సాక్షి నెట్‌వర్క్ : భానుడు ఉగ్రరూపం దాల్చాడు. మండుతున్న ఎండలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుతుండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్టోగ్రతలు 48 డిగ్రీలకు చేరువగా నమోదవుతున్నాయి. అత్యవసర పనులపై వెళ్లాల్సిన వారు వడదెబ్బ బారిన పడుతున్నారు. మంగళవారం ఒక్కరోజే 55 మంది వ్యక్తులు పిట్టల్లా రాలిపోవడం చూస్తుంటే పరిస్థితి తీవ్రత ఇట్టే అర్థమవుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 18 మంది, నల్లగొండ జిల్లాలో 10 మంది, ఖమ్మం జిల్లాలో 13 మంది, వరంగల్ జిల్లాలో 14 మంది మృతి చెందారు. జగిత్యాల జిల్లాలోని బీర్పూర్ మండలం కొల్వాయి, వెల్గటూరు మండలం రాజారాంపల్లి గ్రామాల్లో రెండ్రోజులుగా రాష్ట్రంలోనే అత్యధికంగా ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం ఏకంగా 47.9 డిగ్రీలకు చేరుకున్నాయి. ఈ స్థాయిలో ఎండలు గతంలో చూడలేదని వృద్ధులు అంటున్నారు. ఉష్ణోగ్రతల ధాటికి కూలర్లు సైతం ఉపశమనం కల్పించడం లేదు. ప్రజలు చెట్ల నీడన చేరి సాంత్వన పొందుతున్నారు.
రానున్న మూడ్రోజులు తీవ్ర వడగాడ్పులు
రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో రానున్న మూడు రోజుల పాటు సాధారణం నుంచి తీవ్ర వడగాడ్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు మంగళవారం వెల్లడించారు. మరోవైపు మధ్య మహారాష్ట్ర నుంచి కోమోరిన్ ప్రాంతం వరకు ఇంటీరియర్ కర్ణాటక, ఇంటీరియర్ తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోందని పేర్కొన్నారు. దీంతో బుధ, గురువారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. ఇదిలావుండగా రాష్ట్రంలో తీవ్రమైన వడగాడ్పులు వీస్తున్నాయి. మంగళవారం 43 నుంచి 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, నిజామాబాద్‌ల్లో ఏకంగా 46 డిగ్రీల చొప్పన ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. హన్మకొండ, ఖమ్మం, మెదక్, నల్లగొండ, రామగుండంల్లో 45 డిగ్రీలు, మహబూబ్‌నగర్‌లో 44, హైదరాబాద్, భద్రాచలంల్లో 43 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
రాష్ట్రంలో మంగళవారం అత్యధికంగా నమోదైన ఉష్టోగ్రతలు
భానుడి ఉగ్రరూపం
Published Wed, May 29 2019 2:43 AM | Last Updated on Wed, May 29 2019 7:25 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment