కూలీల బాగే వ్యవసాయ బాగు | Sakshi Guest Column On Agricultural laborers and Farming | Sakshi
Sakshi News home page

కూలీల బాగే వ్యవసాయ బాగు

Published Fri, Jan 10 2025 1:03 AM | Last Updated on Fri, Jan 10 2025 1:03 AM

Sakshi Guest Column On Agricultural laborers and Farming

విశ్లేషణ

అనేక కారణాల వల్ల వ్యవసాయ కూలీలు ఊర్లో ఉండి పని చేసుకుని బతికే అవకాశాలు తగ్గుతున్నాయి. వ్యవసాయంలో వస్తున్న ఆధునిక మార్పులు పని అవకాశాలను తగ్గించాయి. వాతావరణ మార్పుల వల్ల సంభవిస్తున్న తీవ్రమైన ఎండలు, విపరీతమైన వర్షాలు వ్యవసాయ కూలీల సాధారణ పనికి ఆటంకంగా మారాయి. వ్యవసాయేతర అవసరాల కొరకు భూసేకరణ జరిగి, భూమి వినియోగం మారినప్పుడు, దాని ప్రభావం వ్యవసాయ ఉత్పత్తి మీద, వ్యవసాయ కూలీల మీద ఉంటుంది. వ్యవసాయంలో రైతులు, వ్యవసాయ కూలీల మధ్య అనుబంధం ఉంటేనే సుస్థిర వ్యవసాయం సాధ్యం. ఈ అనుబంధానికి తగిన ప్రభుత్వ మద్దతు, ఉపశమనం కలిగించే పథకాలు ఉంటేనే వ్యవసాయం స్వతంత్రంగా నిలబడగలుగుతుంది.

వ్యవసాయంలో 2018–19 నాటికి సగటు రోజువారీ ఆదాయం 27 రూపాయలు మాత్రమే. ఆర్థిక సర్వే 2021–22 ప్రకారం, 2019 నాటికి వ్యవసాయ కుటుంబ సగటు నెలవారీ ఆదాయం రూ.10,218. రైతు ఆదాయమే అంత తక్కువ ఉండగా, వ్యవసాయ కూలీ ఆదాయం అంతకంటే ఘోరంగా ఉన్నది. ఉపాధి హామీ పథకంలో సగటు రోజు కూలీ రూ.179.70 చూపించి రైతు కన్నా వాళ్లకు ఎక్కువ వస్తుంది అనుకుంటారు. 

పథకంలో అమలు అవుతున్న పని దినాలు చాలా తక్కువ. కూలీల వలసలు తగ్గకపోవడమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. సగటు రైతు ఆర్థిక పరిస్థితే బాగాలేనప్పుడు సగటు రైతు కూలీ పరిస్థితి మెరుగ్గా ఉండే అవకాశం లేదు. వ్యవసాయ కూలీలకు సంవత్సరం మొత్తం పని ఉండదు. కూలీ సరిపోక చాలా కుటుంబాలు పిల్లలను బడికి కాకుండా పనికి పంపిస్తున్నాయి. భారతదేశంలో బాల కార్మి కుల సంఖ్య వివిధ అంచనాల ప్రకారం 1.75 నుండి 4.4 కోట్లు.

అప్రకటిత నిర్లక్ష్యం
2011 జనాభా లెక్కల ప్రకారం, దేశంలో మొత్తం వ్యవసాయ కార్మికుల సంఖ్య 2001లో ఉన్న 23.41 కోట్ల (12.73 కోట్ల సాగు దారులు, 10.68 కోట్ల వ్యవసాయ కూలీలు) నుండి 2011లో 26.31 కోట్లకు (11.88 కోట్ల సాగుదారులు, 14.4 కోట్ల వ్యవసాయ కూలీలు) పెరిగింది. పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే నివేదిక ప్రకారం, భారతదేశంలోని మొత్తం శ్రామికశక్తిలో 45.5 శాతం మంది 2021–22 నాటికి వ్యవసాయ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నారు. దేశంలోని శ్రామిక శక్తి ఉపాధిలో వ్యవసాయ రంగం వాటా 2020–21లో 46.5 శాతం ఉండగా, 2021–22 నాటికి 45.5 శాతానికి తగ్గింది. 

పల్లెలలో సాగుదారులు, వ్యవసాయ కూలీలు ఎక్కువగా ఉన్నారు. వారి సంఖ్యను తగ్గించాలని గత 40 యేండ్ల నుంచి ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. కొందరు అపర మేధావులు కూడా ఉత్పాదకత పేరు మీద, ఇంకేవో లెక్కల ఆధారంగా వ్యవసాయంలో ఇంత మంది ఉండొద్దు, తగ్గించే కార్యక్రమాలు చేపట్టమని ప్రభుత్వా నికి పదేపదే చెబుతుంటారు. వ్యవసాయ కూలీలను నిర్లక్ష్యం చేసే అప్రకటిత ప్రభుత్వ విధానం ఆ కోణం నుంచే వచ్చింది. రైతులు, కూలీల సంఖ్య తగ్గించాలనుకునేవారు వారికి ఇతర మార్గాల ఏర్పాటు గురించి ఆలోచనలు చేయడం లేదు.

వ్యవసాయమే ఆధారంగా ఉండే పల్లెలలో వ్యవసాయం ఆదాయాన్ని బట్టి, అందులో ఉన్న మార్పులను బట్టి ఇతర వృత్తుల మీద ప్రభావం ఉంటున్నది. రోడ్లు, విమానాశ్రయం, పరిశ్రమలు తదితర వ్యవసాయేతర అవసరాలకు కొరకు భూసేకరణ జరిగి, భూమి ఉపయోగం మారినప్పుడు, ఆ ఊర్లో ఆ మేరకు వ్యవసాయం తగ్గుతుంది. దాని ప్రభావం వ్యవసాయ ఉత్పత్తి మీద, వ్యవసాయ కూలీల మీద ఉంటుంది. 

బహుళ పంటలు ఉంటే నిరంతరం పని ఉంటుంది. ఒక్కటే పంట ఉంటే విత్తనాలప్పుడు, కోతలప్పుడు తప్పితే పని ఉండదు. ఇదివరకు రైతులు పండించి కొంత తమ దగ్గర పెట్టుకుని మిగతాది మార్కెట్‌కు తరలించేవారు. ఇప్పుడు మొత్తం నేరుగా మార్కెట్‌కు తరలిస్తున్నారు. రైసు మిల్లులు అధునాతనం అయినాక వాటి సగటు సామర్థ్యం పెరిగింది, కూలీ పని తగ్గింది. 

తగ్గుతున్న పని
కాంట్రాక్ట్‌ వ్యవసాయం, యాంత్రీకరణ, రసాయనీకరణ తర్వాత ఇప్పుడు ప్రభుత్వం డిజిటలీకరణ అంటున్నది. సబ్సిడీలు ఇచ్చి తెస్తున్న ఈ మార్పులు ఖర్చులను పెంచడంతో పాటు వ్యవ సాయ కూలీలకు పని అవకాశాలు తగ్గించాయి. కూలీ రేట్లు పెరిగి నందువల్ల కలుపును చంపే రసాయనాల వాడకం పెరిగిందని చాలా మంది నమ్ముతున్నారు. అది పెస్టిసైడ్‌ కంపెనీల మార్కెట్‌ మాయ మాత్రమే. సగటు పంట ఖర్చు పెరుగుదలలో విత్తనాలు, ఎరువులు, కీటకనాశక రసాయనాలు వగైరా అన్ని పెరిగినాయి. 

వాటి ధరల మీద, నాణ్యత మీద, వాటి కొరకు అయ్యే రవాణా, ఇతర ఖర్చుల మీద రైతులకు నియంత్రణ లేదు. పట్టణవాసులు ఐస్‌క్రీమ్, సబ్బులు, సినిమా టికెట్‌ కొనేటప్పుడు, హోటల్‌ బిల్లు కట్టేటప్పుడు పెద్దగా ఆలోచించరు. కానీ, కొత్తిమీర కట్ట రేటు పెరిగితే తెగ బాధపడతారు. అట్లాగే, రైతు బయట సరుకుల రేటు, వాటి కొరకు చేసే అప్పులు, వాటి మీద వడ్డీలు, తన ప్రయాణం, సరుకుల రవాణా వగైరా ఖర్చులను లెక్కలోకి తీసుకోడు. కానీ ఊర్లో ఉండే కూలీకి ఎంత ఇవ్వాలి అని మాత్రం ఆలోచిస్తాడు. కూలీ గురించి రైతుకు ఉన్న చింత బయటి నుంచి కొనుక్కొస్తున్న వాటి మీద ఉండటం లేదు. ఎందుకంటే కూలీ ఒక్కటే తన పరిధిలో ఉంటుంది.

వ్యవసాయం సంక్షోభంలో ఉన్నది. రైతు సంక్షోభంలో ఉన్నాడు. వ్యవసాయ కూలీలు సంక్షోభంలో ఉన్నారు. పాడి పశువుల పరిస్థితి భిన్నంగా లేదు. పల్లెలు మొత్తం ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి. ఊర్లోకి రూపాయి రాకడ కంటే పోకడ ఎక్కువ అయినందున సగటు గ్రామీణ కుటుంబం అప్పులలో ఉన్నది. అందుకే వ్యవసాయ కూలీలు వలస పోతున్నారు. స్థానిక వ్యవసాయ కూలీలను కోల్పోతే వారి స్థానంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వలస కార్మికులు శారీరక శ్రమ చేయగలుగుతారేమో కానీ రైతుకు పూర్తి మద్దతు రాదు. 

స్థానిక వాతా వరణాన్ని బట్టి ఉండే నైపుణ్యం, జ్ఞానం, అనుభవం ఉన్న స్థానిక వ్యవసాయ కూలీలు రైతుకు అనేక రూపాలలో మద్దతు ఇవ్వ గలుగుతారు. వలస వచ్చిన కూలీలు ఆఫీసుకు వచ్చి పోతున్నట్లు వ్యవహరిస్తారు. వ్యవసాయంలో రైతులు, వ్యవసాయ కూలీల మధ్య అనుబంధం ఉంటేనే సుస్థిర వ్యవసాయం సాధ్యం. ఈ అనుబంధా నికి తగిన ప్రభుత్వ మద్దతు, సానుకూల విధానాలు, ఉపశమనం కలిగించే పథకాలు, సంక్షేమ నిధులు ఇస్తేనే భారత వ్యవసాయం స్వతంత్రంగా నిలబడగలుగుతుంది. లేకపోతే, మన ఆహార భద్రత ఆందోళన కలిగించకమానదు.

కూలీలు కేంద్రంగా విధానం
ఆధునిక వ్యవసాయంలో విపరీతంగా వాడుతున్న ప్రమాదకర కీటకనాశక రసాయనాల వల్ల, వాతావరణ మార్పుల వల్ల వ్యవ సాయ కూలీల ఆరోగ్యం ప్రమాదంలో పడింది. తీవ్రమైన ఎండలు, విపరీతమైన వర్షాలు వ్యవసాయ కూలీల సాధారణ పనికి ఆటంకంగా మారాయి. భారత వాతావరణ శాఖ ప్రకారం, పిడుగుపాటు వల్ల ప్రతి సంవత్సరం సుమారు 2,000 మంది చనిపోతున్నారు. 

భారతదేశపు మొట్టమొదటి వార్షిక ఉరుములు మెరుపుల నివేదిక (2019–2020) ప్రకారం, పిడుగుపాటు మరణాలకు ప్రధాన కారణం చెట్టు కింద నిలబడటం. ఇది మొత్తం పిడుగుపాటు మరణాలలో 71 శాతం. అత్యధిక సంఖ్యలో వ్యవసాయ కూలీలు ఆరు బయట పని చేస్తూ ఉంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా ఆయా కుటుంబాలకు ఉపశమనం కల్పించటానికి ఒక్క అడుగు కూడా వేయలేదు. 

2021లో భారతదేశం ప్రకృతి వైపరీత్యాల వల్ల దాదాపు రూ. 27 వేల కోట్ల నష్టం అయ్యిందని ఒక అంచనా. ఇందులో వ్యవసాయ కూలీల జీవనోపాధికి వచ్చిన నష్టం కలుపలేదు. వీరిని కూడా నష్టాల అంచనాలలో, నష్ట నివారణ చర్యలలో ముఖ్యంగా పరిగణించాలని అంతర్జాతీయ కార్మిక సంస్థ కూడా చెప్పింది. ఈ సంస్థ తయారు చేసిన విధి విధానాలు భారతదేశంలో అమలు చేయడానికి ఒక జాతీయ టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చెయ్యాలి. జాతీయ బడ్జెట్‌లో దీనికి అవసరమైన కేటాయింపులు చేయాలి. వ్యవసాయ కూలీలు కేంద్రంగా సుస్థిర అభివృద్ధి, పర్యావరణ అనుకూల గ్రామీణ విధానాలు తయారు చెయ్యాలి.

డా‘‘ దొంతి నరసింహా రెడ్డి 
వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement