న్యూ ఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఎండలు భగ్గుమంటున్నాయి. ఢిల్లీతో సహా తూర్పు, ఉత్తర భారతదేశంలో తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంట్లోంచి కాలు బయట పెట్టాలంటే ముచ్చెమటలు పడుతున్నాయి. కాళ్లకు చెప్పులు లేకుండా, నెత్తి మీద రుమాలు లేకుండా బయట అడుగు పెడితేా.. అంతే సంగతులు. కాళ్లకు బొబ్బలు కట్టడం ఖాయం, మాడు పగలడం ఖరార్. పైగా, వేడి గాలుల బీభత్సం. తెల్లారింది మొదలు రాత్రి 10 గంటల దాకా భానుడి భగభగలే.
ఎంత వేడిని తట్టుకోలేక దేశ వ్యాప్తంగా 54 మంది మృత్యువాత పడ్డారు. బీహార్‌లో 32 మంది వడదెబ్బతో మరణించారు. ఔరంగాబాద్‌లో 17 మంది, అర్రాలో ఆరుగురు, గయాలో ముగ్గురు, రోహతాస్‌లో ముగ్గురు, బక్సర్‌లో ఇద్దరు, పాట్నాలో ఒకరు మరణించారు.. ఒడిశాలోని రూర్కెలాలో 10 మంది చనిపోయారు. జార్ఖండ్‌లోని పాలము, రాజస్థాన్‌లలో ఐదుగురు చొప్పున మరణించగా, ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో ఒకరు మరణించారు.
ఇక ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రతలు 45.6 డిగ్రీలను దాటేసింది. సాధారణం కంటే 5.2 డిగ్రీలు ఎక్కువ నమోదైంది. ఉత్తరప్రదేశ్‌లో మే 31 నుంచి జూన్ 1 మధ్య.. హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో మే 31న దుమ్ము తుఫాను రానున్నట్లు భారత వాతావరణశాఖ అంచనా వేసింది. మే 31, జూన్ 1న వాయువ్య భారత్‌లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షతం నమోదుకానున్నట్లు పేర్కొంది.
రోహిణి కార్తె తన ప్రతాపాన్ని చూపుతుంది. అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలు దంచి కొడుతున్నాయి. రుతుపవనాలు వస్తాయన్న ఆశతో ఎదురు చూస్తున్న ప్రజలకు మాడు అదిరిపోయేలా ఎండలు అదరగొడుతున్నాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న ఢిల్లీలో 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు అల్లాడి పోయారు. ఒక ఢిల్లీలోనే కాదు..ఉత్తర భారత దేశంలో ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు బయటకు రావడానికే జంకుతున్నారు.
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. సూర్య ప్రతాపానికి ప్రజలు విల విలాడిపోతున్నారు. చిన్న పిల్లలు, వృద్దులు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్న సమయంలో రోడ్లన్నీ కర్ఫ్యూను తలపిస్తున్నాయి. బుధవారం తొలిసారిగా రికార్డు స్థాయిలో మంగేష్ పూర్‌లో ఏకంగా 52.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఏడారి ప్రాంతమైన రాజస్థాన్ కన్నా ఎక్కువగా రాజధానిలో ఎండలు మండిపోతున్నాయి.
రాజస్థాన్‌లో అత్యధికంగా ఫలోడిలో 51 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది. ఢిల్లీలోని నజాఫ్ గడ్, పిఠంపుర సహా మరికొన్ని ప్రాంతాల్లో నేడు 50 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దక్షిణ భారతదేశంలోకి రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చాయి. వివిధ రాష్ట్రాల్లో తొలకరి జల్లులు పలకరిస్తుంటే.. ఉత్తర భారతం భానుడి భగభగలతో ఠారెత్తిపోతోంది.
ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఎండతీవ్రతకు తోడు వేడి గాలులు వీస్తున్నాయి. జనాలు ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి. ఏసీలు, కూలర్లు వాడకం ఎక్కువ అయ్యింది. ఒక్కసారిగా విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఢిల్లీలో 8వేల302 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ ఉంది.
ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా నీటి ఎద్దడి ఏర్పడింది. నీటిని వృధా చేసిన వారికి రెండు వేల జరిమానా విధిస్తున్నారు. రాజస్థాన్‌లోనూ ఇదే పరిస్థితి. వేసవి విడిదికోసం ఉత్తర భారతం వెళ్లిన పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు. వాతావరణంలో ఇంతటి మార్పులు గతంలో ఎప్పుడూ చూడలేదంటున్నారు జనం.
రాజస్థాన్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, గుజరాత్‌తో సహా అనేక ప్రాంతాలకు భారత వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీ మాదిరిగానే వేడి గాలులు వీచే ప్రమాదం ఉందని తెలిపింది. ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌లోని ఫలొదిలో 51 డిగ్రీలు, హరియాణాలోని సిర్సాలో 50.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment