
ఢిల్లీ నడిబొడ్డున పేరొందిన ఒక కోచింగ్ సెంటర్‌లో వరద నీటిలో మునిగి ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. సివిల్ సర్వీసు పరీక్షలకు మంచి కోచింగ్ సెంటర్‌గా ఆ సంస్థకు దశాబ్దాల చరిత్ర ఉంది. రాజధాని నగరంలో ఉన్న ఆ సెంటరు నిబంధనలకు వ్యతిరేకంగా భవనం బేస్‌మెంట్‌లో లైబ్రరీ నిర్వహిస్తోంది. విద్యార్థులు ముగ్గురూ అందులో చిక్కుకుని మరణించిన వారే. ఎన్నో ఆశలతో, ఎంతో ధనం ఫీజుల రూపంలో వెచ్చించి ఆ సంస్థలో చేరిన విద్యార్థులు, సంస్థ నిర్వాహకుల అత్యాశ, అధికారుల అలసత్వం, అవినీతి, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల జీవితాల్ని కోల్పోయారు.
బేస్‌మెంట్‌ని పార్కింగు కోసం, లేదా స్టోర్ రూమ్‌గా మాత్రమే వినియోగించాలని ఒక నిబంధన. దాన్ని లైబ్రరీగా మార్చి సొమ్ము చేసుకోవడం ఆ సంస్థ కక్కుర్తి. అలా ప్రాణాపాయం కలిగే అవకాశం ఉన్నా, నిబంధనల్ని అతిక్రమించినా పట్టనట్టు వ్యవహరించడం, లేదా లంచాలు తిని ఉపేక్షించడం నగర పాలక సంస్థ నిర్వాకం. ఆ సెంటరులోకి వరద నీరు ఒక్క ఉదుటున చేరడానికి కారణం యథేచ్చగా అక్రమ కట్టడాల్ని అనుమతించడం. డ్రయిన్ వ్యవస్థ పూడుకున్నంత వరకూ వదిలేయడం. అయితే ఈ సమస్య ఆ ఒక్క కోచింగ్ సెంటర్‌కో, ఆ ప్రాంతానికో పరిమితం కాదు.
పుట్టగొడుగుల్లా నగరమంతా వ్యాపించిన కోచింగ్ సెంటర్లు, వాణిజ్య సముదాయాలు, అక్రమ కట్టడాలు... ఇలా పట్టణ ప్రణాళికల్ని తుంగలో తొక్కేవి కోకొల్లలు. అలాగే ఢిల్లీ ఒక్కటే ఇలా దయనీయంగా లేదు. దేశంలో ప్రతీ పట్టణమూ ఇలా అఘోరిస్తున్నవే. రాష్ట్రాలకు పెరుగుతున్న ఒత్తిడి మేరకు కేంద్రం నిధులు, మార్గదర్శకాలు ఇవ్వాలి. పట్టణాల అభి వృద్ధిని రాష్ట్రాలు దగ్గరగా పర్యవేక్షించాలి. నగర పాలక సంస్థలు సమర్థంగా వ్యవహరించాలి. దురదృష్టవశాత్తూ అలాంటి రోజులు దగ్గరలో కనబడడం లేదు. – డా. డి.వి.జి. శంకరరావు, పార్వతీపురం మాజీ ఎంపీ, విజయనగరం