గుర్రు..వు | Teacher giving heavy panishments to students | Sakshi
Sakshi News home page

గుర్రు..వు

Published Wed, Jun 17 2015 10:50 PM | Last Updated on Sun, Sep 3 2017 3:53 AM

గుర్రు..వు

గుర్రు..వు

భయం నుంచి వచ్చేది నిస్పృహ... నిస్పృహ పెంచేది అచేతనం.
గౌరవం నుంచి పుట్టేది భక్తి... భక్తి నుంచి పెరిగేది శ్రద్ధ.
స్కూలు పిల్లలకు కావలసింది టీచర్లంటే భయం కాదు... భక్తి.
చదువులపై అనాసక్తి కాదు... శ్రద్ధ.
రోజూ స్కూలుకు వెళ్లాలనిపించే చదువులు... రోజూ చదువుకోవాలనిపించే స్కూళ్లు.
తల్లిదండ్రులను మించిన దైవం గురువు అంటారు.
శిక్షకు, శిక్షణకు తేడా తెలియనివారు గురువులెలా అవుతారు? దైవం ఎలా అవుతారు?
 
దండించకుండానే మార్పు తేవచ్చు
- పోటీని తట్టుకోవాలంటే పిల్లలు చదువులో ముందుండాలి. వారు మనసుపెట్టి చదువుకోవాలంటే పాఠశాల వాతావరణమూ బాగుండాలి.
- పిల్లలను ప్రశంసించడం నేర్చుకోండి. ఎంత చిన్న ఘనత సాధించినా చిన్న చిన్న కానుకలు ఇస్తూ విద్యార్థుల అభివృద్ధికి మైలురాళ్లు వేయండి.  
- తప్పులు చేయడం సహజం. వాటిని దిద్దుకున్న మేధావుల గురించి చెప్పండి. ఇలా దండన అవసరం లేకుండానే చదువు చెప్పవచ్చు.
- విద్యార్థి తప్పు చేస్తే దాన్ని నలుగురి ముందు ఫోకస్ చేయకండి. అలాగని ‘నాకెందుకు’ అని వదిలేయకుండా సరిదిద్దండి. మీపై గౌరవం పెరుగుతుంది.
- అస్సలు చదవని పిల్లవాడినైనా ‘బాగా చదవగలవు’ అనే పాజిటివ్ స్టేట్‌మెంట్స్ ఇస్తూ ఉండండి.
- శారీరక, మానసిక దండన అనేది పిల్లలను స్కూల్ నుండి, నేర్చుకోవడం నుండి దూరం చేస్తుందని గమనించండి.
 
కిందటి విద్యా సంవత్సరం: పిఠాపురంలోని ఓ ప్రైవేటు స్కూల్లో లెక్కల టీచర్ విచక్షణ కోల్పోయి విద్యార్థిపై విరుచుకుపడ్డాడు. ఐదవ తరగతి చదువుతున్న కామేష్ అనే విద్యార్థి తలపై ఆ టీచర్ కర్రతో బలంగా కొట్టడంతో అతడికి తీవ్ర గాయమై, ఆసుపత్రి పాలయ్యాడు.

హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో టెన్త్ చదువుతున్న ఇస్మాయిల్ తరగతి గదిలో స్నేహితులతో మాట్లాడుతుండగా టీచరమ్మకు విపరీతమైన కోపం వచ్చింది. పనిష్మెంటుగా అతడిని స్కూల్ నాలుగు అంతస్తులలోని అన్ని తరగతులకు తిప్పి, గుంజీలు తీయించింది. అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న ఇస్మాయిల్ తీవ్ర అస్వస్థతకు లోనై ఆ తర్వాత చికిత్స పొందుతూ మరణించాడు.
విశాఖపట్టణంలోని ఓ మాంటిస్సోరి స్కూల్లో సూర్యతేజ, దిలీప్‌కుమార్ అనే ఐదవ తరగతి విద్యార్థులు హోమ్‌వర్క్ చేసుకురాలేదని టీచర్ మూడుగంటల పాటు వాళ్ల బట్టలు విప్పించి, ఎండలో నిలబెట్టింది.
 
ఈ నాలుగు సంఘటనలే కాదు...
బడికి ఆలస్యంగా వచ్చాడనే కోపంతో ఒక టీచర్, హోంవర్క్ చేయలేదన్న కారణంతో మరో టీచర్, డిక్టేషన్ సరిగా రాయలేదన్న చిరాకుతో ఇంకో టీచర్, క్లాస్ రూములో గుసగుసలు చెప్పుకుంటున్నందుకు ఇంకో టీచర్, జుత్తు సరిగ్గా దువ్వుకోనందుకు, దుస్తులు సరిగా వేసుకోనందుకు, బ్యాడ్జీ పెట్టుకోనందుకు, బాక్స్‌లో అన్నం పూర్తిగా తిననందుకు.. ఇలా ఏదో ఒక కారణంతో స్కూల్‌లో టీచర్ల చేత దెబ్బలు తినని పిల్లలు లేరు.
 
మానసిక హింస
టీచర్లు విధించే ఇలాంటి చాలా శిక్షలు స్కూల్ గేట్ దాటి బయటపడవు. అందులోనూ మానసిక వేధింపుల శిక్షలైతే ఎప్పటికీ బయటపడవు. ‘పాఠశాలల్లో మానసిక వేధింపులు కూడా ఇటీవలి కాలంలో ఎక్కువవుతున్నాయి’ అంటున్నారు సైకాలజిస్టులు.

8వ తరగతి చదువుతున్న పూర్ణిమ ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడుతూ ఉండేది. అకస్మాత్తుగా నవ్వడమే మర్చిపోయింది. ఒక సబ్జెక్ట్‌లో తక్కువ మార్కులు వచ్చాయనే కారణంతో ‘నువ్వు నవ్వితే అసహ్యంగా’ ఉంటుందని తిట్టాడట టీచర్. నవ్వడమే తప్పు అన్న భావనలోనే ఆ అమ్మాయి కొన్నేళ్లుగా ఉండిపోయింది. అంతేకాదు శారీరక లోపాలను, ప్రవర్తనను, చదువులో వెనుకబాటుతనాన్ని కారణంగా చూపుతూ విద్యార్థులను తోటి విద్యార్థుల ముందు అవమానించడం అతి పెద్ద హింస’ అంటున్నారు మానసిక నిపుణులు. ఎందుకంటే ఒంటిమీద కన్నా మనసు మీద పడిన దెబ్బ తాలూకు గాయం అతి పెద్దది. అది పిల్లల్లో ఆ టీచర్ పట్ల, ఆ టీచర్ చెప్పే చదువు పట్ల ఏహ్యభావనకు దారి తీస్తుంది.
 
మీరూ టీచరేనా? అయితే...
సర్వేపల్లి రాధాకృష్ణ, రవీంద్రనాథ్ టాగూర్, సావిత్రీబాయి పూలే... ఇలా ఎంతో మంది టీచర్ల గురించి నేటికీ గొప్పగా చెప్పుకుంటున్నాం. వారిలా రేపటి తరం మనసుల్లో తమ అభిమాన టీచర్ ఓ రోల్‌మోడల్‌గా మీరూ కొలువుదీరాలి.
- విద్యార్థులు టీచర్‌నే ప్రధానంగా గమనిస్తారు. మీరు క్రమశిక్షణతో నడుచుకుంటే మిమ్మల్ని అనుసరించే విద్యార్థులు తమ ప్రవర్తనను తామే సరిదిద్దుకునే శక్తిని పెంచుకోగలరు.
- శుభ్రమైన డ్రెస్, హుందాగా నడక.. మీ పూర్తి ఆహార్యమూ చూడ్డానికి బాగుండాలి.
- ఇటీవల కాలంలో టీచర్- స్టూడెంట్స్ మధ్య కమ్యూనికేషన్ ఉండటం లేదు. అందుకని రెగ్యులర్ టైమ్‌లో కుదరకపోయినా, స్కూల్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు పిల్లల కోసం సమయం కేటాయించండి. పాఠ్యాంశాలు బోధించడానికి కాదు ఓ చిన్న కథతోనో, వారి సమస్యలు వినడం వల్లనో ఆకట్టుకోండి.
- ‘టీచర్‌కి అన్నీ తెలుసు’ అని మాత్రమే కాదు ‘నా గురించి మా టీచర్‌కు అన్నీ తెలుసు’ అని పిల్లవాడికి నమ్మకం కుదిరితే, కుదురుగా మీరు చెప్పింది తప్పక వింటాడు.
- టీచర్‌పై అభిమానం పెంచుకున్న విద్యార్థి ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా తన మార్గానికి సోపానంగా నిలిచిన వారికి ఎప్పుడూ అభివాదం చేస్తూనే ఉంటాడు. ముందుతరాలకూ ఆ టీచర్ గొప్పతనాన్ని చాటుతూనే ఉంటాడు. విద్యార్థి తన జీవితకాలపు ‘వరం’గా ఉపాధ్యాయుడు తనను తాను మార్చుకోవాల్సిన అవసరం నేడు తప్పనిసరి.
- నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
 
యాక్షన్ తీసుకుంటాం
శిక్షణ పొందిన టీచర్లే బడిలో ఉండాలి కానీ, శిక్షలను అమలు చేసేవారు కాదు. ఏ పాఠశాల అయినా అర్హత కలిగిన టీచర్లనే నియమించుకోవాలి. పిల్లలను శిక్షించే టీచర్‌కు సంబంధించిన సమాచారం రుజువులతో సహా ఉంటే, సదరు టీచర్‌ను తొలగించమని ఆ స్కూల్‌కునోటీసులు ఇస్తాం. సరైన యాక్షన్ తీసుకుంటాం.
- ఆర్.పి.సిసోడియా, ఐ.ఎ.ఎస్, ప్రభుత్వ కార్యదర్శి, విద్యాశాఖ, ఆంధ్రప్రదేశ్
 
సహనం తప్పనిసరి....
శిక్షలు అమలు చేసే టీచర్ల పట్ల బాలల హక్కు చట్టం ప్రకారమే కాకుండా శాఖాపరమైన చర్యలంటూ ఉంటాయి. మండల పరిధిలో ఉన్న ప్రభుత్వ, ప్రవైట్ స్కూళ్ల తనిఖీ చేయడం మా విధి. పిల్లలను శిక్షిస్తున్నారని నిర్ధారణ అయితే ప్రాధమిక నివేదక ఆధారంగా తొలత ఆ ఉద్యోగిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తాం.  
 - కొల్లి తవిటినాయుడు, ఎంఈఓ, భోగాపురం మండలం, విజయనగరం.
 
నిశితంగా గమనించాలి
తల్లిదండ్రులతో ‘తరగతి గదిలో మీ అబ్బాయి/అమ్మాయి మిస్‌బిహేవ్’ చేస్తున్నారు అనే కంప్లైంటు చేస్తుంటారు టీచర్లు. పిల్లల ప్రతి ప్రవర్తనకు ఒక కారణం ఉంటుంది. వారిలో అల్లరినే కాదు, ఏదైనా అటెన్షన్ డిజార్డర్ ఉందా, అకడమిక్‌లో లోపమా... అనేది కూడా చూడాలి. ప్రవర్తనలో లోపాన్ని మూలం నుంచి మార్చుకురావాలి కానీ, శిక్షల వల్లకాదు.    
 - డా.గీతాచల్లా, సైకాలజిస్ట్
 
అనుబంధం బలపడుతుంది
అర్హత కలిగిన టీచర్లనే ఎంపిక చేస్తాం. వారానికి ఒకసారైనా విద్యార్థులకు జీవనైపుణ్యాలను సంబంధించిన తరగతులను నిర్వహిస్తాం కాబట్టి, టీచర్‌కి-స్టూడెంట్‌కి మధ్య అనుబంధం బలపడుతుంది. దీంతో దండన అనే సమస్యే లేదు. ఈ తరహా పద్ధతి వల్ల విద్యార్థుల ప్రవర్తనలో మంచి మార్పులు చూస్తున్నాం.
 - జయంతి వెంకటరామన్, ప్రిన్సిపల్, సిస్టర్ నివేదిత స్కూల్, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement