సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం నిప్పులకొలిమిపై మండుతోంది. తీవ్రమైన ఎండలతో జనం విలవిల్లాడుతున్నారు. ఉదయం 8 గంటలు దాటితేచాలు ఎండ తీవ్రతతో బెంబేలెత్తిపోతున్నారు. ఆరుబయట పనిచేసే కూలీలు, ఇతర కార్మి కులు, ఉద్యోగులు వడదెబ్బ బారినపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నైరుతి రుతుపవనాలు ప్రవేశించే వరకూ ఎండల తీవ్రత ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెబుతోంది.
ఎంత తీవ్రమైన ఎండ ఉన్నా రోజువారీ పనులు, శుభకార్యాలు, ఇతరత్రా కార్యకలాపాల కోసం ప్రజలు బయటకు రావాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకోసం పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ద్విచక్ర వాహనాలు, బస్సులు, ఆటోలను ఆశ్రయిస్తారు. ఎండలు దంచికొడుతున్నా ఉపాధి కూలీలు పని మానుకునే పరిస్థితి ఉండదు. దీంతో వేలాది మంది వడదెబ్బకు గురవుతున్నారు.
తీవ్రమైన జ్వరం, వాంతులు, వీరోచనాలకు గురవుతున్నారు. తలనొప్పి, వికారం ఉంటాయి. ఇలాంటి రోగాలతో వడదెబ్బ బాధితులు అనేక ఆసుపత్రులకు క్యూలు కడుతున్నారు. వేసవిలో జాగ్రత్తలు తీసుకోకపోతే పిల్లలు వడదెబ్బ, డయేరియా బారిన పడే ప్రమాదముంది. ఆహారం, తాగునీరు కలుషితమైతే పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక
అధిక వేడి, వడదెబ్బలతో మానవులపై శారీరక ప్రభావం ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తెలిపింది. కొందరిలో అకాల మరణం, వైకల్యం సంభవిస్తుందని హెచ్చరించింది. అధిక వేడి కారణంగా శ్వాసకోశ, గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటిస్, మూత్రపిండ వ్యాధులు కూడా సంభవిస్తాయి.
పగటి పూట గది ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, రాత్రి సమయంలో 24 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలని డబ్ల్యూహెచ్‌ఓ సూచించింది. ఎండ తీవ్రతకు గురయ్యే వారు కఠినమైన శారీరక శ్రమను నివారించాలి. తప్పనిసరిగా శ్రమతో కూడిన పని చేయాల్సి వస్తే, సాధారణంగా వేకువజామున 4 గంటల నుంచి ఉదయం 7 గంటల మధ్య ఉండేలా చూసుకోవాలి.
వేసవిలో చల్లగా ఉండడం ఎలా...
ఫ్లూయిడ్స్ పుష్కలంగా తాగాలి: వేడి వాతావరణంలో, పనితో సంబంధం లేకుండా ద్రవపదార్థాలు తీసుకోవాలి. దాహం వేసే వరకు వేచి ఉండకూడదు. రోజూ 8–10 గ్లాసుల కంటే ఎక్కువ నీరు తాగాలి. కొబ్బరి నీరు, తాజా పండ్ల రసాలు, మజ్జిగ, లస్సీ, నిమ్మకాయ నీరు, ప్రత్యేకంగా నీటితో ఎలక్ట్రోలైట్ తీసుకోవచ్చు. ఆల్కహాల్ లేదా పెద్ద మొత్తంలో చక్కెర ఉన్న ద్రవాలను తాగవద్దని నిపుణులు చెబుతున్నారు.
మసాలాలు మానుకోవాలి
తాజా పండ్లు, కూరగాయలు పుష్కలంగా తినాలి. వేడి ఆహారాలు తీసుకోవద్దు. అధిక మోతాదులో భోజనం చేయొద్దు. పుచ్చకాయ, ద్రాక్ష, పైనాపిల్, క్యారెట్, దోసకాయ వంటి చల్లని పదార్థాలను తీసుకోవాలి. రోజువారీ వంటలో మసాలాలు, ఆవాలు, ఎర్ర మిరపకాయలను ఉపయోగించడం మానుకోవాలి. ఎందుకంటే ఇవి వేడి లక్షణాలను తీవ్రతరం చేస్తాయి. పుల్లని, మసాలా ఆహారాలకు దూరంగా ఉండాలి.
తగిన దుస్తులు ధరించండి
♦ తేలికైన, లేత రంగు, వదులుగా ఉండే దుస్తులను ఎంచుకోవాలి. ముదురు రంగు బట్టలను ధరించవద్దు.
♦ చర్మాన్ని తేమగా ఉంచుకుని సంరక్షించుకోవాలి. ఆరుబయటకి వెళ్లాల్సి వస్తే సన్ గ్లాసెస్‌తోపాటు టోపీని ధరించడం ద్వారా సూర్యుని నుండి రక్షించుకోండి.
సాధారణంగా వేసవిలోవచ్చే వ్యాధులు
♦ నీటి ద్వారా వచ్చే వ్యాధులు: అతిసారం, విరోచనాలు, టైఫాయిడ్, కలరా, హెపటైటిస్ తదితరాలు
♦ అంటువ్యాధులు: దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు డెంగీ, మలేరియా, చికున్‌గున్యా
♦ వేడి సంబంధిత వ్యాధులు: వడదెబ్బ, డీహైడ్రేషన్, తలనొప్పి వంటివి
♦ చర్మ వ్యాధులు: సన్ బర్న్, టానింగ్, చర్మ కేన్సర్ వంటివి
♦ కంటి వ్యాధులు: కండ్లకలక వంటివి
Comments
Please login to add a commentAdd a comment