు, శిక్షణకు తేడా తెలియనివారు గురువులెలా అవుతారు? దైవం ఎలా అవుతారు? దండించకుండానే మార్పు తేవచ్చు - పోటీని తట్టుకోవాలంటే పిల్లలు చదువులో ముందుండాలి. వారు మనసుపెట్టి చదువుకోవాలంటే పాఠశాల వాతావరణమూ బాగుండాలి. - పిల్లలను ప్రశంసించడం నేర్చుకోండి. ఎంత చిన్న ఘనత సాధించినా చిన్న చిన్న కానుకలు ఇస్తూ విద్యార్థుల అభివృద్ధికి మైలురాళ్లు వేయండి. - తప్పులు చేయడం సహజం. వాటిని దిద్దుకున్న మేధావుల గురించి చెప్పండి. ఇలా దండన అవసరం లేకుండానే చదువు చెప్పవచ్చు. - విద్యార్థి తప్పు చేస్తే దాన్ని నలుగురి ముందు ఫోకస్ చేయకండి. అలాగని ‘నాకెందుకు’ అని వదిలేయకుండా సరిదిద్దండి. మీపై గౌరవం పెరుగుతుంది. - అస్సలు చదవని పిల్లవాడినైనా ‘బాగా చదవగలవు’ అనే పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉండండి. - శారీరక, మానసిక దండన అనేది పిల్లలను స్కూల్ నుండి, నేర్చుకోవడం నుండి దూరం చేస్తుందని గమనించండి. కిందటి విద్యా సంవత్సరం: పిఠాపురంలోని ఓ ప్రైవేటు స్కూల్లో లెక్కల టీచర్ విచక్షణ కోల్పోయి విద్యార్థిపై విరుచుకుపడ్డాడు. ఐదవ తరగతి చదువుతున్న కామేష్ అనే విద్యార్థి తలపై ఆ టీచర్ కర్రతో బలంగా కొట్టడంతో అతడికి తీవ్ర గాయమై, ఆసుపత్రి పాలయ్యాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్లో టెన్త్ చదువుతున్న ఇస్మాయిల్ తరగతి గదిలో స్నేహితులతో మాట్లాడుతుండగా టీచరమ్మకు విపరీతమైన కోపం వచ్చింది. పనిష్మెంటుగా అతడిని స్కూల్ నాలుగు అంతస్తులలోని అన్ని తరగతులకు తిప్పి, గుంజీలు తీయించింది. అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న ఇస్మాయిల్ తీవ్ర అస్వస్థతకు లోనై ఆ తర్వాత చికిత్స పొందుతూ మరణించాడు. విశాఖపట్టణంలోని ఓ మాంటిస్సోరి స్కూల్లో సూర్యతేజ, దిలీప్‌కుమార్ అనే ఐదవ తరగతి విద్యార్థులు హోమ్‌వర్క్ చేసుకురాలేదని టీచర్ మూడుగంటల పాటు వాళ్ల బట్టలు విప్పించి, ఎండలో నిలబెట్టింది. ఈ నాలుగు సంఘటనలే కాదు... బడికి ఆలస్యంగా వచ్చాడనే కోపంతో ఒక టీచర్, హోంవర్క్ చేయలేదన్న కారణంతో మరో టీచర్, డిక్టేషన్ సరిగా రాయలేదన్న చిరాకుతో ఇంకో టీచర్, క్లాస్ రూములో గుసగుసలు చెప్పుకుంటున్నందుకు ఇంకో టీచర్, జుత్తు సరిగ్గా దువ్వుకోనందుకు, దుస్తులు సరిగా వేసుకోనందుకు, బ్యాడ్జీ పెట్టుకోనందుకు, బాక్స్‌లో అన్నం పూర్తిగా తిననందుకు.. ఇలా ఏదో ఒక కారణంతో స్కూల్లో టీచర్ల చేత దెబ్బలు తినని పిల్లలు లేరు. మానసిక హింస టీచర్లు విధించే ఇలాంటి చాలా శిక్షలు స్కూల్ గేట్ దాటి బయటపడవు. అందులోనూ మానసిక వేధింపుల శిక్షలైతే ఎప్పటికీ బయటపడవు. ‘పాఠశాలల్లో మానసిక వేధింపులు కూడా ఇటీవలి కాలంలో ఎక్కువవుతున్నాయి’ అంటున్నారు సైకాలజిస్టులు. 8వ తరగతి చదువుతున్న పూర్ణిమ ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడుతూ ఉండేది. అకస్మాత్తుగా నవ్వడమే మర్చిపోయింది. ఒక సబ్జెక్ట్‌లో తక్కువ మార్కులు వచ్చాయనే కారణంతో ‘నువ్వు నవ్వితే అసహ్యంగా’ ఉంటుందని తిట్టాడట టీచర్. నవ్వడమే తప్పు అన్న భావనలోనే ఆ అమ్మాయి కొన్నేళ్లుగా ఉండిపోయింది. అంతేకాదు శారీరక లోపాలను, ప్రవర్తనను, చదువులో వెనుకబాటుతనాన్ని కారణంగా చూపుతూ విద్యార్థులను తోటి విద్యార్థుల ముందు అవమానించడం అతి పెద్ద హింస’ అంటున్నారు మానసిక నిపుణులు. ఎందుకంటే ఒంటిమీద కన్నా మనసు మీద పడిన దెబ్బ తాలూకు గాయం అతి పెద్దది. అది పిల్లల్లో ఆ టీచర్ పట్ల, ఆ టీచర్ చెప్పే చదువు పట్ల ఏహ్యభావనకు దారి తీస్తుంది. మీరూ టీచరేనా? అయితే... సర్వేపల్లి రాధాకృష్ణ, రవీంద్రనాథ్ టాగూర్, సావిత్రీబాయి పూలే... ఇలా ఎంతో మంది టీచర్ల గురించి నేటికీ గొప్పగా చెప్పుకుంటున్నాం. వారిలా రేపటి తరం మనసుల్లో తమ అభిమాన టీచర్ ఓ రోల్‌మోడల్‌గా మీరూ కొలువుదీరాలి. - విద్యార్థులు టీచర్నే ప్రధానంగా గమనిస్తారు. మీరు క్రమశిక్షణతో నడుచుకుంటే మిమ్మల్ని అనుసరించే విద్యార్థులు తమ ప్రవర్తనను తామే సరిదిద్దుకునే శక్తిని పెంచుకోగలరు. - శుభ్రమైన డ్రెస్, హుందాగా నడక.. మీ పూర్తి ఆహార్యమూ చూడ్డానికి బాగుండాలి. - ఇటీవల కాలంలో టీచర్- స్టూడెంట్స్ మధ్య కమ్యూనికేషన్ ఉండటం లేదు. అందుకని రెగ్యులర్ టైమ్‌లో కుదరకపోయినా, స్కూల్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు పిల్లల కోసం సమయం కేటాయించండి. పాఠ్యాంశాలు బోధించడానికి కాదు ఓ చిన్న కథతోనో, వారి సమస్యలు వినడం వల్లనో ఆకట్టుకోండి. - ‘టీచర్‌కి అన్నీ తెలుసు’ అని మాత్రమే కాదు ‘నా గురించి మా టీచర్‌కు అన్నీ తెలుసు’ అని పిల్లవాడికి నమ్మకం కుదిరితే, కుదురుగా మీరు చెప్పింది తప్పక వింటాడు. - టీచర్‌పై అభిమానం పెంచుకున్న విద్యార్థి ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా తన మార్గానికి సోపానంగా నిలిచిన వారికి ఎప్పుడూ అభివాదం చేస్తూనే ఉంటాడు. ముందుతరాలకూ ఆ టీచర్ గొప్పతనాన్ని చాటుతూనే ఉంటాడు. విద్యార్థి తన జీవితకాలపు ‘వరం’గా ఉపాధ్యాయుడు తనను తాను మార్చుకోవాల్సిన అవసరం నేడు తప్పనిసరి. - నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి యాక్షన్ తీసుకుంటాం శిక్షణ పొందిన టీచర్లే బడిలో ఉండాలి కానీ, శిక్షలను అమలు చేసేవారు కాదు. ఏ పాఠశాల అయినా అర్హత కలిగిన టీచర్లనే నియమించుకోవాలి. పిల్లలను శిక్షించే టీచర్‌కు సంబంధించిన సమాచారం రుజువులతో సహా ఉంటే, సదరు టీచర్‌ను తొలగించమని ఆ స్కూల్కునోటీసులు ఇస్తాం. సరైన యాక్షన్ తీసుకుంటాం. - ఆర్.పి.సిసోడియా, ఐ.ఎ.ఎస్, ప్రభుత్వ కార్యదర్శి, విద్యాశాఖ, ఆంధ్రప్రదేశ్ సహనం తప్పనిసరి.... శిక్షలు అమలు చేసే టీచర్ల పట్ల బాలల హక్కు చట్టం ప్రకారమే కాకుండా శాఖాపరమైన చర్యలంటూ ఉంటాయి. మండల పరిధిలో ఉన్న ప్రభుత్వ, ప్రవైట్ స్కూళ్ల తనిఖీ చేయడం మా విధి. పిల్లలను శిక్షిస్తున్నారని నిర్ధారణ అయితే ప్రాధమిక నివేదక ఆధారంగా తొలత ఆ ఉద్యోగిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తాం. - కొల్లి తవిటినాయుడు, ఎంఈఓ, భోగాపురం మండలం, విజయనగరం. నిశితంగా గమనించాలి తల్లిదండ్రులతో ‘తరగతి గదిలో మీ అబ్బాయి/అమ్మాయి మిస్‌బిహేవ్’ చేస్తున్నారు అనే కంప్లైంటు చేస్తుంటారు టీచర్లు. పిల్లల ప్రతి ప్రవర్తనకు ఒక కారణం ఉంటుంది. వారిలో అల్లరినే కాదు, ఏదైనా అటెన్షన్ డిజార్డర్ ఉందా, అకడమిక్‌లో లోపమా... అనేది కూడా చూడాలి. ప్రవర్తనలో లోపాన్ని మూలం నుంచి మార్చుకురావాలి కానీ, శిక్షల వల్లకాదు. - డా.గీతాచల్లా, సైకాలజిస్ట్ అనుబంధం బలపడుతుంది అర్హత కలిగిన టీచర్లనే ఎంపిక చేస్తాం. వారానికి ఒకసారైనా విద్యార్థులకు జీవనైపుణ్యాలను సంబంధించిన తరగతులను నిర్వహిస్తాం కాబట్టి, టీచర్‌కి-స్టూడెంట్‌కి మధ్య అనుబంధం బలపడుతుంది. దీంతో దండన అనే సమస్యే లేదు. ఈ తరహా పద్ధతి వల్ల విద్యార్థుల ప్రవర్తనలో మంచి మార్పులు చూస్తున్నాం. - జయంతి వెంకటరామన్, ప్రిన్సిపల్, సిస్టర్ నివేదిత స్కూల్, హైదరాబాద్