ఈయనే ఆ ఇమ్రాన్‌ఖాన్!
అల్వార్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం రాత్రి లండన్‌లోని వెంబ్లే స్టేడియంలో ప్రసంగిస్తూ.. ప్రముఖంగా ప్రస్తావించిన పేరు ఇమ్రాన్‌ఖాన్. విద్యాపరమైన 52 యాప్‌లు తయారుచేసి ఉచితంగా పంపిణీ చేసిన ఇమ్రాన్‌ఖాన్ సేవలను ఘనంగా కీర్తించారు. ఆయన సేవలో నిజమైన భారతీయత నాకు కనిపిస్తున్నదని మోదీ ప్రశంసల్లో ముంచెత్తారు. ఇంతకీ ఆ ఇమ్రాన్‌ఖాన్ ఎవరు? రాజస్థాన్‌లోని అల్వార్‌కు చెందిన ఆయన గణిత ఉపాధ్యాయుడు. సంస్కృత ప్రభుత్వ పాఠశాలలో గణితాన్ని బోధిస్తున్న 37 ఏళ్ల ఇమ్రాన్‌ఖాన్ అందరికీ విద్యనందించేందుకు అలుపులేకుండా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే 50కిపైగా మొబైల్ యాప్‌లను రూపొందించి ఉచితంగా పంపిణీ చేశారు.
ప్రధాని మోదీ తన పేరు ప్రస్తావించడంతో ప్రముఖంగా వెలుగులోకి వచ్చిన ఇమ్రాన్‌ఖాన్ శనివారం విలేకరులతో మాట్లాడుతూ 'ఉపాధ్యాయుడిగా నేను చేసిన కృషి చాలా చిన్నది. దీనికి నన్ను ప్రధాని పొగడటం చాలా గొప్ప విషయం' పేర్కొన్నారు.
'డిజిటల్ ఇండియా మిషన్‌లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు మనం ట్యాబెట్లు, కంప్యూటర్లు, ఐటీ సాధనాలు సమకూర్చాల్సిన అవసరముంది. వాటిలో ప్రాంతీయ భాషల్లో సమాచారం అందించే యాప్, స్టాప్‌వేర్‌లు అందుబాటులో ఉంచాలి. ఇంగ్లిష్ భాషలో ఎంతోమంచి సాఫ్ట్‌వేర్‌లు ఉన్నాయి. కానీ ఆ సేవలు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉపయోగపడటం లేదు. కాబట్టి హిందీ వంటి ప్రాంతీయ భాషల్లోనూ ఆ సేవలను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరముంది' అని ఆయన చెప్పారు.