ముంచెత్తిన వాన.. ఏకమైన దారులు, ఏరులు
విజయవాడలో ఇళ్లపై కొండ చరియలు విరిగిపడి ఐదుగురు మృత్యువాత
మంగళగిరిలో తలపై కొండరాయి పడటంతో వృద్ధురాలు మృతి
పెదకాకాని వద్ద వాగులో కొట్టుకుపోయిన కారు.. ఓ టీచర్, ఇద్దరు విద్యార్థుల మృతి
ఇంద్రకీలాద్రిపై విరిగిపడిన కొండ చరియలు, ధ్వంసమైన కార్యాలయాలు
తటాకాలుగా మారిన రోడ్లు... బెజవాడ, బందరులో స్తంభించిన జనజీవనం
గుంటూరులో బీభత్సం.. కాజ టోల్‌గేట్ వద్ద నాలుగు అడుగుల మేర ప్రవాహం
రాజధాని అమరావతిని చుట్టుముట్టిన వరద.. పోటెత్తిన వాగులు.. హైకోర్టులో పలు సెక్షన్లలోకి నీళ్లు
నల్లమలలో ఉధృతంగా గుండ్లకమ్మ.. వాగులో చిక్కుకున్న 40 మంది భక్తులు సురక్షితం
ప్రాథమికంగా దాదాపు 2 లక్షల ఎకరాల్లో మునిగిపోయిన పంటలు.. పల్నాడులో పత్తి, మిరప, అపరాలు, వరి నీట మునక
మరో 2 రోజులు కొనసాగనున్న వర్షాలు.. కోస్తాకు రెడ్ అలర్ట్.. రైతన్నల్లో ఆందోళన
కళింగపట్నం వద్ద తీరం దాటనున్న వాయుగుండం
సాక్షి, అమరావతి, సాక్షి నెట్‌వర్క్: ఎడతెరిపి లేని అతి భారీ వర్షాలకు రాష్ట్రం అతలాకుతలమైంది. శుక్రవారం రాత్రి నుంచి కుండపోతగా కురుస్తున్న వర్షాలకు కోస్తా జిల్లాలు వణికిపోయాయి. వర్షపు నీరు వాగులా మారి రోడ్లపై ప్రవహిస్తుండడంతో విజయవాడ నగరం పూర్తిగా స్తంభించింది. మచిలీపట్నంలోనూ అదే పరిస్థితి నెలకొంది. విజయవాడ మొగల్రాజపురంలో ఇళ్లపై కొండ చరియలు విరిగిపడ్డ ఘటనలో ఐదుగురు మృతి చెందగా మంగళగిరిలో కొండరాయి తలపై పడి ఓ వృద్ధురాలు మరణించింది.
గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఉప్పలపాడు సమీపంలోని మురికివాగులో కారు కొట్టుకుపోవడంతో ఓ టీచర్, ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొండ చరియలు విరిగి పడడంతో అమ్మవారి దేవస్థానం కార్యాలయాలు ధ్వంసమయ్యాయి. వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. భూపరిపాలన కమిషనర్ జయలక్ష్మి నేతృత్వంలో 19 మంది అధికారులతో కమిటీని నియమించింది.
మచిలీపట్నం, విజయవాడలో అన్ని ప్రధాన రోడ్లు, వీధులు, సందులు, ఖాళీ స్థలాలు వరద ప్రవాహంతో నిండిపోవడంతో ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు విజయవాడ సున్నపుబట్టీల సెంటర్ వద్ద శనివారం ఉదయం 7 గంటల సమయంలో కొండ చరియలు ఇళ్లపై విరిగి పడటంతో ఐదుగురు మృత్యువాత పడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక విద్యార్థి ఉన్నారు. నలుగురు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు.
నాలుగు ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మృతులను నవుడు మేఘన (25), బోలెం లక్ష్మీ(49), పుర్కట్ లాలో (38), జంపాన అన్నపూర్ణ (55), కమ్మరి సంతోషాచారి (18)గా గుర్తించారు. మరికొందరు శిథిలాల కింద ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. గుడ్లవల్లేరుకు చెందిన యశ్వంత్ అనే విద్యార్థి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు శనివారం రాత్రి ఘటన స్థలం వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. కొండ రాళ్లను తొలగించి యశ్వంత్ ఆచూకీ నిర్ధారించాల్సిందిగా పొలీసులను కోరారు.
ప్రస్తుతం వాతావరణం అనుకూలించడం లేదని, పెద్ద రాళ్లను తొలగించటం సాధ్యం కాదని పోలీసులు తెలిపారు. ఆదివారం ఉదయం పెద్ద రాళ్లను తొలగిస్తే తప్ప నిర్ధారణకు రాలేమన్నారు. మరోసారి కొండ చరియలు విరిగి పడే సూచనలు కనిపిస్తుండటంతో సహాయ బృందాలు పలు ఇళ్లలో ప్రజలను ఖాళీ చేయించాయి. కాయ కష్టం చేసుకుని జీవించే వారంతా ఈ ఘటనతో బిక్కుబిక్కుమంటున్నారు.
మరోవైపు ఇంద్రకీలాద్రిపై కొండ చరియలు విరిగిపడ్డ ఘటనలో సమాచార కేంద్రం, డోనార్ సెల్ ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో భక్తులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వర్షాలతో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. ఆర్టీసీ, ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వరి, మొక్కజొన్న, పత్తి మిరప పైర్లు నీట మునిగిపోయాయి.
పసుపు, అరటి, కూరగాయ తోటలు ముంపుబారిన పడ్డాయి. మెట్ట రైతులకు భారీ నష్టం వాటిల్లింది. పెనమలూరు మండలం యనమలకుదురులో కొండ చరియలు విరిగిపడి షెడ్డు ధ్వంసం కావడంతో 20 జీవాలు మృత్యువాత పడ్డాయి. విజయవాడలో 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కమిషనర్ ధ్యాన చంద్ర తెలిపారు. ఎలాంటి సమస్య ఉన్నా 8181960909 నంబర్‌కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.
⇒ ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. గుంటూరులో వర్షం బీభత్సం సృష్టించింది. 24 గంటల వ్యవధిలో 250 నుంచి 399 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. రోడ్లు జలాశయాలుగా మారాయి. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయాయి. జిల్లా వ్యాప్తంగా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. కలకత్తా–చెన్నై రహదారిపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.
కాజా టోల్‌గేట్ వద్ద నాలుగు అడుగుల మేర వరద ప్రవాహంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. పెదకాకాని మండలం ఉప్పలపాడు వద్ద వాగులో కారు కొట్టుకుపోయిన ఘటనలో నంబూరు ప్రైవేట్ విద్యాసంస్థలో గణితం ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న నడుంపల్లి రాఘవేంద్రరావు(39), విద్యార్థులు పసుపులేని సౌదీస్ (6), కోడూరి మాన్విత్(9) మృత్యువాత పడ్డారు. మంగళగిరి కొత్తపేటలో కొండ చరియ విరిగి పడి రూకా నాగరత్నమ్మ (85) గాయాల పాలై మృతి చెందింది.
⇒ పల్నాడు జిల్లాలో 28 మండలాల పరిధిలో విస్తారంగా వర్షాలు పడ్డాయి. అచ్చంపేట మండలంలో దోసపాటి చెరువుకు గండి పడింది.
⇒ ఏలూరు జిల్లాలో కరాటం కృష్ణమూర్తి జల్లేరు జలాశయంలోకి వరద పోటెత్తింది. నూజివీడులో పెద్ద చెరువుకు గండిపడి పొలాలు ముంపునకు గురయ్యాయి.
⇒ ప్రకాశం జిల్లాలో శనివారం చలిగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. నెమలి గుండ్లరంగనాయకస్వామి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమైన 40 మంది భక్తులు చిక్కుకుపోయారు.
⇒ బాపట్ల జిల్లా పర్చూరు, అద్దంకి, చీరాల నియోజకవర్గాల్లో రహదారులు చెరువులను తలపించాయి.
⇒ పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు ఐదువేల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. తూర్పు గోదావరి జిల్లాలో పలుచోట్ల వృక్షాలు నేలకొరిగాయి.
⇒ శ్రీకాకుళం జిల్లాలో రోజంతా జల్లులు పడటంతో వాగులు, చెరువులు ఉరకలెత్తుతున్నాయి. కడలి కల్లోలంగా మారింది.
⇒ వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరులో అత్యధికంగా 97 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కర్నూలు జిల్లాను ముసురు కమ్మేసింది. జిల్లా మొత్తంగా సగటున 19.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
⇒ విశాఖలో శనివారం గరిష్టంగా సగటున 50 మి.మీ వర్షపాతం నమోదైంది.
అష్ట దిగ్బంధంలో అమరావతి
సాక్షి ప్రతినిధి, గుంటూరు, తాడికొండ: జోరు వర్షాలకు రాజధాని అమరావతి ప్రాంతం జల దిగ్బంధంలో చిక్కుకుంది. రాజధానిని వరద నీరు చుట్టుముట్టడంతో గ్రామాల నుంచి ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేదు. కొండవీటి వాగు ఉప్పొంగడంతో హైకోర్టుకు వెళ్లే ప్రధాన రహదారి నీటితో నిండిపోయింది. ఎస్‌ఆర్‌ఎం, విట్ వర్సిటీలు, పలు నివాస భవనాలు, లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. కొండవీటి వాగు ఉధృతికి తాడికొండ మండలం లాం గ్రామం వద్ద అమరావతి– గుంటూరు ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు చేరి రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది.
పెదపరిమి వద్ద కోటేళ్ల వాగు ఉప్పొంగడంతో రాజధానికి రాకపోకలు నిలిచిపోయాయి. అయ్యన్న వాగు, పాలవాగు కూడా పొంగి పొర్లుతున్నాయి. దొండపాడు టిడ్కో గృహాల వద్ద నీరు చేరడంతో బయటకు వచ్చే పరిస్థితి లేక అల్లాడుతున్నారు. నెక్కల్లు వద్ద వాగులో ఓ ఆటో గల్లంతు కావడంతో ఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్ ట్రాక్టరుపై వెళ్లి తాడు సాయంతో ముగ్గురిని రక్షించారు. అమరావతి ప్రాంతంలో ఎటు చూసినా వర్షపు నీరే కనిపిస్తోంది.
చెరువులు ప్రమాదకర పరిస్థితికి చేరాయి. కొండవీటి వాగు గట్టుపై నుండి నీరు పొంగి ప్రవహిస్తోంది. ఈ వాగులో భారీగా జమ్ము, తూటికాడ అడ్డం పడుతుండటంతో నీరు ముందుకు కదలటం లేదు. దీంతో ఎగువ నుండి వస్తున్న వరద నీరంతా వెనక్కి తన్ని గ్రామాలు, పొలాల్లోకి వస్తోంది. దీంతో రాజధాని ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
విజయవాడలో రికార్డుస్థాయిలో వర్షం
విజయవాడలో వందేళ్ల చరిత్రలో ఆగస్టు నెలలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. శుక్రవారం సాయంత్రం 4 నుంచి శనివారం 4 గంటల వరకు 24 గంటల్లో నగరంలో 26.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శనివారం ఉదయం 8.30 నుంచి రాత్రి 9 గంటల వరకు తెనాలిలో 17.9, వత్సవాయిలో 17.75, మంగళగిరిలో 15.47, దాచేపల్లిలో 15.2, నూజివీడులో 15, వీరులపాడులో 14.95, ఆగిరిపల్లిలో 12.65, పెదకాకానిలో 11.25 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది.
కృష్ణా, గుంటూరులో ఇందుకే అధిక వర్షాలు
నైరుతి రుతుపవనాలు కొనసాగుతున్న సమయంలో ఉత్తరాంధ్రలో వాయుగుండం ఏర్పడితే నైరుతి సెక్టార్‌లో ఉన్న దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రధానాధికారి స్టెల్లా తెలిపారు. ప్రస్తుతం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురవడానికి ఇదే కారణమని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment