సాక్షి, హైదరాబాద్: ఆయనో ఆర్టీసీ బస్సు కండక్టర్.. కొడుకు పుట్టినరోజు వేడుకను పొద్దున్నే పూర్తి చేసుకుని సెకండ్ షిఫ్ట్ డ్యూటీకి వెళ్లాడు. డిపోకు రాగానే అందుబాటులో ఉన్న తోటి కార్మికులు ఆయన చుట్టూ మూగారు. కొడుకు పేరుతో డిపోలోని సిబ్బంది అందరికి మజ్జిగ తాగించమని అడిగారు. జేబులోంచి రూ.2 వేలు తీసి అప్పటికప్పుడు పెరుగు డబ్బాలు తెప్పించి మజ్జిగ చేయించి అందరికీ తాగించాడు. కానీ మరుసటి రోజు ఎవరింటిలో ఏ ప్రత్యేక సందర్భం లేకపోవటంతో సిబ్బందికి మజ్జిగ లేకుండా పోయింది. ఈ వ్యవహారం కాస్త ఆశ్చర్యంగా ఉన్నా.. ఇప్పుడు ఆర్టీసీ డిపోల్లో జరుగుతున్న తంతు ఇదే. భగభగలాడుతున్న భానుడి ప్రభావానికి గురికాకుండా వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే ఇలా మజ్జిగనో, నిమ్మరసమో తాగాల్సి ఉంది. అవి దొరకాలంటే కచ్చితంగా సిబ్బందిలో ఎవరింటిలోనో ప్రత్యేక సందర్భం ఉంటే వారి పేరుతో ఆ సిబ్బంది జేబు ఖర్చు నుంచి తెప్పించాల్సిందే. లేదంటే మంచినీళ్లు తాగి సరిపెట్టుకోవాల్సిందే. జీతాలు చెల్లించేందుకు డబ్బులు లేక అల్లాడుతున్న ఆర్టీసీలో సిబ్బందికి మజ్జిగ తాగించే పరిస్థితి లేకుండా పోయింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ముందుజాగ్రత్త చర్యగా పాఠశాలల సెలవులను ప్రభుత్వం పొడిగించింది. కానీ ఉష్ణోగ్రత ఎంతున్నా సరే విధుల్లో నిమగ్నమయ్యే డ్రైవర్లు, కండక్టర్లకు మాత్రం వేసవి నుంచి కాస్త ఉపశమనం కూడా లేకుండా పోవటం గమనార్హం.
నయా పైసా రాదు..
ఓవైపు ఎండ తీవ్రత.. మరోవైపు ఇంజిన్ వేడితో ఆర్టీసీ డ్రైవర్లు నరకయాతన అనుభవిస్తున్నారు. ఎండలో గంటల తరబడి బస్సు ఉంటుండటంతో అది బాగా వేడెక్కి డ్రైవర్లు, కండక్టర్లు సెగకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో వడదెబ్బకు గురికాకుండా వారికి మంచినీటితోపాటు మజ్జిగ, నిమ్మరసం సరఫరా చేయాల్సి ఉంది. కానీ మంచినీళ్లు తప్ప అవి దొరికే పరిస్థితి లేదు. బస్‌భవన్ నుంచి డిపోలకు వీటి ఖర్చు కోసం నయాపైసా రావటం లేదు. కొన్ని డిపోల్లో మేనేజర్లే సొంత ఖర్చుతో కొన్నిరోజులు వాటిని ఏర్పాటు చేసినా కొనసాగించలేక చేతులెత్తేస్తున్నారు. ఫలితంగా సిబ్బంది రోజుకొకరు చొప్పున వాటాలేసుకుని వాటిని ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కువ మంది సిబ్బంది ఉండే డిపో అయితే రోజువారి ఖర్చు దాదాపు రూ.2 వేలు అవుతోంది. అంతమొత్తం భరించటం కొందరికి ఇబ్బందిగా మారటంతో చేతులెత్తేస్తున్నారు. మరో 20 రోజులకుపైగా ఎండలు కొనసాగనున్నాయి. రోహిణి కార్తె కావటంతో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. గత 2 రోజులుగా 45 డిగ్రీలను మించుతుండటంతో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇంత ఎండలో సెకండ్ షిఫ్ట్‌లో ఉండే డ్రైవర్లు, కండక్టర్లు బస్సులో ఏర్పడే సెగతో వడదెబ్బకు గురవుతున్నారు. దాన్నించి తప్పించుకోవాలంటే సొంత డబ్బులతోనే మజ్జిగ, నిమ్మరసం తాగాల్సి వస్తోంది.
కోటితో వేసవి మొత్తం..
రాష్ట్రంలో ఉన్న 97 డిపోలకు వేసవి మొత్తం మజ్జిగ, నిమ్మరసం నిత్యం అందుబాటులో ఉంచాలంటే దాదాపు రూ.కోటి వరకు ఖర్చవుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితిలో అది ఆర్టీసీకి భరించలేని మొత్తమే. నిత్యం రూ.11 కోట్ల ఆదాయం ఉన్నా, ఖర్చు దాన్ని మించి ఉంటుండటంతో ఆర్టీసీ నష్టాల్లోకి కూరుకుపోతోంది. వేరే పద్దు నుంచి ఈ ఖర్చును భరిద్దామన్నా అవకాశం ఉండటం లేదు. దీంతో డబ్బు లేక వేసవి ప్లాన్‌ను అమలు చేయటం లేదు. మంచినీళ్లు చల్లగా ఉండేందు కు కుండలు కొనటం తప్ప వేసవి ప్లాన్‌లో మజ్జిగ, నిమ్మరసం సరఫరా లేకుండా పోయింది. ఇలాంటి తరుణంలో ఉన్నతాధికారులు దాతలతో మాట్లాడి వాటిని ఏర్పాటు చేసే వీలున్నా అది అమలు కావటం లేదు. రాష్ట్రంలో విజయ డెయిరీతోపాటు పలు ప్రైవేటు డెయిరీలున్నాయి. వాటి యజమానులతో ఉన్నతస్థాయి వర్గాలు మాట్లాడితే.. సామాజిక బాధ్యత కింద పెరుగు సరఫరా చేసే అవకాశం ఉంది. కానీ ఆర్టీసీ యాజమాన్యం ఈసారి అలాంటి ప్రయత్నమే చేయలేదు. డిపో మేనేజేర్ల స్థాయిలో చిన్న దాతలు తప్ప పెద్ద స్థాయి కంపెనీలతో మాట్లాడటం సాధ్యం కావటం లేదు. చిన్న దాతలు ఒకట్రెండు రోజులు ఖర్చు భరించటానికే పరిమితమవుతున్నారు.
డబుల్ డ్యూటీలపై ఆరా.. మజ్జిగ సంగతి పట్టించుకోరా..
డ్రైవర్లు కొరత వల్ల కొన్ని సర్వీసులు నిత్యం డిపోలకే పరిమితం కావాల్సి వస్తోంది. కొందరు డ్రైవర్లను డబుల్ డ్యూటీలకు ఒప్పించటం ద్వారా కొన్ని సర్వీసులను తిప్ప గలుగుతున్నారు. ఎండలు తీవ్రంగా ఉండటంతో డబుల్ డ్యూటీలకు వారు నిరాకరిస్తున్నారు. ఫలితంగా డిపోలకు పరిమితమయ్యే బస్సుల సంఖ్య పెరుగుతోంది. ఇది మళ్లీ ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే అంశం కావటంతో ఉన్నతాధికారు లు నిత్యం డిపో మేనేజర్ల స్థాయిలో వాకబు చేస్తూ డబుల్ డ్యూటీల విషయంపై ఆరా తీస్తున్నా రు. బస్సులు నిలిచిపోతే ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉన్నందున ఎలాగోలా కొందరు డ్రైవర్లను ఒప్పించి డబుల్ డ్యూటీలకు పంపాలని పేర్కొంటున్నారు. ఎండలో మాడిపోతున్నా డబుల్ డ్యూటీలకు పంపుతూ.. వడ దెబ్బకు గురికాకుండా మజ్జిగ ఏర్పాటు చేయలేరా అంటూ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క రోజు బస్సులు ఆగిపోతే జనం అల్లాడిపోతారు. అలాంటి అతి ముఖ్యమైన బస్సులను ఎండ తీవ్రతకు వెరవకుండా నడుపుతున్న వారికి ఇప్పటికైనా మజ్జిగ, నిమ్మరసం అందుబాటులో ఉంచాల్సిన అవసరాన్ని గుర్తించాలని కార్మికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment