
ఇస్లామాబాద్: నిర్మాణాత్మక చర్చలు ప్రారంభమయ్యేందుకు ముందుగా ఇరుదేశాల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పడాల్సిన అవసరం ఉందని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్ సహా అన్ని అపరిష్కృత సమస్యల పరిష్కారానికి అది ఎంతో అవసరమని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. పాకిస్తాన్ డే సందర్భంగా పాక్ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ భారత ప్రధాని రాసిన లేఖకు సోమవారం ఇమ్రాన్ సమాధానమిచ్చారు.
పాకిస్తాన్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ, పాక్ ప్రజలు కూడా భారత్ సహా అన్ని పొరుగు దేశాలతో శాంతియుత, సహకారాత్మక సంబంధాలనే కోరుకుంటున్నారని పేర్కొన్నారు. శాంతి నెలకొనాలంటే ముందుగా ఉగ్రవాద రహిత వాతావరణం ఏర్పడాలన్న మోదీ వ్యాఖ్యకు స్పందనగా.. కశ్మీర్ సహా అన్ని సమస్యలు పరిష్కారమైతేనే శాంతి సాధ్యమని ఇమ్రాన్ స్పష్టం చేయడం గమనార్హం.
చదవండి: (ప్రమాదంలో యావత్ దేశం.. కరోనా తీవ్రతతో పరిస్థితి విషమం)