రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ
న్యూఢిల్లీ : ఉష్ణోగ్రతలు అసాధారణ స్థ నేపధ్యంలో భారత వాతావరణ శాఖ శనివారం దేశంలో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు భానుడి భగభగలతో మండిపోతున్నాయి. ఇప్పటివరకూ రెండు తెలుగు రాష్ట్రాల్లో వడదెబ్బకు 427మంది మృత్యువాత పడ్డారు. కాగా రాగల రెండు, మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది.
వాయవ్య భారతం నుంచి వీస్తున్న పొడి గాలులతో విదర్భ, తెలంగాణ, రాయలసీమల్లో ఎండలు మండిపోతున్నాయి. ఎండ తీవ్రతతో పాటు ఉక్కపోత అధికం కావటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉత్తర తెలంగాణలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇక హైదరాబాద్లో 43.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. గత అయిదేళ్లలో ఇదే అత్యధికం. తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో 67మంది, ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలో 64మంది వడదెబ్బకు మృతి చెందారు. ఏపీలో 204 , తెలంగాణలో 223 వడదెబ్బ మరణాలు నమోదు అయ్యాయి. ఇక వడదెబ్బకు మృతి చెందినవారు కుటుంబాలకు ఆపద్భందు పథకం కింద రూ. 50 వేల ఆర్థిక సహాయం అందుతుందని అధికారులు వెల్లడించారు.