సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమవుతోంది. సోమవారం నుంచి పశ్చిమ రాజస్థాన్ ప్రాంతం నుంచి వీటి ఉపసంహరణ మొదలవుతుంది. వాయవ్య భారతదేశంలో యాంటీ సైక్లోన్ అభివృద్ధి చెందడం, నైరుతి రాజస్థాన్‌లో పొడి వాతావరణం నెలకొనడం ద్వారా ఈ రుతుపవనాల నిష్క్రమణ మొదలు కానున్నట్టు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమై అక్టోబర్ 15 నాటికి దేశం నుంచి నైరుతి రుతు పవనాల నిష్క్రమణ పూర్తవుతుంది.
సాధారణంగా నైరుతి రుతుపవనాల నిష్క్రమణ రాజస్థాన్ నుంచి సెప్టెంబర్ 17 నుంచి ఆరంభమవుతుంది. కానీ.. ఈ ఏడాది వారం రోజులు ఆలస్యంగా ఉపసంహరణ మొదలవుతోంది. ఈ ఏడాది నైరుతి ఆగమనం కూడా వారం రోజుల ఆలస్యంగానే మొదలైంది. వాస్తవానికి జూన్ 1వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. అక్కడ నుంచి క్రమంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరిస్తాయి. అయితే, ఈ ఏడాది ఇవి వారం రోజులు ఆలస్యంగా అంటే జూన్ 8వ తేదీన కేరళను తాకాయి. వీటి విరమణలోనూ అదే తీరును కనబరిచాయి.
ఈ ఏడాది ‘నైరుతి’ విభిన్నం!
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు విభిన్నంగా ప్రభావం చూపాయి. ఈ రుతుపవనాల సీజన్ జూన్ నుంచి అక్టోబర్ వరకు ఉంటుంది. ఈ సమయంలో బంగాళాఖాతంలో కనీసం ఐదారు అల్పపీడనాలు, మూడు వాయుగుండాలు, ఒకట్రెండు తుపానులు సంభవిస్తాయి. కానీ.. ఈ సీజనులో ఇప్పటివరకు నాలుగు అల్పపీడనాలు మాత్రమే ఏర్పడ్డాయి. ఇవి కూడా స్వల్పంగానే ప్రభావం చూపాయి తప్ప ఆశించిన స్థాయిలో వర్షాలను కురిపించలేదు. ఈ ఏడాది ఒక్క వాయుగుండం గాని, తుపాను గాని ఏర్పడలేదు. వాయుగుండాలు, తుపానులు ఏర్పడితే సమృద్ధిగా వానలు కురిసేందుకు దోహద పడేవి. ఈ దృష్ట్యా రాష్ట్రంలో ఈ సీజన్‌లో ఇప్పటివరకు 16.8 శాతం లోటు వర్షపాతం నమోదైంది.
తిరోగమనంలో వర్షాలు
సాధారణంగా నైరుతి రుతుపవనాల తిరోగమనంలోనూ వర్షాలు కురుస్తాయి. ఈ సమయంలో బంగాళాఖాతంలో అల్పపీడనాలకు ఆస్కారం ఉంటుందని, రుతుపవనాలు చురుకుదనం సంతరించుకుంటాయని, ఫలితంగా వానలు కురుస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇలా తిరోగమనంలో కురిసే వర్షాలతో రాష్ట్రంలో నెలకొన్న లోటు వర్షపాతం సాధారణ స్థితికి చేరుకుంటుందని, వచ్చే నెల 15 వరకు వర్షాలు పడతాయని పేర్కొంటున్నారు.
ఎందుకిలా జరిగిందంటే!
ఈ సీజన్‌లో నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా ప్రభావం చూపకపోవడానికి వాతావరణ నిపుణులు వివిధ కారణాలు చెబుతున్నారు. నైరుతి రుతుపవనాలు భూమధ్య రేఖ ప్రాంతం నుంచి అరేబియా, బంగాళాఖాతం శాఖలుగా> విడిపోతాయి. వీటిలో బంగాళాఖాతం శాఖ ప శ్చిమ మధ్య బంగాళాఖాతంలో కాకుండా చైనా, జపాన్ దేశాల వైపు వెళ్లిపోయాయి. దీంతో చైనా సముద్రంలో ఈ సీజన్‌లో రెండు మూడు బలమైన తుపానులు ఏర్పడ్డాయి.
పైగా.. రుతుపవన ద్రోణి దాదాపు నెల రోజులపాటు హిమాలయాల్లోనే ఉండిపోయింది. ఫలితంగా పశి్చమ బంగాళాఖాతంలో అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడక రాష్ట్రంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవకుండా పోయాయి. దీనికి ఎల్‌నినో పరిస్థితులు కూడా తోడయ్యాయని వాతావరణ శాఖ విశ్రాంత అధికారి ఆర్.మురళీకృష్ణ ‘సాక్షి’కి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment