ఇస్లామాబాద్/శ్రీనగర్/న్యూఢిల్లీ: కశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370ని రద్దుచేయడం ద్వారా భారత ప్రధాని మోదీ వ్యూహాత్మక తప్పిదానికి పాల్పడ్డారని పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ విమర్శించారు. పాక్ స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో బుధవారం పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే) అసెంబ్లీలో ఇమ్రాన్ మాట్లాడారు. ‘మోదీ తన చివరి అస్త్రాన్ని ప్రయోగించారు. ఈ నిర్ణయం మోదీకి, బీజేపీకి చాలా ఖరీదైన వ్యవహారంగా మారబోతోంది. ఎందుకంటే కశ్మీర్ సమస్యను వారు అంతర్జాతీయం చేసేశారు. భారత్‌లో కర్ఫ్యూ సందర్భంగా ఏమేం జరిగిందో మేం అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళతాం. ప్రతీ అంతర్జాతీయ వేదికపై కశ్మీరీలకు నేను రాయబారిగా నిలుస్తా’ అని వెల్లడించారు. కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులపై అంతర్జాతీయ సమాజం ఎందుకు మౌనం వహిస్తోందని ఆయన ప్రశ్నించారు. జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని కేంద్రం రద్దుచేసిన సంగతి తెలిసిందే. భారత్ చర్యకు నిరసనగా దౌత్య, వాణిజ్య సంబంధాలను తెంచుకున్న పాక్, ఆగస్టు 14ను కశ్మీరీలకు సంఘీభావ దినంగా పాటిస్తామని ప్రకటించింది.
భారత్ దాడికి సిద్ధమైంది..
భారత్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా పాక్ దీటుగా తిప్పికొడుతుందని ఇమ్రాన్ హెచ్చరిం చారు. ‘భారత్ దుందుడుకు చర్యలు తీసుకునేందుకు సిద్ధమైందని మా ఆర్మీకి పూర్తి సమాచారం ఉంది. మీకు(భారత్‌కు) నేను చెప్పేదొక్కటే. భారత్ విసిరే ప్రతీ ఇటుకకు రాయితో జవాబిస్తాం. మీరు ఎలాంటి చర్య తీసుకున్నా, మేం చివరివరకూ పోరాడుతాం. భారత్–పాకిస్తాన్‌ల మధ్య యుద్ధమే జరిగితే అందుకు ప్రపంచశాంతి కోసం ఏర్పడ్డ అంతర్జాతీయ సంస్థలే బాధ్యత వహించాల్సి ఉంటుంది’ అని ఇమ్రాన్ హెచ్చరించారు.
జమ్మూలో ఆంక్షల ఎత్తివేత..
శాంతిభద్రతలు అదుపులోనే ఉన్న నేపథ్యంలో బుధవారం జమ్మూలో ఆంక్షలను ఎత్తివేశారు. ఈ విషయమై జమ్మూకశ్మీర్ అదనపు డీజీపీ మునీర్ ఖాన్ మాట్లాడుతూ..‘జమ్మూలో విధించిన ఆంక్షలను పూర్తిగా ఎత్తివేశాం. స్కూళ్లు, ఇతర కార్యాలయాలు సాధారణంగానే నడుస్తున్నాయి. కశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆంక్షలు కొనసాగుతున్నాయి. కర్ఫ్యూ సందర్భంగా అక్కడక్కడా చెదరుమదురు సంఘటనలు చోటుచేసుకున్నాయి. కొందరికి పెల్లెట్ గాయాలయ్యాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు’ అని తెలిపారు. సామాజికమాధ్యమాల ఆధారంగా పాక్ తప్పుడు వార్తల్ని వ్యాప్తిచేస్తోందనీ, ఈ విషయంలో తాము చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
మోదీ చివరి అస్త్రం వాడారు
Published Thu, Aug 15 2019 3:46 AM | Last Updated on Thu, Aug 15 2019 4:32 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment