‘బీఎండబ్ల్యూ’తో రోడ్డుపై మహిళ హల్‌చల్‌.. ఆర్థిక శాఖ సీనియర్‌ అధికారి దుర్మరణం | Delhi BMW Accident: Finance Ministry Deputy Secretary Navtoj Singh Dies, Wife Injured | Sakshi
Sakshi News home page

‘బీఎండబ్ల్యూ’తో రోడ్డుపై మహిళ హల్‌చల్‌.. ఆర్థిక శాఖ సీనియర్‌ అధికారి దుర్మరణం

Sep 15 2025 8:53 AM | Updated on Sep 15 2025 11:29 AM

Finance Ministry Deputy Secretary Dies After BMW hits

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బీఎండబ్ల్యూ కారును నిర్లక్ష్యంగా నడిపిన  ఓ మహిళ.. ప్రభుత్వ సీనియర్‌ అధికారి దుర్మరణానికి కారకురాలయ్యారు.  ఈ దుర్ఘటనలో ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ నవ్‌తోజ్ సింగ్ మృత్యువాత పడ్డారు. ఢిల్లీ కాంట్ మెట్రో స్టేషన్ సమీపంలోని రింగ్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. బీఎండబ్ల్యూ కారు నడుపుతున్న ఒక మహిళ.. బైక్‌ వస్తున్న నవ్‌తోజ్ సింగ్ దంపతులను ఢీకొంది. ఈ ప్రమాదంలో సీనియర్ అధికారి నవ్‌తోజ్ సింగ్ మరణించగా, అతని భార్య తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు.

ఆర్థిక వ్యవహారాల శాఖ డిప్యూటీ సెక్రటరీ నవ్‌తోజ్ సింగ్ ఆదివారం బంగ్లా సాహిబ్ గురుద్వారా నుండి తన బైక్‌పై భార్య సందీప్ కౌర్‌తో పాటు ఇంటికి తిరిగి వెళుతుండగా, ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. నవ్‌తోజ్ సింగ్ వయసు 52 సంవత్సరాలు. ప్రమాదం అనంతరం వీరి కుమారుడు మాట్లాడుతూ తీవ్రంగా గాయపడిన తన తల్లిదండ్రులను ఘటన జరిగిన ప్రాంతానికి 17 కిలోమీటర్ల దూరంలోని నులైఫ్ ఆసుపత్రికి తీసుకెళ్లామని, అప్పటికే తన తండ్రి చనిపోయారని తెలిపాడు.
 

తన తల్లిదండ్రుల బైక్‌ను ఢీకొన్న బీఎమ్‌డబ్ల్యూ కారు నడిపిన మహిళ కూడా ఈ ప్రమాదంలో గాయపడ్డారని, అయితే  ఆస్పత్రి సిబ్బంది  ఆమె గురించిన సమాచారం వెల్లడించలేదని  నవ్‌తోజ్ సింగ్ కుమారుడు తెలిపాడు. ప్రమాదానికి కారకురాలైన మహిళ కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఆమె కోసం నకిలీ మెడికో-లీగల్ సర్టిఫికేట్‌ను సిద్ధం చేసేందుకు ఆస్పత్రి యాజమాన్య సహాయం చేస్తోందని ఆయన ఆరోపించాడు.

కాగా కారు నడిపి మహిళను గగన్‌ప్రీత్‌గా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆమె భర్త పరీక్షిత్ పాసింజర్ సీట్లో కూర్చున్నాడు. ప్రమాదానికి కారణమైన బీఎండబ్ల్యూ కారును, నవ్‌తోజ్ సింగ్ మోటార్ సైకిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాద స్థలాన్ని క్రైమ్ బృందం, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నిపుణులు పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా సంఘటనా స్థలంలో కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement