
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ రుతుపవనాలు రాకపోవడంతో వారం రోజులుగా రాష్ట్రంలో ఎండలు మండిపోయాయి. శనివారం రాష్ట్రంలోని పలు చోట్ల సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువ నమోదైనప్పటికీ... గత నాలుగు రోజుల ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే తక్కువగా నమోదయ్యాయి.
శనివారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 41.6 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 24 డిగ్రీ సెల్సియస్‌గా నమోదయ్యాయి. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
రెండ్రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రాక
నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సము ద్రంలోని చాలా భాగాలు, కొంకణ్‌లోని చాలా ప్రాంతాలు (ముంబైతో సహా), మధ్య మహా రాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలలోకి ప్రవేశించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 48 గంటల్లో తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ, మధ్య, వాయవ్య బం గాళాఖాతంలో రుతుపవనాలు మరింత ముం దుకు సాగడానికి అనుకూల పరిస్థితులున్నట్లు వివరించింది.
ప్రస్తుతం రాష్ట్రానికి పశ్చిమ దిశ నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్న కారణంగా రాష్ట్రంలోని నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడా ఆదివారం వడగాడ్పులు వీచే అవకాశం ఉందని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment