జడ్చర్ల పోలీస్ స్టేషన్ . జడ్చర్లలో నెలకొన్న ట్రాఫిక్ సమస్య
జడ్చర్ల: రెండు జాతీయ రహదారులు కలయుకతో పాటు పారిశ్రామికంగా, వ్యాపార వాణిజ్యపరంగా, తదితర అనేక రంగాలకు సంబంధించి నిత్యం రద్దీని సంతరించుకున్న జడ్చర్లలో పోలీసుల సత్వర సేవల ఆవశ్యకత ఎంతైనా ఉంది. సకాలంలో పోలీసుల సేవలు అందకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేగాక నేరాలు, తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై సరైన నిఘా పెట్టలేని పరిస్థితి నెలకొంది.
వీటికి తోడు ట్రాఫిక్ సమస్యను కూడా స్థానిక పోలీసులే పర్యవేక్షించాల్సి రావడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. చోరీలు, తదితర నేరాల నియంత్రణ కష్టతరమైంది.
వీటన్నింటి పరిష్కారానికి జడ్చర్లలో పోలీస్ సబ్‌డివిజన్ ఏర్పాటుతో పాటు ప్రత్యేకంగా రూరల్ పోలీస్‌స్టేషన్, ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్లను ఏర్పాటు చేస్తే తప్పా సమస్యల పరిష్కారానికి నోచుకోలేని పరిస్థితి నెలకొంది.
రూరల్ స్టేషన్‌కు ఎదురుచూపులు..
జడ్చర్లలో రూరల్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటుకు ప్రజలు ఎదురుచూస్తున్నారు. దశాబ్ద కాలంగా రూరల్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ బలంగా ఉంది. పట్టణం రోజు రోజుకు నలుదిక్కులా విస్తరిస్తుండటంతో పాటు ఓ వైపు 44వ నంబర్ జాతీయ రహదారి, మరో వైపు 167 నంబర్ జాతీయ రహదారి ఉన్నాయి.
వీటితో పాటు మండల పరిధిలోని పోలేపల్లి గ్రామ శివారులో ఏర్పాటు చేసిన సెజ్, గ్రీన్ ఇండస్ట్రీయల్ ఏరియాతో నియోజకవర్గం కేంద్రంగా ఉన్న జడ్చర్ల పోలీస్‌స్టేషన్ బిజీబిజీగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో చోటు చేసుకుంటున్న పలు సమస్యలు సకాలంలో పరిష్కారానికి నోచుకోక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
జడ్చర్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో బాదేపల్లి, కావేరమ్మపేట(జడ్చర్ల) జంట పట్టణంతో పాటు మండల పరిధిలోని 45 గ్రామపంచాయతీలు, వాటి పరిధిలోని 23 అనుబంధ తండాలు, తదితర నివాస ప్రాంతాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో లక్షకు పైగా జనాభా ఉంది.
ఒక్క జడ్చర్ల పట్టణంలోనే దాదాపు 80 వేలకు పైగా జనాభా ఉంది. ఇంత జనాభాకు సంబంధించి ఒకే ఒక పోలీస్‌స్టేషన్ ఉండటంతో ప్రజలకు సత్వర పోలీస్‌సేవలు అందడం లేదనే అపవాదు ఉంది.
ట్రాఫిక్ సమస్యలతో..
పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవుతుండటంతో ట్రాఫిక్ నియంత్రణ కూడా పోలీసులే చూడాల్సి వస్తుంది. పట్టణంలోని నడిబొడ్డున జాతీయ రహదారులతో పాటు అంతర్రాష్ట్రీయ రహదారులు ఉన్నాయి. దీంతో వాహనాల రద్దీ తీవ్రంగా ఉంటుంది. రోడ్లు ఇరుగ్గా ఉండటంతో రాకపోకలు స్తంభించిపోతున్నాయి.
పనిభారంతో సతమతం..
జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న సిబ్బంది తలకు మించిన పనిభారంతో సతమతమవుతున్నారు. స్టేషన్‌లో సిబ్బంది కొరత కూడా వేధిస్తుంది. మండల పరిధిలోని సెజ్‌లో పరిశ్రమల సంఖ్య పెరుగుతుండటంతో అక్కడికి సంబంధించిన శాంతిభద్రతల సమస్యల పరిరక్షణ బాధ్యత పోలీసులపైనే ఉంటుంది.
జిల్లాలోనే అధిక నేరాలు నమోదవుతున్న పోలీస్‌స్టేషన్లలో జడ్చర్ల ప్రధానంగా ఉంది. ప్రతి ఏడాది దాదాపుగా 500–600 వరకు కేసులు నమోదవుతున్నాయి. గత ఏడాది దాదాపు 800 పైచిలుకు కేసులు నమోదయ్యాయి.
ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు..
జడ్చర్లలో పోలీస్ సబ్‌డివిజన్‌తో పాటు రూరల్, ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ల ఏర్పాటుకు సంబంధించి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రతిపాదనలు పంపించారు. ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ భవన నిర్మాణ పనులకు అప్పటి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కొబ్బరికాయ కూడా కొట్టారు.
ఇటీవల ఎన్నికల ప్రచార సభకు వచ్చిన అప్పటి సీఎం కేసీఆర్ కూడా రూరల్, ట్రాఫిక్ స్టేషన్ల ఏర్పాటుకు హామీ ఇచ్చారు. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఈ ప్రతిపాదనలు కూడా అటకెక్కే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికై నా డివిజన్ కార్యాలయంతో పాటు రూరల్, ట్రాఫిక్ స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రజలకు అందుబాటులో సేవలు..
జడ్చర్ల పట్టణంతో పాటు మండల ప్రజలకు సకాలంలో సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం. జడ్చర్ల మున్సిపాలిటీ మరియు గ్రామీణ ప్రాంతాలు, తండాలకు కలిపి ఒకే పోలీస్‌స్టేషన్ ఉంది. రూరల్ పోలీస్ స్టేషన్ ఏర్పాటయితే ప్రజలకు మరింత సౌకర్యంగా ఉంటుంది. –రమేశ్‌బాబు, సీఐ, జడ్చర్ల
ఏర్పాటుకు కృషి..
జడ్చర్లలో రూరల్ పోలీస్‌స్టేషన్ అవసరం ఎంతో ఉంది. ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడి ప్రజలు రూరల్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. రూరల్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటుపై గత పాలకులు నిర్లక్ష్యం వహించారు. తమ హయాంలో రూరల్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటుకు కృషి చేస్తాం. – అనిరుద్‌రెడ్డి, ఎమ్మెల్యే, జడ్చర్ల
Comments
Please login to add a commentAdd a comment