
సాక్షి, హైదరాబాద్ : నగరాన్ని మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. పలు ప్రాంతాలను జలమయం చేసింది. ఈదురుగాలులు సైతం వీస్తుండటంతో హైదరాబాద్ నగర ప్రజలు భయంతో వణుకుతున్నారు. తాజాగా అందిన సమాచారంప్రకారం పటాన్ చెర్వు, అమీన్‌పురా మండలాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. అలాగే, సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం జాతీయ రహదారిపై నాగులమ్మ గుడి వద్ద భారీగా వరద నీరు చేరుకుంది. బేగంపేట, సికింద్రాబాద్, రసూల్‌పూర్, చిలకలగూడ, ఆలుగడ్డ, మెట్టుగూడ, ఉప్పల్, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, మాసబ్‌ట్యాంక్, మెట్టుగూడ, సికింద్రాబాద్, అమీర్‌పేట్, ఎస్‌ఆర్ నగర్, షేక్ పేట్, మెహిదీపట్నం, లంగర్‌హౌజ్, కోఠి, నాంపల్లి, తార్నాక, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్, చాదర్‌ఘాట్ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన జడివాన కురుస్తోంది.
దీంతో పైన పేర్కొన్న ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. బేగంపేట ప్లైఓవర్ మీదుగా పీఎన్టీ ప్లైఓవర్, రసూల్‌పురా, సీటీవో ప్లైఓవర్, ప్లాజా ఎక్స్ రోడ్డు, వైఎంసీఏ ప్లైఓవర్, నార్త్ జోన్ డీసీపీ ఆఫీసువైపుగా ట్రాఫిక్ సాగుతోంది. అలాగే సంగీత్ క్రాస్ రోడ్డు, చిలుకలగూడ రోటరీ నుంచి ఆలుగడ్డ బావి, మెట్టుగూడ జంక్షన్ వరకు ట్రాఫిక్ కొనసాగుతోంది.
భారత వాతావరణశాఖ హెచ్చరిక
భారత వాతావరణ శాఖ మరోసారి దేశంలో హెచ్చరికలు జారీ చేసింది. మరో ఐదు రోజులపాటు భారీ వర్షాలు తప్పవని స్పష్టం చేసింది. మొత్తం ఐదు రోజుల్లో ఏయే రాష్ట్రాల్లో ఎంతమొత్తం వర్షాలు పడనున్నాయో వివరాలు వెల్లడించింది. ఇందులో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన వాతావరణ శాఖ జార్ఖండ్ ఒడిశా వంటి ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. బెంగాల్, ఒడిశా తీరంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. అలాగే, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు ఉంటాయని కూడా హెచ్చరించింది.
ఇక అసోం, నాగాలాండ్, మణిపూర్; త్రిపుర, మేఘాలయ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మరఠ్వాడా, కొంకణ్, గోవా, తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక ఉత్తర భాగం, తమిళనాడు పుదుచ్చేరిలో ఈ నెల(అక్టోబర్) 9, 10 తేదీల్లో రెండు రోజులపాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. అలాగే ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందన్నారు. పశ్చిమ బెంగాల్‌లో గంటకు 65 కిలో మీటర్ల వేగంతో చలి గాలులు వీచే ప్రమాదం ఉందని, ఇక ఒడిశా, జార్ఖండ్లో 50 కిలోమీటర్ల వేగంగా ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఇక 11, 12,13 తేదీల్లో మాత్రం బిహార్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, కొంకణ్, గోవా ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షం పడే అవకాశం హెచ్చరించింది.