మహబూబ్‌నగర్: ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల వసూళ్లకు అడ్డు, అదుపు లేకుండాపోతోంది. నాణ్యమైన చదువులు, స్మార్ట్‌క్లాస్‌లు, ఐఐటీల పేరిట తల్లిదండ్రులను మభ్యపెట్టి.. ఎల్‌కేజీ, యూకేజీల నుంచే ఫీజుల మోత మోగిస్తున్నారు.
విద్యార్థుల తల్లిదండ్రుల ఆశలను ఆసరాగా చేసుకుని తక్కువలో తక్కువ రూ.20 వేల నుంచి మొదలుకొని రూ.లక్ష వరకు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఇంత పెద్దఎత్తున ఫీజులు వసూలు సంబంధిత విద్యాశాఖ అధికారులు మాత్రం తమ కేమి సంబంధం లేదనట్లుగా వ్యవహరించడం గమనార్హం.
ప్రతిఏటా పెరుగుదల..
వాస్తవానికి ఫీజుల పెంపు వ్యవహారం పాఠశాల సొసైటీ ఆధ్వర్యంలో తల్లిదండ్రుల కమిటీ సమన్వయంతో ప్రతి సంవత్సరం పెంచాల్సిన ఫీజులపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, జిల్లాలోని ఏ పాఠశాలలో కూడా విద్యార్థుల తల్లిదండ్రుల ప్రమేయం లేకుండానే ఎన్నో రెట్ల ఫీజులు పెంచుకుంటున్నారు.
ఎల్‌కేజీ నుంచి ఎస్సెస్సీ వరకు రూ.వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన కొన్ని పాఠశాలల్లో 6 నుంచి 7వ తరగతి వరకు రూ.40– 50 వేల వరకు డిమాండ్ చేస్తున్నారు. ఇక 8, 9, 10వ తరగతుల వారికి రూ.50– 70 వేలకుపైగా రాబడుతున్నారు. వీటిలో కొన్ని పాఠశాలలు ఎలాంటి అనుమతులు లేకుండానే విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పిస్తూ ప్రతి సంవత్సరం అదనంగా రూ.50 వేలకుపైగా వసూలు చేస్తున్నారు.
రెండు చేతులా సంపాదన..
విద్యార్థికి ఫీజుల చెల్లింపు ఒక ఎత్తయితే.. పుస్తకాలు, నోట్‌బుక్స్, టై, బెల్టులు, షూ, యూనిఫాంలు, రికార్డులు, బస్సు ఫీజుల వంటివి మరో ఎత్తు అవుతున్నాయి. బయటి నుంచి విద్యార్థులు ఏం కొన్నా.. వాటిని అనుమతించని పాఠశాలలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఇందులో ముఖ్యంగా 6– 8వ తరగతుల పుస్తకాల కోసం రూ.6,500 తీసుకుంటున్నారు.
ఇందులో ఐఐటీ వంటి ప్రత్యేక సంస్థల కరిక్యూలం ఉన్న పుస్తకాలకు రూ.8 వేల వరకు వసూలు చేస్తున్నారు. నోట్‌పుస్తకాలు ఏకంగా పాఠశాల పేరు మీదనే ముద్రిస్తున్నారు. యూనిఫాం రూ.2,800, షూ, బెల్టులు రూ.1,200, బస్సు ఫీజు రూ.15– 18 వేల వరకు వసూలు చేస్తున్నారు. చాలా వరకు పాఠశాలల్లోనే అమ్ముతుండగా.. కొన్ని మాత్రం తెలిసిన బుక్‌సెంటర్ల ద్వారా విక్రయిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment