ప్రచండ భానుడు
నేటి నుంచి 3 రోజులు తీవ్ర ఎండలు
- భారత వాతావరణ శాఖ హెచ్చరిక
- ఇప్పటికే నిప్పుల కుంపటిలా రాయలసీమ
- రాష్ట్రంలో పెరుగుతున్న వడగాడ్పుల మరణాలు
- 42.2 శనివారం కర్నూలులోఅత్యధిక ఉష్ణోగ్రత (డిగ్రీల సెల్సియస్)
- వడదెబ్బతో మృతి చెందిన వారు 9
సాక్షి, అమరావతి/సాక్షి, నెట్‌వర్క్: రాష్ట్రంలో ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. ప్రచండ భానుని ప్రతాపంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇదే సమయంలో ఆదివారం నుంచి మూడు రోజులపాటు ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ తాజాగా శనివారం రాత్రి హెచ్చరికలు చేసింది. ముఖ్యంగా రాయలసీమలో ఈ ఎండల తీవ్రత బాగా అధికంగా ఉంటుందని తెలిపింది. రెండు, మూడు డిగ్రీల వరకు అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే వీలున్నట్టు వెల్లడించింది. దీంతో ఇప్పటికే నిప్పులకుంపటిలా మారిన రాయలసీమలో రాబోయే మూడురోజులపాటు ఎండ భగభగలు మరింత తీవ్ర స్థాయిలో ఉండనున్నాయి. ఇదిలా ఉంటే శనివారం కర్నూలులో అత్యధికంగా 42.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అనంతపురంలో 41.9, కడపలో 41.5, జంగమేశ్వరపురంలో 41.2, తిరుపతిలో 40.6, విజయవాడలో 39.2 డిగ్రీల సెల్సియస్ చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రం మొత్తమ్మీద కర్నూలు, అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి.
వడదెబ్బతో 9 మంది మృతి
రాష్ట్రంలో ఎండల తీవ్రతకు వడగాడ్పులు తోడవడంతో వడదెబ్బ మరణాలు అధికమయ్యాయి. వడదెబ్బకు గురై తాజాగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా వైఎస్సార్ జిల్లాలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. చింతకొమ్మదిన్నె మండలం ఇప్పెంట పంచాయతీ పరిధిలోని బోడెద్దులపల్లె గ్రామవాసి పఠాన్ జమాల్‌ఖాన్(68), నందలూరు మండలం నాగిరెడ్డిపల్లె మేజర్ పంచాయతీ పరిధిలోని దళితవాడకు చెందిన కొండా రామలక్షుమ్మ(70), ఎర్రగుంట్ల పట్టణంలో వెంకటయ్య(55) వడదెబ్బ కారణంగా చనిపోయారు. గుంటూరులోని పల్నాడు బస్టాండ్ సమీపంలో చెప్పులు కుట్టుకుని జీవనం సాగిస్తున్న 60 ఏళ్ల వృద్ధుడు వడదెబ్బతో మృతిచెందాడు. ఇతని పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని సుగాలీ కాలనీకి చెందిన దివ్యాంగుడు మేఘావతు బ్రహ్మనాయక్(45) శనివారం వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోయాడు.
చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం బసినికొండ పంచాయతీకి చెందిన భీమన్నగారి రామన్న(65) శుక్రవారం మధ్యాహ్నం పొలానికి నీళ్లు కడుతూ ఎండ తీవ్రత తట్టుకోలేక కుప్పకూలిపోయాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందాడు. శ్రీకాళహస్తికి చెందిన షేక్ రమీజాబీ(52) ఎండల తీవ్రతకు పదిరోజులక్రితం అనారోగ్యానికి గురైంది. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంది. శనివారం తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూసింది. అనంతపురం జిల్లా గుత్తి మండలం తురకపల్లికి చెందిన పెయింటర్ శ్రీనివాసులు(45), గుత్తి పట్టణంలోని ఎస్సీ కాలనీవాసి మాతాంగి రామకృష్ణ(28) వడదెబ్బతో మృత్యువాత పడ్డారు.