ద్రోణి ప్రభావంతో నేడు, రేపు మోస్తరు వర్షాలు
2, 3 రోజుల్లో చురుగ్గా మారనున్న రుతుపవనాలు
17, 18 తేదీల్లో భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: రానున్న రెండు మూడు రోజుల్లో వర్షాలు ఊపందుకోనున్నాయి. ప్రస్తుతం రాయలసీమ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది.
ద్రోణి ప్రభావంతో శనివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలు, ఆదివారం పార్వతీపురం మన్యం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, వైఎస్సార్, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అదే సమయంలో ఆ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది.
ఊపందుకోనున్న రుతుపవనాలు..
కొద్ది రోజులుగా నైరుతి రుతుపవనాలు స్తబ్దుగా ఉన్నాయి. దీనివల్ల రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు, అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అయితే రెండు మూడు రోజుల్లో రుతుపవనాలు చురుకుదనం సంతరించు కోనున్నాయి. ఫలితంగా ఈనెల 17, 18 తేదీల్లో కోస్తాంధ్రలోను, 18న రాయలసీమలోను భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది.
శుక్రవారం రాత్రి వరకు డోలపేట (విజయనగరం జిల్లా)లో 7.8 సెంటీమీటర్లు, కోట ఉరట్ల (అనకాపల్లి)లో 5.7, అనపర్తి (తూర్పు గోదావరి)లో 4.3, ఎచ్చెర్ల (శ్రీకాకుళం)లో 3.2, సాలూరు (పార్వతీపురం మన్యం)లో 2.9, పర్లపాడు (వైఎస్సార్)లో 2.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment