weather station
-
ఊళ్లు.. నీళ్లు.. కోస్తా కకావికలం
సాక్షి, అమరావతి, సాక్షి నెట్వర్క్: ఎడతెరిపి లేని అతి భారీ వర్షాలకు రాష్ట్రం అతలాకుతలమైంది. శుక్రవారం రాత్రి నుంచి కుండపోతగా కురుస్తున్న వర్షాలకు కోస్తా జిల్లాలు వణికిపోయాయి. వర్షపు నీరు వాగులా మారి రోడ్లపై ప్రవహిస్తుండడంతో విజయవాడ నగరం పూర్తిగా స్తంభించింది. మచిలీపట్నంలోనూ అదే పరిస్థితి నెలకొంది. విజయవాడ మొగల్రాజపురంలో ఇళ్లపై కొండ చరియలు విరిగిపడ్డ ఘటనలో ఐదుగురు మృతి చెందగా మంగళగిరిలో కొండరాయి తలపై పడి ఓ వృద్ధురాలు మరణించింది. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఉప్పలపాడు సమీపంలోని మురికివాగులో కారు కొట్టుకుపోవడంతో ఓ టీచర్, ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొండ చరియలు విరిగి పడడంతో అమ్మవారి దేవస్థానం కార్యాలయాలు ధ్వంసమయ్యాయి. వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. భూపరిపాలన కమిషనర్ జయలక్ష్మి నేతృత్వంలో 19 మంది అధికారులతో కమిటీని నియమించింది. మచిలీపట్నం, విజయవాడలో అన్ని ప్రధాన రోడ్లు, వీధులు, సందులు, ఖాళీ స్థలాలు వరద ప్రవాహంతో నిండిపోవడంతో ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు విజయవాడ సున్నపుబట్టీల సెంటర్ వద్ద శనివారం ఉదయం 7 గంటల సమయంలో కొండ చరియలు ఇళ్లపై విరిగి పడటంతో ఐదుగురు మృత్యువాత పడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక విద్యార్థి ఉన్నారు. నలుగురు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. నాలుగు ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మృతులను నవుడు మేఘన (25), బోలెం లక్ష్మీ(49), పుర్కట్ లాలో (38), జంపాన అన్నపూర్ణ (55), కమ్మరి సంతోషాచారి (18)గా గుర్తించారు. మరికొందరు శిథిలాల కింద ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. గుడ్లవల్లేరుకు చెందిన యశ్వంత్ అనే విద్యార్థి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు శనివారం రాత్రి ఘటన స్థలం వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. కొండ రాళ్లను తొలగించి యశ్వంత్ ఆచూకీ నిర్ధారించాల్సిందిగా పొలీసులను కోరారు. ప్రస్తుతం వాతావరణం అనుకూలించడం లేదని, పెద్ద రాళ్లను తొలగించటం సాధ్యం కాదని పోలీసులు తెలిపారు. ఆదివారం ఉదయం పెద్ద రాళ్లను తొలగిస్తే తప్ప నిర్ధారణకు రాలేమన్నారు. మరోసారి కొండ చరియలు విరిగి పడే సూచనలు కనిపిస్తుండటంతో సహాయ బృందాలు పలు ఇళ్లలో ప్రజలను ఖాళీ చేయించాయి. కాయ కష్టం చేసుకుని జీవించే వారంతా ఈ ఘటనతో బిక్కుబిక్కుమంటున్నారు. మరోవైపు ఇంద్రకీలాద్రిపై కొండ చరియలు విరిగిపడ్డ ఘటనలో సమాచార కేంద్రం, డోనార్ సెల్ ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో భక్తులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వర్షాలతో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. ఆర్టీసీ, ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వరి, మొక్కజొన్న, పత్తి మిరప పైర్లు నీట మునిగిపోయాయి. పసుపు, అరటి, కూరగాయ తోటలు ముంపుబారిన పడ్డాయి. మెట్ట రైతులకు భారీ నష్టం వాటిల్లింది. పెనమలూరు మండలం యనమలకుదురులో కొండ చరియలు విరిగిపడి షెడ్డు ధ్వంసం కావడంతో 20 జీవాలు మృత్యువాత పడ్డాయి. విజయవాడలో 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కమిషనర్ ధ్యాన చంద్ర తెలిపారు. ఎలాంటి సమస్య ఉన్నా 8181960909 నంబర్‌కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ⇒ ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. గుంటూరులో వర్షం బీభత్సం సృష్టించింది. 24 గంటల వ్యవధిలో 250 నుంచి 399 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. రోడ్లు జలాశయాలుగా మారాయి. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయాయి. జిల్లా వ్యాప్తంగా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. కలకత్తా–చెన్నై రహదారిపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. కాజా టోల్గేట్ వద్ద నాలుగు అడుగుల మేర వరద ప్రవాహంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. పెదకాకాని మండలం ఉప్పలపాడు వద్ద వాగులో కారు కొట్టుకుపోయిన ఘటనలో నంబూరు ప్రైవేట్ విద్యాసంస్థలో గణితం ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న నడుంపల్లి రాఘవేంద్రరావు(39), విద్యార్థులు పసుపులేని సౌదీస్ (6), కోడూరి మాన్విత్(9) మృత్యువాత పడ్డారు. మంగళగిరి కొత్తపేటలో కొండ చరియ విరిగి పడి రూకా నాగరత్నమ్మ (85) గాయాల పాలై మృతి చెందింది. ⇒ పల్నాడు జిల్లాలో 28 మండలాల పరిధిలో విస్తారంగా వర్షాలు పడ్డాయి. అచ్చంపేట మండలంలో దోసపాటి చెరువుకు గండి పడింది. ⇒ ఏలూరు జిల్లాలో కరాటం కృష్ణమూర్తి జల్లేరు జలాశయంలోకి వరద పోటెత్తింది. నూజివీడులో పెద్ద చెరువుకు గండిపడి పొలాలు ముంపునకు గురయ్యాయి. ⇒ ప్రకాశం జిల్లాలో శనివారం చలిగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. నెమలి గుండ్లరంగనాయకస్వామి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమైన 40 మంది భక్తులు చిక్కుకుపోయారు. ⇒ బాపట్ల జిల్లా పర్చూరు, అద్దంకి, చీరాల నియోజకవర్గాల్లో రహదారులు చెరువులను తలపించాయి. ⇒ పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు ఐదువేల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. తూర్పు గోదావరి జిల్లాలో పలుచోట్ల వృక్షాలు నేలకొరిగాయి. ⇒ శ్రీకాకుళం జిల్లాలో రోజంతా జల్లులు పడటంతో వాగులు, చెరువులు ఉరకలెత్తుతున్నాయి. కడలి కల్లోలంగా మారింది. ⇒ వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరులో అత్యధికంగా 97 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కర్నూలు జిల్లాను ముసురు కమ్మేసింది. జిల్లా మొత్తంగా సగటున 19.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ⇒ విశాఖలో శనివారం గరిష్టంగా సగటున 50 మి.మీ వర్షపాతం నమోదైంది.అష్ట దిగ్బంధంలో అమరావతిసాక్షి ప్రతినిధి, గుంటూరు, తాడికొండ: జోరు వర్షాలకు రాజధాని అమరావతి ప్రాంతం జల దిగ్బంధంలో చిక్కుకుంది. రాజధానిని వరద నీరు చుట్టుముట్టడంతో గ్రామాల నుంచి ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేదు. కొండవీటి వాగు ఉప్పొంగడంతో హైకోర్టుకు వెళ్లే ప్రధాన రహదారి నీటితో నిండిపోయింది. ఎస్ఆర్ఎం, విట్ వర్సిటీలు, పలు నివాస భవనాలు, లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. కొండవీటి వాగు ఉధృతికి తాడికొండ మండలం లాం గ్రామం వద్ద అమరావతి– గుంటూరు ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు చేరి రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. పెదపరిమి వద్ద కోటేళ్ల వాగు ఉప్పొంగడంతో రాజధానికి రాకపోకలు నిలిచిపోయాయి. అయ్యన్న వాగు, పాలవాగు కూడా పొంగి పొర్లుతున్నాయి. దొండపాడు టిడ్కో గృహాల వద్ద నీరు చేరడంతో బయటకు వచ్చే పరిస్థితి లేక అల్లాడుతున్నారు. నెక్కల్లు వద్ద వాగులో ఓ ఆటో గల్లంతు కావడంతో ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ ట్రాక్టరుపై వెళ్లి తాడు సాయంతో ముగ్గురిని రక్షించారు. అమరావతి ప్రాంతంలో ఎటు చూసినా వర్షపు నీరే కనిపిస్తోంది. చెరువులు ప్రమాదకర పరిస్థితికి చేరాయి. కొండవీటి వాగు గట్టుపై నుండి నీరు పొంగి ప్రవహిస్తోంది. ఈ వాగులో భారీగా జమ్ము, తూటికాడ అడ్డం పడుతుండటంతో నీరు ముందుకు కదలటం లేదు. దీంతో ఎగువ నుండి వస్తున్న వరద నీరంతా వెనక్కి తన్ని గ్రామాలు, పొలాల్లోకి వస్తోంది. దీంతో రాజధాని ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడలో రికార్డుస్థాయిలో వర్షంవిజయవాడలో వందేళ్ల చరిత్రలో ఆగస్టు నెలలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. శుక్రవారం సాయంత్రం 4 నుంచి శనివారం 4 గంటల వరకు 24 గంటల్లో నగరంలో 26.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శనివారం ఉదయం 8.30 నుంచి రాత్రి 9 గంటల వరకు తెనాలిలో 17.9, వత్సవాయిలో 17.75, మంగళగిరిలో 15.47, దాచేపల్లిలో 15.2, నూజివీడులో 15, వీరులపాడులో 14.95, ఆగిరిపల్లిలో 12.65, పెదకాకానిలో 11.25 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. కృష్ణా, గుంటూరులో ఇందుకే అధిక వర్షాలు నైరుతి రుతుపవనాలు కొనసాగుతున్న సమయంలో ఉత్తరాంధ్రలో వాయుగుండం ఏర్పడితే నైరుతి సెక్టార్లో ఉన్న దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రధానాధికారి స్టెల్లా తెలిపారు. ప్రస్తుతం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురవడానికి ఇదే కారణమని చెప్పారు. -
ముంచుకొస్తున్న వాయు‘గండం’
సాక్షి, విశాఖపట్నం: రాబోయే రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మేఘావృత వాతావరణం ఏర్పడుతుండటంతో రోజూ అర్ధరాత్రి సమయంలో వర్షాలు పడనున్నాయి. దీంతో పాటు ఈ నెల 29న తూర్పు మధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.ఇది క్రమంగా బలపడి వాయుగుండంగా మారే సూచనలున్నట్లు తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు చెబుతున్నారు. ఈ వాయుగుండం ఆంధ్రప్రదేశ్‌లోనే తీరం దాటే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, అది కూడా ఉత్తరాంధ్రలోనే దాటే సూచనలున్నట్లు తెలిపారు. దీని ప్రభావంతో రాబోయే రోజుల్లో వర్షాల తీవ్రత పెరుగుతుందన్నారు. సెప్టెంబర్ 5 వరకు వాయుగుండం ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. రాబోయే 2 రోజుల పాటు ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమల్లో వానలకు ఆస్కారం ఉందని అధికారులు వెల్లడించారు. -
నేటి నుంచి అక్కడక్కడా వానలు
సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు అరేబియా సముద్రం, గుజరాత్‌లోని మరికొన్ని ప్రాంతాల్లోకి, మహారాష్ట్రలోని మిగిలిన భాగాలు, మధ్యప్రదేశ్–ఛత్తీస్‌గడ్‌లోని మరికొన్ని భాగాలు, ఒడిశాలోని మిగిలిన భాగాలు.. జార్ఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించాయి. రానున్న మూడు, నాలుగు రోజుల్లో ఉత్తర అరేబియా సముద్రం, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్‌లోని మిగిలిన భాగాల్లోకి ప్రవేశించనున్నాయి. దేశమంతటా రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడింది.ఈ కారణంగా.. రాష్ట్ర వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. క్రమంగా కోస్తా, రాయలసీమల్లో వానలు విస్తరించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి ప్రభావంతో.. నేటి నుంచి రాష్ట్రంలో అక్కడక్కడా వానలు కురిసే అవకాశాలున్నాయి. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమల్లో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటినుంచి మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశాలున్నాయని అధికారులు వెల్లడించారు. -
సూరీడు 40+ హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండల తీవ్రత కనిపిస్తోంది. సాయంత్రం 6 గంటలు దాటి నా వేడిగాలులు వీస్తున్నాయి. ఇప్పటికే సాధారణం కంటే 2–3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమో దవుతుండగా వచ్చే మూడు రోజులపాటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని... కొన్ని జిల్లాల్లో 42ని–44 డిగ్రీల సెల్సియస్ మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అలాగే మంగళవారం నుంచి హైదరాబాద్ చుట్టు పక్కల జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 38–41 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. దిగువ స్థాయిలోని గాలులు వాయవ్య దిశ నుంచి రాష్ట్రం వైపు వీస్తున్నాయని వివరించింది. రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించే వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. సోమ వారం నల్లగొండలో 43.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదవగా భద్రాచలంలో 43.2 డిగ్రీలు, ఖమ్మంలో 43 డిగ్రీల చొప్పు న ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు వడదెబ్బకు గురై హనుమ కొండ జిల్లాలో ముస్కుపెంటు(52)అనే ఉపాధి హామీ కూలీ, మంచిర్యాల జిల్లాలో సంతోష్‌కుమార్ (36) అనే కానిస్టేబుల్ మృతి చెందారు. మరోవైపు రాష్ట్ర ప్రణాళికా విభా గం విడుదల చేసిన గణాంకాల ప్రకారం నల్లగొండ జిల్లా దామరచర్ల 45.3 డిగ్రీలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ 45.1 డిగ్రీలు, నల్లగొండ జిల్లా నిడ మానూరులో 44.9 డిగ్రీలు, ములుగు జిల్లా తాడ్వాయి, రామగుండంలో 44.4 డిగ్రీల చొప్పున, జగిత్యాల జిల్లా జైనా, కరీంనగర్ జిల్లా వీణవంక, మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో 44.3 డిగ్రీల చొప్పున, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారాంపట్నంలో 44.2 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, ఏపీలో కూడా వడగాడ్పులు, ఎండల ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. -
నిప్పులకొలిమి.. ఎండకు వెళ్తే మండిపోతారు! డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం నిప్పులకొలిమిపై మండుతోంది. తీవ్రమైన ఎండలతో జనం విలవిల్లాడుతున్నారు. ఉదయం 8 గంటలు దాటితేచాలు ఎండ తీవ్రతతో బెంబేలెత్తిపోతున్నారు. ఆరుబయట పనిచేసే కూలీలు, ఇతర కార్మి కులు, ఉద్యోగులు వడదెబ్బ బారినపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నైరుతి రుతుపవనాలు ప్రవేశించే వరకూ ఎండల తీవ్రత ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెబుతోంది. ఎంత తీవ్రమైన ఎండ ఉన్నా రోజువారీ పనులు, శుభకార్యాలు, ఇతరత్రా కార్యకలాపాల కోసం ప్రజలు బయటకు రావాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకోసం పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ద్విచక్ర వాహనాలు, బస్సులు, ఆటోలను ఆశ్రయిస్తారు. ఎండలు దంచికొడుతున్నా ఉపాధి కూలీలు పని మానుకునే పరిస్థితి ఉండదు. దీంతో వేలాది మంది వడదెబ్బకు గురవుతున్నారు. తీవ్రమైన జ్వరం, వాంతులు, వీరోచనాలకు గురవుతున్నారు. తలనొప్పి, వికారం ఉంటాయి. ఇలాంటి రోగాలతో వడదెబ్బ బాధితులు అనేక ఆసుపత్రులకు క్యూలు కడుతున్నారు. వేసవిలో జాగ్రత్తలు తీసుకోకపోతే పిల్లలు వడదెబ్బ, డయేరియా బారిన పడే ప్రమాదముంది. ఆహారం, తాగునీరు కలుషితమైతే పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక అధిక వేడి, వడదెబ్బలతో మానవులపై శారీరక ప్రభావం ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. కొందరిలో అకాల మరణం, వైకల్యం సంభవిస్తుందని హెచ్చరించింది. అధిక వేడి కారణంగా శ్వాసకోశ, గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటిస్, మూత్రపిండ వ్యాధులు కూడా సంభవిస్తాయి. పగటి పూట గది ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, రాత్రి సమయంలో 24 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది. ఎండ తీవ్రతకు గురయ్యే వారు కఠినమైన శారీరక శ్రమను నివారించాలి. తప్పనిసరిగా శ్రమతో కూడిన పని చేయాల్సి వస్తే, సాధారణంగా వేకువజామున 4 గంటల నుంచి ఉదయం 7 గంటల మధ్య ఉండేలా చూసుకోవాలి. వేసవిలో చల్లగా ఉండడం ఎలా... ఫ్లూయిడ్స్ పుష్కలంగా తాగాలి: వేడి వాతావరణంలో, పనితో సంబంధం లేకుండా ద్రవపదార్థాలు తీసుకోవాలి. దాహం వేసే వరకు వేచి ఉండకూడదు. రోజూ 8–10 గ్లాసుల కంటే ఎక్కువ నీరు తాగాలి. కొబ్బరి నీరు, తాజా పండ్ల రసాలు, మజ్జిగ, లస్సీ, నిమ్మకాయ నీరు, ప్రత్యేకంగా నీటితో ఎలక్ట్రోలైట్ తీసుకోవచ్చు. ఆల్కహాల్ లేదా పెద్ద మొత్తంలో చక్కెర ఉన్న ద్రవాలను తాగవద్దని నిపుణులు చెబుతున్నారు. మసాలాలు మానుకోవాలి తాజా పండ్లు, కూరగాయలు పుష్కలంగా తినాలి. వేడి ఆహారాలు తీసుకోవద్దు. అధిక మోతాదులో భోజనం చేయొద్దు. పుచ్చకాయ, ద్రాక్ష, పైనాపిల్, క్యారెట్, దోసకాయ వంటి చల్లని పదార్థాలను తీసుకోవాలి. రోజువారీ వంటలో మసాలాలు, ఆవాలు, ఎర్ర మిరపకాయలను ఉపయోగించడం మానుకోవాలి. ఎందుకంటే ఇవి వేడి లక్షణాలను తీవ్రతరం చేస్తాయి. పుల్లని, మసాలా ఆహారాలకు దూరంగా ఉండాలి. తగిన దుస్తులు ధరించండి ♦ తేలికైన, లేత రంగు, వదులుగా ఉండే దుస్తులను ఎంచుకోవాలి. ముదురు రంగు బట్టలను ధరించవద్దు. ♦ చర్మాన్ని తేమగా ఉంచుకుని సంరక్షించుకోవాలి. ఆరుబయటకి వెళ్లాల్సి వస్తే సన్ గ్లాసెస్తోపాటు టోపీని ధరించడం ద్వారా సూర్యుని నుండి రక్షించుకోండి. సాధారణంగా వేసవిలోవచ్చే వ్యాధులు ♦ నీటి ద్వారా వచ్చే వ్యాధులు: అతిసారం, విరోచనాలు, టైఫాయిడ్, కలరా, హెపటైటిస్ తదితరాలు ♦ అంటువ్యాధులు: దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు డెంగీ, మలేరియా, చికున్‌గున్యా ♦ వేడి సంబంధిత వ్యాధులు: వడదెబ్బ, డీహైడ్రేషన్, తలనొప్పి వంటివి ♦ చర్మ వ్యాధులు: సన్ బర్న్, టానింగ్, చర్మ కేన్సర్ వంటివి ♦ కంటి వ్యాధులు: కండ్లకలక వంటివి -
రెండ్రోజులు కోస్తాంధ్రకు వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం/పాడేరు: పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి సమీపంలో తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 5.1 కి.మీ. ఎత్తు వరకు విస్తరించింది. మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో స్వల్ప అల్పపీడనం ఏర్పడింది. ఇది క్రమంగా బలహీనపడి నెల్లూరు, తమిళనాడు వైపుగా ప్రయాణించే సూచనలు కనిపిస్తున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో శని, ఆదివారాల్లో విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయని వివరించారు. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయని తెలిపారు. రాయలసీమలో అక్కడక్కడా తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నెల 12న దక్షిణాంధ్ర, ఉత్తర తమిళనాడు ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని, దీని ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు ఈ నెల 13 నుంచి మొదలయ్యే సూచనలున్నాయని వెల్లడించారు. విజయవాడలో అత్యధిక వర్షపాతం 2021లో అత్యధిక వర్షపాతం నమోదైన నగరంగా విజయవాడ రికార్డు సృష్టించింది. తర్వాత స్థానంలో కడప ఉండటం విశేషం. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షపాత వివరాల్ని పరిశీలిస్తే.. విజయవాడలో అత్యధికంగా 1,548 మి.మీ. వర్షపాతం నమోదైంది. కడపలో 1,342, విజయనగరంలో 1,331 మి.మీ. వర్షం కురిసింది. సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైన నగరాల జాబితాలో అట్టడుగున నెల్లూరు 440 మి.మీ. వర్షపాతంతో ఉండగా, కర్నూలులో 461, కావలిలో 552, ఒంగోలులో 698 మి.మీ. వర్షపాతం నమోదైంది. పడిపోతున్న ఉష్ణోగ్రతలు విశాఖ ఏజెన్సీలో చలిగాలులు ప్రారంభమయ్యాయి. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. పొగమంచు దట్టంగా కురుస్తోంది. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం సూర్యోదయం అయ్యే వరకు చలి తీవ్రత నెలకొంది. అతిశీతల ప్రాంతాలుగా గుర్తింపు పొందిన కాఫీ తోటల ఏరియాల్లో మాత్రం చలిగాలులు అధికంగా వీస్తున్నాయి. పాడేరుకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అతిశీతల ప్రాంతం మినుములూరు కేంద్ర కాఫీ బోర్డు వద్ద ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఈ నెల 3న 17 డిగ్రీలు, 4వ తేదీన 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా, శుక్రవారం ఉదయం 10 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయింది. చింతపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రంలో శుక్రవారం 14.4, అరకులోయ కేంద్ర కాఫీ బోర్డు కార్యాలయంలో 18.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
AP: మూడు రోజులు వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో దక్షిణ మధ్య బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. రానున్న మూడు రోజుల్లో అల్పపీడనం పశ్చిమ దిశగా ప్రయాణించనుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనానికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ద్రోణి వాయవ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కోస్తా, రాయలసీమల్లో రానున్న మూడురోజులు విస్తారంగా వర్షాలు పడతాయని తెలిపారు. గురువారం నుంచి 30వ తేదీ వరకు మూడురోజులు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడా, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయని వివరించారు. 29, 30 తేదీల్లో విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల వానలు కురిశాయి. -
అక్కడక్కడా తేలికపాటి వర్షాలకు చాన్స్
మహారాణిపేట (విశాఖ దక్షిణ): ఉత్తర తమిళనాడు తీరంలో ఉపరితల ఆవర్తనం విస్తరిస్తోంది. ఇది సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. ఈ కారణంగా రాగల రెండు రోజుల్లో కోస్తాంధ్రలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాయలసీమ ప్రాంతంలోనూ కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. -
2 రోజులు వర్షాలు
సాక్షి, అమరావతి /మహారాణిపేట(విశాఖ దక్షిణ): జార్ఖండ్ నుంచి దక్షిణ కోస్తాంధ్రా వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. ఈ ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతోపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తాంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం వల్ల గాలుల వేగం రాష్ట్రంపై పెరిగింది. పశ్చిమ, వాయువ్య దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. గుంటూరు జిల్లాలో వర్షాలు.. కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం నుంచి పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. గుంటూరు నగరంతో పాటు దుగ్గిరాల, వినుకొండ, చిలకలూరిపేట, తాడికొండ, మంగళగిరి, రేపల్లె, బాపట్ల, పెదకాకాని మండలాల్లో వర్షం పడింది. -
దక్షిణ కోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: హిందూ మహాసముద్రం, దాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో దక్షిణ మధ్య బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడింది. ఇది రాగల 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం (ఐఎండీ) వెల్లడించింది. ఇది క్రమంగా పశ్చిమ వాయువ్య దిశ వైపు కదులుతూ దక్షిణ తమిళనాడు తీరం వైపుగా ప్రయాణించి ఈ నెల 25న తమిళనాడు–పుదుచ్ఛేరి తీర ప్రాంతానికి చేరనుందని ఐఎండీ వివరించింది. దీని ప్రభావంతో ఈ నెల 24, 25 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే సూచనలున్నాయని ఐఎండీ అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 55 నుంచి గరిష్టంగా 75 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించారు. ఆయా తేదీల్లో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. మరోవైపు శనివారం అనంతపురంలో రికార్డు స్థాయిలో 14.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మినుములూరులో 14.7, చింతపల్లిలో 15.2, అరకులో 18.8 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
నేడు, రేపు మోస్తరు వర్షాలు
మహారాణిపేట (విశాఖ దక్షిణ): ఉపరితల ద్రోణి వల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఈశాన్య, తూర్పు దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. కొమరిన్ ప్రాంతం నుంచి ఉత్తర తమిళనాడు తీరం వరకు 1.5 కిలోమీటర్లు ఎత్తు వరకు కొనసాగుతున్న ఉపరితల ద్రోణి పశ్చిమ దిశగా ప్రయాణిస్తోంది. ఇది మాల్దీవుల నుంచి ఆగ్నేయ ఆరేబియా సముద్రం వరకు కొనసాగుతున్న ఉపరితల ద్రోణిలో విలీనమైందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఈ ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో (బుధ, గురువారాల్లో) ఉత్తర, దక్షిణ కోస్తాలతోపాటు రాయలసీమ ప్రాంతాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మేఘాలు ఆవరించడం వల్ల రాత్రిపూట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని, అనేక ప్రాంతాల్లో రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గాయని తెలిపారు. మంగళవారం చీమకుర్తి (ప్రకాశం)లో 7 సెం.మీ., సూళ్లురుపేట (నెల్లూరు), తడ (నెల్లూరు)లో 6, ఒంగోలు, దర్శిలో 5, అర్ధవీడు(ప్రకాశం), నెల్లూరులలో 4 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. -
దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం : కొమరిన్ ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం దక్షిణ కోస్తాంధ్ర తీరానికి సమీపంలోని నైరుతి బంగాళాఖాతం వరకు వ్యాపించింది. ఇది సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో నేడు, రేపు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ కోస్తాలో సోమవారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంది. -
దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి తమిళనాడు తీరానికి సమీపంలో కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల రెండు రోజులు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. శని, ఆదివారాల్లో దక్షిణ కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. దీపావళి తర్వాత చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. గడచిన 24 గంటల్లో కావలిలో 7 సెం.మీ., సూళ్లూరుపేటలో 6, ఒంగోలు, తడ, వింజమూరు, శ్రీకాళహస్తి, తొట్టంబేడులో 4, వెంకటగిరి, చీమకుర్తి, సత్యవేడు, పుల్లంపేటలో 3 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. -
రాష్ట్రంలో రెండు రోజులు వానలు
సాక్షి, విశాఖపట్నం: ఈశాన్య రుతుపవనాలు విస్తరిస్తున్న నేపథ్యంలో కోస్తాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దేశవ్యాప్తంగా బుధవారం నైరుతి రుతుపవనాలు నిష్క్రమించనున్నాయి. మధ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో 1.5 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా.. ఉత్తర తమిళనాడు తీరానికి సమీపంలో నైరుతి బంగాళాఖాతంలో 3.1 నుంచి 5.8 కి.మీ ఎత్తు మధ్య మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. -
‘నైరుతి’ నిష్క్రమణం.. ‘ఈశాన్యం’ ఆగమనం
సాక్షి, విశాఖపట్నం: విస్తారమైన వానల్ని కురిపించిన నైరుతి రుతు పవనాలు సోమవారం రాష్ట్రం నుంచి నిష్క్రమించాయి. దేశవ్యాప్తంగా ఈ నెల 28న నైరుతి రుతు పవనాలు వైదొలగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇదే సమయంలో బంగాళాఖాతం, దక్షిణ ద్వీపకల్ప భారత్‌పై దిగువ ట్రోపో ఆవరణం స్థాయిలో ఈశాన్య గాలులు ఏర్పడ్డాయి. ఇవి ముందుకు కదిలి.. కోస్తాంధ్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్ఛేరి ప్రాంతాల్లో 28న వర్షాలతో ప్రవేశించనున్నాయని అధికారులు పేర్కొన్నారు. మొత్తానికి ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు 8.7 శాతం మిగులు వర్షపాతంతో వైదొలగనున్నాయి. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈశాన్య, మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో 3.1 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది. ఈ ఆవర్తనం నుంచి ఉపరితల ద్రోణి నైరుతి బంగాళాఖాతం మీదుగా దక్షిణ తమిళనాడు వరకు 1.5 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది. రాగల రెండు రోజులపాటు కోస్తా, రాయలసీమల్లో మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. -
48 గంటల్లో అల్పపీడనం తీవ్ర రూపం
సాక్షి, హైదరాబాద్: ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వచ్చే 48 గంటల్లో తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రానున్న రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వివరించింది. కాగా, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.