పోలీసులపై స్థానిక ప్రజల ఎదురుదాడి.. 'సీఐ' ను వ్యవసాయ పొలాల్లో వెంబడించి.. మరీ | - | Sakshi
Sakshi News home page

ఇథనాల్‌ కంపెనీ వ్యతిరేఖతపై.. పోలీసులు, స్థానిక ప్రజల మధ్య తీవ్ర ఘర్షణ..

Published Mon, Oct 23 2023 12:52 AM | Last Updated on Mon, Oct 23 2023 1:24 PM

- - Sakshi

ఎక్లాస్‌పూర్‌– చిత్తనూరు శివారులో ఘర్షణ పడుతున్న పోలీసులు, గ్రామస్తులు

సాక్షి, మహబూబ్‌నగర్: నారాయణపేట జిల్లా మరికల్‌ మండలంలోని చిత్తనూర్‌లో ఇథనాల్‌ కంపెనీకి వ్యతిరేకంగా గ్రామస్తులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. జూరాల ఆగ్రో ఇథనాల్‌ కంపెనీ వ్యర్థాలను ఎక్లాస్‌పూర్‌, జిన్నారం, చిత్తనూర్‌, చిన్నచింతకుంట మండలం ఉంద్యాల గ్రామాల శివారుల్లో పారబోస్తుండడంతో అనారోగ్యం బారిన పడుతున్నామని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో శనివారం రాత్రి ఓ ట్యాంకర్‌ వ్యర్థాలను నింపుకొని బయటికి రావడాన్ని గమనించిన గ్రామస్తులు.. ఎక్లాస్‌పూర్‌ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద అడ్డుకున్నారు. ఇథనాల్‌ కంపెనీని మూసివేయాలని డిమాండ్‌ చేస్తూ ధర్నాకు దిగారు. 16 గంటలపాటు ఆత్మకూర్‌ రోడ్డుపై ఆందోళన చేపట్టారు. పోలీసులు నచ్చజెప్పేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది. ఆదివారం ఉదయం తహసీల్దార్‌ సునీత అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు.

ఈ నెల 25న ఆర్డీఓ సమక్షంలో కంపెనీని పరిశీలిస్తామని చెప్పినా వినలేదు. ట్యాంకర్‌లో ఉన్న కెమికల్‌ను పరీక్షించే వరకు ఆందోళన విరమించేది లేదని గ్రామస్తులు భీష్మించారు. నారాయణపేట డీఎస్పీ సత్యనారాయణ ఆదేశాల మేరకు మరికల్‌, మక్తల్‌, నర్వ, ధన్వాడ పోలీసులతోపాటు స్పెషల్‌ పార్టీ పోలీసులు రంగంలోకి దిగారు. గ్రామస్తులపై లాఠీచార్జ్‌ చేయడంతో పలువురికి గాయాలవగా.. పొలాల వెంబడి గ్రామస్తులు పరుగులు పెట్టారు.

ఇదే సమయంలో ఇథనాల్‌ కంపెనీ ట్యాంకర్‌ను పోలీసుల బందోబస్తు మధ్య తరలించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పోలీసులపై ఎదురుదాడికి పాల్పడ్డారు. రాళ్లు, ఇటుకలు, కర్రలతో దూసుకురావడంతో అక్కడి నుంచి ప్రాణాలతో బయట పడేందుకు పోలీసులు పరుగులు పెట్టారు. మక్తల్‌ సీఐ రాంలాల్‌ను వ్యవసాయ పొలాల్లో వెంబడించి తీవ్రంగా గాయపర్చారు. గాయపడిన మరికొందరు పోలీసులు పక్కనే ఉన్న నరసింహస్వామి ఆలయ గదిలోకి వెళ్లారు. అనంతరం అరెస్ట్‌ చేసిన ఆందోళనకారులను వదిలిపెట్టి, గదిలో ఉన్న పోలీసులను విడిపించుకున్నారు.

గాయపడిన పోలీసులు..
చిత్తనూర్‌ ఇథనాల్‌ కంపెనీ ఆందోళనలో పోలీసులు, గ్రామస్తులకు మధ్య జరిగిన ఘర్షణలో మక్తల్‌ సీఐ రాంలాల్‌తోపాటు కృష్ణ ఎస్‌ఐ విజయభాస్కర్‌, కానిస్టేబుళ్లు అనిత, అరుణ, వెంకటేశ్వరమ్మ, చెన్నరాయుడు, నవ్వు శ్రీనులకు గాయాలయ్యాయి. అలాగే పోలీస్‌ టీఆర్‌ గ్యాస్‌ వాహనంతోపాటు రెండు బైక్‌లకు గ్రామస్తులు నిప్పంటించడంతో పూర్తిగా కాలిపోయాయి. డీఎస్పీ వాహనంతోపాటు మరో మూడు వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. కంపెనీకి వెళ్లే 8 లారీల అద్దాలను ధ్వంసం చేయడంతోపాటు టైర్లలో గాలి తీశారు. ఈ ఘటనకు కారణమైన వారి ఆచూకీ కోసం చిత్తనూర్‌, ఎక్లాస్‌పూర్‌, జిన్నారం గ్రామాలను జల్లెడ పడుతున్నట్లు డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు.

కాలు విరగొట్టారు..
పోలీసులు కర్రలతో కొట్టడంతో కాలు విరిగిపొయింది. కంపెనీ నుంచి వచ్చే వ్యర్థాల నుంచి తమకు ప్రాణహాని ఉందని రెండేళ్ల నుంచి ఆందోళన చేస్తున్నాం. పిల్లలు, వృద్ధులు అని కూడా చూడకుండా పోలీసులు కొట్టడం వల్ల చాలామంది గాయపడ్డారు. ఇంకా కంపెనీని రద్దు చేసే వరకు నిద్రపోం. – చంద్రమ్మ, జిన్నారం



ప్రాణం పోయినా.. పట్టువదలం!
ఇక్కడి నుంచి కంపెనీ ఎత్తివేసే వరకు తమ పోరాటం ఆగదు. ఇథనాల్‌ కంపెనీ నుంచి ప్రమాదం కలిగించే కెమికల్స్‌ను గ్రామ శివారులో వేయడం వల్ల దుర్వాసన వస్తోంది. వ్యర్థాలను తరలించే ట్యాంకర్‌ను అడ్డుకొని శాంతియుతంగా ధర్నా చేస్తుంటే పోలీసులు దాడిచేసి గాయపర్చారు. అక్కడి నుంచి పరుగు తీసినా వదిలిపెట్టలేదు. మా ప్రాణాలు పోయినా పర్వాలేదు.. కంపెనీని తొలగించే వరకు ఆందోళన చేస్తాం. – హన్మమ్మ, మానస, ఎక్లాస్‌పూర్‌


డీఎస్పీదే బాధ్యత..
ఇథనాల్‌ కంపెనీ నుంచి బయటకు తెచ్చి పారబోస్తున్న విష రసాయనాల ట్యాంకర్‌ను అడ్డుకొని ఆందోళన చేస్తున్న గ్రామస్తులపై పోలీసు లను రెచ్చగొట్టి లాఠీచార్జీ చేయించిన డీఎస్పీపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఇథనాల్‌ కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యు డు చక్రవర్తి అన్నారు. కంపెనీ నుంచి ట్యాంకర్ల ద్వారా వ్యర్థాలను తీసుకువచ్చి జిన్నారం, ఎక్లాస్‌పూర్‌, చిత్తనూర్‌, ఉంద్యాల గ్రామాల పక్కన పారపోయడంపై తహసీల్దార్‌తో మాట్లాడుతుండగా డీఎస్పీ పోలీసులను రెచ్చగొట్టి లాఠీచార్జీ చేయించారని, ఇందుకు ఆయనే బాధ్యత వహించాలని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement