సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలకు ఉపక్రమించినా ప్రైవేట్ పాఠశాలల దోపిడి మాత్రం ఆగడం లేదు. వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ నిబంధనలను అతిక్రమిస్తూనే ఉన్నాయి. పైగా సకాలంలో ఫీజులు చెల్లించడంలేదని దాష్టీకానికి పాల్పడుతున్నాయి. ఫీజు కట్టలేదని విద్యార్థులను ఇంటికి పంపేయడం, తరగతి గదిలోకి అనుమతించకపోవడం, గదిలో బంధించడం లాంటి ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఢిల్లీలో ఇలాంటి ఘటననే ఒకటి చోటు చేసుకుంది. ఫీజు చెల్లించలేదని దాదాపు 59మంది నర్సరీ విద్యార్థులను బేస్‌మెంట్‌లో బంధించింది ఓ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం.
ఢిల్లీకి చెందిన రబియా గర్ల్స్ పబ్లిక్ స్కూల్‌లో ఫీజు చెల్లింలేదని 59 నర్సరీ విద్యార్థులను పాఠశాల బేస్‌మెంట్‌లో బంధించి తాళం వేశారు. దాదాపు ఐదు గంట తర్వాత విషయం విద్యార్థుల తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని తమ పిల్లను గది నుంచి విడిపించారు. అనంతరం యాజమాన్యంపై విరుచుపడ్డారు. చిన్న పిల్లలనే మానవత్వం లేకుండా కిటికీలు లేని చీకటి గదిలో బంధించారని మండిపడ్డారు. పాఠశాల యాజమాన్యంపై ఫోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫీజు విషయాన్ని తమకు తెలియజేయలేదని ఆరోపించారు. తమ పిల్లల ఫీజులు అడ్వాన్స్‌గా చెల్లించినా కూడా గదిలో బంధించారని కొంతమంది తల్లిదండ్రులు ఫిర్యాదులో తెలిపారు. వెంటిలేటర్లు, ఫ్యాన్లులేని గదిలో చిన్న పిల్లలను బంధించిన పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫీజులు కూడా అధికంగా వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక్కొ నర్సరీ విద్యార్థికి దాదాపు రూ.2500 నుంచి రూ.2900 వరకూ వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు.
కాగా పాఠశాల యాజమాన్యం మాత్రం తమ చర్యను సమర్థించుకుంది. పాఠశాల నిబంధనల మేరకే విద్యార్థులను తరగతి గదిలోని అనుమతించలేదని తేల్చిచెప్పింది. వారిని చీకటి గదిలో బంధించలేదని, ఆట గదిలో ఉంచామని పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment