వ్యవస్థల్ని నడిపే వ్యక్తులు చేయాల్సిన పని చేయకపోతే... విషాదం ఎలా ఉంటుందో చెప్పడానికి శనివారం సాయంత్రం ఢిల్లీలోని ఓ ప్రసిద్ధ ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌లో జరిగిన ఘటనే ఉదాహరణ. నిబంధనలకు విరుద్ధంగా ఎనిమిది అడుగుల లోతు బేస్‌మెంట్‌లో నడుపుతున్న స్టడీ సెంటర్‌లోకి పైపులు పగిలి నీళ్ళు వెల్లువెత్తినప్పుడు, జలదిగ్బంధంలో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు పోగొట్టు కున్న తీరు కన్నీరు తెప్పిస్తుంది. పూర్తిస్థాయి ఈ మానవ తప్పిదానికి ముగ్గురు చనిపోయారని అధికారికంగా చెబుతున్నా, సంఖ్య అంతకన్నా ఎక్కువే ఉంటుందట. పది పన్నెండు మంది కనిపించట్లేదట.
కొద్దిరోజుల క్రితం పొంగిపొర్లిన వర్షపునీటి వీధిలో విద్యుదాఘాతంతో ఒక ఐఏఎస్ కోచింగ్ విద్యార్థి మరణించినప్పుడే వ్యవస్థ మేల్కొని ఉండాల్సింది. దురదృష్టవశాత్తూ అది జరగలేదు. ఇప్పుడీ తాజా ఘటనతో దేశమంతా ఉలిక్కిపడింది. గమనిస్తే, క్రిక్కిరిసిన అభ్యర్థులతో కోళ్ళఫారాలుగా మారిన కోచింగ్ సెంటర్లు, కిందికి వేలాడుతున్న కరెంట్ తీగలు, వర్షం పడితే చాలు వీధుల్లో కాలువలు కట్టే నీళ్ళు, అధ్వాన్నమైన డ్రైనేజ్ వ్యవస్థ, అవినీతికి పాల్పడి అన్నిటినీ వదిలేసిన అధికార యంత్రాంగం... అలా ఇది సామూహిక వైఫల్యం. సమష్టిగా అందరూ చేసిన పాపం.
ఒకరిద్దరు అధికారుల సస్పెన్షన్, యజమానుల లాంటి పెద్ద చేపల్ని వదిలేసి చిరుద్యోగుల అరెస్ట్, ఘటనకు దారి తీసిన కారణాలు – నివారణ చర్యలపై నివేదికకు కేంద్ర హోమ్‌శాఖ ప్రత్యేక ప్యానెల్ ఏర్పాటు లాంటివి చకచకా జరిగాయి. కానీ, పోయిన ఆ ప్రతిభావంతుల ప్రాణాలు తిరిగొస్తాయా? వారిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లితండ్రుల గర్భశోకం తీరుస్తాయా? శనివారం నుంచి విద్యార్థులు బైఠాయించి, శాంతియుత నిరసన తెలియజేస్తుంటే ప్రభుత్వాలు వారికి తగిన హామీనిచ్చి సాంత్వన పరచలేకపోవడం మరో వైఫల్యం.
ఢిల్లీలో వేర్వేరు ప్రాంతాలకు విస్తరిస్తున్న ఈ విద్యార్థి నిరసనల వద్ద ప్రచారం కోసం కాసేపు కనిపించిపోతున్న టీచర్లు, పరస్పర నేరారోపణలు చేసుకుంటున్న రాజకీయ నేతలను చూస్తుంటే వెగటు పుట్టక మానదు. ప్రజలెన్నుకున్న ఢిల్లీ ‘ఆప్’ సర్కార్‌పై కేంద్రం పనుపున లెఫ్టినెంట్ గవర్నర్, ఆయన తైనాతీ అధికారుల పెత్తనం ఒక తప్పయితే... క్షేత్రస్థాయిలో లేకున్నా జైలు నుంచే రోజువారీ పాలన సాగిస్తానంటున్న ఢిల్లీ సీఎం మొండి వైఖరి మరో తప్పు. శిక్ష, నష్టం మాత్రం ఢిల్లీలో ప్రజలకు, పరిపాలనకు పడుతోంది.
ఢిల్లీలో పుట్టగొడుగుల్లా వెలిసిన కోచింగ్ కేంద్రాల్లో ప్రమాదాలు జరగడం ఇదేమీ తొలిసారి కాదు. ఏడాది క్రితం కూడా ఢిల్లీ ఉత్తర ప్రాంతంలోని ఓ కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించింది. 61 మంది విద్యార్థులు గాయపడ్డారు. అప్పుడూ ఇలాగే జనాగ్రహం పెల్లుబికింది. సదరు కేంద్రం పర్మిట్ లేకుండా అక్రమంగా నడుస్తున్నట్టు అప్పట్లో అగ్నిమాపక శాఖ ప్రకటించింది. ఢిల్లీలో 600 దాకా కోచింగ్ సెంటర్లుంటే, వాటిలో 67కే అనుమతులున్నాయట. కఠిన చర్యలు తీసుకుంటామంటూ పాలకులు అప్పుడూ చెప్పారు, ఇప్పుడూ చెబుతున్నారు. కానీ, చేసింది శూన్యం.
నిజానికి, 2021 నాటి ఢిల్లీ మాస్టర్ ప్లాన్, అలాగే 2016 నాటి యూనిఫైడ్ బిల్డింగ్ బైలాస్ భవనాల సెల్లార్ల వినియోగంపై స్పష్టమైన నిబంధనలు విధించాయి. అయినా సరే బేస్‌మెంట్లలో కోచింగ్ కేంద్రాలు, వాటి లైబ్రరీలు, జిమ్‌లు, షాపులు నడుస్తూనే ఉన్నాయి. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా అనేక ప్రధాన నగరాల్లో, పట్టణాల్లో ఇలాంటి పొంచివున్న ప్రమాదాలు అనేకం. ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చని తెలిసినా, ఈ ఉల్లంఘనలపై అన్నిచోట్లా పాలకులది ఓ గుడ్డిదర్బారే!
వాహనాల పార్కింగ్, స్టోర్ రూమ్ కోసం ఉద్దేశించిన సెల్లార్లను ఇలా చట్టవ్యతిరేకంగా స్టడీ సెంటర్లుగా వాడుతూ, వందల విద్యార్థుల్ని కూర్చోబెడుతున్న వైనం పట్ల చాలాకాలంగా ఫిర్యాదులు వస్తున్నాయి. నెల క్రితం కూడా సాక్షాత్తూ ఓ విద్యార్థే ఈ సెల్లార్ల నియమోల్లంఘనపై ఢిల్లీ నగరపాలక సంస్థకు ఫిర్యాదు చేశారు. ‘‘పెను ప్రమాదం సంభవించవచ్చు’’ అని భవిష్యద్వాణిలా హెచ్చరించారు. అయినా పట్టించుకున్న నాథుడు లేడు. తక్కువ వసతులు, కనీస ఖర్చుతో ఎక్కువ సంపాదించాలన్న కోచింగ్ సెంటర్ల అత్యాశ తెలియనిది కాదు.
సక్సెస్ రేటు, సెలక్టయిన వారి సంఖ్య లాంటి వివరాలు ప్రకటనల్లో ఇవ్వరాదని నిబంధనలున్నా, వాటినవి గాలికొదిలేస్తున్న వైనమూ నిత్యం చూస్తున్నదే. తప్పుడు గొప్పలు చెప్పుకొని ఆకర్షించే జిమ్మిక్కులూ తెలిసినవే. వందలాది విద్యార్థుల్ని ఒకే గదిలో కుక్కుతున్న వీటికి అడ్డూ ఆపూ లేదు. నియంత్రిత ఆర్థిక వ్యవస్థకు భిన్నమైన ఈ విద్యావ్యాపారపు మార్కెట్ ఎకానమీని అడ్డుకోలేకున్నా అమాయకుల ధన, ప్రాణాలకు నష్టం వాటిల్లకుండా నిబంధనలతో అదుపు చేయడం పాలకులు తలుచుకుంటే కష్టం కాదు.
ఆ చిత్తశుద్ధి లేకనే సమస్య! తాజా ఘటన పార్లమెంట్‌లో చర్చ దాకా వెళ్ళడంతో నగరపాలక సంస్థ హడావిడిగా డజనుకు పైగా చట్టవిరుద్ధ కోచింగ్ సెంటర్లకు సీలు వేసింది. మరో అరడజను పేరున్న సంస్థల బేస్‌మెంట్లకు తాళాలు బిగించింది. స్థలాలను ఆక్రమించి, వరద నీటి కాల్వలపై అక్రమంగా కట్టిన నిర్మాణాలపై బుల్‌డోజర్ల ప్రయోగం మొదలుపెట్టింది. నిజానికిది నిరంతరం సాగాల్సిన ప్రక్రియ. మూడు విలువైన ప్రాణాలు పోయాక నడుం కట్టడమే విషాదం.
కోచింగ్, దాని అనుబంధ వ్యాపారం కోట్లలో సాగుతూ, వేలాది విద్యార్థుల భవిష్యత్తు ముడిపడి ఉన్నా, కనీస రక్షణ, వసతులు ప్రభుత్వపరంగా కల్పించలేకపోవడం పాలకుల హ్రస్వదృష్టికి తార్కాణం. పైగా, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణ మంత్రాన్ని నిత్యం పఠిస్తూ, వికసిత భారత గాథను లిఖించాలని చూస్తున్న పాలకులకిది శోభనివ్వదు. సరైన పట్టణ ప్రణాళిక లేకుండా కాంక్రీట్ కీకారణ్యాల్ని ప్రోత్సహిస్తే ప్రయోజనమూ లేదు. ఢిల్లీ ఘటనలు పునరావృతం కాకముందే కేంద్రం, రాష్ట్రాలు నిద్ర లేవాలి.
Comments
Please login to add a commentAdd a comment