న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. 50కి పైగా డిగ్రీల ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు. దీనికి తోడు వడగాలులు ప్రాణాలు తీస్తున్నాయి. ఠారెత్తిస్తున్న ఎండలకు తోడు తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక హస్తీనా వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
నగరంలోని ఆసుపత్రులన్నీ హీట్ స్ట్రోక్ బాధితులతో నిండిపోతున్నాయి. ప్రతిరోజు పదుల సంఖ్యలో రోగులు అడ్మిట్ అవుతున్నారు. వారిలో కొంతమంది పరిస్థితి సీరియస్‌గా ఉంటుంది. 72 గంటల్లోనే ఢిల్లీ, నోయిడాలో 15 మంది వడదెబ్బతో ప్రాణాలు వదిలారు. ఢిల్లీలో అయిదుగురు, నోయిడాలో 10 మంది మృత్యువాత పడ్డారు
అయితే తీవ్ర ఉక్కపోత, వడదెబ్బ కారణంగా ఢిల్లీలో జూన్ 11 నుంచి 19 మధ్య 196 మంది నిరాశ్రయులు (ఇళ్లు లేని వారు) మరణించినట్లు ఎన్జీవో సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్‌మెంట్ నివేదిక పేర్కొంది. ఈ కాలంలో నమోదైన అత్యధిక మరణాల సంఖ్య ఇదేనని వెల్లడించింది.
NGO ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సునీల్ కుమార్ అలెడియా మాట్లాడుతూ.. జూన్ 11 నుండి 19 వరకు తీవ్ర వేడి పరిస్థితుల కారణంగా ఢిల్లీలో 192 మంది నిరాశ్రయుల మరణాలు నమోదయ్యాయని పేర్కొన్నారు. అంతేగాక మరణించిన వారిలో 80 శాతం మంది మృతదేహాలు ఎవరివో కూడా తెలియవని అన్నారు. ఈ ఆందోళనకరమైన మరణాల సంఖ్య.. సమాజాన్ని రక్షించేందుకు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని తెలియజేస్తున్నాయని తెలిపారు.
వాయు కాలుష్యం, వేగవంతమైన పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, అటవీ నిర్మూలన వంటి కారణాల వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, నిరాశ్రయులైన వారి పరిస్థితి మరింత దిగజారుతుందని ఆయన పేర్కొన్నారు. నివాసాలు లేని వారికి అవసరమైన తాగునీరు అందించడం ముఖ్యమైన సవాలుగా మారిందన్నారు. దీని వల్ల డీహైడ్రేషన్, సంబంధిత ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుందన్నారు.
దీన్ దయాళ్ నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ (NULM-SUH) ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (PMAY) వంటి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ద్వారా నిరాశ్రయులు ఉపశమనం పొందవచ్చని తెలిపారు. అయితే వారికి ప్రాథమికంగా గుర్తింపు పత్రాలు లేకపోవడం, శాశ్వత చిరునామా లేకపోవడం సమస్యగా మారిందన్నారు.
అదే విధంగా శీతలీకరణ కేంద్రాలను ఏర్పాటు చేయడం, తగిన షెల్టర్ సామర్థ్యాన్ని నిర్ధారించడం, నీటిని పంపిణీ చేయడం. సహాయక గృహాలు, సేవల ఏర్పాటు ద్వారా నిరాశ్రయులైన సమస్యలను పరిష్కరించవచ్చని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment