India Meteorological Department
-
కూలీల బాగే వ్యవసాయ బాగు
అనేక కారణాల వల్ల వ్యవసాయ కూలీలు ఊర్లో ఉండి పని చేసుకుని బతికే అవకాశాలు తగ్గుతున్నాయి. వ్యవసాయంలో వస్తున్న ఆధునిక మార్పులు పని అవకాశాలను తగ్గించాయి. వాతావరణ మార్పుల వల్ల సంభవిస్తున్న తీవ్రమైన ఎండలు, విపరీతమైన వర్షాలు వ్యవసాయ కూలీల సాధారణ పనికి ఆటంకంగా మారాయి. వ్యవసాయేతర అవసరాల కొరకు భూసేకరణ జరిగి, భూమి వినియోగం మారినప్పుడు, దాని ప్రభావం వ్యవసాయ ఉత్పత్తి మీద, వ్యవసాయ కూలీల మీద ఉంటుంది. వ్యవసాయంలో రైతులు, వ్యవసాయ కూలీల మధ్య అనుబంధం ఉంటేనే సుస్థిర వ్యవసాయం సాధ్యం. ఈ అనుబంధానికి తగిన ప్రభుత్వ మద్దతు, ఉపశమనం కలిగించే పథకాలు ఉంటేనే వ్యవసాయం స్వతంత్రంగా నిలబడగలుగుతుంది.వ్యవసాయంలో 2018–19 నాటికి సగటు రోజువారీ ఆదాయం 27 రూపాయలు మాత్రమే. ఆర్థిక సర్వే 2021–22 ప్రకారం, 2019 నాటికి వ్యవసాయ కుటుంబ సగటు నెలవారీ ఆదాయం రూ.10,218. రైతు ఆదాయమే అంత తక్కువ ఉండగా, వ్యవసాయ కూలీ ఆదాయం అంతకంటే ఘోరంగా ఉన్నది. ఉపాధి హామీ పథకంలో సగటు రోజు కూలీ రూ.179.70 చూపించి రైతు కన్నా వాళ్లకు ఎక్కువ వస్తుంది అనుకుంటారు. పథకంలో అమలు అవుతున్న పని దినాలు చాలా తక్కువ. కూలీల వలసలు తగ్గకపోవడమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. సగటు రైతు ఆర్థిక పరిస్థితే బాగాలేనప్పుడు సగటు రైతు కూలీ పరిస్థితి మెరుగ్గా ఉండే అవకాశం లేదు. వ్యవసాయ కూలీలకు సంవత్సరం మొత్తం పని ఉండదు. కూలీ సరిపోక చాలా కుటుంబాలు పిల్లలను బడికి కాకుండా పనికి పంపిస్తున్నాయి. భారతదేశంలో బాల కార్మి కుల సంఖ్య వివిధ అంచనాల ప్రకారం 1.75 నుండి 4.4 కోట్లు.అప్రకటిత నిర్లక్ష్యం2011 జనాభా లెక్కల ప్రకారం, దేశంలో మొత్తం వ్యవసాయ కార్మికుల సంఖ్య 2001లో ఉన్న 23.41 కోట్ల (12.73 కోట్ల సాగు దారులు, 10.68 కోట్ల వ్యవసాయ కూలీలు) నుండి 2011లో 26.31 కోట్లకు (11.88 కోట్ల సాగుదారులు, 14.4 కోట్ల వ్యవసాయ కూలీలు) పెరిగింది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక ప్రకారం, భారతదేశంలోని మొత్తం శ్రామికశక్తిలో 45.5 శాతం మంది 2021–22 నాటికి వ్యవసాయ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నారు. దేశంలోని శ్రామిక శక్తి ఉపాధిలో వ్యవసాయ రంగం వాటా 2020–21లో 46.5 శాతం ఉండగా, 2021–22 నాటికి 45.5 శాతానికి తగ్గింది. పల్లెలలో సాగుదారులు, వ్యవసాయ కూలీలు ఎక్కువగా ఉన్నారు. వారి సంఖ్యను తగ్గించాలని గత 40 యేండ్ల నుంచి ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. కొందరు అపర మేధావులు కూడా ఉత్పాదకత పేరు మీద, ఇంకేవో లెక్కల ఆధారంగా వ్యవసాయంలో ఇంత మంది ఉండొద్దు, తగ్గించే కార్యక్రమాలు చేపట్టమని ప్రభుత్వా నికి పదేపదే చెబుతుంటారు. వ్యవసాయ కూలీలను నిర్లక్ష్యం చేసే అప్రకటిత ప్రభుత్వ విధానం ఆ కోణం నుంచే వచ్చింది. రైతులు, కూలీల సంఖ్య తగ్గించాలనుకునేవారు వారికి ఇతర మార్గాల ఏర్పాటు గురించి ఆలోచనలు చేయడం లేదు.వ్యవసాయమే ఆధారంగా ఉండే పల్లెలలో వ్యవసాయం ఆదాయాన్ని బట్టి, అందులో ఉన్న మార్పులను బట్టి ఇతర వృత్తుల మీద ప్రభావం ఉంటున్నది. రోడ్లు, విమానాశ్రయం, పరిశ్రమలు తదితర వ్యవసాయేతర అవసరాలకు కొరకు భూసేకరణ జరిగి, భూమి ఉపయోగం మారినప్పుడు, ఆ ఊర్లో ఆ మేరకు వ్యవసాయం తగ్గుతుంది. దాని ప్రభావం వ్యవసాయ ఉత్పత్తి మీద, వ్యవసాయ కూలీల మీద ఉంటుంది. బహుళ పంటలు ఉంటే నిరంతరం పని ఉంటుంది. ఒక్కటే పంట ఉంటే విత్తనాలప్పుడు, కోతలప్పుడు తప్పితే పని ఉండదు. ఇదివరకు రైతులు పండించి కొంత తమ దగ్గర పెట్టుకుని మిగతాది మార్కెట్‌కు తరలించేవారు. ఇప్పుడు మొత్తం నేరుగా మార్కెట్‌కు తరలిస్తున్నారు. రైసు మిల్లులు అధునాతనం అయినాక వాటి సగటు సామర్థ్యం పెరిగింది, కూలీ పని తగ్గింది. తగ్గుతున్న పనికాంట్రాక్ట్ వ్యవసాయం, యాంత్రీకరణ, రసాయనీకరణ తర్వాత ఇప్పుడు ప్రభుత్వం డిజిటలీకరణ అంటున్నది. సబ్సిడీలు ఇచ్చి తెస్తున్న ఈ మార్పులు ఖర్చులను పెంచడంతో పాటు వ్యవ సాయ కూలీలకు పని అవకాశాలు తగ్గించాయి. కూలీ రేట్లు పెరిగి నందువల్ల కలుపును చంపే రసాయనాల వాడకం పెరిగిందని చాలా మంది నమ్ముతున్నారు. అది పెస్టిసైడ్ కంపెనీల మార్కెట్ మాయ మాత్రమే. సగటు పంట ఖర్చు పెరుగుదలలో విత్తనాలు, ఎరువులు, కీటకనాశక రసాయనాలు వగైరా అన్ని పెరిగినాయి. వాటి ధరల మీద, నాణ్యత మీద, వాటి కొరకు అయ్యే రవాణా, ఇతర ఖర్చుల మీద రైతులకు నియంత్రణ లేదు. పట్టణవాసులు ఐస్‌క్రీమ్, సబ్బులు, సినిమా టికెట్ కొనేటప్పుడు, హోటల్ బిల్లు కట్టేటప్పుడు పెద్దగా ఆలోచించరు. కానీ, కొత్తిమీర కట్ట రేటు పెరిగితే తెగ బాధపడతారు. అట్లాగే, రైతు బయట సరుకుల రేటు, వాటి కొరకు చేసే అప్పులు, వాటి మీద వడ్డీలు, తన ప్రయాణం, సరుకుల రవాణా వగైరా ఖర్చులను లెక్కలోకి తీసుకోడు. కానీ ఊర్లో ఉండే కూలీకి ఎంత ఇవ్వాలి అని మాత్రం ఆలోచిస్తాడు. కూలీ గురించి రైతుకు ఉన్న చింత బయటి నుంచి కొనుక్కొస్తున్న వాటి మీద ఉండటం లేదు. ఎందుకంటే కూలీ ఒక్కటే తన పరిధిలో ఉంటుంది.వ్యవసాయం సంక్షోభంలో ఉన్నది. రైతు సంక్షోభంలో ఉన్నాడు. వ్యవసాయ కూలీలు సంక్షోభంలో ఉన్నారు. పాడి పశువుల పరిస్థితి భిన్నంగా లేదు. పల్లెలు మొత్తం ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి. ఊర్లోకి రూపాయి రాకడ కంటే పోకడ ఎక్కువ అయినందున సగటు గ్రామీణ కుటుంబం అప్పులలో ఉన్నది. అందుకే వ్యవసాయ కూలీలు వలస పోతున్నారు. స్థానిక వ్యవసాయ కూలీలను కోల్పోతే వారి స్థానంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వలస కార్మికులు శారీరక శ్రమ చేయగలుగుతారేమో కానీ రైతుకు పూర్తి మద్దతు రాదు. స్థానిక వాతా వరణాన్ని బట్టి ఉండే నైపుణ్యం, జ్ఞానం, అనుభవం ఉన్న స్థానిక వ్యవసాయ కూలీలు రైతుకు అనేక రూపాలలో మద్దతు ఇవ్వ గలుగుతారు. వలస వచ్చిన కూలీలు ఆఫీసుకు వచ్చి పోతున్నట్లు వ్యవహరిస్తారు. వ్యవసాయంలో రైతులు, వ్యవసాయ కూలీల మధ్య అనుబంధం ఉంటేనే సుస్థిర వ్యవసాయం సాధ్యం. ఈ అనుబంధా నికి తగిన ప్రభుత్వ మద్దతు, సానుకూల విధానాలు, ఉపశమనం కలిగించే పథకాలు, సంక్షేమ నిధులు ఇస్తేనే భారత వ్యవసాయం స్వతంత్రంగా నిలబడగలుగుతుంది. లేకపోతే, మన ఆహార భద్రత ఆందోళన కలిగించకమానదు.కూలీలు కేంద్రంగా విధానంఆధునిక వ్యవసాయంలో విపరీతంగా వాడుతున్న ప్రమాదకర కీటకనాశక రసాయనాల వల్ల, వాతావరణ మార్పుల వల్ల వ్యవ సాయ కూలీల ఆరోగ్యం ప్రమాదంలో పడింది. తీవ్రమైన ఎండలు, విపరీతమైన వర్షాలు వ్యవసాయ కూలీల సాధారణ పనికి ఆటంకంగా మారాయి. భారత వాతావరణ శాఖ ప్రకారం, పిడుగుపాటు వల్ల ప్రతి సంవత్సరం సుమారు 2,000 మంది చనిపోతున్నారు. భారతదేశపు మొట్టమొదటి వార్షిక ఉరుములు మెరుపుల నివేదిక (2019–2020) ప్రకారం, పిడుగుపాటు మరణాలకు ప్రధాన కారణం చెట్టు కింద నిలబడటం. ఇది మొత్తం పిడుగుపాటు మరణాలలో 71 శాతం. అత్యధిక సంఖ్యలో వ్యవసాయ కూలీలు ఆరు బయట పని చేస్తూ ఉంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా ఆయా కుటుంబాలకు ఉపశమనం కల్పించటానికి ఒక్క అడుగు కూడా వేయలేదు. 2021లో భారతదేశం ప్రకృతి వైపరీత్యాల వల్ల దాదాపు రూ. 27 వేల కోట్ల నష్టం అయ్యిందని ఒక అంచనా. ఇందులో వ్యవసాయ కూలీల జీవనోపాధికి వచ్చిన నష్టం కలుపలేదు. వీరిని కూడా నష్టాల అంచనాలలో, నష్ట నివారణ చర్యలలో ముఖ్యంగా పరిగణించాలని అంతర్జాతీయ కార్మిక సంస్థ కూడా చెప్పింది. ఈ సంస్థ తయారు చేసిన విధి విధానాలు భారతదేశంలో అమలు చేయడానికి ఒక జాతీయ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చెయ్యాలి. జాతీయ బడ్జెట్లో దీనికి అవసరమైన కేటాయింపులు చేయాలి. వ్యవసాయ కూలీలు కేంద్రంగా సుస్థిర అభివృద్ధి, పర్యావరణ అనుకూల గ్రామీణ విధానాలు తయారు చెయ్యాలి.డా‘‘ దొంతి నరసింహా రెడ్డి వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు -
Uttar Pradesh: పిడుగుపాటుకు 38 మంది మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో పిడుగులు పడిన ఘటనలు పలువురి ప్రాణాలు బలిగొన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పిడుగుపాటుకు గురై కనీసం 38 మంది మరణించారని అధికారులు గురువారం ప్రకటించారు. ప్రతాప్‌గఢ్‌లో అత్యధికంగా 11 మంది మృతి చెందారు. సుల్తాన్‌పూర్‌లో ఏడుగురు, చందౌలీలో ఆరుగురు, మెయిన్‌పురిలో ఐదుగురు, ప్రయాగ్‌రాజ్‌లో నలుగురు, ఔరయ్యా, డియోరియా, హత్రాస్, వారణాసి, సిద్ధార్థనగర్లలో ఒక్కొక్కరు మరణించారు. అనేక మందికి కాలిన గాయాలయ్యాయి. తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీ జిల్లాలో బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ ఘటనలో 13, 15 ఏళ్లున్న ఇద్దరుతో సహా చాలా మంది బాధితులు పొలంలో పనిచేస్తున్నారు. అప్పుడే చేపలు పట్టేటప్పుడు పిడుగుపాటుకు గురయ్యారు. సుల్తాన్‌పూర్‌లో ముగ్గురు చిన్నారులుసహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. కొందరు వరి నాట్లు వేస్తుండగా, ఒకరు మామిడి కాయలు కోసేందుకు వెళ్లి, మరొకరు తాగునీరు తెచ్చేందుకు వెళ్లి పిడుగుపాటుకు గురయ్యారు. బుధవారం భారీ వర్షం కురుస్తుండగా చెట్టు కింద తలదాచుకుంటున్న ఓ మహిళ పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందింది. వర్షం కురుస్తుండటంతో మామిడి చెట్టు కింద తలదాచుకుంటున్న 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. డియోరియాలో పొలంలో ఉన్న కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్తుండగా పిడుగుపడి 5 ఏళ్ల బాలిక మరణించింది. వారణాసిలో ఇద్దరు సోదరులు పిడుగుపాటుకు గురయ్యారు. ఒకరు కాలిన గాయాలతో మృతి చెందగా, మరొకరు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. రాబోయే ఐదు రోజుల్లో ఉత్తరప్రదేశ్. దాని పరిసర రాష్ట్రాలు. కేంద్ర పాలిత ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. -
కొనసాగుతున్న ద్రోణి
సాక్షి, విశాఖపట్నం: రానున్న రెండు మూడు రోజుల్లో వర్షాలు ఊపందుకోనున్నాయి. ప్రస్తుతం రాయలసీమ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ద్రోణి ప్రభావంతో శనివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలు, ఆదివారం పార్వతీపురం మన్యం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, వైఎస్సార్, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అదే సమయంలో ఆ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఊపందుకోనున్న రుతుపవనాలు..కొద్ది రోజులుగా నైరుతి రుతుపవనాలు స్తబ్దుగా ఉన్నాయి. దీనివల్ల రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు, అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అయితే రెండు మూడు రోజుల్లో రుతుపవనాలు చురుకుదనం సంతరించు కోనున్నాయి. ఫలితంగా ఈనెల 17, 18 తేదీల్లో కోస్తాంధ్రలోను, 18న రాయలసీమలోను భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. శుక్రవారం రాత్రి వరకు డోలపేట (విజయనగరం జిల్లా)లో 7.8 సెంటీమీటర్లు, కోట ఉరట్ల (అనకాపల్లి)లో 5.7, అనపర్తి (తూర్పు గోదావరి)లో 4.3, ఎచ్చెర్ల (శ్రీకాకుళం)లో 3.2, సాలూరు (పార్వతీపురం మన్యం)లో 2.9, పర్లపాడు (వైఎస్సార్)లో 2.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. -
సూర్యుడి భగభగ.. ఎండ వేడి తట్టుకోలేక 54 మంది మృత్యువాత
న్యూ ఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఎండలు భగ్గుమంటున్నాయి. ఢిల్లీతో సహా తూర్పు, ఉత్తర భారతదేశంలో తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంట్లోంచి కాలు బయట పెట్టాలంటే ముచ్చెమటలు పడుతున్నాయి. కాళ్లకు చెప్పులు లేకుండా, నెత్తి మీద రుమాలు లేకుండా బయట అడుగు పెడితేా.. అంతే సంగతులు. కాళ్లకు బొబ్బలు కట్టడం ఖాయం, మాడు పగలడం ఖరార్. పైగా, వేడి గాలుల బీభత్సం. తెల్లారింది మొదలు రాత్రి 10 గంటల దాకా భానుడి భగభగలే.ఎంత వేడిని తట్టుకోలేక దేశ వ్యాప్తంగా 54 మంది మృత్యువాత పడ్డారు. బీహార్‌లో 32 మంది వడదెబ్బతో మరణించారు. ఔరంగాబాద్‌లో 17 మంది, అర్రాలో ఆరుగురు, గయాలో ముగ్గురు, రోహతాస్‌లో ముగ్గురు, బక్సర్‌లో ఇద్దరు, పాట్నాలో ఒకరు మరణించారు.. ఒడిశాలోని రూర్కెలాలో 10 మంది చనిపోయారు. జార్ఖండ్‌లోని పాలము, రాజస్థాన్‌లలో ఐదుగురు చొప్పున మరణించగా, ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో ఒకరు మరణించారు.ఇక ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రతలు 45.6 డిగ్రీలను దాటేసింది. సాధారణం కంటే 5.2 డిగ్రీలు ఎక్కువ నమోదైంది. ఉత్తరప్రదేశ్‌లో మే 31 నుంచి జూన్ 1 మధ్య.. హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో మే 31న దుమ్ము తుఫాను రానున్నట్లు భారత వాతావరణశాఖ అంచనా వేసింది. మే 31, జూన్ 1న వాయువ్య భారత్‌లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షతం నమోదుకానున్నట్లు పేర్కొంది. రోహిణి కార్తె తన ప్రతాపాన్ని చూపుతుంది. అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలు దంచి కొడుతున్నాయి. రుతుపవనాలు వస్తాయన్న ఆశతో ఎదురు చూస్తున్న ప్రజలకు మాడు అదిరిపోయేలా ఎండలు అదరగొడుతున్నాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న ఢిల్లీలో 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు అల్లాడి పోయారు. ఒక ఢిల్లీలోనే కాదు..ఉత్తర భారత దేశంలో ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు బయటకు రావడానికే జంకుతున్నారు.ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. సూర్య ప్రతాపానికి ప్రజలు విల విలాడిపోతున్నారు. చిన్న పిల్లలు, వృద్దులు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్న సమయంలో రోడ్లన్నీ కర్ఫ్యూను తలపిస్తున్నాయి. బుధవారం తొలిసారిగా రికార్డు స్థాయిలో మంగేష్ పూర్లో ఏకంగా 52.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఏడారి ప్రాంతమైన రాజస్థాన్ కన్నా ఎక్కువగా రాజధానిలో ఎండలు మండిపోతున్నాయి. రాజస్థాన్‌లో అత్యధికంగా ఫలోడిలో 51 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది. ఢిల్లీలోని నజాఫ్ గడ్, పిఠంపుర సహా మరికొన్ని ప్రాంతాల్లో నేడు 50 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దక్షిణ భారతదేశంలోకి రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చాయి. వివిధ రాష్ట్రాల్లో తొలకరి జల్లులు పలకరిస్తుంటే.. ఉత్తర భారతం భానుడి భగభగలతో ఠారెత్తిపోతోంది.ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఎండతీవ్రతకు తోడు వేడి గాలులు వీస్తున్నాయి. జనాలు ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి. ఏసీలు, కూలర్లు వాడకం ఎక్కువ అయ్యింది. ఒక్కసారిగా విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఢిల్లీలో 8వేల302 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా నీటి ఎద్దడి ఏర్పడింది. నీటిని వృధా చేసిన వారికి రెండు వేల జరిమానా విధిస్తున్నారు. రాజస్థాన్‌లోనూ ఇదే పరిస్థితి. వేసవి విడిదికోసం ఉత్తర భారతం వెళ్లిన పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు. వాతావరణంలో ఇంతటి మార్పులు గతంలో ఎప్పుడూ చూడలేదంటున్నారు జనం.రాజస్థాన్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, గుజరాత్‌తో సహా అనేక ప్రాంతాలకు భారత వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీ మాదిరిగానే వేడి గాలులు వీచే ప్రమాదం ఉందని తెలిపింది. ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌లోని ఫలొదిలో 51 డిగ్రీలు, హరియాణాలోని సిర్సాలో 50.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. -
తీరం దాటిన రెమాల్ తుఫాన్
-
Cyclone Remal: ఉరుములు, మెరుపులతో వర్షాలు..
-
ఈశాన్య బంగాళాఖాతం వైపు వెళ్తున్న వాయుగుండంకు రెమల్ తుపానుగా పేరు
-
కోస్తాంధ్ర, రాయలసీమలో రేపు భారీ వర్షాలు
-
హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
ఢిల్లీ: దేశంలోని ప్రధాన నగరాల్లో ఎండ తీవ్రత రోజు రోజుకి భారీగా పెరుగుతోంది. ప్రజలు భానుడి వేడి తట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో భారత వాతావరణ శాఖ తీవ్రమైన వేడిగాలులు త్వరలో తగ్గుముఖం పట్టబోతున్నాయని ఓ శుభవార్త చెప్పింది.తూర్పు, దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలో వేడిగాలులు తగ్గుముఖం పట్టబోతున్నాయి. తూర్పు ప్రాంతానికి ఈ రోజులో ఉపశమనం లభించవచ్చు. దక్షిణాది రాష్ట్రాలు కూడా త్వరకలోనే వేడి తీవ్రతలు తగ్గుతాయని ఐఎండీ పేర్కొంది. మే 10 వరకు ఈ ప్రాంతాలలో ఉరుములు, గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.గత నెల నుంచి భారతదేశంలో పలు ప్రాంతాల్లో తీవ్రమైన వేడిగాలులు వ్యాపించడంతో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువ అవుతున్నాయి. ఏప్రిల్ చివరి రోజున కోల్‌కతాలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది, కోల్‌కతాలో దశాబ్దాలుగా ఇంతటి ఉష్ణోగ్రత నమోదు కాలేదు.రాబోయే ఐదు రోజుల్లో గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్‌లను ఉష్ణోగ్రతలు తగ్గుతాయని, ఈశాన్య రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మేఘాలయలోని ఖాసీ-జైంతియా హిల్స్ ప్రాంతంలో నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. 400 మందికి పైగా ప్రజలు నష్టపోయినట్లు.. మరో 48 గంటల పాటు ఈ వర్షం కొనసాగుతుందని వాతావరణ సఖ పేర్కొంది. -
హీట్‌వేవ్ అలర్ట్: భారత వాతావరణ శాఖ ట్వీట్
న్యూఢిల్లీ: భారత వాతావరణ శాఖ (IMD) సోమవారం దేశంలోని కొన్ని ప్రాంతాల్లో హీట్ వేవ్ అలర్ట్ జారీ చేసింది. దీనికి సంబంధించిన ఇండియా మ్యాప్‌ను తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేసింది. ఇందులో హీట్‌వేవ్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాలను హైలెట్ చేసింది.గంగా పశ్చిమ బెంగాల్, బీహార్‌లోని అనేక ప్రాంతాల్లో హీట్ వేవ్ పరిస్థితులు ఎక్కువగా ఉంటాయని, ఒడిషా, తూర్పు ఉత్తరప్రదేశ్, సబ్-హిమాలయన్ పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌లో వేడి తరంగాలకు అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది.Heat wave to Severe Heat Wave conditions very likely in many pockets of Gangetic West Bengal and Bihar, isolated pockets of Odisha and heat wave conditions very likely in east Uttar Pradesh, Sub-Himalayan West Bengal, Jharkhand, Konkan & Goa, Saurashtra & Kutch.... pic.twitter.com/vFezec7hUy— India Meteorological Department (@Indiametdept) April 29, 2024 హీట్ వేవ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను వెల్లడించడం మాత్రమే కాకుండా.. హీట్ వేవ్ పరిస్థితుల్లో.. తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా ఐఎండీ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది.మీకు దాహం లేకపోయినా మిమ్మల్ని మీరు హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి తగినంత నీరు/ఓఆర్ఎస్ తాగండి.వేడి ఎక్కువగా ఉండటం వల్ల 12 గంటల నుంచి 4 గంటల వరకు బయట చేయాల్సిన పనిని కొంత వాయిదా వేసుకోండి.వేడి నుంచి తప్పించుకోవడానికి నీడగా ఉండే ప్రదేశాల్లో నిలబడండి.పిల్లలు, వృద్దులు, జబ్బుపడిన వారిని ఎండ వేడి నుంచి జాగ్రత్తగా కాపాడుకోవాలి.ఎండ సమయంలో లేత రంగు బట్టలను ధరించండి.తలను కప్పుకోవదానికి గుడ్డ, టోపీ వంటి వాటిని ఉపయోగించాలి.DO's during #Heatwave@moesgoi@DDNewslive@ndmaindia@airnewsalerts pic.twitter.com/59FtYPB35v— India Meteorological Department (@Indiametdept) April 28, 2024 -
ఈ రాష్ట్రాల్లో మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు
ఢిల్లీ: ఇప్పటికే భానుడి భగభగలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఏప్రిల్ - జూన్ మధ్య కాలంలో భారతదేశంలో తీవ్రమైన ఉష్ణోగ్రత ఉంటుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. భారత వాతావరణ విభాగం (IMD) డైరెక్టర్ జనరల్ 'మృత్యుంజయ్ మహపాత్ర' ప్రకారం.. ఏప్రిల్-జూన్ కాలంలో దేశంలోని చాలా ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు. మధ్య, పశ్చిమ ద్వీపకల్ప భారతదేశంలో అధిక వేడి ఉంటుంది. పశ్చిమ హిమాలయ ప్రాంతం, ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తర ఒడిశాలోని కొన్ని ప్రాంతాలలో తక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని మృత్యుంజయ్ మహపాత్ర చెప్పారు. అయితే మైదానాల్లోని చాలా ప్రాంతాలలో ఎక్కువ వేడిగాలులు వచ్చే అవకాశం ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో 10 నుంచి 20 రోజులపాటు వేడిగాలులు నమోదయ్యే అవకాశం ఉందని, ఆ సమయంలో వేడి మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉందని అన్నారు. రాష్ట్రాల వారీగా గుజరాత్, మధ్య మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తర ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌లో వేడిగాలుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని మోహపాత్ర తెలిపారు. -
‘నైరుతి’ నిష్క్రమణ ఆరంభం
సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమవుతోంది. సోమవారం నుంచి పశ్చిమ రాజస్థాన్ ప్రాంతం నుంచి వీటి ఉపసంహరణ మొదలవుతుంది. వాయవ్య భారతదేశంలో యాంటీ సైక్లోన్ అభివృద్ధి చెందడం, నైరుతి రాజస్థాన్‌లో పొడి వాతావరణం నెలకొనడం ద్వారా ఈ రుతుపవనాల నిష్క్రమణ మొదలు కానున్నట్టు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమై అక్టోబర్ 15 నాటికి దేశం నుంచి నైరుతి రుతు పవనాల నిష్క్రమణ పూర్తవుతుంది. సాధారణంగా నైరుతి రుతుపవనాల నిష్క్రమణ రాజస్థాన్ నుంచి సెప్టెంబర్ 17 నుంచి ఆరంభమవుతుంది. కానీ.. ఈ ఏడాది వారం రోజులు ఆలస్యంగా ఉపసంహరణ మొదలవుతోంది. ఈ ఏడాది నైరుతి ఆగమనం కూడా వారం రోజుల ఆలస్యంగానే మొదలైంది. వాస్తవానికి జూన్ 1వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. అక్కడ నుంచి క్రమంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరిస్తాయి. అయితే, ఈ ఏడాది ఇవి వారం రోజులు ఆలస్యంగా అంటే జూన్ 8వ తేదీన కేరళను తాకాయి. వీటి విరమణలోనూ అదే తీరును కనబరిచాయి. ఈ ఏడాది ‘నైరుతి’ విభిన్నం! ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు విభిన్నంగా ప్రభావం చూపాయి. ఈ రుతుపవనాల సీజన్ జూన్ నుంచి అక్టోబర్ వరకు ఉంటుంది. ఈ సమయంలో బంగాళాఖాతంలో కనీసం ఐదారు అల్పపీడనాలు, మూడు వాయుగుండాలు, ఒకట్రెండు తుపానులు సంభవిస్తాయి. కానీ.. ఈ సీజనులో ఇప్పటివరకు నాలుగు అల్పపీడనాలు మాత్రమే ఏర్పడ్డాయి. ఇవి కూడా స్వల్పంగానే ప్రభావం చూపాయి తప్ప ఆశించిన స్థాయిలో వర్షాలను కురిపించలేదు. ఈ ఏడాది ఒక్క వాయుగుండం గాని, తుపాను గాని ఏర్పడలేదు. వాయుగుండాలు, తుపానులు ఏర్పడితే సమృద్ధిగా వానలు కురిసేందుకు దోహద పడేవి. ఈ దృష్ట్యా రాష్ట్రంలో ఈ సీజన్లో ఇప్పటివరకు 16.8 శాతం లోటు వర్షపాతం నమోదైంది. తిరోగమనంలో వర్షాలు సాధారణంగా నైరుతి రుతుపవనాల తిరోగమనంలోనూ వర్షాలు కురుస్తాయి. ఈ సమయంలో బంగాళాఖాతంలో అల్పపీడనాలకు ఆస్కారం ఉంటుందని, రుతుపవనాలు చురుకుదనం సంతరించుకుంటాయని, ఫలితంగా వానలు కురుస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇలా తిరోగమనంలో కురిసే వర్షాలతో రాష్ట్రంలో నెలకొన్న లోటు వర్షపాతం సాధారణ స్థితికి చేరుకుంటుందని, వచ్చే నెల 15 వరకు వర్షాలు పడతాయని పేర్కొంటున్నారు. ఎందుకిలా జరిగిందంటే! ఈ సీజన్లో నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా ప్రభావం చూపకపోవడానికి వాతావరణ నిపుణులు వివిధ కారణాలు చెబుతున్నారు. నైరుతి రుతుపవనాలు భూమధ్య రేఖ ప్రాంతం నుంచి అరేబియా, బంగాళాఖాతం శాఖలుగా> విడిపోతాయి. వీటిలో బంగాళాఖాతం శాఖ ప శ్చిమ మధ్య బంగాళాఖాతంలో కాకుండా చైనా, జపాన్ దేశాల వైపు వెళ్లిపోయాయి. దీంతో చైనా సముద్రంలో ఈ సీజన్లో రెండు మూడు బలమైన తుపానులు ఏర్పడ్డాయి. పైగా.. రుతుపవన ద్రోణి దాదాపు నెల రోజులపాటు హిమాలయాల్లోనే ఉండిపోయింది. ఫలితంగా పశి్చమ బంగాళాఖాతంలో అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడక రాష్ట్రంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవకుండా పోయాయి. దీనికి ఎల్‌నినో పరిస్థితులు కూడా తోడయ్యాయని వాతావరణ శాఖ విశ్రాంత అధికారి ఆర్.మురళీకృష్ణ ‘సాక్షి’కి వివరించారు. -
జీ20 సదస్సు.. ప్రత్యేకంగా వాతావరణ కేంద్రం.. ఇంకా ఎన్నో!
జై సియా రాం భారత మూలాలున్న బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, అక్షతా మూర్తి దంపతులకు శుక్రవారం ఉదయం పాలం విమానాశ్రయంలో.. కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ చౌబే జై సియా రాం(జై శ్రీరాం) అంటూ స్వాగతం పలికారు. వారికి మంత్రి చౌబే రుద్రాక్షను, భగవద్గీత, హనుమాన్ చాలీసా ప్రతులను కానుకలుగా అందజేశారు. వ్యాపారవేత్తలకు ఆహ్వానాల్లేవ్.. జీ20 ప్రత్యేక విందు కార్యక్రమానికి వ్యాపార దిగ్గజాలకు ఆహ్వానాలు వెళ్లాయన్న వార్తలపై కేంద్రం స్పందించింది. జీ20 స్పెషల్ డిన్నర్‌కు రావాలంటూ వ్యాపారవేత్తలను ఆహ్వానించలేదని స్పష్టం చేసింది. శనివారం జరిగే విందుకు బిలియనీర్లు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి 500 మందికి పైగా వ్యాపారవేత్తలు హాజరవనున్నారంటూ వస్తున్న వార్తలను తప్పుదోవపట్టించేవిగా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. వాణిజ్యవేత్తలెవరినీ ఆహ్వానించలేదని తెలిపింది. యూపీఐని పరిచయం చేసేందుకు.. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘డిజిటల్ ఇండియా’ కార్యక్రమంపై జీ20 ప్రతినిధులకు ప్రత్యక్ష అనుభవం కల్పించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంది. విదేశీ ప్రతినిధులు ఢిల్లీలో ఉండగా జరిపే కొనుగోళ్లకు గాను యూపీఐ(యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) ద్వారా చెల్లింపులపై ఆసక్తి కల్పించేందుకు చర్యలు తీసుకుంది. దేశీయంగా రూపకల్పన చేసిన ఈ విధానంలో చెల్లింపులు ఎంత సులువో వారికి తెలియజేయడమే ఉద్దేశం. ఇందులోభాగంగా సుమారు వెయ్యి మంది విదేశీ ప్రతినిధుల ఫోన్ వ్యాలెట్లలో రూ.500 నుంచి రూ.1000 వరకు బ్యాలెన్స్ జమ చేయనుంది. ఇందుకోసం రూ.10 లక్షల వరకు ప్రత్యేకించింది. ప్రత్యేకంగా వాతావరణ కేంద్రం జీ20 సమావేశాలు జరిగే ప్రగతి మైదాన్‌కు సమీపంలో భారత వాతావరణ విభాగం(ఐఎండీ) అదనంగా ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ప్రపంచ నేతలు పాల్గొంటున్న కార్యక్రమం అయినందున ఈ వాతావరణ కేంద్రం ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలు చేస్తుంది. గురువారం నుంచి ఆదివారం వరకు ఇది నిర్విరామంగా వాతావరణాన్ని పరిశీలిస్తుంటుంది. ఐఎండీకి చెందిన వెబ్‌పేజీ mausam.imd.gov.in/g20 ద్వారా వాతావరణ సూచనల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. చదవండి: G20 Summit: బైడెన్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చలు స్ట్రీట్ ఫుడ్, మిల్లెట్స్‌తో ప్రత్యేక మెనూ భారత్‌లో ఈ సీజన్లో ప్రజలు ఎక్కువగా ఇష్టపడే వంటకాలతో ప్రత్యేకంగా మెనూ సిద్ధమైంది. భారతీయ స్ట్రీట్ ఫుడ్ ఐటమ్స్‌తోపాటు మిల్లెట్లతో చేసిన ఆహార పదార్థాలకు ఇందులో స్థానం కల్పించారు. ఇంకా గులాబ్ జామ్, రసమలై, జిలేబీ వంటి స్వీట్లు కూడా అతిథులకు వడ్డిస్తారు. వడ్డించే సిబ్బందికి ప్రత్యేక యూనిఫాం రూపొందించారు. మెనూలో ఫలానావి ఉంటాయని అధికారులెవరూ స్పష్టంగా చెప్పనప్పటికీ, భారతీయ వంటకాల్లో వైవిధ్యాన్ని చాటేలా మెనూ ఉంటుందని భావిస్తున్నారు. ప్రత్యేక టేబుల్ వేర్ ప్రపంచనేతలకు ఇచ్చే విందు కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. వారికి మరిచిపోలేని ఆతిథ్య అనుభూతి కల్పించేందుకు ఆహారపదార్థాలను వెండి, బంగారు పూత కలిగిన పాత్రల్లో వడ్డిస్తారు. విదేశీ నేతలు వివిధ హోటళ్లలో బస చేసినప్పుడు, రాష్ట్రపతి ఏర్పాటు చేసిన విందుకు హాజరయ్యే సమయంలో ఉపయోగించేందుకు 200 మంది కళాకారులతో 15 వేల వరకు సామగ్రిని తయారు చేయించారు. ఇందులో స్టీల్, ఇత్తడి లేదా రెండింటి మిశ్రమంతో తయారైన టేబుల్ సామగ్రికి వెండిపూత వేయించారు. విందు సమయంలో అతిథులకు బంగారు పూత వేసిన గ్లాస్‌లలో డ్రింక్స్‌ను సర్వ్ చేస్తారు. ప్లేట్లు, స్పూన్లు తదితర వస్తువులను భారతీయ సంప్రదాయం ప్రతిబింబించేలా ఎంపిక చేశారు. జైపూర్, ఉదయ్‌పూర్, వారణాసిలతోపాటు కర్ణాటకలో వీటిని తయారు చేయించారు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీపై నిషేధం జీ20 దృష్ట్యా ఈ నెల 8, 9, 10వ తేదీల్లో న్యూఢిల్లీలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఢిల్లీ పోలీసులు ఈ ప్రాంతంలో ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు ప్రకటించారు. క్లౌడ్ కిచెన్, ఫుడ్ డెలివరీలు, అమెజాన్ డెలివరీ వంటి వాణిజ్య సేవలపై ఎన్డీఎంసీ ప్రాంతంలో నిషేధం విధిస్తున్నట్లు స్పెషల్ పోలీస్ కమిషనర్ ఎస్ఎస్ యాదవ్ చెప్పారు. ఈ ప్రాంతంలో లాక్డౌన్ విధిస్తారన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. అలాంటిదేమీ లేదన్నారు. బియెన్‌వెన్యూ నుంచి బియెన్‌వెనిడో దాకా.. జీ20 శిఖరాగ్రానికి హాజరయ్యే జీ20 ప్రతినిధులు, విదేశీ అతిథులకు వారివారి భాషల్లోనే స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. జీ20 ఇతివృత్తం ‘వసుధైక కుటుంబకమ్’ను జీ20 సభ్యదేశాలు, ఆహ్వానిత దేశాల భాషల్లో ముద్రించారు. దీంతోపాటు ఫ్రెంచిలో బియెన్‌వెన్యూ, టర్కిష్‌లో హాస్గెల్డినిజ్, జర్మన్లో విల్కోమెన్, ఇండోనేసియన్‌లో సెలామట్ దతంగ్, స్పానిష్‌లో బియెన్‌వెనిడో అంటూ స్వాగతాన్ని రష్యన్, మాండరిన్ భాషల్లో సైతం ముద్రించారు. దేశాల ప్రతినిధుల కోసం భారత్ మండపం కాంప్లెక్స్ 14వ నంబర్ హాలు ప్రవేశద్వారం వద్ద వీటిని ఏర్పాటు చేశారు. ఖర్గేకు రాని విందు పిలుపు సాక్షి, న్యూఢిల్లీ: జీ 20సదస్సులో భాగంగా శనివారం రాత్రి అతిథులకు ఇస్తున్న విందుకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు పిలుపు రాలేదు. ప్రగతిమైదాన్‌లోని భారత మండపంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇవ్వనున్న ఈ విందుకు ఖర్గేకు పిలుపు రాలేదని ఆయన కార్యాలయం ధ్రువీకరించింది. మాజీ ప్రధానులు దేవెగౌడ. మన్మోహన్ సింగ్. కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర కార్యదర్శులు, పలువురు పారిశ్రామిక వేత్తలు ఆహ్వానితుల్లో ఉన్నారు. అయితే కేబినెట్ హోదా ఉన్న రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు ఖర్గేకు ఆహా్వనం పంపకపోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సీఎంలు నితీశ్‌కుమార్ , మమతా బెనర్జీ, కేజ్రీవాల్, భగవంత్‌మాన్, హేమంత్ సోరెన్‌లు విందుకు హాజరు అవుతున్నట్లు ప్రకటించారు. అనారోగ్య కారణంగా విందుకు హాజరుకావడంలేదని మాజీ ప్రధాని దేవెగౌడ ట్వీట్ చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ కూడా అనారోగ్య కారణాలతో విందుకు హాజరుకావడం లేదని సమాచారం. నేతల బస సదస్సుకు హాజరవుతున్న దేశాధినేతలందరికీ సెంట్రల్ ఢిల్లీలోని స్టార్‌హోటళ్లు, గురుగ్రామ్‌లో బస ఏర్పాట్లు చేశారు. సుమారు 35 వేల గదులు బుక్ చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఐటీసీ మౌర్య 14వ అంతస్తులో, చాణక్యపురిలోని తాజ్ ప్యాలెస్‌లో చైనా ప్రధాని లీ క్వియాంగ్, బ్రెజిల్ ప్రతినిధులు, షాంగ్రీలాలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, జర్మనీ చాన్స్‌లర్ ఒలాఫ్ షోల్జ్, క్లారిడ్జ్ హోటల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, ఇంపీరియర్ హోటల్లో ఆ్రస్టేలియా ప్రధాని ఆంటొనీ అల్బనీస్, ఒబెరాయ్ హోటల్లో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, గురుగ్రామ్‌లోని ఒబెరాయ్ హోటల్లో దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్, జేడబ్ల్యూ మారియట్, హయత్ రెసిడెన్సీల్లో ఇటలీ ప్రతినిధులు, లీ మెరిడియన్‌లో నెదర్లాండ్స్, నైజీరియా, యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు, లలిత్ హోటల్లో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, గురుగ్రామ్ లీలీ హోటల్లో సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ బృందం బస చేయనుంది. -
ఆనాటి కాలం.. వడగాడ్పులు తీవ్రం
సాక్షి, అమరావతి: దేశంలో వడగాడ్పుల తీవ్రత, మరణాలపై గడిచిన తొమ్మిదేళ్లకు సంబంధించి ఇటీవల కేంద్ర వైద్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నివేదిక విడుదల చేసింది. 2015 నుంచి 2023 వరకు రాష్ట్రాల వారీగా లెక్కలను ఆ నివేదికలో వెల్లడించింది. సంవత్సరాల వారీగా చూస్తే 2015 నుంచి 2019 వరకు వడగాడ్పులకు ఆంధ్రప్రదేశ్‌లో 2,418 మంది మరణించారు. 2015లోనే అత్యధికంగా ఏపీలో 1,422 మంది మరణించినట్లు నివేదిక పేర్కొంది. ఇక 2020 నుంచి 2023 వరకు మన రాష్ట్రంలో వడగాడ్పులకు ఐదుగురు మరణించినట్లు నివేదిక స్పష్టం చేసింది. మన రాష్ట్రం తర్వాత తెలంగాణలోనే అత్యధికంగా వడదెబ్బ మరణాలు నమోదయ్యాయి. వాతావరణ మార్పు, మానవ ఆరోగ్యంపై దాని ప్రభావం తదితర అంశాలపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టి వేసవి గాలులపై ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు సూచనలు, సాంకేతిక సహకారం అందిస్తోంది. ప్రజలకు కూడా అవగాహన కల్పించడానికి ఎప్పటికప్పుడు సంక్షిప్త సందేశాలను పంపించడంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తోందని నివేదిక పేర్కొంది. వడగాడ్పులకు చికిత్స ద్వారా సంబంధిత మరణాలను తగ్గించడానికి మౌలిక సదుపాయాలను 28 రాష్ట్రాల్లో కల్పించినట్లు తెలిపింది. భారత వాతావరణ శాఖ హీట్ వేవ్ హెచ్చరికలను ముందస్తుగా జారీ చేస్తుందని, అందుకు అనుగుణంగా రాష్ట్రాలు తగిన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా మరణాలను తగ్గించవచ్చని నివేదిక పేర్కొంది. -
తెలంగాణకు చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు వచ్చేశాయ్..
సాక్షి, హైదరాబాద్: తీవ్రమైన ఎండలు, వడగాలులతో అల్లాడుతున్న తెలంగాణకు ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు తెలిపింది. ఖమ్మం వరకూ నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని, రెండు మూడు రోజుల్లో తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాలకు ఇవి విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో రాష్ట్రంలో ఎండల తీవ్రత కొంతమేర తగ్గనుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లోని ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గరలో ఆవర్తనం ఏర్పడిందని, దీని కారణంగా పశ్చిమ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకు గాలులు వీస్తున్నాయని వాతావావరణశాఖ వెల్లడించింది. ఈ ప్రభావంతో రాగల మూడు రోజులు తెలంగాణలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. చదవండి: సిద్దిపేటకు రైలు.. తిరుపతి, బెంగళూరు, ముంబయికి ఎక్స్‌ప్రెస్ సర్వీసులు నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ములుగు ,యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు పేర్కొంది. ఈనెల 25, 26 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపిన ఐఎండీ హైదరాబాద్ కేంద్రం తెలంగాణకు ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. సాక్షి, అమరావతి: ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ కేంద్రం. పార్వతీపురం, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. అనకాపల్లి, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, శ్రీసత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాలకు ఓ మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం, ఏలూరులో గురువారం ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. పల్నాడు జిల్లాలోనూ పలుచోట్ల వర్షం కురిసింది. ఈదురు గాలులు వీస్తున్నాయి. రాజుపాలెం, సత్తెనపల్లి, క్రోసూరు, నకరికల్లు, పెదకూరపాడు, నూజెండ్లలో వర్షం పడగా.. ఈదురుగాలులకు కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా నలిచిపోయింది. -
బిపర్జోయ్ విలయం.. ఇద్దరు మృతి, 22 మందికి గాయాలు
కఛ్(గుజరాత్): గత పదిరోజులుగా భయాందోళనకు గురిచేస్తున్న తీవ్ర తుపాను బిపర్జోయ్ ఎట్టకేలకు గురువారం సాయంత్రం గుజరాత్లో తీరాన్ని తాకింది. గంటకు 125 కిమీ నుంచి 140 కిమీ వేగంతో కఛ్ జిల్లాలోని జఖౌ పోర్టు సమీపంలో సౌరాష్ట్ర, కచ్ తీరాలను దాటిందని భారత వాతావరణశాఖ వెల్లడించింది. బిపర్జోయ్ తుపాను గుజరాత్లో తీరం తాకిన తర్వాత అతి తీవ్రమైన కేటగిరి నుంచి తీవ్ర స్థాయికి తగ్గిందని ఐఎండీ పేర్కొంది. ప్రస్తుతం తుపాను సముద్రం నుంచి భూమి వైపు కదిలిందని సౌరాష్ట్ర-కచ్ వైపు కేంద్రీకృతమై ఉందని తెలిపింది. బిపర్జోయ్ తీవ్రత 105-115 కి.మీ.కి తగ్గిందని పేర్కొంది. గుజరాత్ విధ్వంసం తర్వాత తుపాన్ రాజస్థాన్‌కు మళ్లిందని ఐఎండీ డైరెక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. రాజస్థాన్ మీదుగా తుపాను బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపారు . ఇది వాయువ్య దిశగా కదులుతున్నందున జూన్ 16, 17 తేదీల్లో రాజస్థాన్‌లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. చదవండి: గుజరాత్‌లోని కఛ్, సౌరాష్ట్ర తీర ప్రాంతాల్లో కుంభవృష్టి కాగా తుపాను సృష్టించిన విలయానికి ఇప్పటి వరకు 22 మంది గాయపడ్డారని, 23 జంతువులు చనిపోయాయని గుజరాత్ రిలీఫ్ కమిషనర్ అలోక్ పాండే తెలిపారు. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాల కారణంగా పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, 524 చెట్లు నేలకొరిగాయని తెలిపారు. దాదాపు 940 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. అయితే భావ్‌నగర్ జిల్లాలో చిక్కుకున్న మేకలను రక్షించే ప్రయత్నంలో పశువుల యజమాని, అతని కుమారుడు మరణించినట్లు పీటీఐ పేర్కొంది. #WATCH | Gujarat: Trees uprooted and property damaged in Naliya amid strong winds of cyclone 'Biparjoy' pic.twitter.com/d0C1NbOkXQ — ANI (@ANI) June 16, 2023 తుపాను నేపథ్యంలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్ సహా అన్ని సాయుధ బలగాలు గుజరాత్ స్థానిక ప్రజలకు సహాయం అందించడానికి సన్నద్ధం చేశాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. 15 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 12 రాష్ట్ర విపత్తు స్పందన దళాలు, భారత వాయు సేన, నేవీ, ఆర్మీ బలగాలు, తీరగస్తీ దళాలు, బీఎస్ఎఫ్ సిబ్బంది తుపాను సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారని పేర్కొంది. తీర ప్రాంతాలకు చెందిన లక్ష మందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపింది. ఇదిలా ఉండగా వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాజస్తాన్‌లోని పలు ప్రాంతాలకు సైతం రెడ్ అలర్ట్ ప్రకటించింది. అదే విధంగా బిపర్జోయ్ తుపాను కారణంగా శుక్రవారం పలు రైళ్లను రద్దు చేసినట్లు పశ్చిమ రైల్వే ప్రకటించింది. తుఫాను పీడిత ప్రాంతాలలో ముందుజాగ్రత్త చర్యగా పలు రైళ్లను పూర్తిగా రద్దు చేయగా, మరికొన్నింటిని ఆసల్యంగా నడుపుతున్నట్లు పేర్కొంది. రద్దైన రైళ్ల జాబితా #WRUpdates #CycloneBiparjoyUpdate For the kind attention of passengers. The following trains of 16/06/2023 have been Fully Cancelled/Short-Originate by WR as a precautionary measure in the cyclone-prone areas over Western Railway.@RailMinIndia pic.twitter.com/NcxSLeqK7a — Western Railway (@WesternRly) June 16, 2023 -
బిపర్‌జోయ్‌తో ఊహించని రేంజ్లో డ్యామేజ్!!
వింతగా మారిన అరేబియా సముద్ర వాతావరణం.. తీర ప్రాంత ప్రజల్ని బెంబేలెత్తిస్తోంది. బిపర్జోయ్ తుపాను విరుచుకుపడే నేపథ్యంలో.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, నేవీ, కోస్టల్‌గార్డు, ఆర్మీని మోహరింపజేసింది. సముద్ర తీరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నవాళ్లను ఖాళీ చేయిస్తున్నారు. దాదాపు 21 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే బిపర్జోయ్ కలిగించబోయే నష్టం మామూలుగా ఉండకపోవచ్చని అంటున్నారు భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర. తుపాను ఇప్పటికే బలహీనపడి చాలా తీవ్రమైన తుపానుగా మారిందని గుర్తు చేస్తున్నారాయన. గురువారం అది తీరం తాకే సమయంలో తీవ్ర స్థాయిలోనే నష్టం చేకూర్చే అవకాశం ఉందని చెబుతున్నారాయన. గురువారం కచ్, దేవ్‌భూమి ద్వారకా, జామ్‌నగర్, పోర్బందర్, రాజ్‌కోట్, జునాఘడ్, మోర్బీ జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, తీరానికి అదిచేరుకునే సమయానికి గంటకు 125 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో ఉంటుందని, భారీ వర్షం తో పాటు గంటకు 140 నుంచి 150 కిలోమీటర్ల వేగంగా ఈదరుగాలులు వీస్తాయని మహోపాత్ర వివరించారు. ఆ ప్రభావం చెట్లు నేలకొరిగే అవకాశం ఉన్నందునా.. అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల అధికారులను ఆయన హెచ్చరించారు. అలాగే పంట నష్టం కూడా తీవ్రంగా ఉండొచ్చని చెబుతున్నారు. తుపాను ప్రభావంతో సౌరాష్ట్ర, కచ్ కోస్టల్ ఏరియాల్లో ఆరు మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడతాయని చెప్పారాయన. కాబట్టి, ఆయా ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని చెబుతున్నారు. జూన్ 6వ తేదీ నుంచి బిపర్జోయ్ ఉదృతి కొనసాగుతోందని, ఆ మరుసటి నాటికే అది తీవ్ర రూపం దాల్చిందని, జూన్ 11 నాటికి మహోగ్ర రూపానికి చేరుకుందని, ఈ ఉదయానికి కాస్త బలహీనపడి తీవ్రమైందిగా మారిందని మహోపాత్ర తెలిపారు. మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ ఉదయం డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రిత్వ శాఖతో భేటీ అయ్యి.. తుపాను సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని యంత్రాంగాన్ని ఆదేశించారాయన. #CycloneBiparjoy moves menacingly towards Dwaraka, Jamnagar, Kutch in Gujarat at 135 kmph on Tuesday . At landfall on Thursday it may peak at 190kmph . pic.twitter.com/GxxevyPKlv — P.V.SIVAKUMAR #Amrit Kaal On 🇮🇳 (@PVSIVAKUMAR1) June 13, 2023 Live visuals from #Okha Port , Indian Coast Guard on Alert Okha IMD recorded 91mm #Rainfall between 8:30am-5:30pm#Gujarat #CycloneBiparjoy #CycloneBiparjoyUpdate #CycloneAlert #BiparjoyUpdate pic.twitter.com/Yt12KUKr2h — Siraj Noorani (@sirajnoorani) June 13, 2023 జూహూ బీచ్‌లో విషాదం ఇదిలా ఉంటే.. సైక్లోన్ బిపర్‌జోయ్‌తో పశ్చిమ రైల్వేలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 67 రైళ్లు ఇప్పటికే రద్దు అయ్యాయి. ముంబైలో భారీ వర్షం కురుస్తుండగా.. ఎయిర్‌పోర్టులోనూ గందరగోళం నెలకొంది. పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు జుహూ బీచ్‌లో విషాదం నెలకొంది. ఐదుగురు గల్లంతు కాగా.. అందులో నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. -
వచ్చే రెండ్రోజుల్లో తెలంగాణలో మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈనెల 7న ఇదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది క్రమంగా బలపడి ఈ నెల 8న తీవ్ర అల్పపీడనంగా ఆపై 8న వాయుగుండంగా మారే అవకాశముందని భారత వాతావరణ విభాగం పేర్కొంది. ఆ వాయుగుండం మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి ఉత్తర దిశగా పయనిస్తూ తుపానుగా మారే అవకాశం ఉందని బుధవారం వెల్లడించింది. దీని ప్రభావంతో రానున్న రెండ్రోజులు తెలంగాణవ్యాప్తంగా అక్కడక్కడా తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు రానున్న రెండ్రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని పేర్కొంది. -
AP: ఆ జిల్లాలకు అలర్ట్.. మూడు రోజుల పాటు భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం/సాక్షి నెట్వర్క్: ద్రోణులు, ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. ఇవి మరో మూడు రోజులపాటు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో శని, ఆది వారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రస్తుతం దక్షిణ తమిళనాడు నుంచి ఉత్తర కొంకణ్ వరకు రాయలసీమ, తెలంగాణ, విదర్భల మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. బంగ్లాదేశ్ పరిసరాల్లోని ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర కోస్తాంధ్ర వరకు విస్తరించిన మరో ద్రోణి శుక్రవారం బలహీనపడింది. వీటి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, యానాం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, ఎస్పీఎస్సార్ నెల్లూరు జిల్లాల్లో, ఆదివారం విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, యానాం, అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు కొన్నిచోట్ల పిడుగులకు ఆస్కారం ఉందని, గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. గడచిన 24 గంటల్లో త్రిపురాంతకం కోట (తిరుపతి)లో 7.3 సెంటీమీటర్లు, అడ్డతీగల (అల్లూరి సీతారామరాజు)లో 5, రేపల్లె (బాపట్ల)లో 4.8, పోతిరెడ్డిపాలెం (కృష్ణా)లో 4.7, ఎన్.కండ్రిగ (చిత్తూరు), గుడ్లదోన (ఎస్పీఎస్సార్)లో 3.8, శివరాంపురం (అన్నమయ్య)లో 3.7, గుంటూరు పశ్చిమలో 2.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో, నంద్యాల జిల్లాలో గురువారం రాత్రి, శుక్రవారం వడగండ్ల వర్షం కురిసింది. గురువారం రాత్రి పిడుగుల శబ్దాలకు శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఇద్దరు వృద్ధులు మృతిచెందారు. -
అబ్బా.. చలి చంపుతోంది!
సాక్షి, హైదరాబాద్/కోహీర్(జహీరాబాద్): రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతున్నాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. రెండ్రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ మేర తగ్గినట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండ్రోజులు రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని హెచ్చరించింది. ఈశాన్యం వైపు నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్న నేపథ్యంలో చలి తీవ్రత మరింత పెరుగుతుందని వెల్లడించింది. సోమవారం రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 4.6 డిగ్రీల సెల్సియస్‌గా నమో దైంది. రాష్టంలో ఈ సీజన్లో అత్యల్ప ఉష్ణోగ్రత ఇదేనని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొమురం భీమ్ జిల్లా సిర్పూర్(యు)లో 4.8 డిగ్రీలు రెండో అత్యల్ప ఉష్ణోగ్రత కాగా, రంగారెడ్డి జిల్లా తాళ్లపల్లి, వికారాబాద్ జిల్లా మర్పల్లి 5 డిగ్రీలతో మూడో స్థానంలో నిలిచాయి. చలి తీవ్రత పెరగడంతో ఉదయం 8 గంటల వరకు ప్రజలు బయటికి రాలేకపోతున్నారు. తెల్లవారుజామున, రాత్రి వేళల్లో ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో చలి నుంచి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యనిపుణులు సూచించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో... కనిష్ట ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోవడంతో గ్రేటర్ హైదరాబాద్ గజగజలాడుతోంది. సోమవారం తెల్లవారుజామున శివరాంపల్లిలో కనిష్టంగా 7.3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. కాగా నగరం మొత్తంగా సరాసరిన 11.3 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీచేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజలను అప్రమత్తం చేసింది. ఉదయం 10దాటినా తొలగని మంచు పాల్వంచ రూరల్: కొండలు, దట్టమైన అటవీ ప్రాంతాల సమీపాన ఉండే గ్రామాల్లో ఆదివాసీల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సాయంత్రం ఐదు గంటల నుంచే చలి మొదలవుతుండటం, ఉదయం 10 గంటల వరకూ మంచు తెరలు వీడకపోవడంతో రాత్రంతా నెగడు (చలిమంటలు) వద్దే గడుపుతున్నారు. పడుకునే సమయాన కూడా పక్కన నెగడుకు తోడు దుప్పట్లు కప్పుకుని నిద్రిస్తున్నారు. కొత్తగూడెం జిల్లాలోని చిరుతానిపాడులో, పెద్దకలశ, రాళ్లచెలక, బుసురాయి, ఎర్రబోరు తదితర గ్రామాల్లో ఇదే పరిస్థితి కనిపించింది. -
శీతల గాలులు.. వర్షాలపై ఐఎండీ అంచనాలు.. ఈసారి మరింత వణుకుడే!
సాక్షి, విశాఖపట్నం: ఈ ఏడాది శీతాకాలం ఎక్కువ ప్రభావం చూపనుంది. చలి గాలుల తీవ్రత ఎక్కువగా ఉండనుంది. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు దేశంలో శీతాకాలం ప్రభావంపై భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గురువారం అంచనాలను విడుదల చేసింది. ఈ శీతాకాలంలో ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణాది రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంకంటే తక్కువగా రికార్డవుతాయని అంచనా వేసింది. ఫలితంగా రాష్ట్రంలో ఈ మూడు నెలలు చలి ఒకింత ఎక్కువ ఉంటుందని పేర్కొంది. రానున్న రెండు నెలల్లో (డిసెంబర్, జనవరిల్లో) అప్పుడప్పుడు అతి శీతల గాలులకు ఆస్కారం ఉంది. గరిష్ట (పగటి) ఉష్ణోగ్రతలు సాధారణంకంటే తక్కువగా నమోదవుతాయని, అందువల్ల పగటి వేళ కూడా శీతల అనుభూతి ఉంటుందని ఐఎండీ అంచనా వేస్తోంది. సాధారణంగా నైరుతి రుతు పవనాల సీజనులో వర్షాలు సమృద్ధిగా కురిసినప్పుడు ఆ తర్వాత వచ్చే శీతాకాలంలో చలి ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది చలి తీవ్రత ఎక్కువగా ఉండటానికి కూడా ఇదే కారణమని వాతావరణ శాఖ రిటైర్డ్ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ చెప్పారు. ఈ సీజనులో రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలతో పోల్చుకుంటే ఉత్తరాంధ్ర, ఏజెన్సీ ప్రాంతాల్లో చలి ఎక్కువగా ఉంటుందని తెలిపారు. మరోవైపు అక్టోబర్ నెలతో మొదలైన ఈశాన్య రుతు పవనాల సీజను డిసెంబర్‌తో ముగియనుంది. ఈ నెలలో రాష్ట్రంలో సాధారణ వర్షాలకే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. 5న అల్పపీడనం! దక్షిణ అండమాన్ సముద్రంలో ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని ఈ నెల ఐదో తేదీన అల్పపీడనం ఏర్పడనుంది. అనంతరం అది పశ్చిమ వాయవ్య దిశగా కదిలి 48 గంటల్లో వాయుగుండంగా బలపడనుంది. 8వ తేదీకి తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు చేరుతుందని ఐఎండీ వెల్లడించింది. దీని ప్రభావం తమిళనాడు, పుదుచ్చేరిలపై అధికంగా, దక్షిణ కోస్తాంధ్రపై మోస్తరుగా ఉండే అవకాశముంది. వాయుగుండం ప్రభావంతో ఈనెల 6 నుంచి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంపైకి తూర్పు, ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. ఫలితంగా రానున్న రెండు రోజులు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉత్తర కోస్తాంధ్రలో మాత్రం పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. చదవండి: వద్దన్నా.. వినకుండా ఈవెంట్ బృందంతో వెళ్లి.. -
Telangana: చలి.. చలి!
సాక్షి, హైదరాబాద్: చలి పులి పంజా విసురుతోంది. రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పతనమవుతున్నాయి. నాలుగైదు రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. గురువారం నాటి ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే ఖమ్మంలో 33.4 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 11 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యింది. చాలాచోట్ల సాధా రణ ఉష్ణోగ్రతల కంటే 4 నుంచి 5 డిగ్రీల మేర తక్కువగా నమోదు కావడం రాష్ట్రంలో చలి తీవ్రతను స్పష్టం చేస్తోంది. రా నున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయని, తగు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతటా తక్కువే.. ప్రస్తుతం సీజన్లో నమోదు కావాల్సిన సాధారణ ఉష్ణోగ్రతల కంటే చాలా తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. సాధా రణ కనిష్ట ఉష్ణోగ్రతలతో పోలిస్తే గురు వారం హన్మకొండలో 4.4 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదైంది. మెదక్‌లో 4.9 డిగ్రీల సెల్సియస్, హైదరాబాద్‌లో 3.5 డిగ్రీల సెల్సియస్, నల్లగొండలో 3.3 డిగ్రీల సెల్సియస్ తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక నిజామాబాద్, అదిలాబాద్, రామగుండంలోనూ సాధారణం కంటే రెండు డిగ్రీల మేర తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యింది. జాగ్రత్తగా ఉండాలి.. రాష్ట్రానికి ఈశాన్య దిశ నుంచి తక్కువ ఎత్తు లో వేగంగా గాలులు వీస్తున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గడానికి తోడు ఈశాన్య దిశల నుంచి వచ్చే గాలులతో చలి తీవ్రత పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో వృద్ధులు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ సూచించింది. దూర ప్రయాణాలు చేసేవారు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు, హృద్రోగులు, గర్భిణులు, చిన్నపిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. -
గజగజ మొదలైంది! రాష్ట్రంలో ఒక్కసారిగా పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాత్రిపూట బయటికి రావాలంటే గజగజ వణికే పరిస్థితి ఉంది. రాష్ట్రంలో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. ఈనెల ప్రారంభం నుంచి శీతాకాలం ప్రారంభమైనప్పటికీ వరుస వర్షాలతో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో నమోదయ్యాయి. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పడుతుండటంతో చలి తీవ్రత పెరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలోపగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలోనే నమోదవుతుండగా.. రాత్రి ఉష్ణోగ్రతలు మాత్రం ఒక్కసారిగా పడిపోయి చలి తీవ్రత పెరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు ఒకట్రెండు చోట్ల మినహా మిగతా ప్రాంతాల్లో 20 డిగ్రీల సెల్సియస్‌లోపే నమోదవుతున్నాయి. రానున్న మూడు రోజులు కూడా ఇదే తరహాలో వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సాధారణం కంటే తక్కువగా... బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నమోదైన గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... ఖమ్మంలో గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ కాగా, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 13.6 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రధాన కేంద్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ ఉష్ణోగ్రతలకు ఒక డిగ్రీ అటుఇటుగా నమోదుకాగా, కనిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణం కంటే భారీగా తగ్గాయి. హనుమకొండలో కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 4.2 డిగ్రీ సెల్సియస్ తక్కువగా నమోదైంది. హైదరాబాద్‌లో 5.6, మెదక్‌లో 5.4. నల్లగొండలో 3.6 డిగ్రీ సెల్సియస్ తక్కువగా నమోదయ్యాయి. 29 నుంచి ‘ఈశాన్య’ వర్షాలు నైరుతి రుతుపవనాలు దాదాపు దేశమంతటా ఉపసంహరణ అయినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఈశాన్య రుతుపవనాలు రెండు మూడు రోజుల్లో ప్రవేశించే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. ఈనెల 29న బంగాళాఖాతం మీద, దక్షిణ ద్వీపకల్ప భారతదేశం మీదుగా ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్లు భావిస్తోంది. వీటి ప్రభావంతో ఆగ్నేయ ద్వీపకల్ప భారతంలో ఈనెల 29 నుంచి ఈశాన్య రుతుపవన వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణమే ఉంటుందని చెబుతున్నారు. రాష్ట్రానికి ఈశాన్య, తూర్పు దిశల నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అక్కడక్కడా తేలికపాటి వర్షాలు తప్ప ఎలాంటి హెచ్చరికలు లేవని చెప్పింది. -
మూడురోజుల్లో నైరుతి రుతుపవనాల ఉపసంహరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి నైరుతి రుతుప వనాల ఉపసంహరణ పూర్తికాగా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాలతోపాటు బిహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల నుంచి కూడా రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోంది. రానున్న మూడురోజులు మెజార్టీ ప్రాంతాల నుంచి రుతుపవనాల తిరోగమన ప్రక్రియ పూర్తయ్యేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. పశ్చిమ, మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు తెలిపింది. ఇది సముద్రమట్టం నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తువరకు విస్తరించి ఉన్నట్లు పేర్కొంది. ఈ నెల 18న ఉత్తర అండమాన్, దాని పరిసర ప్రాంతాల్లో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. రానున్న రెండ్రోజులు ఆదిలాబాద్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబా బాద్, వరంగల్, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు నమోదు కావొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న రెండ్రోజులు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, ఉష్ణోగ్రతలు సాధారణస్థితిలోనే ఉంటాయని వివరించింది. -
రానున్న రెండ్రోజులు మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు (ఆది, సోమ) పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రానికి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్లు వెల్లడించింది. ఈ గాలుల ప్రభావంతో దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. -
మళ్లీ ముసిరిన వాన
సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్వర్క్: రాష్ట్రంపై వాన ముసురుకుంది. రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. పలుచోట్ల భారీ వర్షాలూ నమోదయ్యా యి. దసరా పండుగ రోజూ మధ్యాహ్నం నుంచి వాన ప్రతాపం చూపించింది. దీనితో సాధారణ జనజీవనం స్తంభించింది. ప్రజలు ఇళ్లకే పరిమి తమయ్యారు. నైరుతి సీజన్ ముగిసి ఈశాన్య రుతుపవనా ల సీజన్ మొదలైనా.. రాష్ట్రంపై నైరుతి రుతుపవనాల ప్రభావం ఇంకా కొనసా గుతోందని వాతావరణ నిపుణు లు తెలిపారు. దీనికితోడు ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నట్టు వెల్లడించారు. బుధవారం మధ్యా హ్నం మొదలైన వాన లు మధ్యలో కాస్త తెరిపినిస్తూ.. గురువారం రాత్రి వరకు కొనసాగాయి. రంగారెడ్డి జిల్లా ఆమన్‌గల్‌లో అత్యధికంగా 12.18 సెంటీమీటర్లు, చుక్కాపూర్లో 11.70 సెంటీమీటర్లు వర్షపాతం నమోంది. రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట్ జిల్లాలతోపాటు గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో చాలాచోట్ల భారీ వర్షం పడింది. హిమాయత్‌సాగర్‌కు ఇన్‌ఫ్లో పెరగడంతో రెండు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఉస్మాన్‌సాగర్ (గండిపేట)కు వరద వస్తోంది. పాలమూరులోని రాయచూర్ రహదారిపై వర్షపునీటిలో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు తడిసిముద్దయిన పాలమూరు కుండపోత వానలతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో తడిసి ముద్దయింది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో ఇళ్లు నీట మునిగాయి, రోడ్లపై భారీగా వరద నిలిచింది. బండర్‌పల్లి వాగు పొంగడంతో మహబూబ్ నగర్–రాయచూర్ ప్రధాన రహదారి భారీగా వరద చేరింది. జిల్లావ్యాప్తంగా సగటున 3.13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో వందల ఎకరాల పంటలు నీటమునిగాయి. ఇక నాగర్‌కర్నూల్ జిల్లాలో దుందుభి, నల్లవాగు, పెద్దవాగు ప్రమాదకర స్థాయిలో పారు తున్నాయి. భారీగా పంటలకు నష్టం జరిగింది. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం దొడగుంటపల్లి చెరువుకు గండిపడింది. మంత్రి నిరంజన్‌రెడ్డి నీట మునిగిన పంటలు, లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. ధారూరు మండలం నాగారం వాగులో కొట్టుకుపోయిన కారు వికారాబాద్‌లో కుండపోత వికారాబాద్ జిల్లాలో బుధవారం రాత్రి మొదలైన వాన గురువారం రాత్రివరకు కురుస్తూనే ఉంది. దీనితో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొడంగల్‌లో చెరువు కట్ట తెగిపోవడంతో కుమ్మరి గేరి, బాలాజీనగర్ కాలనీలు నీట మునిగాయి. మరికొన్నిచోట్ల లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. మూసీ, కాగ్నా, వాటి ఉప నదులు ఉప్పొంగుతున్నాయి. ధారూరు మండలం నాగరం సమీపంలోని వాగులో ఓ కారు కొట్టుకుపోయింది. కొంతదూరంలో కారు చెట్టుకు తట్టుకోవటంతో అందులోని ఇద్దరు చెట్లకొమ్మలు పట్టుకుని బయటపడ్డారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం జీవన్గీలో మహాదేవలింగేశ్వర స్వామి ఆలయం నీట మునిగింది. వికారాబాద్ జిల్లా జీవన్గీలో మహాదేవలింగేశ్వర స్వామి ఆలయాన్ని చుట్టుముట్టిన కాగ్నానది ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ.. రెండు రోజులుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ భారీ వర్షాలు కురిశాయి. దసరా వేడుకలకు ఇబ్బంది ఎదురైంది. మధిరలో రైల్వే అండర్ బ్రిడ్జి నుంచి వరద ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఏన్కూరు, సత్తు పల్లి, నేలకొండపల్లి మండలాల్లోనూ రహదారులపై వరద పారింది. వర్షాలతో పత్తి, మిర్చి పంటలకు నష్టం వాటి ల్లుతోందని రైతులు వాపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోనూ చాలా ప్రాంతాల్లో వానలు పడ్డాయి. వాన ధాటికి కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రానికి చెందిన సగ్గిల శ్రీనివాస్ ఇల్లు కూలిపోయింది. మరో 2 రోజులూ వానలు కోస్తాంధ్ర నుంచి తెలంగాణ, విదర్భ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని.. దీని ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా మరో రెండు రోజులు వానలు కురుస్తాయ ని వాతావరణ శాఖ తెలిపింది. వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు.. నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేట, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. -
బలహీనపడ్డ తీవ్ర వాయుగుండం!
సాక్షి, హైదరాబాద్: బంగాళాఖాతంలో కొనసాగిన తీవ్ర వాయుగుండం ఆదివారం ఉదయం బలహీనపడింది. ప్రస్తుతం తెలంగాణ నుంచి దూరంగా వెళ్లడంతో రాష్ట్రానికి ప్రస్తుతం ఎలాంటి హెచ్చరికలు లేవని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రానికి పశ్చిమ, వాయవ్య దిశల నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో రానున్న రెండ్రోజులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని సూచించింది. ఇక రానున్న 48 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెల్సియస్ నుంచి 23 డిగ్రీల సెల్సియస్ మధ్యన ఉంటాయని అంచనా వేసింది. -
రెండ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శుక్రవారం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది క్రమంగా పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గురువారం ఏర్పడిన అల్పపీడనం.. సాయంత్రానికి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది శుక్రవారం ఉదయం వాయుగుండంగా మారి.. అనంతరం ఆరుగంటల తర్వాత బలపడి తీవ్ర వాయుగుండంగా మార్పు చెందింది. ఇది శనివారం ఉదయం కల్లా తీరం దాటే అవకాశంఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. కుమ్రుంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని వెల్లడించింది. అప్రమత్తంగా ఉండాలి.. ఇప్పటివరకు కురిసిన వర్షాలతో రాష్ట్రంలో చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో వర్షాలు కురిస్తే జనజీవనం అస్తవ్యస్తం అవుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈక్రమంలో అధికారయంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వరదలతో కలిగే నష్టాన్ని ముందస్తుగా అంచనా వేసి నివారణ చర్యలు చేపట్టాలని సూచించింది. నైరుతి రుతుపవనాలు జూన్ మొదటి వారంలో ప్రారంభం కాగా... జూలై నుంచి రాష్ట్రంలో భారీ వర్షపాతం నమోదైంది. కేవలం రుతుపవనాల ప్రభావంతో ఈ వర్షాలు రికార్డు స్థాయిలో కురిశాయి. ఈక్రమంలో జూలై ఆఖరు నాటికే రాష్ట్రంలో సీజన్ సగటు వర్షపాతం నమోదైంది. ప్రస్తుత నైరుతి సీజన్లో ఈనెల 19 నాటికి 51.5 సెం.మీ. వర్షపాతంనమోదు కావాల్సిఉండగా, 83.23 సెం.మీ. నమోదైంది. సాధారణ వర్షపాతం కంటే 62 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. -
19న బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, హైదరాబాద్: ఉత్తర బంగాళాఖాతంలో ఈనెల 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తదుపరి 24 గంటల్లో ఈ తుపాను బలపడనున్నట్లు అంచనా వేసింది. రాష్ట్రంలో రానున్న మూడు రోజులు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమ మీదుగా కొనసాగుతున్న ఉపరితల ద్రోణి బుధవారం బలహీనపడింది. రాష్ట్రానికి నైరుతి దిశ నుంచి బలమైన గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాల సీజన్లో రాష్ట్రంలో ఇప్పటివరకు 49.92 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావలసిఉండగా, బుధవారం ఉదయం 8.30 గంటల వరకు 83 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం కంటే 66 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు రాష్ట్ర ప్రణాళిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలోని 27 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, 6 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. -
Telangana Rain Alert: రానున్న మూడురోజులు అతిభారీ వర్షాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న మూడురోజులు అక్కడక్కడ అతిభారీ వర్షాలు నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తు తం రాష్ట్రంపై ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. ఈ ద్రోణి బికనీర్, కోటా, రైసెన్, రాయ్‌పూర్, దిఘా మీదుగా ఆగ్నేయ దిశ నుంచి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ఉంది. ఇది సముద్రమట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఉపరితల ద్రోణికి అనుబంధంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లోని ఆంధ్రప్రదేశ్ తీరం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్రమట్టానికి సగటున 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు వివరించింది. ఉపరితల ద్రోణి, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో తెలంగాణలో గత రెండ్రోజులుగా భారీ వర్షా లు నమోదవుతుండగా.. రానున్న మూడు రోజులు పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, అక్కడక్కడ అతి భారీ వర్షాలు నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం.. వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నైరుతి సీజన్ ప్రారంభమైన తర్వాత తొలిసారిగా వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్టు తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు మరింత జోరందుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఈనెల రెండో వారంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి, అతిభారీ, అత్యంత భారీ వర్షాలు నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రస్తుతం నైరుతి సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 40.42 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. శుక్రవారం ఉదయానికి 74.28 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సగటు సాధారణ వర్షపాతం కంటే 84 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. ఇక నైరుతి సీజన్ పూర్తయ్యే నాటికి రాష్ట్రవ్యాప్తంగా 72.5 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఇప్పటికే అంతకు మించి వర్షపాతం నమోదు అయింది. ఈ నేపథ్యంలో సీజన్ ముగిసే నాటికి రికార్డు స్థాయిలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. -
మూడు రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాగల మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయని వెల్లడించింది. చాలాచోట్ల వచ్చే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర – దక్షిణ ద్రోణి మంగళవారం దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుండి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడుల మీదుగా కొమరం ప్రదేశం వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద స్థిరంగా కొనసాగుతుంది. తమిళనాడు కోస్తాతీరం, పరిసర ప్రాంతాల్లోని ఆవర్తనం, మంగళవారం ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరంలోని పశ్చిమ మధ్య, పరిసర ప్రాంతాల్లోని నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతూ సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా, రాష్ట్రంలో మంగళవారం రంగారెడ్డి జిల్లా మంగళపల్లెలో 12.5 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. యాదాద్రి భువనగిరి జిల్లా తూఫ్రాన్‌పేటలో 8.3 సెంటీమీటర్లు, కందువాడలో 7.5 సెంటీమీటర్లు, ఇల్లెందులో 7.4 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. -
మరో రెండ్రోజులు మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుంచి దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, ఇంటీరియర్ తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉంది. మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది -
నగరాన్ని మూసింది
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరాన్ని వాన కష్టాలు వీడటంలేదు. మూసీ నది ఉగ్రరూపం దా ల్చడంతో దాని పరీవాహక ప్రాంతాలతో పాటు నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో చేరిన వరదనీ టిని తొలగించేందుకు జీహెచ్ఎంసీ, జలమండలి అత్యవసర బృందాలు శ్రమిస్తున్నాయి. బుధవా రం సుమారు 200కు పైగా బస్తీల్లో వరదనీరు చేరింది. మూసీ ఉధృతి కారణంగా చాదర్ ఘాట్ చిన్న బ్రిడ్జి, మూసారాంబాగ్ ప్రాంతాల్లో నదిపై ఉన్న వంతెనల పైనుంచి వరద నీరు ఉప్పొంగింది. దీంతో ఆయా మార్గాల్లో పలు బ్రిడ్జిలను మూసివేశారు. ఫలితంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దారులు మూసుకు పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముంచెత్తిన వరద.. బుధవారం గండిపేట్ జలాశయానికి సంబంధించి 13 గేట్లు, హిమాయత్‌సాగర్‌లో 8 గేట్లను ఎత్తివేశా రు. దీంతో మూసీలో వరదనీటి ఉధృతి అనూహ్యంగా పెరిగింది. హైదరాబాద్‌లో మూసీ ప్రవహించే బాపూఘాట్–ప్రతాపసింగారం (44 కి.మీ) మార్గంలో మునుపెన్నడూ లేనివిధంగా వరద ముంచెత్తింది. అలాగే మూసానగర్, కమలానగర్ పరిసరాలను వరదనీరు చుట్టేసింది. అంబర్పేట్, మలక్‌పేట్, చాదర్‌ఘాట్ పరిసరాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. వివిధ ప్రాంతాల నుంచి సు మారు 2 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. వచ్చే 24 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షం బుధవారం రాత్రి 7 గంటల వరకు నగరంలో పలుచోట్ల 5 నుంచి 8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. రాగల 24 గంటల్లో హైదరాబాద్‌లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు బేగంపేటలోని వాతావరణ శాఖ తెలిపింది. కాగా ఎడ తెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఉస్మాన్‌సాగర్ (గండిపేట), హిమాయత్ సాగర్ జలాశయాలు నిండుకుండల్లా మారాయి. మూసీ ప్రాజెక్టు ఎనిమిది గేట్లు ఎత్తివేత కేతేపల్లి: నల్లగొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరదనీరు పోటెత్తింది. దీంతో బుధవారం రాత్రి ఎనిమిది క్రస్ట్ గేట్లను రెండు అడుగులు పైకెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం 636.80 అడుగుల వద్ద ఉంది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో హిమాయత్‌సాగర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తారు. అక్కడి నుంచి వచ్చే వరదనీరు బుధవారం రాత్రి మూసీ రిజర్వాయర్‌కు చేరుకుంది. -
Telangana: నేడు, రేపు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంపై ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్రమట్టం నుంచి 4.5 కి.మీ. నుంచి 5.8 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి స్థిరంగా కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పలుచోట్ల కురిసే అవకాశముందని తెలిపింది. బుధవారం తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో నమోదయ్యాయని పేర్కొంది. ఖమ్మంలో గరిష్ట ఉష్ణోగ్రత 34.5 డిగ్రీల సెల్సియస్, మెదక్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 22.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. రానున్న రెండ్రోజులు సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. -
బలహీనపడిన అల్పపీడనం
సాక్షి, హైదరాబాద్: అల్పపీడనం మంగళవారం బలహీన పడింది. ద్రోణి సగటు సముద్ర మట్టం మధ్య విస్తరించి ఉంది. దీంతో రాగల మూడు రోజులు తెలంగాణలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో కొత్తగూడెం, పాల్వంచలలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. జూలూరుపాడులో 4, అశ్వారావుపేట, బూర్గంపాడు, ఇల్లందు, టేకులపల్లి, వెంకటాపురాల్లో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. -
ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవాలి
సాక్షి, హైదరాబాద్: మరో రెండు మూడురోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అన్ని శాఖల అధికారులు ఇతర కార్యక్రమాలు రద్దు చేసుకుని క్షేత్ర స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని, అప్రమత్తతతో వ్యవహరించాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని సూచించారు. గోదావరి పరీవాహక ప్రాంతాలతో పాటు జీహెచ్ఎంసీ, మున్సిపల్ ప్రాంతాల పరిధిలో ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ బృందాలు, హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రగతి భవన్లో ఆదివారం నాటి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని సోమవారం కూడా సీఎం కొనసాగించారు. మంత్రులు, ప్రజాప్రతి నిధులతో ఫోన్లో మాట్లాడారు. వరద ముప్పు ఉన్న జిల్లాల అధికారులను అడిగి స్థానిక పరిస్థితులను తెలుసుకున్నారు. గోదావరి, ఉప నదుల్లో వరద పరిస్థితిపై ఆరా తీశారు. సమాచారాన్ని స్క్రీన్ మీద పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తగు సూచనలు చేశారు. గోదావరి వరదను ఎప్పటికప్పుడు దిగువకు వదలాలి.. మహారాష్ట్రలో, రాష్ట్రంలోని ఎగువ గోదావరి పరీవాహక ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఎస్సారెస్పీ తదితర రిజర్వాయర్లకు చేరుకునే వరదను ఎప్పటికప్పుడు కిందికి వదలాలని ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ రావుకు కేసీఆర్ సూచించారు. బ్యాక్ వాటర్‌తో ముంపునకు గురికాకుండా చూసుకోవాలన్నారు. మరో వారం పదిరోజుల పాటు వర్షాలు కొనసాగనున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అధికారులకు సహకరిస్తూ, స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించారు. పువ్వాడకు ఫోన్.. గడచిన రెండురోజుల్లో వర్షాలు, వరదల నుంచి ప్రజలను కాపాడేందుకు చేపట్టిన రక్షణ చర్యలను సీఎం కేసీఆర్‌కు అధికారులు వివరించారు. నిజామాబాద్, ములుగు, రామన్నగూడెం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని, అయినా పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు. దీంతో అవసరమైన చోట తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చి మూడవ ప్రమాద హెచ్చరిక ప్రకటించిన నేపథ్యంలో మంగళవారం కూడా భద్రాచలంలోనే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, భద్రాచలం పర్యటనలో వున్న స్థానిక మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను కేసీఆర్ ఫోన్లో ఆదేశించారు. అప్రమత్తంగా ఉండండి రెడ్ అలర్ట్ ప్రకటించిన వరంగల్, నల్లగొండ, సూర్యాపేట, తుంగతుర్తి, మహబూబాబాద్, జనగాం తదితర ప్రాంతాల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని, ఆ ప్రాంతాలను విడిచి వెళ్లొద్దని ముఖ్యమంత్రి ఆదేశించారు. అన్ని శాఖల అధికారులతో సమీక్షించుకుంటూ తగు చర్యలు తీసుకోవాలని మంత్రి జగదీశ్‌రెడ్డికి సూచించారు. గోదావరి వరదల నేపథ్యంలో నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉంచాలని, స్థానిక మంత్రులు ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డిలకు చెప్పారు. -
జర పైలం.. రెండ్రోజులు.. జోరు వాన!
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండటం, దానికి తోడుగా ఉపరితల ఆవర్తనంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో పలుచోట్ల కుండపోత వాన పడింది. వాగులు వంకలు ఉప్పొంగాయి. కాలనీలు నీట మునిగాయి. రహదారులపైకి నీళ్లు చేరాయి. ఇలాగే మరో రెండు రోజులపాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. తొమ్మిది జిల్లాల్లో కుండపోత వానలు పడతాయని, మరో 11 జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. సాధారణం కంటే ఎక్కువగా.. వానాకాలం సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 18.03 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. శుక్రవారం సాయంత్రానికల్లా 26.57 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇది సాధారణం కంటే 47 శాతం అధికమని వాతావరణ శాఖ పేర్కొంది. 10 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, 20 జిల్లాల్లో అధిక వర్షపాతం, 3 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్టు తెలిపింది. ఆనందంలో రైతాంగం జోరుగా వానలు కురుస్తుండటంతో రైతుల్లో ఆనందం కనిపిస్తోంది. ఇప్పటికే దుక్కి దున్నిన రైతులు విత్తనాలు వేయడం, నారు మడులు సిద్ధం చేసుకోవడం మొదలుపెట్టారు. ఉద్యాన పంటల సాగు సైతం ఊపందుకుంది. కూరగాయలకు మార్కెట్లో డిమాండ్ ఉన్న నేపథ్యంలో వాటి సాగువైపు రైతులు ఉత్సాహం చూపుతున్నారు. బాగా తగ్గిన ఉష్ణోగ్రతలు రెండు రోజులుగా మబ్బు పట్టే ఉండటం, విస్తారంగా వానలు పడుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయాయి. సగటు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగైదు డిగ్రీల మేర తక్కువగా నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాత్రి ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గి చలివేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. బొగత జలపాతం పరవళ్లు నల్లవాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలో బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. జలపాతాన్ని చూసేందుకు స్థానికులు పోటెత్తారు. నీటిలో చిక్కుకున్న స్కూల్ బస్సు ►మహబూబ్‌నగర్ రూరల్ మండలం బొక్కలోనిపల్లి గ్రామ శివార్లలో ఉన్న ఓ ప్రైవేటు స్కూల్ బస్సు.. శుక్రవారం ఉదయం కోయిలకొండ మండలం కేశ్వాపూర్, పెర్సివీడు, మణికొండ, రామచంద్రాపూర్, మాచన్‌పల్లి, సూగురుగడ్డ తండాలలో విద్యార్థులను ఎక్కించుకుంది. మాచన్‌పల్లి– కోడూర్ స్టేజీ మధ్య రైల్వే అండర్ పాస్ కింద భారీగా వరద నీరు నిలిచి ఉండగా.. డ్రైవర్ గమనించకుండా బస్సును ముందుకు పోనిచ్చాడు. మధ్యలోకి వెళ్లేసరికి బస్సు నీటిలో చిక్కుకుపోయింది. అందులో ఉన్న విద్యార్థులంతా నర్సరీ నుంచి ఐదో తరగతిలోపు చిన్నారులే కావడం, అంతా భయంతో అరవడంతో.. సమీపంలో ఉన్న యువకులు వచ్చి కాపాడారు. ఒక్కొక్కరుగా 30 మంది విద్యార్థులను బయటికి తీసుకొచ్చారు. ఆర్టీఏ, పోలీస్, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. – మహబూబ్‌నగర్ రూరల్ టార్చిలైట్ వెలుతురులో గర్భిణికి ప్రసవం.. ►భారీ వర్షం కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో.. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం అడవిమల్లెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తీవ్ర ఇబ్బంది ఎదురైంది. ఇక్కడి ఎడ్లబంజరు గ్రామానికి చెందిన దుర్గాభవానికి పురుటి నొప్పులు రావడంతో వైద్యులు టార్చిలైట్, సెల్‌ఫోన్ లైట్ల వెలుతురులో ప్రసవం చేశారు. విద్యార్థులకు ‘వరద’కష్టం! ►కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి మండలం దిందా గ్రామ విద్యార్థుల గోస ఇది. ఉదయం పొరుగూరిలోని బడికి వెళ్లిన విద్యార్థులు.. సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఇలా వాగు పొంగి ప్రవహిస్తోంది. గ్రామస్తులు అక్కడికి చేరుకుని విద్యార్థులను మెల్లగా వాగు దాటించారు. నల్లగొండ, ఖమ్మం ఆగమాగం నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండడంతో రాష్ట్రమంతటా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో కుండపోత వాన కురిసింది. చాలా చోట్ల గురువారం అర్ధరాత్రి నుంచే మొదలైన వాన శుక్రవారం అర్ధరాత్రి దాటినా కురుస్తూనే ఉంది. రహదారులపై నీరు పారుతుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ►సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలంలో అత్యధికంగా 19.04 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సూర్యాపేట పట్టణంలో మానస నగర్, వినాయకనగర్ తదితర ప్రాంతాలు నీటమునిగాయి. మద్దిరాల మండలం ముకుందాపురంలో వర్షానికి ఒక ఇల్లు కూలింది. నల్లగొండలో పానగల్ బైపాస్ రోడ్డు చెరువులా మారింది. నకిరేకల్‌లో పలు కాలనీలో జలమయం అయ్యాయి. ►ఖమ్మం ఉమ్మడి జిల్లా పరిధిలో చాలా చోట్ల వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దాంతో అధికారులు ఆయా మార్గాల్లో రాకపోకలను నిలిపివేశారు. మాటూరు సమీపంలో నిర్మాణంలోని బ్రిడ్జి వద్ద డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోవడంతో ఆరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 20.3 అడుగులకు పెరిగింది. కిన్నెరసాని, తాలిపేరు జలాశయాలకు భారీగా వరద వస్తుండటంతో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. మణుగూరు మండలం కూనవరం రైల్వేగేట్ సమీపంలోని కోడిపుంజు వాగులో వర్సా శంకర్ అనే వ్యక్తి కొట్టుకుపోయాడు. భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం మండలం నడిగడ్డకు చెందిన గిరిజన మహిళ ఏనిక దుర్గమ్మ (55) గుబ్బలమంగి వాగులో గల్లంతయ్యారు. ఇదే జిల్లా పాల్వంచ మండలం దంతెలబోరుకు చెందిన బొదా నర్సిరెడ్డి పాడి గేదెల కోసం వెళ్లి కిన్నెరసాని నది మధ్యలో చిక్కుకుపోయాడు. అధికారులు, అగ్నిమాపక సిబ్బంది ఆయనను రక్షించారు. నర్సిరెడ్డిని కాపాడుతున్న అగ్నిమాపక సిబ్బంది ►మహబూబాబాద్ జిల్లాలో మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పాకాల ఏరు చెక్‌డ్యాంపై నుంచి వరద పొంగిపొర్లుతోంది. చిన్నగూడూరు మండలంలోని పలు ఇళ్లు జలమయం అయ్యాయి. -
Telangana: రెండు రోజులు భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశంఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. ఈ మేరకు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. ఉత్తర మధ్య మహారాష్ట్ర నుంచి అంతర్గత తమిళనాడు వరకు కేంద్రీకృతమై ఉన్న ఉపరితల ద్రోణి ఆదివారం విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ, అంతర్గత తమిళనాడు మీదుగా దక్షిణ తమిళనాడు వరకు విస్తరించింది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం వల్ల రానున్న రెండు రోజులు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఒకట్రెండు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ వివరించింది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 3.4 మిల్లీమీటర్ల వర్షపా తం నమోదైంది. వానాకాలం సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 19వ తేదీ నాటికి 8.28 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 5.76 సెంటీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. రాష్ట్రంలోని 2 జిల్లాల్లో అత్యంత లోటు వర్షపాతం ఉండగా... మరో 20 జిల్లాల్లో లోటు వర్షపాతం ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది. 7 జిల్లాల్లో సాధారణ, 2 జిల్లాల్లో అధికం, మరో రెండు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం రుతుపవనాలు రాష్ట్రమంతటా వ్యాప్తి చెందుతుండటంతో త్వరలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. -
రాష్ట్రానికి నైరుతి..
సాక్షి, హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు సోమవారం రాష్ట్రాన్ని తాకనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రానికి పశ్చిమ దిశ నుంచి వీస్తున్న గాలు లు, ఇతర వాతావరణ పరిస్థితులు అనుకూ లంగా ఉండటంతో నైరుతి రుతుపవనాలు చురుకుగా వ్యాప్తి చెందే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. పరిస్థితు లు ఇలాగే కొనసాగితే రానున్న మూడు, నాలు గు రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించే అవకాశం ఉందని నిపుణులు చెబు తున్నారు. సోమవారం మధ్యాహ్నం కల్లా నైరు తి రుతుపవనాలు ఉత్తర అరేబియా సము ద్రంలోని కొన్ని ప్రాంతాలు, కొంకణ్‌లోని మిగి లిన భాగాలు, గుజరాత్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు, మధ్య మహారాష్ట్రలోని చాలా ప్రాంతాలు, మొత్తం కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, ఆంధ్ర ప్రదేశ్ పశ్చిమ, మధ్య, వాయవ్య బంగాళా ఖాతం ప్రాంతాల్లో ముందుకు సాగనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కాగా, ఈశాన్య బంగాళాఖాతం నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో చాలాచోట్ల ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. -
వడగాడ్పులు.. రెండ్రోజుల్లో రుతుపవనాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ రుతుపవనాలు రాకపోవడంతో వారం రోజులుగా రాష్ట్రంలో ఎండలు మండిపోయాయి. శనివారం రాష్ట్రంలోని పలు చోట్ల సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువ నమోదైనప్పటికీ... గత నాలుగు రోజుల ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే తక్కువగా నమోదయ్యాయి. శనివారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 41.6 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 24 డిగ్రీ సెల్సియస్‌గా నమోదయ్యాయి. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రెండ్రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రాక నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సము ద్రంలోని చాలా భాగాలు, కొంకణ్‌లోని చాలా ప్రాంతాలు (ముంబైతో సహా), మధ్య మహా రాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలలోకి ప్రవేశించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 48 గంటల్లో తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ, మధ్య, వాయవ్య బం గాళాఖాతంలో రుతుపవనాలు మరింత ముం దుకు సాగడానికి అనుకూల పరిస్థితులున్నట్లు వివరించింది. ప్రస్తుతం రాష్ట్రానికి పశ్చిమ దిశ నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్న కారణంగా రాష్ట్రంలోని నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడా ఆదివారం వడగాడ్పులు వీచే అవకాశం ఉందని సూచించింది. -
అగ్ని‘గుండం’.. రామగుండంలో 44.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం మంగళవారం మండిపోయింది. అత్యధికంగా రామగుండంలో 44.8డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్‌లో 43.8డిగ్రీలు నమోదైంది. ఇతర ప్రాంతాల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణల మీదుగా రాయలసీమ వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీంతో బుధ, గురువారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే రాగల మూడు రోజులు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. -
రాష్ట్రంలో తగ్గిన ఉష్ణోగ్రతలు
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గాయి. గత రెండ్రోజులుగా కొనసాగిన భగభగలు శనివారం నాటికి కాస్త చల్లబడ్డాయి. కొన్నిచోట్ల గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు పైగా నమోదు కాగా, మరికొన్ని చోట్ల మాత్రం 40 డిగ్రీల కంటే తక్కువగా నమోదైంది. మరో రెండ్రోజుల తర్వాత వాతావరణం ఇంకా చల్లబడనుంది. రామగుండంలో 44.4 డిగ్రీల సెల్సియల గరిష్ట ఉష్ణోగ్రత న మోదుకాగా, హైదరాబాద్‌లో 24.0 డిగ్రీల సెల్సియస్‌ల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది.ప్రస్తుతం రాష్ట్రానికి పశ్చిమ, వాయవ్య దిశల నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీ స్తున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. రానున్న రెం డ్రోజులు రాష్ట్రంలోని ఒకట్రెండు జిల్లాల్లో అక్క డక్క డా వానలు కురిసే అవకాశం ఉందని వివరించింది. -
మరో రెండ్రోజులు భగభగలే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 3డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండ్రోజులు ఇదేస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు వెల్లడించింది. కాగా, నైరుతి రుతుపవనాలు వాయవ్య బంగాళాఖాతం లోని కొన్ని ప్రాంతాలు, ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్‌లోని అనేక ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. -
Telangana: తేలికపాటి వానలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో రాగల 48గంటల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కర్ణాటక నుంచి దక్షిణ తమిళనాడు వరకు కొనసాగుతున్న ఉపరితల ద్రోణి... సముద్రమట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద స్థిరంగా ఉన్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. నైరుతి అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతం, దక్షిణ బంగాళాఖాతం లోని మరికొన్ని ప్రాంతాలలోకి నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు వ్యాపించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో గురువారం నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత రామగుండంలో 41.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత దుండిగల్‌లో 25 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, కొన్నిచోట్ల సాధారణం కంటే ఒకట్రెండు డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. -
వాన లెక్క తేల్చే మాస్టారు
..::కంచర్ల యాదగిరిరెడ్డి ఈ ఏడాది రుతుపవనాలు గతంకంటే ముందే పలకరిస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తాజాగా ప్రకటించడం తెలిసిందే. రుతుపవనాల రాకకు అనుకూలంగా పరిస్థితులు ఉన్నందున మునుపటి కంటే వేగంగానే రుతుపవనాలు విస్తరిస్తాయని ఐఎండీ పేర్కొంది. ఇక్కడి దాకా బాగానే ఉంది కానీ... దేశంలో కోట్ల మంది రైతులతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన నైరుతి రుతుపవనాలను ఐఎండీ ఎలా అంచనా వేస్తుందో మీరెప్పుడైనా ఆలోచించారా? ఆసక్తికరమైన ఈ సమాచారం మీ కోసమే... దేశ ఆర్థిక రంగానికి దిక్సూచి... నైరుతి రుతుపవనాలు ఈ దేశానికి ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సకాలంలో వచ్చే వానలే దేశం ఆర్థికంగా, సామాజికంగా బలపడేందుకు అత్యంత కీలకం. ఇందులో ఏమాత్రం హెచ్చుతగ్గులు వచ్చినా కోట్ల మంది రైతులు, రైతు కూలీలకు పస్తులే మిగులుతాయి. ఈ పరిణామం దేశ ఆర్థిక వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇంత ముఖ్యమైన వ్యవహారం కాబట్టే భారత వాతావరణ విభాగం రుతుపవనాల ముందస్తు అంచనాకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటుంది. ఏటా ఏప్రిల్‌లో ఒకసారి, ఆ తరువాత రుతుపవనాల రాకకు ముందు, రుతుపవనాల ఆగమనం తరువాత అంచనాలను ప్రకటిస్తుంది. లెక్కలోకి ఐదు అంశాలు... రుతుపవనాల అంచనాకు ‘ద ఎర్త్ సిస్టమ్ సైన్స్ ఆర్గనైజేషన్ (ఈఎస్ఎస్ఓ)తో కలసి భారత వాతావరణ విభాగం కనీసం 5 అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. అవి ఏమిటంటే... ►ఉత్తర అట్లాంటిక్, ఉత్తర పసిఫిక్ మహాసముద్ర భాగాల ఉపరితల ఉష్ణోగ్రతల గ్రేడియంట్ (మారే తీరు) ఒకటి. ఇందుకోసం గతేడాది డిసెంబర్, ఈ ఏడాది జనవరి నెలల్లోని లెక్కలను పరిగణనలోకి తీసుకుంటారు. ►హిందూ మహాసముద్రంలో ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఉపరితల ఉష్ణోగ్రతల వివరాలు. ►తూర్పు ఆసియా ప్రాంతంలో ఫిబ్రవరి, మార్చి నెలల్లోని సగటు సముద్రమట్ట పీడనం. ►వాయవ్య యూరప్ ప్రాంతంలో జనవరి నెలలో ఉండే ఉపరితల గాలి ఉష్ణోగ్రతలు. ►ఫిబ్రవరి, మార్చి నెలల్లో భూమధ్య రేఖ వెంబడి పసఫిక్ మహాసముద్రంలో నులివెచ్చటి నీటి పరిమాణం. వానలు సక్రమంగా పడాలంటే ఈ ఐదు అంశాలు సంతృప్తికరంగా ఉంటేనే సరిపోదు. వాటికి తోడుగా మరికొన్ని అంశాలూ సహకరించాలి. నైరుతి నుంచి మేఘాలతో వీచే గాలులే మన రుతుపవనాలన్నది తెలిసిన విషయమే. మరి ఈ గాలులకు కేంద్రం ఏమిటో తెలుసా? భారత్‌కు సుమారు 4 వేల కిలోమీటర్ల దూరంలో ఉండే మాస్కెరేన్ ద్వీప ప్రాంతం! హిందూ మహా సముద్రంలో మడగాస్కర్కు ఇది సమాంతరంగా ఉంటుంది. సాధారణంగా ఏప్రిల్ మధ్యలో అక్కడ అత్యధిక పీడనం ఏర్పడుతుంది. దీన్ని మాస్కెరేన్ హై అంటారు. ఈ పీడనం ఎంత ఎక్కువ ఉంటుందన్న అంశంపై మన రుతుపవనాల తీవ్రత ఆధారపడి ఉంటుంది. పీడనం ఎక్కువగా ఉంటే రుతుపవన గాలులూ బలంగా ఉంటాయి. మాస్కెరేన్ ద్వీపం ప్రాంతంలో అధిక పీడనం ఏర్పడటం ఆలస్యమైతే రుతుపవనాల రాక కూడా ఆలస్యమవుతుంది. ఎక్కడో అంటార్కిటికా ప్రాంతంలో జరిగే కొన్ని అంశాల ఆధారంగా ఈ మాస్కెరేన్ ద్వీపం వద్ద అధిక పీడనం ఏర్పడుతుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. దిశ మార్చుకొని.. మాస్కరేన్ ద్వీపం వద్ద అధిక పీడనంతో ఏర్పడే గాలులు వాయవ్య దిశగా కదిలి ఆఫ్రికాలోని సొమాలియా ప్రాంతాన్ని ఢీకొంటాయి. అక్కడి ఎత్తుపల్లాలు, స్థల ఆకృతి ఆధారంగా గాలులు తూర్పు వైపునకు కదులుతాయి. భూమధ్య రేఖను దాటాక భూభ్రమణం వల్ల కలిగే కొరియాలిస్ శక్తి ప్రభావానికి లోనవుతాయి. దీని ప్రభావం వల్ల గాలులు దిశ మార్చుకొని నైరుతి దిక్కుగా కదులుతాయి. ఈ గాలుల్లో ఒక భాగం అరేబియా సముద్రం వైపు, ఇంకో భాగం బంగాళాఖాతం వైపు విడిపోతాయి. నైరుతి రుతుపవనాలు దేశంలో మొట్టమొదట తాకే కేరళ రాష్ట్రం అరేబియా సముద్ర తీరంలోనే ఉంటుంది. వేసవి మంట దారి చూపుతుంది రోహిణి కార్తెలో రోకళ్లు పగిలేంత ఎండ ఉంటే... రుతుపవనాల్లో అంతేస్థాయిలో వానలూ ఉంటాయని రైతులు అంచనా వేసుకుంటారు. అయితే దీని వెనుక శాస్త్రీయత కూడా లేకపోలేదు. ఎందుకంటే అరేబియా సముద్రం వైపు నుంచి కదులుతున్న రుతుపవనాలను ఆకర్షించేందుకు వేసవి ఎండలు ఉపయోగపడుతాయి. తుపానులు, వాయుగుండాలు, అల్పపీడనాలు కూడా రుతుపవనాలను సముద్రం నుంచి నేలమీదకు తీసుకొచ్చేందుకు ఉపయోగపడతాయి. గాలులు ఎప్పుడైనా అధిక పీడనం నుంచి తక్కువ పీడనం ఉన్న వైపునకు ప్రయాణిస్తాయి. నీరు పల్లం వైపు ప్రవహించినట్లు. వేసవిలో దేశం ఉత్తర దిక్కు నుంచి వీచే చల్లటిగాలులను హిమాలయ పర్వత శ్రేణి అడ్డుకుంటూ నేల బాగా వేడెక్కేందుకు సాయప డుతూంటుంది. దేశానికి ఇరువైపులా ఉన్న సముద్రాల ఉపరితల జలాలూ వేడెక్కుతాయి. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా కారణంగా నేలపై పీడనం తక్కువగా ఉంటుంది. ఇదే సమయంలో అటు అరేబియా సముద్రం దక్షిణ ప్రాంతం ఇటు బంగాళాఖాతంలోనూ పీడనం ఎక్కువగా ఉంటుంది. తగిన సమయంలో అరేబియా సముద్రం వైపు నుంచి రుతుపవన గాలులు దేశం మీదకు వీస్తాయి. ఎల్ నినో, లా నినా ఎఫెక్ట్ ఎక్కడో దక్షిణ అమెరికా ప్రాంతంలో సముద్ర ఉపరితల జలాలు వెచ్చబడినా (ఎల్ నినో) లేక చల్లబడినా (లా నినా) దాని ప్రభావం మన రుతుపవనాలపై ఉంటుంది. దేశంలో ఇప్పటివరకు కరవులు ఏర్పడ్డ ప్రతిసారీ ఎల్ నినో పరిస్థితులే ఉన్నాయి. అయితే ఈ రెండు పరిస్థితులను గుర్తించడం ఎంతో సంక్లిష్టం. దీంతోపాటు హిందూ మహాసముద్రంలోనూ ఉపరితల జలాల ఉష్ణోగ్రతలు రుతుపవనాలపై ప్రభావం చూపుతాయని 1999లో జపాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్త ఎన్.హెచ్.సాజీ పరిశోధన ద్వారా నిరూపించారు. దీనినే ఇండియన్ ఓషియన్ డైపోల్ అని పిలుస్తారు ‘పాజిటివ్, నెగెటివ్, న్యూట్రల్ అని మూడు దశలుంటాయి. పాజిటివ్ దశలో హిందూ మహాసముద్రం పశ్చిమ ప్రాంతంలో ఉపరితల జలాలు వెచ్చగా ఉంటాయి. ఈ పరిణామం రుతుపవనాలకు ఊపునిస్తుంది. దీనికి భిన్నంగా ఉంటే నెగెటివ్. మార్పులేవీ లేకపోతే న్యూట్రల్. 1994, 2006లలో ఎన్ నినో ఏర్పడ్డా దేశంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడకపోవడానికి ఇండియన్ డైపోల్ పాజిటివ్‌గా ఉండటమే కారణం’ అని ఆయన అంచనా వేశారు. రుతుపవనాల లెక్కలిలా.. ►నైరుతీ రుతుపవనాలు దక్షిణాసియాలోని 25 దేశాలపై ప్రభావం చూపుతాయి. రుతుపవనాల వల్ల తూర్పు నుంచి పశ్చిమంగా 18 వేల కి.మీ. మేర, దక్షిణం నుంచి ఉత్తరానికి సుమారు 6 వేల కి.మీ. మేర వానలు కురుస్తాయి. ►దేశ తొలి రుతుపవన అంచనా 1886 జూన్ 4న వెలువడింది. 1871 నుంచి 2006 వరకూ రుతుపవనాలు 94 సార్లు సాధారణంగా ఉంటే 23 ఏళ్లు కరువులు ఏర్పడ్డాయి. ►50 ఏళ్లపాటు దేశవ్యాప్తంగా కురిసిన సగటు వర్షపాతంలో 96–104 శాతం పడితే సాధారణ వర్షపాతంగా లెక్కిస్తారు. 90 శాతం కంటే తక్కువగా ఉంటే (వర్షాభావం) కరువు కింద లెక్క. ►సాధారణ పరిస్థితుల్లో జూన్ తొలి వారానికల్లా నైరుతి రుతుపవనాలు దక్షిణాదిని మొత్తాన్ని కమ్మేస్తాయి. ఆ తరువాత 15 రోజుల్లో దేశంలోని సగం ప్రాంతానికి విస్తరిస్తాయి. జూలై మధ్య నాటికి దేశం మొత్తమ్మీద ప్రభావం చూపుతాయి. -
ఎనిమిది జిల్లాల్లో భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లోని పలుచోట్ల బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాల పల్లి, మంచిర్యాల జిల్లాల్లో బుధ వారం అక్కడక్కడా భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరా బాద్ వాతావరణ కేంద్రం హెచ్చ రికలు జారీ చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. బుధ, గురువారాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మొత్తంగా రాగల మూడురోజులు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. సోమవారం పశ్చిమ మధ్య, దాన్ని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలోని తీవ్ర తుపాను ‘అసని‘ పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి మంగళవారం ఉదయం 8.30 గంటలకు కాకినాడకు ఆగ్నేయ దిశగా 260 కిలోమీటర్ల దూరం లో కేంద్రీకృతమై ఉంది. ఈ తీవ్ర తుపాను వాయవ్య దిశగా పయ నించి అదేరోజు రాత్రికి పశ్చిమ మధ్యబంగాళా ఖాతంలోని ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరానికి చేరుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత అది దిశ మార్చు కుని ఉత్తర ఈశాన్యం వైపు కదిలి ఉత్తర ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరంలోని వాయవ్య బంగాళా ఖాతం లోకి చేరుకునే అవకాశం ఉంది. అది క్రమంగా బలహీన పడి 24 గంటల్లోపు తుపానుగా మారే అవకాశం ఉంది. కాగా, మంగళవారం పలుచోట్ల భానుడు భగభగమన్నాడు. -
హే.. సూర్య ‘భగ’వాన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈనెల 6, 7 తేదీల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 3 డిగ్రీ సెల్సియస్ అధికంగా నమోదవుతుందని చెప్పింది. ఈ నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని సూచించింది. మంగళవారం మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో మినహా మిగతా చోట్ల సాధారణ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 43.3 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత నల్లగొండలో 24.6 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. ప్రస్తుతం తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా ఇంటీరియర్ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్రమట్టం నుంచి 0.9 కి.మీ. ఎత్తు వరకు ఉన్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. -
నిప్పుల కుంపటి.. జర జాగ్రత్త
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం నిప్పులకుంపటిలా మారింది. మండు టెండలు, వడగాడ్పులు, ఉక్కబోత రోజురోజుకూ ఉగ్రరూపం దాలుస్తున్నాయి. వీటిని తట్టుకోలేక జనం అల్లాడిపోతున్నారు. మే నెలలో ఎండలు మరింత ముదిరి 45 నుంచి 48 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు నమోదుకావచ్చని వాతావరణ శాఖ సైతం హెచ్చరిస్తోంది. ఇప్పటికే పలుచోట్ల ఉష్ణోగ్రతలు 42, 43 డిగ్రీలకు చేరుకున్నాయి. హైదరాబాద్‌సహా మరికొన్ని చోట్ల ఎండ తక్కువగా ఉన్నట్టు కనిపిస్తున్నా, వడగాడ్పుల వేడి, ఉక్కబోత వంటివి జనాలను హడలెత్తిస్తున్నాయి. రాత్రి అయినా చల్లబడని వాతావరణంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మే నెలలో భానుడి భగభగలతో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇలాంటి వాతావరణంలో వడదెబ్బతోపాటు జలుబు, దగ్గు, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, మెదడు లాగినట్లు ఉండటం వంటివి చోటుచేసుకుంటాయని పేర్కొంటున్నారు. బరువులు ఎత్తడం, ఇతర శారీరక అలసట కలిగించే పనులేవీ చేయకపోయినా చెమటలు పట్టి శరీరం నుంచి సోడియం, పొటాషియం, క్లోరైడ్స్ తగ్గిపోతాయని, ఆ విధంగా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. ఇళ్లలో ఉండే వృద్ధులు, చిన్నపిల్లలపైనా అధిక ప్రభావం వృద్ధులు, చిన్నపిల్లలు ఇళ్లలోనే ఉన్నా అధిక ఉష్ణోగ్రతలు వారిపై అధిక ప్రభావం చూపుతాయి. రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్న వృద్ధుల్లో సోడియం స్థాయిలు తగ్గిపోవడం వల్ల అయోమయం, ఎటూ తోచని తీరుతోపాటు కోమాలోకి వెళ్లే అవకాశాలుంటాయి. వడగాల్పులు చెవుల్లోకి వెళ్లి కళ్లు మంటలెక్కడం, మెదడు ప్రభావితమై, ఒళ్లునొప్పులతో జ్వరమొచ్చినట్టుగా అవుతుంది. ఆహారాన్ని అరిగించే ఎంజైమ్స్ పొడిబారిపోయి నీళ్ల విరేచనాలు వంటి వాటికి దారితీయవచ్చు. అందువల్ల తరచూ నీళ్లు, మజ్జిగ, నిమ్మకాయ నీళ్లు తాగాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఇళ్ల నుంచి బయటకు వెళ్లకపోవడం మంచిది. ఆఫీసుల్లో, ఇళ్లలో ఏసీలు, కూలర్లతో 18–20 డిగ్రీల వాతావరణంలో ఉండి 40 డిగ్రీలకు పైబడిన బయటి ప్రాంతాలకు వెళ్లొద్దు. కొద్దిసమయం 30–35 డిగ్రీలున్న ప్రదేశంలో ఉండి వేడికి అలవాటు పడ్డాక బయటకు వెళ్లాలి. ఒక్కసారిగా వాతావరణ మార్పు సంభవించే చల్లటి ప్రదేశం నుంచి వేడి ప్రాంతానికి, వేడి ప్రదేశం నుంచి చల్లని ప్రాంతాలకు రావడం, పోవడం వంటివి చేస్తే వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువ. ఇళ్లలోనే తాజా పండ్లరసాలు, నిమ్మకాయ నీళ్లు, ఉప్పు, చక్కెర కలిపిన పలుచటి మజ్జిగ తాగడం మంచిది. ఎలక్ట్రాల్ నీళ్లు, ఓఆర్ఎస్, ఇతర పానీయాలు తీసుకోవాలి. బయట రంగునీళ్లు, ఈగలు వాలే చెరుకురసాలు, శుభ్రత లేని పానీయాలు, ఎనర్జీ డ్రింకులు తీసుకోవడం వల్ల ఉపయోగం లేకపోగా ఆరోగ్యం పాడయ్యే ప్రమాదముంది. – డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి, జనరల్ ఫిజీషియన్, లైఫ్ మల్టీస్పెషాలిటీస్ క్లినిక్ -
రానున్న మూడ్రోజులు తేలికపాటి వానలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న మూడురోజులు పలుచోట్ల తేలికపాటి వానలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంపై ఉపరితల ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. ఇది మధ్య ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుంచి దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు కొనసాగుతున్నట్లు పేర్కొంది. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆది, సోమ, మంగళ వారాల్లో తేలికపాటి వానలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వివరించింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో తేలికపాటి వానలు కురుస్తాయంది. కాగా, శనివారం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 41.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 23 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. -
ఆదిలాబాద్‌లో 42 డిగ్రీలు
సాక్షి, హైదరాబాద్: మార్చి చివరి నాటికే ఎండలతో రాష్ట్రం మండిపోతోంది. మంగళవారం ఆదిలాబాద్‌లో 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్, రామగుండంలలో 41 డిగ్రీలు రికార్డయింది. హైదరాబాద్‌లో సాధారణం కంటే 2.8 డిగ్రీలు, నిజామాబాద్‌లో 2.6 డిగ్రీలు, మెదక్ 2.5 డిగ్రీలు, రామగుండం 2.4 డిగ్రీలు నమోదైంది. మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయని.. ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితేంటని ఆందోళన వ్యక్తమవుతోంది. బుధవారం నుంచి రాష్ట్రంలో అక్కడక్కడ గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశముంది. ఏప్రిల్ ఒకట్రెండు తేదీల్లో రాష్ట్రంలోని వాయువ్య జిల్లాల్లో వడగాడ్పులు వీచే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
తరుముకొస్తున్న మరో తుఫాను.. పేరేంటో తెలుసా?
న్యూఢిల్లీ: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ముందుగా తీవ్ర అల్పపీడనంగా మారి తుఫానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ సోమవారం వెల్లడించింది. ఉత్తర అండమాన్ సముద్రం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా ఇది వ్యాప్తి చెంది ఉంది. మాయాబందర్ (అండమాన్ దీవులు)కి ఆగ్నేయంగా 110 కిలోమీటర్ల దూరంలో, యాంగోన్ (మయన్మార్)కి నైరుతి దిశలో 530 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. వచ్చే 12 గంటల్లో తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 48 గంటల్లో ఇది ఉత్తర దిశగా మయన్మార్ తీరం వైపు పయనించనుందని పేర్కొంది. బుధవారం తెల్లవారుజామున తాండ్వే (మయన్మార్) సమీపంలో తీరం దాటనుందని వెల్లడించింది. సైక్లోన్ 'అసాని' కాగా, ఆగ్నేయ బంగాళాఖాతంలో తాజాగా ఏర్పడిన అల్పపీడనం.. తుఫానుగా మారితే 'అసాని' అనే పేరుతో పిలుస్తారు. ఈ పేరును శ్రీలంక పెట్టింది. శ్రీలంకలోని అధికారిక భాషలలో ఒకటైన సింహళంలో 'అసాని' అంటే 'కోపం' అనే అర్థం వస్తుంది. అయితే 'అసాని' తుఫాను ప్రభావం అంత భయంకరంగా ఉండకపోవచ్చని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర తెలిపారు. 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నా.. అధిక తీవ్రత కలిగిన తుఫానుగా మారబోదని చెప్పారు. ఉష్ణమండల తుఫానులకు పేరు పెట్టే వాటిలో ప్రపంచవ్యాప్తంగా ఆరు ప్రాంతీయ వాతావరణ కేంద్రాలు ఉన్నాయి. ఈ ఆరింటిలో భారత వాతావరణ శాఖ కూడా ఒకటి. బంగాళాఖాతం, అరేబియా సముద్రం, ఉత్తర హిందూ మహాసముద్రం మీదుగా ఏర్పడే ఉష్ణమండల తుఫానులకు 13 సభ్య దేశాలు పేర్లు ప్రతిపాదించడానికి ఐఎండీ ఒక ప్రామాణిక విధానాన్ని అనుసరిస్తుంది. 13 దేశాలు.. 169 పేర్లు ఇండియాతో సహా బంగ్లాదేశ్, ఇండియా, ఇరాన్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, ఖతార్, సౌదీ అరేబియా, శ్రీలంక, థాయ్‌లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యెమెన్.. ఇప్పటికే పేర్లను ప్రతిపాదించాయి. ఒక్కో దేశం 13 పేర్లు చొప్పున ప్రతిపాదించగా.. మొత్తం 169 పేర్లతో 2020లో జాబితాను రూపొందించారు. దేశాల పేర్లను అక్షర క్రమంలో ఉంచారు. వీటి ఆధారంగా ఆయా దేశాలు పెట్టిన పేర్లను వరుసగా తీసుకుంటారు. ఉదాహరణకు గతేడాది అక్టోబర్‌లో ఏర్పడిన తుఫానుకు ‘షహీన్’ అని పేరు పెట్టారు. ఖతార్ ఈ పేరు పెట్టింది. డిసెంబర్లో వచ్చిన తుఫానుకు సౌదీ అరేబియా సూచించిన ‘జవాద్’ పేరు పెట్టారు. అక్షర క్రమంలో సౌదీ తర్వాత ఉన్న శ్రీలంక వంతు ఇప్పుడు వచ్చింది. కాబట్టి శ్రీలంక సూచించిన 'అసాని' పేరును తాజాగా వాడుతున్నారు. IMD issues new list of Names of Tropical Cyclones over north Indian Ocean. The current list has a total of 169 names including 13 names each from 13 WMO/ESCAP member countries. Detailed Press Release available at https://t.co/dArV0Ug8nh and https://t.co/wRl94BzRXr pic.twitter.com/ge0oVz4riD — India Meteorological Department (@Indiametdept) April 28, 2020 పేర్లు ఎందుకు పెడతారు? ఒకే సమయంలో తుఫానులు ఏర్పడినపుడు గందరగోళాన్ని నివారించడానికి తుఫానులకు పేర్లు పెడుతున్నారు. ముందస్తు పటిష్ట నిరోధక చర్యలు తీసుకోవడానికి.. ఏయే తుఫాను వల్ల ఎంత నష్టం జరిగిందనే వివరాలు నమోదు చేయడానికి ఈ విధానం తోడ్పతుంది. ఏ తుఫాను సందర్భంగా ఎలాంటి చర్యలు తీసుకున్నామో విశ్లేషించడం ద్వారా ముందస్తు చర్యలకు వీలు పడుతుంది. (క్లిక్: కంచు కోటలు బద్దలు కొట్టారు.. చరిత్ర సృష్టించారు!) 'అసాని'తో అప్రమత్తం! 'అసాని' తుఫాను ప్రభావంతో అండమాన్ నికోబార్ దీవుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ హెచ్చరించింది. ముందు జాగ్రత్తగా అండమాన్ నికోబార్ దీవుల్లో మార్చి 22 వరకు పర్యాటక కార్యకలాపాలు నిలిపివేశారు. అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోకి వెళ్లవద్దని మత్స్యకారులకు ఐఎండీ సూచించింది. విద్యుత్, సమాచార వ్యవస్థలకు పాక్షికంగా అంతరాయం కలిగే అవకాశముంది. (క్లిక్: బ్లాక్ చెయిన్‌పై ఆసక్తి చూపిస్తున్న కింగ్ నాగార్జున?) -
రెండ్రోజులు తగ్గనున్న ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: బిహార్ నుంచి ఛత్తీస్‌గఢ్ మీదుగా ఉత్తర తెలంగాణ వరకు ఏర్పడిన ఉత్తర–దక్షిణ ఉపరితల ద్రోణి శనివారం బలహీన పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రానికి తూర్పు, ఈశాన్య దిశల నుంచి తక్కువ ఎత్తులో బలంగా గాలులు వీస్తున్నట్టు వివరించింది. ఉపరితల ద్రోణి బలహీనపడిన ప్పటికీ రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది. సాధారణంగా నమోదయ్యే ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీ సెల్సియస్ మేర తగ్గుదల నమోదు కావొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో చలి తీవ్రత పెరుగుతుందని సూచించింది. శనివారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. కనిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 8.2 డిగ్రీల సెల్సియస్, గరిష్ట ఉష్ణోగ్రత భద్రాచలంలో 32.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. -
మళ్లీ చలి..చలి.. రానున్న మూడు రోజులు తగ్గనున్న ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు కాస్త తగ్గే అవకాశముందని వాతావరణశాఖ సూచించింది. రెండ్రోజులుగా సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. మారిన వాతావరణ పరిస్థితులతో రానున్న మూడ్రోజుల పాటు గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతల్లో తగ్గుదల నమోదు కానుంది. రాష్ట్రంపై ఉత్తర–దక్షిణ ద్రోణి కొనసాగు తోంది. ఇది నైరుతి బిహార్ నుంచి ఛత్తీస్‌గఢ్, విదర్భల మీదుగా ఉత్తర తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. దీంతో శని, ఆది, సోమవారాల్లో నారాయణపేట్, మహబూబ్‌నగర్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, మిగతా జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 11 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. మొత్తంగా సాధారణ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేర తగ్గే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే గరిష్ట ఉష్ణోగ్రత నిజామాబాద్‌లో 33.9 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత వికారాబాద్ జిల్లా మర్పల్లిలో 11.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. కాగా, రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణమే ఉంటుందని వెల్లడించింది. -
మరో రెండ్రోజులు చలి తీవ్రత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి తూర్పు, ఈశాన్య దిశల నుంచి గాలులు బలంగా వీస్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గడంతో చలి తీవ్రత పెరుగుతున్నట్టు వివరించింది. రానున్న రెండ్రోజులు ఇదే తరహాలో వాతావరణం ఉంటుందని సూచించింది. ఆదివారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. కనిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 6.7 డిగ్రీల సెల్సియస్, గరిష్ట ఉష్ణోగ్రత నల్లగొండలో 31 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. సోమ, మంగళవారాల్లో సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. -
వణికిస్తున్న చలి.. తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది ఎక్కడో తెలుసా?
సాక్షి, హైదరాబాద్/సాక్షి నెట్వర్క్: రాష్ట్రాన్ని మళ్లీ చలి చుట్టేసింది. అన్ని ప్రాంతాల్లో సాధారణ సగటు కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 6 డిగ్రీల సెల్సియస్ మేర తక్కువగా నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. శనివారం ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్పంగా అర్లీ(టీ)లో 4.9 డిగ్రీలుగా నమోదైంది. ఇంకా కుమరంభీంలో 5.8, సిర్పూర్ (యు)లో 5.8, గిన్నెధరిలో 6.0, సంగారెడ్డి జిల్లా న్యాలకల్‌లో 6.2 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలవారీగా చూస్తే పెద్దపల్లి, హన్మకొండ జిల్లాల్లో వీస్తోన్న ఈశాన్య గాలుల ఫలితంగా ఏకంగా 6 నుంచి 8 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే మూడు రోజుల చలి తీవ్రత కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. కాగా, గరిష్ట ఉష్ణోగ్రత మహబూబ్‌నగర్‌లో 30.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. -
ఎముకలు కొరకని చలి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణస్థితికి చేరుకుంటున్నాయి. వారంరోజులుగా సాధారణం కంటే 5 డిగ్రీల మేర పతనమైన ఉష్ణోగ్రతలు ఇప్పుడు పెరుగుతున్నాయి. శుక్రవారం మెదక్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 8.8 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత దుండిగల్, నల్లగొండలో 32 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రానున్న రెండ్రోజులు సాధారణం కంటే 2 డిగ్రీల మేర తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. -
ఆరు.. వణికారు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయి. కుమ్రుంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో కనిష్ట ఉష్ణోగ్రత 6 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇప్పటివరకు సీజన్లో నమోదైన అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత ఇదే. ఆదిలాబాద్ జిల్లా అర్లిలో 6.2 డిగ్రీల సెల్సియస్, ఆసిఫాబాద్ జిల్లా గిన్నెదారిలో 6.4 డిగ్రీల సెల్సియస్ చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రధాన నగరాల వారీగా పరిశీలిస్తే.. మెదక్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 30.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 7.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. సోమవారం రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ మేర తక్కువగా నమోదయ్యాయని, రానున్న రెండ్రోజులూ ఇదే తరహాలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. రాష్ట్రానికి ఈశాన్య దిశ నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని, కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గడంతో చలి పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. -
నేడు, రేపు తేలికపాటి వానలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురి సే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలి పింది. ఉత్తర తెలంగాణ దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతున్నట్లు వివరించింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యా పించి ఉంది. అల్పపీడనం, ఉపరితల ఆవర్తన ప్రభావాలతో అక్కడక్కడా తేలికపాటి వర్షాలతోపాటు ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. -
Weather Update: అతి భారీ వర్షాలు పడే అవకాశం
సాక్షి, విశాఖపట్నం: ఐఎండీ వాతావరణ సూచనల ప్రకారం తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. ఈ రోజు రాత్రికి వాయుగుండంగా తీవ్ర అల్పపీడనం బలపడనుంది. తదుపరి 48 గంటల్లో వాయుగుండం పశ్చిమ-వాయువ్య దిశగా ఒడిశా తీరం వైపు పయనించనుంది. దీని ప్రభావంతో రాగల 3 రోజులు పాటు కోస్తాంధ్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం అక్కడక్కడ అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. పశ్చిమబెంగాల్-ఒడిశా-ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి గంటకు 50 -60 కీమీ వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. మత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్ళరాదని, ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు సూచించారు. రాగల 3 రోజుల వాతావరణ సమాచారం శనివారం శ్రీకాకుళం,విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, రాయలసీమ, కృష్ణా ,గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఆదివారం శ్రీకాకుళం,విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, రాయలసీమ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం సోమవారం శ్రీకాకుళం,విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు, రాయలసీమ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం -
ఏపీ: రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు
సాక్షి, అమరావతి : బంగాళాఖాతంలో నిన్న(ఆదివారం) ఏర్పడిన అల్పపీడనం బలపడి, వాయుగుండంగా మారింది. గడిచిన 6 గంటల్లో వాయువ్య దిశగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి పాండిచేరికి తూర్పు ఆగ్నేయ దిశగా 550 కి.మీ. చైన్నైకి ఆగ్నేయ దిశగా 590 కి.మీ. దూరంలో కేంద్రీకృతం అయ్యిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది బలపడి రాగల 24 గంటల్లో తుఫానుగా మారి, వాయువ్య దిశగా ప్రయాణించి, కారైకాల్, మహా బలిపురం, ప్రాంతాల మధ్య తీరాన్ని 25 నవంబర్‌న సాయంత్రం తీవ్ర తుఫానుగా గంటకు 100-110 కి.మీ. గాలి వేగంతో దాటవచ్చని పేర్కొంది. చదవండి: తుఫానుగా బలపడనున్న వాయుగుండం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనను భారత వాతావరణ శాఖ విడుదల చేసింది. దీని ప్రకారం.. ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ఈరోజు, రేపు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాల చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్ర : ఈరోజు దక్షిణకోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు దక్షిణకోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచిఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి దక్షిణకోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాయలసీమ : ఈరోజు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.ఎల్లుండి రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. -
కేరళలో వర్షబీభత్సం
తిరువనంతపురం: కేరళలో కొద్ది రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి 15 మంది మృత్యువాత పడ్డారు. ఇడుక్కి జిల్లా రాజమలలోని పెట్టిముడిలో విరిగిపడిన కొండచరియల కింద తేయాకు తోటల్లో పనిచేసే దాదాపు 50 మంది కార్మికులు చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున కార్మికుల నివాసాలపై భారీ కొండచరియలు విరిగిపడడంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతుల్లో ఇద్దరు పిల్లలు, ఐదుగురు మహిళలు ఉన్నారు. శిథిలాల్లో చిక్కుకున్న 15 మందిని రక్షించామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని కేరళ ముఖ్యమంత్రి విజయన్ వెల్లడించారు. (కేరళ: ఒకే రోజు రెండు విషాదాలు) చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మృతుల కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.5 లక్షలను, గాయపడ్డ వారికి ప్రభుత్వమే వైద్య సాయం అందిస్తుందని చెప్పారు. అలాగే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బాధితులు ఒక్కొక్కరికి రెండు లక్షల చొప్పున, క్షతగాత్రులకు 50,000 చొప్పున ఇవ్వనున్నట్టు ట్వీట్ చేశారు. భారీ వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించడంతో రాష్ట్రప్రభుత్వం అన్ని జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేసింది. -
ఢిల్లీలో భారీ వర్షాలు
-
రెడ్ అలర్ట్: ఆ సమయంలో బయటకు రావొద్దు
న్యూఢిల్లీ: గడిచిన వారం రోజులుగా ఒక్కసారిగా దేశంలో ఉష్ణోగ్రతలు అధికమయ్యాయి. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైన నమోదవుతుండగా.. రాబోయే రోజుల్లో ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఈ క్రమంలోనే ఉత్తర భారతదేశంలోని హర్యానా, పంజాబ్, రాజస్థాన్, చంఢీఘర్, ఢిల్లీ రాష్ట్రాలకు ఆదివారం 'రెడ్ అలర్ట్' ఉత్తర్వులను జారీ చేసింది. ఉత్తరప్రదేశ్‌లో కూడా వడగాలు వీస్తాయని ఐఎండీ 'ఆరెంజ్ వార్నింగ్' జారీ చేసింది. చదవండి: గాడ్సే దేశాన్ని రక్షించారంటూ ఎఫ్బీలో పోస్ట్ ఈ విషయంపై ఐఎండీ రీజినల్ మెటీరియాలజీ సెంటర్ హెడ్ కుల్దీప్ శ్రీవాస్తవ వివరణ ఇస్తూ.. రాబోయే రెండు మూడు రోజులు ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలు దాటి నమోదవుతాయి. ఈ సంవత్సరం వేసవిలో అధిక సంఖ్యలో ఉష్ణోగ్రతలు నమోదుకావడం ఇదే తొలిసారి. ఉత్తర, మధ్య భారతదేశంలో ఉష్ణోగ్రతలు ఇప్పటి వరకూ సాధారణం కంటే తక్కువగానే నమోదయ్యాయి. ఏప్రిల్, మే మధ్య వరకు వర్షాలు కురవడంతో ఎండలు తీవ్రత అంతగాలేదని ఆయన పేర్కొన్నారు. రాబోయే ఐదు రోజుల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల నుంచి 47 డిగ్రీల వరకూ కొనసాగుతాయనీ, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ముఖ్యంగా ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, ఒడిషా, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కోస్తాంధ్రలో ఎండలు ఎక్కువగా ఉండనున్నట్లు ఐఎండీ అధికారులు వెల్లడించారు. ఢిల్లీలో ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత 47 డిగ్రీలుగా నమోదైంది. దీనికి తోడు వేడిగాలుల తీవ్రత పెరగడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెడ్ వార్నింగ్ జారీచేసిన ప్రాంతాల్లోని ప్రజలు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంటి నుంచి బయటకు రావద్దని ఐఎండీ సూచించింది. చదవండి: కరోనా : టాటా గ్రూపు సీఈవోల కీలక నిర్ణయం -
ఈసారి నడి వేసవిలో నిప్పుల వాన
సాక్షి, విశాఖపట్నం: ఈ ఏడాది తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉంటాయని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. భూతాపం కారణంగా సాధారణం కంటే 1 డిగ్రీ సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత అధికంగా నమోదవుతుందని తెలిపింది. నడి వేసవిలో నిప్పుల వాన కురిపించేంతలా ఎండలు కాస్తాయని వెల్లడించింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదు కావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. భూ తాపంతో వాతావరణంలో వస్తున్న పెను మార్పులే దీనికి కారణమని చెబుతున్నారు. ఎండల తీవ్రత మార్చి 2వ వారం నుంచే మొదలుకానుంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. మే నెల నుంచి వడగాడ్పుల ప్రభావం: వాతావరణ శాఖ నివేదిక ప్రకారం... మే నెల మొదటి వారం నుంచి వడగాడ్పుల ప్రభావం మొదలు కానుంది. గతేడాదితో పోల్చిచూస్తే.. వడగాడ్పుల ప్రభావం అంతగా ఉండకపోవడం ఉపశమనం కల్గించినా.. అదే సమయంలో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదు కానుండడంతో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధిక రోజులు నమోదు కానున్నాయి. -
ముంబైను ముంచెత్తుతున్న భారీ వర్షాలు
ముంబై : కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు ముంబై మహానగరం అతలాకుతలం అవుతోంది. నగర శివారు ప్రజలు ఇంటి నుంచి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ప్రభుత్వం అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. సముద్రతీర ప్రాంతాల్లో 4.90 మీ. ఎత్తులో అధిక ఆటుపోట్లతో అలలు ఎగిసిపడుతుండటంతో తీర ప్రాంతాలవైపు వెళ్లకూడదని వాతావరణ శాఖ సూచించింది. 48 గంటల వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ముంబై లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. రైల్వే, విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సంజయ్ గాంధీ జాతీయ పార్కులో వరద నీరు చేరడంతో సందర్శన నిలిపివేశారు. ముంబై-గోవా హైవే పై రాకపోకలు ఆగిపోయాయి. భారీ వర్షాల కారణంగా సముద్ర తీర ప్రాంత రహదారులపై చెత్త కొట్టుకు రావడంతో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది.. దానిని తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. -
భారీ వర్ష సూచన.. రెడ్అలర్ట్ ప్రకటన
తిరువనంతపురం: భారీ వర్ష సూచన నేపథ్యంలో కేరళ రాష్ట్రంలో రెడ్అలర్ట్ ప్రకటించారు. రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ కేరళకు హెచ్చరికలు జారీ చేసింది. దీంతో వెంటనే అప్రమత్తమయిన అధికారులు ముందుస్తు జాగ్రత్తగా హైఅలర్ట్ ప్రకటించారు. గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా సృష్టించిన వరద బీభత్సం.. ఎంతో మందిని బలితీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి అలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు అధికారులంతా ముందుస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ముఖ్యంగా తీర ప్రాంతంలో ప్రజలను అప్రమత్తం చేయనున్నారు. అలాగే ఇడుక్కి, వయనాడ్, కానూర్, ఎర్నాకులం, త్రిసూర్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారుల సమాచారం. కాగా వందేళ్లలో ఎప్పుడూ లేని విధంగా గత ఏడాది కేరళను వరదలు ముంచెత్తిన విషయం విదితమే. -
ఆంధ్రప్రదేశ్ తీరం దాటేసిన ఫొని
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర, ఒడిశాల్లో పెను విధ్వంసం సృష్టించే దిశగా పయనిస్తున్న ఫొని పెను తుపాన్ శుక్రవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ తీరం దాటింది. ఒడిశా రాష్ట్రంలోకి ప్రవేశించిన ఫొని తుపాను గంటకు 11 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. పెను తుపానుగా కొనసాగుతూ గురువారం రాత్రి ప్రచండ తుపాను (సూపర్ సైక్లోన్)గా బలపడిన ఫొని ప్రచండ తుపాను గంటకు 15 కిలోమీటర్ల వేగంతో పయ నిస్తూ బలం పుంజుకుంటోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఫొని పెను తుపాను ఉత్తర ఈశాన్య దిశగా కదులుతోంది. గురువారం రాత్రికి విశాఖకు తూర్పు ఆగ్నేయంగా 150 కిలోమీటర్లు, పూరీకి దక్షిణ నైరుతి దిశగా 275 కి.మీ.ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. శుక్రవారం ఉదయం 10–11 గంటల మధ్య ఒడిశాలోని పూరీ సమీపంలో బలుగోడు వద్ద పెను తుపానుగానే తీరాన్ని దాటనుందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) అంచనా వేస్తోంది. పెను తుపాను తీరాన్ని దాటాక ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తూ తీవ్ర తుపానుగా బలహీనపడి పశ్చిమ బెంగాల్ తీరంలోకి ప్రవేశించనుంది. క్రమంగా బలహీనపడుతూ బంగ్లాదేశ్ మీదుగా అస్సాంలోకి ప్రవేశించి అల్పపీడనంగా మారనుంది. తీర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ తుపాను తీరం దాటే సమయంలో గంటకు 170–180 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని, ఇవి ఒక దశలో 200 కిలోమీటర్లకు పైగా గరిష్ట వేగానికి చేరే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఇవి 115 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని తాకే అవకాశం ఉందని ప్రకటించింది. తుపాను నేపథ్యంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ ప్రాంతాల్లోని ప్రజలు శుక్రవారం బయటకు వెళ్లొద్దని, సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ(ఆర్టీజీఎస్) సూచించింది. ఉత్తరాంధ్రలో మరీ ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో గంటకు 130 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ వెల్లడించింది. ఒడిశాలో తుపాను భూమిని తాకే (తీరం దాటే) ప్రాంతం చాలాదూరం సమతలంగా ఉన్నందున ఉప్పెన ఏర్పడే ప్రమాదం ఉన్నట్లు గోపాల్పూర్ డాప్లర్ రాడార్ కేంద్రం అధికారులు అంచనా వేశారు. అదే జరిగితే ఒడిశాలో నష్టం తీవ్రంగా ఉండడం ఖాయం. పదో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ భీమిలి, కళింగపట్నం పోర్టుల్లో అత్యంత ప్రమాదకరమైన పదో నంబరు ప్రమాద హెచ్చరికలను వాతావరణ శాఖ గురువారం జారీ చేసింది. విశాఖపట్నం, గంగవరం పోర్టుల్లో ప్రమాదకరమైన ఎనిమిదో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం, కాకినాడ, వాడరేవుల్లో మూడో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. గాలివానలు కొనసాగుతున్నాయి. కోస్తాంధ్రలో మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని ప్రభుత్వం హెచ్చరించింది. శ్రీకాకుళంలో ఈదురు గాలుల ధాటికి ఊగుతున్న చెట్లు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో శుక్రవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. గాలుల వేగం, వర్షం తీవ్రతకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పూరిళ్లు నేలకూలుతాయని, పైకప్పు రేకులు ఉంటే లేచి పోయే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది. విద్యుత్తు స్తంభాలు వంగిపోవడం, నేలకూలడం వల్ల విద్యుత్తు సరఫరా వ్యవస్థ దెబ్బతింటుందని పేర్కొంది. రోడ్డు, రైలు మార్గాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని తెలిపింది. పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వెల్లడించింది. మామిడి, అరటి, జీడి, కొబ్బరి వంటి తోటలు కూలిపోయే ప్రమాదం ఉన్నట్లు తెలిసింది. కోస్తా ప్రాంతాల్లో మొబైల్ టీమ్‌లను ఏర్పాటు చేసి, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని సూచించింది. ఒడిశా నుంచి వచ్చే వరద నీటితో గండం ఒడిశాలో తుపాను తీరం దాటనుండడం, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అక్కడి నుంచి వంశధార, మహేంద్రతనయ నదులు శ్రీకాకుళం జిల్లాలోకి ఉప్పొంగే ప్రమాదం ఉంది. పూరీ జిల్లా బ్రహ్మగిరి సమితి బలుకుండో వద్ద శుక్రవారం మధ్యాహ్నం 11–12 గంటల తుపాను మధ్య తీరం దాటే అవకాశం ఉందని గోపాల్పూర్ డాప్లర్ రాడార్ కేంద్రం అధికారులు తెలిపారు. తుపాను నేపథ్యంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోంశాఖ సమీక్షించింది. ఇప్పటికే శ్రీకాకుళం, ఒడిశా తీరం వెంబడి వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశాలో ఉప్పెన తప్పదా? ఒడిశాకు తుపానుతో పాటు ఉప్పెన ముప్పు కూడా పొంచి ఉందని గోపాల్పూర్ డాప్లర్ రాడార్ కేంద్రం అధికారులు బాంబు పేల్చారు. ఒడిశాలో ఆస్తి, ప్రాణ నష్టం అధికంగా ఉంటుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ‘ఫొని’ తుపాను తీరం దాటే సమయంలో సముద్రంలో 1.5 నుంచి 2 మీటర్ల ఎత్తు వరకూ రాకాసి అలలు ఎగిసిపడే అవకాశముందని వాతావరణ అధికారులు అంటున్నారు. తుపాను తీరం దాటుతుందని ఐఎండీ అంచనా వేసిన ఒడిశాలోని పూరీ జిల్లా బ్రహ్మగిరి సమితి బలుకుండో ప్రాంతం చాలా సమతలంగా ఉంటుంది. సాధారణంగా సమతల ప్రాంతంలో అధిక తీవ్రత గల తుపాన్లు సంభవిస్తే ఉప్పెన ప్రమాదం పొంచి ఉంటుంది. అలల తీవ్రతకు సముద్ర జలాలు గ్రామాల్లోకి పొంగిపొర్లడాన్ని ఉప్పెన అంటారు. సమతల భాగంలో తుపాను తీరం దాటితేనే ఇలా ఉప్పెన ముప్పు ఉంటుందని ఒడిశాలోని గోపాల్పూర్ డాప్లర్ రాడార్ కేంద్రం డైరెక్టర్ ఉమాశంకర్ దాస్ తెలిపారు. ‘‘పూరీ నుంచి జగత్సింగ్పూర్ వరకు 175 కిలోమీటర్ల పరిధిలో సముద్ర తీరం మొత్తం సమతల భూభాగమే ఉంది. అందువల్ల ఫోని తుపాను వల్ల ఉప్పెన వచ్చే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నాం. పూరీ–జగత్సింగ్పూర్ మధ్య బ్రహ్మగిరి, కృష్ణప్రసాద్, యరసమ, మహాకాలపడ, పారాదీప్ ప్రాంతాల్లో ఈ ముప్పు పొంచి ఉంది’’ అని దాస్ పేర్కొన్నారు. ఒడిశాలో 5 నదులకు వరద ముప్పు ‘‘తుపాను ప్రభావం వల్ల ఒడిశా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. తుపాను తీరం దాటే సమయంలో శుక్రవారం ఒక్కరోజే 25 నుంచి 30 సెంటీమీటర్లు (250 నుంచి 300 మిల్లీమీటర్ల) రికార్డు స్థాయి వర్షపాతం నమోదయ్యే అకాశం ఉంది. దీంతో ఒడిశాలోని మహానది, వైతరణి, రుషికుయ్య, సురవర్ణరేఖ, దేవీ నదులతోపాటు వాటి ఉప నదులకు కూడా వరద ప్రమాదం పొంచి ఉంది. అందువల్ల నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలి’’ అని ఐఎండీ హెచ్చరించింది. ఎక్కడి రైళ్లు అక్కడే.. ఫొని తుపాను ముప్పును దృష్టిలో ఉంచుకుని రైల్వేశాఖ అప్రమత్తమైంది. హౌరా, భువనేశ్వర్‌ల నుంచి విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, చెన్నై వైపునకు వెళ్లే 74 రైళ్లను రద్దు చేసింది. ఇప్పటికే మార్గమధ్యంలో ఉన్న రైళ్లను ప్రధాన రైల్వే స్టేషన్లలో నిలిపివేశారు. సహాయక చర్యలకు నౌకాదళం సిద్ధం ఫొని తుపాను సహాయక చర్యల్లో పాల్గొనేందుకు తూర్పు నౌకాదళం సిద్ధమైంది. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం విశాఖపట్నం నుంచి ఐఎన్ఎస్ సహ్యాద్రి, ఐఎన్ఎస్ రణ్వీర్, ఐఎన్ఎస్ కద్మత్ యుద్ధ నౌకలను సహాయక సామగ్రితోపాటు వైద్య బృందాలను సిద్ధం చేసినట్లు ఈఎన్సీ అధికారులు తెలిపారు. దీంతో పాటు అదనపు సహాయక సామగ్రి, వైద్య బృందాలు, డైవింగ్ టీమ్‌లను విశాఖ నుంచి ఒడిశాకు రోడ్డు మార్గంలో పంపిస్తున్నట్లు వెల్లడించారు. తుపాను తీరం దాటే ప్రాంతాల్లో సహాయక చర్యలు అందించేందుకు ఒక ఎయిర్ క్రాఫ్ట్‌ని విశాఖలో సిద్ధంగా ఉంచామన్నారు. టెంట్లు, దుస్తులు, మందులు, దుప్పట్లను బాధిత ప్రాంతాల ప్రజలకు అందించనున్నట్లు నౌకాదళ వర్గాలు వివరించాయి. అధికార యంత్రాంగం సర్వసన్నద్ధం ఫోని తుపానును ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో సహాయక కార్యక్రమాల నిమిత్తం జాతీయ విపత్తు సహాయక బృందాలు(ఎన్డీఆర్ఎఫ్), రాష్ట్ర విపత్తు సహాయక దళాలు (ఎస్డీఆర్ఎఫ్)లను ప్రభుత్వం సిద్ధంగా ఉంచింది. శ్రీకాకుళం జిల్లాలో లోతట్టు ప్రాంతాలకు చెందిన 15,000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. విద్యుత్ స్తంభాలు, వైర్లు పడిపోతే యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించేందుకు విద్యుత్తు శాఖ అవసరమైన పనిముట్లను, సిబ్బందిని సిద్ధంగా ఉంచింది. -
రైతులకు భారత వాతావరణ శాఖ తీపి కబురు
-
రైతులకు శుభవార్త!
న్యూఢిల్లీ : భారత వాతావరణ శాఖ రైతులకు శుభవార్త చెప్పింది. సోమవారం 2019 నైరుతి రుతుపవనాల వర్షపాతంపై ఐఎండి అంచనాలను వెల్లడించింది. 2019 వర్షాకాలంలో దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలుంటాయని తెలిపింది. రైతులకు ఖరీఫ్ సీజన్ ఉపయోగకరంగా ఉంటుందని, దేశంలో నైరుతి రుతుపవనాల వల్ల జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణ వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. దీర్ఘకాలికంగా దేశంలో 96 శాతం వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది. ఎలినినో ప్రభావం భారత్‌పై ఉండే అవకాశం లేదని తెలిపింది. జూన్ మొదటి వారంలో వర్షపాతంపై రెండవ విడత అంచనాలను విడుదల చేస్తామని వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని తెలిపింది. -
దేశవ్యాప్తంగా తగ్గిన ఉష్ణోగ్రతలు..
-
చలి చంపేస్తోంది!
న్యూఢిల్లీ /సాక్షి, హైదరాబాద్: చలి గజగజ వణికిస్తోంది. తెలుగు రాష్ట్రాలతోసహా దేశ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణంకంటే తక్కువకి పడిపోయాయి. సాధారణంగా శీతాకాలంలో ఉత్తరాది నుంచి మధ్య భారతం మీదుగా తెలంగాణ నుంచి ఒడిశా వరకు చలిగాలులు బలంగా వీస్తాయి. తెలంగాణ, ఏపీలలో పొడి వాతావరణం ఉండటం వల్ల ఆ గాలుల ప్రభావం తీవ్రంగా ఉండి ఉష్ణోగ్రతలు పడిపోతాయి. ముఖ్యంగా రాత్రి పూట ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుకుంటాయి. ప్రతి ఏడాది ఇలా నాలుగైదుసార్లు జరుగుతుం ది. గతవారంలో పెథాయ్ తుఫాన్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తే, ఇప్పుడు ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులతో రాత్రి పూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి దుప్పట్లో ఉత్తర భారతం ఉత్తరభారతం చలి గుప్పిట్లో చిక్కుకుంది. పంజాబ్, హరియాణా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ తదితర రాష్ట్రాల్లో 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీసహా వాయవ్య భారతంలో వచ్చే రెండు మూడ్రోజుల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు వెల్లడించారు. పలు ఉత్తరాది రాష్ట్రాల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు కూడా సింగిల్ డిజిట్‌కి చేరుకోవడంతో పంటలపై కూడా ప్రభావం పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఢిల్లీలో ఇప్పటికే కనిష్ట ఉష్ణోగ్రత 3 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. ఒకట్రెండు రోజుల్లో రెండు డిగ్రీలకు పడిపోయే అవకాశాలున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గడ్డకట్టిన దాల్ సరస్సు చలితో జమ్ము కశ్మీర్ వాసులు గజగజలాడుతున్నారు. రోజురోజుకి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. గత 11 ఏళ్లలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రి పూట ఉష్ణోగ్రతలు మైనస్ 6.8 డిగ్రీలకు పడిపోయాయి. ఫలితంగా ప్రఖ్యాత దాల్ సరస్సులో కొంత భాగం గడ్డ కట్టింది. వాటర్ పైపులలో కూడా నీరు గడ్డ కట్టేయడంతో ప్రజలకు నీటి సరఫరా ఇబ్బందిగా మారింది. ఇలా సరస్సులు కూడా గడ్డ కట్టేయడం గత పదకొండేళ్లలో ఇప్పుడే జరిగింది. ఇక కార్గిల్‌లో మైనస్ 15.3 డిగ్రీల సెల్సియల్ నమోదైంది. తెలంగాణలో పొడి వాతావరణం ఆగ్నేయ అరేబియా సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రం ప్రాంతాలలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. అలాగే ఆగ్నేయ బంగాళాఖాతం దాన్ని ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రం ప్రాంతాలలో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే తెలంగాణలో మాత్రం వచ్చే రెండ్రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు తెలిపారు. దీనివల్ల ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో వచ్చే రెండ్రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా రెండు మూడు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. వణుకుతున్న హైదరాబాద్ వేగంగా పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలతో హైదరాబాద్ గజగజలాడుతోంది. మంగళవారం కనిష్టంగా 16.3 డిగ్రీలు, గరిష్టంగా 31.5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణంకంటే 2–3 డిగ్రీల మేర తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో చలితీవ్రత క్రమంగా పెరుగుతోంది. రాగల మూడురోజుల్లో నగరంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 14 డిగ్రీలకు చేరుకునే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. గాలిలో తేమ శాతం కూడా 44 శాతానికి తగ్గడంతో చలితీవ్రత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉదయం, రాత్రి వేళల్లో వీస్తోన్న శీతలగాలులు వృద్ధులు, రోగులు, చిన్నారులను గజగజలాడిస్తున్నాయి. ప్రస్తుత సీజన్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులు అసాధారణమేమీ కాదని బేగంపేట్‌లోని వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు ‘సాక్షి’కి తెలిపారు. -
కోస్తాకు వాయుగుండం.. అల్లకల్లోలంగా సముద్రం
సాక్షి, అమరావతి: కోస్తా ఆంధ్రకు వాయుగుండం ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్ప పీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఈ ప్రభావంతో డిసెంబర్ 14 నుంచి 16 మధ్య కాలంలో కోస్తా జిల్లాల్లో భారీ వర్షం కురవనుందని తెలిపారు. సుమద్రంలో అలలు 6 మీటర్ల ఎత్తు వరకు ఎగసి పడే అవకాశం ఉందన్నారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. గంటకు 70 నుంచి 100 మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. -
నైరుతి వచ్చేసింది..
సాక్షి, హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు శుక్రవారం తెలంగాణలోకి ప్రవేశించాయి. ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకూ విస్తరించడంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 4–8 తేదీల మధ్య రాష్ట్రంలోకి నైరుతి ప్రవేశిస్తుందన్న హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా నిజమైంది. రుతుపవనాలు ఒకేసారి రాష్ట్రమంతటా విస్తరించడం శుభపరిణామమని వాతావరణ అధికారులు పేర్కొంటున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు నాలుగు రోజుల ముందే రాష్ట్రంలోకి ప్రవేశించాయి. భారీ వర్షాలు... రుతుపవనాల రాకతో గత 24 గంటల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. మంచిర్యాలలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురవగా, ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరులో 13 సెంటీమీటర్లు, నిజామాబాద్ జిల్లా మోర్తాడ్‌లో 10 సెంటీమీటర్ల మేర కుండపోత వర్షం కురిసింది. జూన్ 1 నుంచి 8 వరకు రాష్ట్రంలో సాధారణంగా 24.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఏకంగా 53.4 మిల్లీమీటర్లు రికార్డయింది. అంటే 147 శాతం అధికంగా నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. 14 వరకు సాధారణ వర్షాలు.. రానున్న రెండ్రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి వెల్లడించారు. ఈ నెల 14వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో సాధా రణం నుంచి అధిక వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. 15 నుంచి నెలాఖరు వరకు తెలంగాణలో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వెల్లడించారు. సాధారణంతో పోలిస్తే ఈసారి 97 శాతం వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. -
భారీ వర్షాలు : శని, ఆదివారాలు సెలవులు రద్దు
ముంబై : ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రుతుపవనాల ప్రభావంతో గురువారం ఉదయం నుంచి కుండపోతగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షాలతో జనజీవనం కూడా స్తంభించిపోయింది. మరో రెండు రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని నగరవాసులను వాతావరణ శాఖ హెచ్చరించింది. పుణేలో మరికొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురవనున్నట్టు పేర్కొంది. ఈ హెచ్చరికతో బొంబై మున్సిపల్ కార్పొరేషన్ తన ఉద్యోగులకు శని, ఆదివారాలు సెలవులు రద్దు చేసింది. ఈ భారీ వర్షాలకు ఇబ్బందులు పడే ప్రజలకు సేవలందించాలని ఆదేశాలు జారీచేసింది. అంతేకాక అత్యవసర సమయంలో తప్ప మిగతా సమయాల్లో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. స్థానిక వాతావరణ కేంద్ర ఇచ్చే వెదర్ అప్డేట్లను ఎప్పడికప్పుడూ తెలుసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. జూన్ 8 నుంచి జూన్ 12 వరకు అరేబియా సముద్రంలోని పలుచోట్ల వేటకు వెళ్లవద్దని చెప్పింది. కొంకణ్, గోవా తీర ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ కేంద్రం హెచ్చరికలతో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. మరోవైపు కుండపోతగా కురుస్తున్న ఈ వర్షాల వల్ల ముంబైకి ఎయిర్‌లైన్ సర్వీసులన్నీ రద్దు అయ్యాయి. లండన్ నుంచి ముంబై వచ్చే జెట్‌ఎయిర్‌వేస్ విమానాన్ని కూడా అహ్మదాబాద్ విమానశ్రయానికి తరలించారు. ముందస్తుగా వచ్చిన ఈ రుతుపవనాలతో థానే, పాల్గఢ్, రాయ్‌ఘడ్, రత్నగిరి ప్రాంతాల వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు నగరంలో ప్రధాన రహదారులన్నీ జలమయం కావడంతో, భారీ ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతోంది. అత్యవసర సమయంలో ముంబైవాసులు 1916కు, ముంబై బయటివారు 1077కు ఫోన్ చేయవచ్చని బీఎంసీ తెలిపింది. సెంట్రల్ అరేబియా సముద్రం, దక్షిణ కొంకణ్‌లోని కొన్ని ప్రాంతాలు, గోవా, మరిన్ని కర్ణాటక, రాయమలసీమ ప్రాంతాలు, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో, కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో, బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు రానున్న 24 గంటల్లో రుతుపవనాలు మరింత విస్తరించనున్నాయి. -
దూసుకొస్తున్న‘మెకును’ పెను తుపాను..
పణాజి,గోవా : పెను తుపాను ‘మెకును’ గోవా వైపు దూసుకొస్తోంది. దాదాపు 3 నుంచి మూడున్నర మీటర్ల ఎత్తులో అలలు తీరంపై విరుచుకుపడతాయని భారతీయ వాతావరణ విభాగం(ఐఎండీ) హెచ్చరించింది. తీర ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మస్కట్‌లోని సలాల రీజియన్ సమీపంలో గల అరేబియా సముద్రంలో గురువారం రాత్రి మెకును తుపాను సంభవించింది. ఈ తుపాను గోవా వైపు కదులుతున్నట్లు ఐఎండీ పేర్కొంది. వాతావరణంలో మార్పులు అత్యంత ప్రమాదకరంగా మారుతున్న తరుణంలో మత్య్సకారులు చేపల వేటకు వెళ్లకూడదని తెలిపింది. తీరం వెంబడి సంరక్షణ కోసం గోవా ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ద్రిష్టి మెరైన్ రంగంలోకి దిగింది. వీరితో పాటు వీలైనంత ఎక్కువ మంది లైఫ్ గార్డ్స్ కూడా సముద్ర తీరం వెంబడి రక్షణ చర్యల్లో పాల్గొన్నారు. ప్రజలను ఎవరిని సముద్ర తీరం వైపు అనుమతించడం లేదని ద్రిష్టి మెరైన్ వెల్లడించింది. -
తెలుగు రాష్ట్రాలకు శుభవార్త
సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు చల్లని కబురందించాయి. శుక్రవారం ఇవి దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించాయి. మరో 24 గంటల్లో ఇవి మరింత బలపడి దక్షిణ అరేబియా సముద్రం, కొమరిన్, మాల్దీవుల్లోకి విస్తరించనున్నాయి. మరో మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. ప్రస్తుతం అండమాన్ పరిసరాల్లో 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం, నైరుతి బంగాళాఖాతంలో మరొకటి, బిహార్ పరిసరాల్లో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నాయి. వీటన్నిటి ప్రభావంతో ఈ నెల 28 నాటికల్లా తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం రాత్రి నివేదికలో వెల్లడించింది. ఇది బలపడుతుందా? లేదా? ఎటు వైపు పయనిస్తుందన్న దానిపై రెండుమూడు రోజుల్లో స్పష్టత వస్తుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, రోహిణి కార్తె ప్రారంభం నేపథ్యంలో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు మళ్లీ విజృంభించనున్నాయి. 28న ఏర్పడే అల్పపీడనం ప్రభావం వల్ల దక్షిణ గాలులు తగ్గి ఉష్ణ తీవ్రత పెరగనుందని, అదే సమయంలో ఉక్కపోత కూడా అధికమవుతుందని వాతావరణ శాఖ రిటైర్డ్ అధికారి ఆర్.మురళీకృష్ణ శుక్రవారం రాత్రి ‘సాక్షి’కి చెప్పారు. కాగా శనివారం రాయలసీమలో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలకు ఆస్కారముందని ఐఎండీ వెల్లడించింది. అక్కడక్కడ పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని తెలిపింది. శుక్రవారం రాష్ట్రంలో పలుచోట్ల 40 డిగ్రీలకంటే తక్కువ ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా రెంటచింతలలో 39.6 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. -
పిడుగులు పడతాయి జాగ్రత్త..!
సాక్షి న్యూఢిల్లీ : దేశంలోని 13 రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. నేడు, రేపు పలు రాష్ట్రాల్లో వందలాది పిడుగులపడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఢిల్లీ, జమ్ము కశ్మీర్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తారాఖండ్‌లతో పాటు ఈశాన్య రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. మరోవైపు భారీ పిడుగుల పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో నేడు, రేపు, ప్రభుత్వ-ప్రవేటు పాఠశాలు, కళాశాలలు మూసివేయాలని హరియాణ విద్యాశాఖా మంత్రి ఆదేశించారు. -
ఈ రాత్రికి హైదరాబాద్‌లో కుండపోత వర్షం
సాక్షి, హైదరాబాద్ : నగరాన్ని మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. పలు ప్రాంతాలను జలమయం చేసింది. ఈదురుగాలులు సైతం వీస్తుండటంతో హైదరాబాద్ నగర ప్రజలు భయంతో వణుకుతున్నారు. తాజాగా అందిన సమాచారంప్రకారం పటాన్ చెర్వు, అమీన్‌పురా మండలాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. అలాగే, సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం జాతీయ రహదారిపై నాగులమ్మ గుడి వద్ద భారీగా వరద నీరు చేరుకుంది. బేగంపేట, సికింద్రాబాద్, రసూల్పూర్, చిలకలగూడ, ఆలుగడ్డ, మెట్టుగూడ, ఉప్పల్, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి, మాసబ్‌ట్యాంక్, మెట్టుగూడ, సికింద్రాబాద్, అమీర్‌పేట్, ఎస్ఆర్ నగర్, షేక్ పేట్, మెహిదీపట్నం, లంగర్‌హౌజ్, కోఠి, నాంపల్లి, తార్నాక, దిల్సుఖ్నగర్, మలక్‌పేట్, చాదర్‌ఘాట్ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన జడివాన కురుస్తోంది. దీంతో పైన పేర్కొన్న ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. బేగంపేట ప్లైఓవర్ మీదుగా పీఎన్టీ ప్లైఓవర్, రసూల్‌పురా, సీటీవో ప్లైఓవర్, ప్లాజా ఎక్స్ రోడ్డు, వైఎంసీఏ ప్లైఓవర్, నార్త్ జోన్ డీసీపీ ఆఫీసువైపుగా ట్రాఫిక్ సాగుతోంది. అలాగే సంగీత్ క్రాస్ రోడ్డు, చిలుకలగూడ రోటరీ నుంచి ఆలుగడ్డ బావి, మెట్టుగూడ జంక్షన్ వరకు ట్రాఫిక్ కొనసాగుతోంది. భారత వాతావరణశాఖ హెచ్చరిక భారత వాతావరణ శాఖ మరోసారి దేశంలో హెచ్చరికలు జారీ చేసింది. మరో ఐదు రోజులపాటు భారీ వర్షాలు తప్పవని స్పష్టం చేసింది. మొత్తం ఐదు రోజుల్లో ఏయే రాష్ట్రాల్లో ఎంతమొత్తం వర్షాలు పడనున్నాయో వివరాలు వెల్లడించింది. ఇందులో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన వాతావరణ శాఖ జార్ఖండ్ ఒడిశా వంటి ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. బెంగాల్, ఒడిశా తీరంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. అలాగే, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు ఉంటాయని కూడా హెచ్చరించింది. ఇక అసోం, నాగాలాండ్, మణిపూర్; త్రిపుర, మేఘాలయ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మరఠ్వాడా, కొంకణ్, గోవా, తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక ఉత్తర భాగం, తమిళనాడు పుదుచ్చేరిలో ఈ నెల(అక్టోబర్) 9, 10 తేదీల్లో రెండు రోజులపాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. అలాగే ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందన్నారు. పశ్చిమ బెంగాల్లో గంటకు 65 కిలో మీటర్ల వేగంతో చలి గాలులు వీచే ప్రమాదం ఉందని, ఇక ఒడిశా, జార్ఖండ్‌లో 50 కిలోమీటర్ల వేగంగా ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఇక 11, 12,13 తేదీల్లో మాత్రం బిహార్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, కొంకణ్, గోవా ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షం పడే అవకాశం హెచ్చరించింది. -
పిడుగులు పడతాయి జాగ్రత్త!
సాక్షి, విశాఖపట్నం: తెలంగాణ, కోస్తాంధ్రలో మళ్లీ పిడుగులు పడే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరించింది. సోమ, మంగళవారాల్లో కోస్తాంధ్రలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా పడతాయని ఆదివారం ఐఎండీ తెలిపింది. మరోవైపు రాయలసీమ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి, ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర, రాయలసీమల మీదుగా అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమలపై నైరుతి రుతుపవనాలు సాధారణంగా ప్రభావం చూపుతున్నాయి. వీటన్నిటి ప్రభావంతో రానున్న మూడు రోజులు రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. గడచిన 24 గంటల్లో గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. కుప్పంలో 9 సెం.మీ, బాపట్లలో 8, వెంకటగిరికోట 5, చిన్నమండెం, కందుకూరు, కారంచేడుల్లో 4, నెల్లూరు, పుంగనూరు, పాలసముద్రంలలో 3, సత్యవేడు, ఓబులదేవరచెరువు, శాంతిపురం, గుర్రÆ కొండ, సాంబేపల్లి, వింజమూరు, ప్రత్తిపాడు, దర్శి, మంగళగిరి, సత్తెనపల్లెల్లో 2 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. -
భారీ వర్షాలు.. అయినా తప్పదా?
న్యూఢిల్లీః దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలను వానలు ముంచెత్తుతున్నా ఇంకా చాలా ప్రాంతాల్లో లోటు వర్షపాతం నమోదైంది. దేశంలో నాలుగింట ఓ వంతు ప్రాంతంలో కనీస వర్షపాతం కూడా నమోదు కాలేదని గణాంకాలు చెబుతున్నాయి. అయితే రానున్న రోజుల్లో మాత్రం అక్కడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండి) అంచనా వేస్తోంది. మధ్యప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, కర్నాటక, పశ్చిమ యూపీలోని కొన్ని ప్రాంతాల్లో లోటు వర్షపాతం నమోదైందని ఐఎండి పేర్కొంది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.కర్నాటకలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయని, మరాఠ్వాడా, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు ఆరంభమయ్యాయని, కొద్దిరోజుల్లో పరిస్థితి మెరుగవుతుందని ఐఎండి డైరెక్టర్ జనరల్ కేజే రమేష్ చెప్పారు. రానున్న రెండు వారాల్లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ సహా మధ్య భారత్‌లో భారీ వర్షాలు కురవనున్నాయని ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి మాధవన్ రాజీవన్ ట్వీట్ చేశారు. మరోవైపు తూర్పు యూపీ, బీహార్, అసోం, గుజరాత్లో వరదలు పోటెత్తాయి.