జమ్మూకశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తివేస్తే రక్తపాతమే : ఇమ్రాన్‌ | Imran Khan Will Raise Kashmir Issue At UNGeneral Assembly | Sakshi
Sakshi News home page

ఐరాస వేదికగా భారత్‌పై అక్కసు వెళ్లగక్కిన పాక్‌

Published Fri, Sep 27 2019 10:16 PM | Last Updated on Fri, Sep 27 2019 10:49 PM

Imran Khan Will Raise Kashmir Issue At UNGeneral Assembly - Sakshi

న్యూయార్క్‌ : అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్‌ మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. ఐక్యరాజ్యసమితి వార్షిక సమావేశాల్లో ప్రసంగించిన పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు. భారత ప్రధాని మోదీ ప్రసంగ శైలికి భిన్నంగా భారత్‌పై విమర్శలు చేయడమే ప్రధాన అంశంగా ఇమ్రాన్‌ మాట్లాడారు. జమ్మూకశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తివేస్తే రక్తపాతమేనంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌ను కేవలం రాజకీయం కోసం మాత్రమే వాడుకుంటున్నారని ఆరోపించారు. ఆర్‌ఎస్‌ఎస్‌పై కూడా ఆయన  విమర్శలు గుప్పించారు. 

ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. ‘కశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావించడానికే ఇక్కడికి వచ్చా. సెప్టెంబర్‌ 11 దాడుల్లో మా ప్రమేయం లేదు. కశ్మీర్‌ ఉగ్రవాదం గురించి మోదీ మాట్లాడారు. మరి బెలూచిస్తాన్‌లో భారత్‌ చేస్తున్న గూఢచర్యం సంగతేమిటి..?. పుల్వామా దాడిలో ఆధారాలు చూపాలని అడిగాం.. సర్జికల్‌స్ట్రైక్‌లో 300 మందిని చంపామని అన్నారు. ఇదంతా ట్రైలర్‌ అని ఎన్నికల ప్రచారంలో చెప్పారు. ఇవన్నీ కూడా పక్కనపెట్టి చర్చలకు రావాలని మోదీని ఆహ్వానించాం. కానీ మోదీ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆర్ఎస్ఎస్ వ్యవహారాన్ని ప్రస్తావనకు తెచ్చారు. ఇండియాలో ఆర్‌ఎస్‌ఎస్‌ అనే సంస్థ ఉంది. మోదీ దానికి జీవితకాల సభ్యుడు. హిట్లర్‌, ముస్సోలినిల స్ఫూర్తితో ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పడింది. ముస్లింలు, క్రిస్టియన్లపై ద్వేషాన్ని పెంచే సంస్థ ఆర్‌ఎస్‌ఎస్.

ప్రపంచ వ్యాప్తంగా ఇస్లామిక్‌ ఫోబియా పెరుగుతోంది. 9/11 దాడుల తర్వాత ఆందోళన మరింత ఉధృతమైంది. కొందరు నేతలు ఉగ్రవాదాన్ని ఇస్లాం మతంతో ముడిపెట్టారు. మతంతో టెర్రరిజానికి సంబంధం లేదు. యూరోపియన్‌ దేశాలు ముస్లింలను అణచివేయాలని చూస్తున్నాయి. ఆ విషయాన్ని ముస్లిం దేశాధినేతలు పట్టించుకోవడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా పలు మతాలు ముస్లింలను రాడికల్స్‌గా ముద్రవేశాయి. ముస్లింలపై వాటి ధోరణి మారాలి.

జాత్యహంకార, విద్వేషపూరిత సిద్ధాంతాలే మహాత్మాగాంధీని చంపేశాయి. మోదీ గుజరాత్‌ సీఎంగా ఉండగా ఎలాంటి చర్యలకు మద్దతిచ్చారో మీరే తెలుసుకోండి. గుజరాత్‌లో వేలమంది ముస్లింలను హతమార్చారు. బలగాలు మోహరించి 80 లక్షల మంది కశ్మీరీలను నిర్బంధిస్తే ఆర్‌ఎస్‌ఎస్‌ మాట్లాడటం లేదు. గత 30 ఏళ్లలో లక్షల మంది కశ్మీరీలు చనిపోయారు. జంతువుల కంటే హీనంగా ముస్లింలను నిర్భందించారు. ఐరాస కశ్మీర్‌కు కల్పించిన హక్కులను భారత్‌ కాలరాస్తోంది. నిర్బంధం విధిస్తే కశ్మీర్‌ మౌనంగా ఉంటుందని అనుకుంటున్నారు. అది ఆయన అహంభావం. వీటన్నిటి మీద ఐరాసలో చర్చ జరగాల్సిన ఆవశ్యకత ఉంది’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement