ఘటనా స్థలంలో వివరాలు సేకరిస్తున్న పోలీసులు
సాక్షి, మహబూబ్‌నగర్: మహమ్మదాబాద్ జిల్లా గుండేడ్ మండలం మన్సూర్‌పల్లిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. మన్సూర్‌పల్లికి చెందిన ఈరమోళ్ల గోవింద్ (45) కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లో ఉంటూ పని చేసుకునేవాడు. దసరా పండగ నిమిత్తం ఈనెల 23న స్వగ్రామానికి వచ్చాడు. పొలంలో పంటను పందులు పాడు చేస్తుండడంతో రాత్రివేళ కాపలా వెళ్లేవాడు. రోజు మాదిరిగానే బుధవారం రాత్రి పొలానికి వెళ్లాడు.
గురువారం ఉదయం 7:30 గంటల ప్రాంతంలో అతడి పెద్ద కుమారుడు వెంకటేష్ పొలం వద్దకు వెళ్లి తండ్రి కోసం వెతకగా, కొద్ది దూరంలో లుంగీ కనిపించింది. అనుమానం వచ్చి మరి కొద్ది దూరం వెళ్లి చూడగా తండ్రి దారుణ హత్యకు గురై కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. గోవిందు తలకు వెనుక వైపు గాయంతో పాటు గదవ కింద గొంతుపై లోతైన గాయం ఉంది. పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఘటనా స్థలానికి మహబూబ్‌నగర్ డీఎస్పీ మహేష్, టూటౌన్ సీఐ ప్రవీణ్‌కుమార్, ఏఎస్‌ఐ అజంఅలీ చేరుకుని వివరాలు సేకరించారు. డాగ్ స్క్వాడ్‌తో విచారణ నిర్వహించారు. గోవిందు పొలం నుంచి హత్య జరిగిన ప్రదేశం వరకు పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ మన్సూర్‌పల్లి గేట్ వరకు పరుగెతి, అక్కడి నుంచి సల్కర్‌పేట్ దారిలో అంతర్‌గంగ రోడ్డు వద్దకు వచ్చి ఆగిపోయింది. హత్య చేసిన వారు సల్కర్‌పేట్ వైపు వెళ్లినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్‌నగర్ మార్చురీకి తరలించారు.
గ్రామంలో విషాదఛాయలు..
గోవిందు హత్యతో మన్సూర్‌పల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు రోధనలు మిన్నంటాయి. మృతుడు అందరితో కలుపుగోలుగా ఉండేవాడని, ఎవరితో విరో ధం లేదని, అలాంటి వాడిని హత్య చేయ డం ఎంతవరకు సమంజసమని పలువురు పేర్కొన్నారు. మృతుడికి భార్య ఈరమోళ్ల సత్యమ్మ, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment