మరిన్ని రోడ్లు
రాష్ట్రంలో వెయ్యి కి.మీ. మేర జాతీయ రహదారుల అభివృద్ధిరూ. 8వేల కోట్లతో నిర్మిస్తామన్న కేంద్ర మంత్రి గడ్కారీ
మహబూబ్‌నగర్, ఖమ్మంలో 4 అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఖమ్మం జిల్లాలో డ్రైపోర్టు ఏర్పాటుకు హామీ
రూ. 5 లక్షల కోట్లతో 101 నదులపై జలమార్గాలు
వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు తేనున్నట్లు వెల్లడి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం, మహబూబ్‌నగర్, భద్రాచలం: రాష్ట్రంలో వెయ్యి కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను నిర్మిస్తామని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ పేర్కొన్నారు. అందుకోసం దాదాపు 8 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. బుధవారం రాష్ర్ట పర్యటనకు వచ్చిన ఆయన మహబూబ్‌నగర్ జిల్లాలోని మరికల్-జడ్చర్ల మధ్యగల జాతీయ రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు.
అలాగే ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రం వద్ద విజయవాడ నుంచి జగదల్పూర్ వెళ్లే ఎన్‌హెచ్ 221 విస్తరణ పనులకు, అలాగే రుద్రంపూర్ నుంచి భద్రాచలం వరకు రహదారి విస్తరణకు, గోదావరి నదిపై రెండో వంతెన నిర్మాణానికీ శ్రీకారం చుట్టారు. అనంతరం రెండు జిల్లాల్లోనూ ఏర్పాటు చేసిన బహిరంగసభల్లో ప్రసంగించారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తీర్ణం తక్కువగా ఉందని, దీన్ని పెంచేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉందని పేర్కొన్నారు. అలాగే జల రవాణాను విస్తృతం చేస్తామని, వచ్చే పదేళ్లలో రూ. 5 లక్షల కోట్లతో దేశంలోని 101 నదులపై జలమార్గాలను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు.
తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తుందని మంత్రి గడ్కారీ తెలిపారు. 15 రోజుల్లో రాష్ట్ర ఎంపీలు, మంత్రులతో సమావేశమై ఈ అంశంపై చర్చిస్తానని ఆయన చెప్పారు. సూర్యాపేట-దేవరపల్లి రాష్ట్రీయ రహదారిని జాతీయ రహదారిగా గుర్తించి నాలుగు లేన్ల రోడ్డును నిర్మిస్తామన్నారు. కొత్తగూడెం నుంచి సత్తుపల్లి వరకూ నాలుగు లేన్ల రహదారి నిర్మాణాన్ని చేపడతామన్నారు. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక వచ్చిన తర్వాత ఖమ్మం జిల్లాకు తప్పనిసరిగా డ్రైపోర్టు ఇస్తామని హామీ ఇచ్చారు. జాతీయ రహదారుల నిర్మాణంలో అనేక మార్పులు తీసుకువస్తున్నట్లు మంత్రి వివరించారు. దేశంలోని అన్ని జాతీయ రహదారులను దశలవారీగా సిమెంట్ రోడ్లుగా మార్చడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకు సిమెంట్‌ను తక్కువ ధరకు సిమెంట్ అందించేందుకు 107 సిమెంట్ కంపెనీలతో కేంద్రం ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. తెలంగాణలోనూ సీసీ రోడ్ల నిర్మాణానికి సహకరిస్తామని, తక్కువ ధరకే సిమెంట్‌ను అందిస్తామని పేర్కొన్నారు.
జల రవాణాను పెంచుతాం...
దేశంలో జలమార్గాల ఏర్పాటుపై కేంద్రం దృష్టి సారించిందని మంత్రి పేర్కొన్నారు. తొలుత గంగా, బ్రహ్మపుత్ర, మహానది వంటి నదుల్లో జలమార్గాలను అందుబాటులోకి తెస్తామన్నారు. రాష్ట్రంలోని గోదావరిపైనా ఏర్పాటు చేస్తామన్నారు. రహదారుల నిర్మాణానికి అమలు పరుస్తున్న ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన(పీఎంజీఎస్‌వై) మాదిరిగా జల మార్గాలను అభివృద్ధి చేసేందుకు ప్రధాన మంత్రి జలమార్గ్ యోజనకు రూపకల్పన చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. జల మార్గాల మీదనే విమానాశ్రయాలను ఏర్పాటు చేసే దిశగా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణకు జలమార్గం లేని లోటును పూడ్చడానికి ఖమ్మం జిల్లాలో డ్రై పోర్టును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అక్కడి నుంచి నేరుగా విశాఖ పోర్టుకు వెళ్లేలా జలమార్గాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు.
రాష్ర్టంలో పారిశ్రామికాభివృద్ధిపై దృష్టి: దత్తాత్రేయ
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై కేంద్రం దృష్టి సారించింద ని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో ఆయిల్‌పామ్ రైతుల సమస్యలను సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. పాల్వంచలో యువతకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలకు, ఉపాధి కల్పనకు కృషి చేస్తానన్నారు. జాతీయ రహదారుల అభివృద్ధిలో కేంద్రం తీసుకున్న విప్లవాత్మకమైన మార్పు అభినందనీయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశంసించారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని, నదుల అనుసంధానం ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులు సి.లకా్ష్మరెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, ఎంపీలు జితేందర్‌రెడ్డి, సీతారాంనాయక్, పార్లమెంటరీ కార్యదర్శులు వి.శ్రీనివాస్‌గౌడ్, జలగం వెంకట్రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
గోదావరిపై రెండో వంతెన
గోదావరి నదిపై ఎన్‌హెచ్ 221 రహదారికి అనుసంధానంగా రూ. 98.45 కోట్ల వ్యయంతో 1,200 మీటర్ల పొడవున నిర్మించే రెండో వంతెనకు గడ్కరీ శంకుస్థాపన చేశారు. ఎన్‌హెచ్ 221 ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దు మీదుగా రుద్రంపూర్ వరకు రూ. 244.30 కోట్ల వ్యయంతో 49.30 కిలోమీటర్ల రహదారి పనులతో పాటు రుద్రంపూర్ నుంచి భద్రాచలం సెక్షన్ వరకు రూ. 295.47 కోట్లతో చేపడుతున్న 44 కిలోమీటర్ల రహదారి, పునరుద్ధరణ, స్థారుుపెంపు పనులకు కూడా మంత్రి శ్రీకారం చుట్టారు.
రామాలయంలో పూజలు
భద్రాచలం రామయ్యను కేంద్ర మంత్రి గడ్కరీ దర్శించుకున్నారు. ఆలయ మర్యాదల ప్రకారం ఈవో జ్యోతి, అర్చకులు, వేదపండితులు ఆయనకు పరివట్టం కట్టి, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేశారు. అయోధ్య తర్వాత భద్రాచల క్షేత్రం దేశంలోనే పవిత్రమైనదని ఈ సందర్భంగా గడ్కరీ పేర్కొన్నారు. ఇక్కడి గోదావరిని చూసి పరవశించిపోయినట్లు చెప్పారు.
రాష్ర్ట రహదారులను పెంచండి: తుమ్మల
రాష్ట్రంలోని పది జిల్లాల్లో ఉన్న ప్రధాన రహదారులను జాతీయ రహదారులుగా ప్రకటించాలని గడ్కరీని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కోరారు. ఖమ్మం జిల్లాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన సందర్భంగా కేంద్ర మంత్రికి ఆయన వినతిపత్రాన్ని సమర్పించారు. పారిశ్రామిక ప్రాంతాలుగా అభివృద్ధి చెందుతున్న వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలను అనుసంధానం చేసే ప్రధాన రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించాలని, అలాగే విజయవాడ నుంచి తిరువూరు, కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం మీదుగా జగదల్పూర్ వరకు నాలుగు లైన్ల రహదారిని మంజూరు చేయాలని ఆయన కోరారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఆరాంఘర్ జంక్షన్ వరకు ఆరు లైన్ల రహదారిని నిర్మించాలన్నారు. మియాపూర్-సంగారెడ్డి ప్రధాన రహదారి మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. సూర్యాపేట రాష్ట్రీయ రహదారితోపాటు మహబూబ్‌నగర్-జడ్చర్ల రహదారిని నాలుగు లైన్లుగా మార్చాలని వినతిపత్రంలో కోరారు.