‘ఫీజుల నియంత్రణ’ గాలికి?
♦ రెండు నెలలు దాటినా ప్రభుత్వం వద్ద పెండింగ్‌లోనే ప్రతిపాదనలు
♦ ప్రైవేట్ పాఠశాలల్లో కొనసాగుతున్న ప్రవేశాలు
♦ 20 శాతం వరకు ఫీజులు పెంపు
♦ పట్టించుకోని అధికారులు.. ఈనెల 21 నుంచే స్కూళ్లు
సాక్షి, హైదరాబాద్: అంగట్లో సరుకైన అక్షరం.. ఫీజుల దందాలో చదువుల తల్లి బందీ.. ప్రైవేట్ పాఠశాలల ఫీ‘జులుం’... విద్యార్థులు చదువు‘కొనలేక’ విలవిల... తల్లిదండ్రుల అగచాట్లు... కొత్త ఆశలు, కొంగొత్త ఆకాంక్షలతో ఏర్పడిన కొత్త రాష్ట్రంలోనూ కనుమరుగుకాని కష్టాలివీ. ఏటా ప్రవేశాల సమయం రాగానే యాజమన్యాలు భారీగా ఫీజులు పెంచడం.. తల్లిదండ్రులు ఆందోళన చేయడం పరిపాటిగా మారింది. ఫీజుల నియంత్రణకు ఇచ్చిన ఉత్తర్వులపై న్యాయ వివాదాలతో సంవత్సరాలు గడిచిపోతు న్నాయి. ఈ నెల 21 నుంచి 2017–18 విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది.
ఈ నేపథ్యంలో ఈసారి వృత్తి విద్యా కాలేజీల తరహాలో పకడ్బందీ చర్యలు చేపట్టాలని విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రభుత్వ ఆమోదానికి రెండు నెలల కిందటే పంపించింది. ఫైలు కదలదు. సర్కార్‌లో ఉలుకూపలుకూ ఉండదు. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులపై యాజమాన్యాలు మళ్లీ భారాన్ని మోపేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే అనేక పాఠశాలలు 10 శాతం నుంచి 20 శాతం ఫీజులను పెంచుతున్నామని తల్లిదండ్రులకు సమాచారమిచ్చాయి. మరోవైపు విద్యాశాఖ ప్రవేశాల నోటిఫికేషన్ జారీ చేయకముందే ప్రైవేట్ పాఠశాలల ఇష్టారాజ్యంగా ప్రవేశాలను చేపడుతున్నాయి. తల్లిదండ్రుల ఆదాయాన్ని బట్టి డొనేషన్ల వసూళ్లను ప్రారంభించాయి.
నియంత్రణ ఉత్తర్వులు వస్తే...
రాష్ట్రంలో 42 వేల పాఠశాలల్లో 60.61 లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా, 11,470 ప్రైవేటు స్కూళ్లలో 31.28 లక్షల మంది విద్యార్థులున్నారు. ఇప్పటివరకు వారినుంచి ప్రైవేటు పాఠశాలలు వసూలు చేస్తున్న ఫీజులకు శాస్త్రీయత అంటూ లేదు. యాజమాన్యాలు చెప్పిందే ఫీజు. ఇస్తేనే సీటు అన్న తీరు కొనసాగుతోంది. కిందటి సంవత్సరంలో పాఠశాల యాజమాన్యం టీచర్లు, సిబ్బందికి ఇచ్చిన వేతనాలు, టీచర్ల సంక్షేమం, సదుపాయాలు, నిర్వహణకు వెచ్చించిన ఖర్చుల ఆధారంగా స్కూల్ ఫీజులను ఖరారు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. తద్వారా చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులపై ఫీజులు భారం తగ్గే అవకాశం ఉందని భావిస్తోంది.
ప్రతిపాదనల్లోని ముఖ్యాంశాలు..
⇔ ఏ రకమైన పేరుతోనూ యాజమాన్యం డొనేషన్, వన్‌టైం ఫీజు వసూలు చేయడానికి వీల్లేదు.
⇔ వన్‌టైమ్ ఫీజు కింద దరఖాస్తు ఫీజు రూ.100 లోపు ఉండాలి.
⇔ రిజిస్ట్రేషన్ ఫీజు రూ.500 లోపే ఉండాలి.
⇔ తిరిగి చెల్లించే (రిఫండబుల్) విధానం కింద రూ. 5 వేలలోపే కాషన్ డిపాజిట్ ఉండాలి.
⇔ ఆ మొత్తాన్ని కూడా పాఠశాల యాజమాన్యం డీఎఫ్‌ఆర్‌సీకి సమర్పించాలి.
వాస్తవానికి ఫీజులను ఖరారు చేసేందుకు టీచర్లు, సిబ్బంది వేతనాలు, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్, నిర్వహణ ఖర్చులు, వసతులు, సదుపాయాలు, స్పెషల్ ఫీజులకు సంబంధించిన ప్రతిపాదనలు యాజమాన్యాలు జిల్లా ఫీజుల నియంత్రణ (డీఎఫ్‌ఆర్‌సీ)కమిటీకి అందజేయాలి. వాటిని డీఎఫ్‌ఆర్‌సీ పరిశీలించిన 60 రోజుల్లోగా ప్రభుత్వానికి సిఫారసులు చేయాలి. ప్రభుత్వం జనవరి కల్లా వాటిని ఖరారు చేస్తుంది. మార్చి 21 నుంచి ప్రారంభం అయ్యే విద్యా సంవత్సరంలో ఆ ఫీజులనే వసూలు చేయాలి. ప్రభుత్వ నిర్దేశిత ఫీజుకు మించి వసూలు చేస్తే పాఠశాల గుర్తింపు రద్దు చేస్తారు.