Sunny intensity
-
'సల్ల'ని కబురేది?
సాక్షి, హైదరాబాద్: ఆయనో ఆర్టీసీ బస్సు కండక్టర్.. కొడుకు పుట్టినరోజు వేడుకను పొద్దున్నే పూర్తి చేసుకుని సెకండ్ షిఫ్ట్ డ్యూటీకి వెళ్లాడు. డిపోకు రాగానే అందుబాటులో ఉన్న తోటి కార్మికులు ఆయన చుట్టూ మూగారు. కొడుకు పేరుతో డిపోలోని సిబ్బంది అందరికి మజ్జిగ తాగించమని అడిగారు. జేబులోంచి రూ.2 వేలు తీసి అప్పటికప్పుడు పెరుగు డబ్బాలు తెప్పించి మజ్జిగ చేయించి అందరికీ తాగించాడు. కానీ మరుసటి రోజు ఎవరింటిలో ఏ ప్రత్యేక సందర్భం లేకపోవటంతో సిబ్బందికి మజ్జిగ లేకుండా పోయింది. ఈ వ్యవహారం కాస్త ఆశ్చర్యంగా ఉన్నా.. ఇప్పుడు ఆర్టీసీ డిపోల్లో జరుగుతున్న తంతు ఇదే. భగభగలాడుతున్న భానుడి ప్రభావానికి గురికాకుండా వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే ఇలా మజ్జిగనో, నిమ్మరసమో తాగాల్సి ఉంది. అవి దొరకాలంటే కచ్చితంగా సిబ్బందిలో ఎవరింటిలోనో ప్రత్యేక సందర్భం ఉంటే వారి పేరుతో ఆ సిబ్బంది జేబు ఖర్చు నుంచి తెప్పించాల్సిందే. లేదంటే మంచినీళ్లు తాగి సరిపెట్టుకోవాల్సిందే. జీతాలు చెల్లించేందుకు డబ్బులు లేక అల్లాడుతున్న ఆర్టీసీలో సిబ్బందికి మజ్జిగ తాగించే పరిస్థితి లేకుండా పోయింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ముందుజాగ్రత్త చర్యగా పాఠశాలల సెలవులను ప్రభుత్వం పొడిగించింది. కానీ ఉష్ణోగ్రత ఎంతున్నా సరే విధుల్లో నిమగ్నమయ్యే డ్రైవర్లు, కండక్టర్లకు మాత్రం వేసవి నుంచి కాస్త ఉపశమనం కూడా లేకుండా పోవటం గమనార్హం. నయా పైసా రాదు.. ఓవైపు ఎండ తీవ్రత.. మరోవైపు ఇంజిన్ వేడితో ఆర్టీసీ డ్రైవర్లు నరకయాతన అనుభవిస్తున్నారు. ఎండలో గంటల తరబడి బస్సు ఉంటుండటంతో అది బాగా వేడెక్కి డ్రైవర్లు, కండక్టర్లు సెగకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో వడదెబ్బకు గురికాకుండా వారికి మంచినీటితోపాటు మజ్జిగ, నిమ్మరసం సరఫరా చేయాల్సి ఉంది. కానీ మంచినీళ్లు తప్ప అవి దొరికే పరిస్థితి లేదు. బస్‌భవన్ నుంచి డిపోలకు వీటి ఖర్చు కోసం నయాపైసా రావటం లేదు. కొన్ని డిపోల్లో మేనేజర్లే సొంత ఖర్చుతో కొన్నిరోజులు వాటిని ఏర్పాటు చేసినా కొనసాగించలేక చేతులెత్తేస్తున్నారు. ఫలితంగా సిబ్బంది రోజుకొకరు చొప్పున వాటాలేసుకుని వాటిని ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కువ మంది సిబ్బంది ఉండే డిపో అయితే రోజువారి ఖర్చు దాదాపు రూ.2 వేలు అవుతోంది. అంతమొత్తం భరించటం కొందరికి ఇబ్బందిగా మారటంతో చేతులెత్తేస్తున్నారు. మరో 20 రోజులకుపైగా ఎండలు కొనసాగనున్నాయి. రోహిణి కార్తె కావటంతో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. గత 2 రోజులుగా 45 డిగ్రీలను మించుతుండటంతో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇంత ఎండలో సెకండ్ షిఫ్ట్‌లో ఉండే డ్రైవర్లు, కండక్టర్లు బస్సులో ఏర్పడే సెగతో వడదెబ్బకు గురవుతున్నారు. దాన్నించి తప్పించుకోవాలంటే సొంత డబ్బులతోనే మజ్జిగ, నిమ్మరసం తాగాల్సి వస్తోంది. కోటితో వేసవి మొత్తం.. రాష్ట్రంలో ఉన్న 97 డిపోలకు వేసవి మొత్తం మజ్జిగ, నిమ్మరసం నిత్యం అందుబాటులో ఉంచాలంటే దాదాపు రూ.కోటి వరకు ఖర్చవుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితిలో అది ఆర్టీసీకి భరించలేని మొత్తమే. నిత్యం రూ.11 కోట్ల ఆదాయం ఉన్నా, ఖర్చు దాన్ని మించి ఉంటుండటంతో ఆర్టీసీ నష్టాల్లోకి కూరుకుపోతోంది. వేరే పద్దు నుంచి ఈ ఖర్చును భరిద్దామన్నా అవకాశం ఉండటం లేదు. దీంతో డబ్బు లేక వేసవి ప్లాన్‌ను అమలు చేయటం లేదు. మంచినీళ్లు చల్లగా ఉండేందు కు కుండలు కొనటం తప్ప వేసవి ప్లాన్‌లో మజ్జిగ, నిమ్మరసం సరఫరా లేకుండా పోయింది. ఇలాంటి తరుణంలో ఉన్నతాధికారులు దాతలతో మాట్లాడి వాటిని ఏర్పాటు చేసే వీలున్నా అది అమలు కావటం లేదు. రాష్ట్రంలో విజయ డెయిరీతోపాటు పలు ప్రైవేటు డెయిరీలున్నాయి. వాటి యజమానులతో ఉన్నతస్థాయి వర్గాలు మాట్లాడితే.. సామాజిక బాధ్యత కింద పెరుగు సరఫరా చేసే అవకాశం ఉంది. కానీ ఆర్టీసీ యాజమాన్యం ఈసారి అలాంటి ప్రయత్నమే చేయలేదు. డిపో మేనేజేర్ల స్థాయిలో చిన్న దాతలు తప్ప పెద్ద స్థాయి కంపెనీలతో మాట్లాడటం సాధ్యం కావటం లేదు. చిన్న దాతలు ఒకట్రెండు రోజులు ఖర్చు భరించటానికే పరిమితమవుతున్నారు. డబుల్ డ్యూటీలపై ఆరా.. మజ్జిగ సంగతి పట్టించుకోరా.. డ్రైవర్లు కొరత వల్ల కొన్ని సర్వీసులు నిత్యం డిపోలకే పరిమితం కావాల్సి వస్తోంది. కొందరు డ్రైవర్లను డబుల్ డ్యూటీలకు ఒప్పించటం ద్వారా కొన్ని సర్వీసులను తిప్ప గలుగుతున్నారు. ఎండలు తీవ్రంగా ఉండటంతో డబుల్ డ్యూటీలకు వారు నిరాకరిస్తున్నారు. ఫలితంగా డిపోలకు పరిమితమయ్యే బస్సుల సంఖ్య పెరుగుతోంది. ఇది మళ్లీ ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే అంశం కావటంతో ఉన్నతాధికారు లు నిత్యం డిపో మేనేజర్ల స్థాయిలో వాకబు చేస్తూ డబుల్ డ్యూటీల విషయంపై ఆరా తీస్తున్నా రు. బస్సులు నిలిచిపోతే ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉన్నందున ఎలాగోలా కొందరు డ్రైవర్లను ఒప్పించి డబుల్ డ్యూటీలకు పంపాలని పేర్కొంటున్నారు. ఎండలో మాడిపోతున్నా డబుల్ డ్యూటీలకు పంపుతూ.. వడ దెబ్బకు గురికాకుండా మజ్జిగ ఏర్పాటు చేయలేరా అంటూ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క రోజు బస్సులు ఆగిపోతే జనం అల్లాడిపోతారు. అలాంటి అతి ముఖ్యమైన బస్సులను ఎండ తీవ్రతకు వెరవకుండా నడుపుతున్న వారికి ఇప్పటికైనా మజ్జిగ, నిమ్మరసం అందుబాటులో ఉంచాల్సిన అవసరాన్ని గుర్తించాలని కార్మికులు కోరుతున్నారు. -
ప్రజలను అప్రమత్తం చేయండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో వడగాలుల బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎల్వీ సుబ్మహ్మణ్యం జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. విస్తృతంగా చలివేంద్రాలు ఏర్పాటు చేసి చల్లని తాగునీరు, మజ్జిగ అందించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. మరో ఐదు రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతోపాటు వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉండే నేపథ్యంలో ఆదివారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లు, సీనియర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫునే కాకుండా ప్రభుత్వేతర సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ధార్మిక సంస్థలు కూడా పెద్ద ఎత్తున చలివేంద్రాలు ఏర్పాటు చేసేలా వాటిని ప్రోత్సహించాలని సీఎస్ అన్నారు. ఆస్పత్రులు, దేవాలయాలు, చర్చిలు, మసీదులు, రైల్వేస్టేషన్లు, బస్టాండుల్లో తాగునీటి వసతి కల్పించాలని సూచించారు. ఇంకా నెలపాటు ఎండల తీవ్రత ఉండే ప్రమాదం ఉన్నందున ఎక్కడ ఎవరికి సేవలు అవసరమైనా అందించేందుకు మందులు, అంబులెన్సులతోపాటు వైద్య బృందాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అంతేకాకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లను అవసరమైన మేరకు అన్ని ఆస్పత్రుల్లో ఉంచాలని ఆదేశించారు. పశువుల దాహార్తిని తీర్చడానికి నీళ్లు నింపిన తొట్టెలను ఏర్పాటు చేయాలన్నారు. వడగాలుల బారిన పడకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన సూచనలపై మీడియా ద్వారా ప్రజలకు చైతన్యం కల్పించాలన్నారు. వడదెబ్బ మరణాలు సంభవించకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. చలివేంద్రాలు, బస్టాపుల్లో నీడ కోసం షెల్టర్ల ఏర్పాటు, వైద్య సేవలు అందించడం లాంటి పనులను పారిశ్రామిక సంస్థలు కూడా సామాజిక బాధ్యతతో నిర్వహించాలని కోరారు. ఈ దిశగా ఆయా సంస్థలు ముందడుగేసేలా జిల్లా కలెక్టర్లు చొరవ తీసుకోవాలని ఆదేశించారు. -
మే రాకుండానే మంటలు
సాక్షి, హైదరాబాద్: ఇంకా మే నెల రానేలేదు. ఏప్రిల్ మధ్యలోనే ఉన్నాం. అయినా ఎండల తీవ్రతతో జనం గుండెలు ఆగిపోతున్నాయి. ప్రభుత్వానికి అందిన అనధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు 10 మందికి పైగా మృతి చెందినట్లు అంచనా. ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ఉంటే మే నెల వచ్చాక ఎండల తీవ్రత, వడగాడ్పులు ఏ స్థాయిలో ఉంటాయోనని వాతావరణశాఖ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. మార్చి నెలాఖరు నుంచే.. రాష్ట్రంలో సాధారణం కంటే 2–4 డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం ఆదిలాబాద్, నిజామాబాద్‌లలో ఏకంగా 43 డిగ్రీల వంతున గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. మరోవైపు ఎండల ప్రభావం పంటలపై పడింది. వ్యవసాయశాఖ వర్గాల అంచనా ప్రకారం రాష్ట్రంలో 2.50 లక్షల ఎకరాల్లో వరి ఎండిపోయినట్లు చెబుతున్నారు. అంతేగాక అనేక చోట్ల వరి కోతలు నిలిచిపోయాయి. ఎండలకు కూలీలు కూడా రావడంలేదు. మరోవైపు వరి కోత యంత్రాలు అందుబాటులో లేకపోవడంతో అనేకచోట్ల ధాన్యం భూమి మీదే రాలిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డేంజర్ జోన్లో తెలంగాణ దేశంలోనే అధికంగా వడగాడ్పులు వచ్చే డేంజర్ జోన్లో తెలంగాణ ఉంది. ఫలితంగా రానున్న రోజుల్లో రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి తెలంగాణపైకి వడగాల్పులు వీస్తాయి. మే నెలలో కొన్నిచోట్ల 47 నుంచి 49 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, భద్రాచలం వంటి చోట్లనైతే 48–49 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. హైదరాబాద్‌లో 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరుకునే అవకాశముంది. డేంజర్‌జోన్‌లో తెలంగాణ ఉండటంతో మరో 20 రోజుల వరకు వడగాడ్పులు తప్పవని వాతావరణ అధికారులు చెబుతున్నారు. వేసవి ప్రణాళిక అమలే కీలకం వేసవి ప్రణాళికను విపత్తు నిర్వహణశాఖ తయారుచేసి కలెక్టర్లు, ఇతర అన్ని శాఖల అధికారులకు అందజేసింది. దాని ప్రకారం మొబైల్ ఫోన్లలో మెసేజ్‌లు, వాట్సాప్ తదితర పద్దతుల ద్వారా వడదెబ్బ, ఎండ వేడిమి హెచ్చరికలను ఎప్పటికప్పుడు జనానికి చేరవేయాలన్న విపత్తు నిర్వహణశాఖ సూచనలను కిందిస్థాయి అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. అంగన్వాడీ, ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్న నిర్ణయం ఎక్కడా అమలుకావడంలేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐవీ ఫ్లూయీడ్స్ అందుబాటులో ఉంచాలి. కానీ ఇవేవీ ఆచరణకు నోచుకోవడంలేదు. కార్మికులు ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఆరుబయట పనిచేయకూడదన్న నిబంధనను అనేక కంపెనీలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయి. ఎండల తీవ్రత, జాగ్రత్తలపై విరివిగా కరపత్రాలు, గోడ పత్రికలు, ఇతరత్రా సమాచారాన్ని ముద్రించి ఇవ్వాలని ఆదేశించినా కిందిస్థాయి అధికారులు పట్టించుకోవడంలేదు. నేడు రేపు అధిక ఉష్ణోగ్రతలు దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక నుండి కోమోరిన్ ప్రాంతం వరకు ఇంటీరియర్ తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని కారణంగా సోమవారం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతోపాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే పలుచోట్ల సాధారణం కంటే 2–4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చంది. డయేరియా వచ్చే ప్రమాదం వేసవిలో జాగ్రత్తలు తీసుకోకపోతే పిల్లలు వడదెబ్బ, డయేరియా బారినపడే ప్రమాదముంది. కాబట్టి ఎండలకు వెళ్లకుండా చూసుకోవాలి. వెళ్లాల్సి వస్తే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వడదెబ్బ తగిలితే వాంతులు, వీరోచనాలు వచ్చే ప్రమాదముంది. పిల్లలు, పెద్దలు ఎండ తీవ్రత నుంచి రక్షణ చర్యలు తీసుకోవాలి. – డాక్టర్ నరహరి, పిల్లల వైద్య నిపుణులు, నీలోఫర్ ఈ జాగ్రత్తలు తప్పనిసరి - ఆరుబయట పనిచేసేవారు సూర్యరశ్మి నుంచి కాపాడుకునేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తరచూ నీళ్లు తాగుతూ ఉండాలి. - తెలుపు లేదా లేత రంగు పలుచటి కాటన్ దుస్తులు ధరించాలి. - తలకు వేడి తగలకుండా టోపీ రుమాలు కట్టుకోవాలి. - పలుచటి మజ్జిగ, గ్లూకోజు నీరు, చిటికెడు ఉప్పు, చెంచా చక్కెర ఒక గ్లాసులో కలుపుకొని తయారుచేసిన ఓఆర్ఎస్ ద్రావణం తాగితే వడదెబ్బ నుంచి ఉపశమనం లభిస్తుంది. - వడదెబ్బ తగిలిన వారిని నీడలో చల్లని ప్రదేశంలో ఉంచాలి. - శరీర ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది కాబట్టి సాధారణ ఉష్ణోగ్రత వచ్చే వరకు తడి గుడ్డతో తుడుస్తూ ఉండాలి. - వడదెబ్బకు గురైనవారు ప్రాథమిక చికిత్స అనంతరం సాధారణ స్థితికి రాకుంటే వెంటనే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాలి. -
ఆర్టీసీకి సన్‌స్ట్రోక్..!
సాక్షి, హైదరాబాద్: నష్టాల ఆర్టీసీకి కష్టాలు వచ్చిపడ్డాయి. ఎండలు ముదురుతుండటంతో ఆర్టీసీలో కొత్త సమస్య ఏర్పడింది. డ్రైవర్ల కొరతతో నిత్యం కొన్నిబస్సులు డిపోలకే పరిమితమవుతుండగా, తాజాగా ఎండవేడి భరించలేక డ్రైవర్లు డబుల్ డ్యూటీకి నిరాకరిస్తున్నారు. దీంతో డిపోల్లో నిలిచిపోతున్న బస్సుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఫలితంగా అర్ధంతరంగా కొన్ని ట్రిప్పులను రద్దు చేయాల్సి వస్తోంది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నెలాఖరుకల్లా ఎండ తీవ్రత మరింత పెరగనుండటంతో సమస్య ఎక్కువకానుంది. ఆర్టీసీలో ఆరేళ్లుగా డ్రైవర్ల నియామకం లేదు. పదవీవిరమణ అవుతున్నవారు, మృత్యువాత పడుతున్న వారు, అనారోగ్యం ఇతర కారణాలతో దీర్ఘకాలిక సెలవుల్లో వెళుతున్నవారు... వెరసి ప్రస్తుతం ఆర్టీసీలో రెండువేల మంది డ్రైవర్ల కొరత ఏర్పడింది. దీంతో అప్పటికప్పుడు డిపో అధికారులు అందుబాటులో ఉన్న డ్రైవర్లను బతిమిలాడి డబుల్ డ్యూటీలకు పంపుతున్నారు. తీవ్ర నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ఇది పెద్ద సమస్యగా మారింది. ఫైర్ సర్వీసెస్‌కు 200 మంది డ్రైవర్లు... డ్రైవర్ల కొరత హైదరాబాద్ నగరంలో మరింత తీవ్రంగా ఉంది. ప్రస్తుతం నగరంలో దాదాపు 700 డ్రైవర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అనారోగ్యం, ఇతర సమస్యలతో కొందరు డ్యూటీలకు హాజరుకావటం లేదు. వెరసి నిత్యం వేయిమంది వరకు డ్రైవర్లు విధులకు రావటం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో నిత్యం 20 శాతం మేర సర్వీసులు డిపోలకు పరిమితమవుతున్నాయి. ఇటీవల అద్దెబస్సుల సంఖ్య బాగా పెంచటంతో సమస్య కొంత తగ్గినా, అది ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా లేదు. అగ్నిమాపక శాఖలో రిక్రూట్మెంట్ లేక డ్రైవర్లకు కొరత ఏర్పడింది. దీంతో తాత్కాలిక పద్ధతిలో ఆర్టీసీ నుంచి కొంతమందిని తీసుకోవాలని మూడేళ్ల క్రితం నిర్ణయించారు. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొనటంతో పెద్దసంఖ్యలో డ్రైవర్లు ఆప్షన్ ఇచ్చారు. దరఖాస్తులను పరిశీలించి 200 మందిని అగ్నిమాపక శాఖకు పంపారు. కానీ, మూడేళ్లు గడుస్తున్నా వారిని తిరిగి ఆర్టీసీకి పంపలేదు. అసలే డ్రైవర్ల కొరత, 200 మంది డిప్యూటేషన్‌లో ఇరుక్కుపోవటంతో ఆర్టీసీ ఆపసోపాలు పడుతోంది. దీంతో వారిని వెంటనే పంపాలంటూ అధికారులు ఇప్పుడు లేఖలు రాసినా స్పందన ఉండటం లేదు. కనీసం ఆ 200 మంది తిరిగి వస్తే కొంతమేర సమస్య పరిష్కారమవుతుందని అధికారులు భావిస్తున్నారు. -
టమాటా ధర పైపైకి!
సాక్షి, హైదరాబాద్: టమాటా ధరలు మళ్లీ పైకి ఎగబాకుతున్నాయి. ఇటీవల కాస్త తగ్గిన ధరలు మళ్లీ చుక్కలనంటుతున్నాయి. రాష్ట్రంలో సాగు తగ్గడం, పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి లేకపోవడంతో కిలో ధర రూ.30 పలుకుతోంది. ఎండ తీవ్రత పెరుగుతుండటంతో ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 15–20 రోజుల క్రితం టమాటా ధర కిలో రూ.10 వరకే పలికింది. రైతుబజార్లో కిలో రూ.5 నుంచి రూ.8 వరకు ఉంది. రాష్ట్రంలో అధికంగా సాగు చేసే మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో సాగు తగ్గిపోయింది. ఈ జిల్లాల్లో ఏర్పడ్డ వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాల్లో భారీ క్షీణత ఏర్పడింది. దీంతో ఈ జిల్లాల నుంచి మార్కెట్లోకి టమాటా రావడం లేదు. దీంతో ఏపీలోని మదనపల్లి నుంచి, కర్ణాటకలోని కొలార్, చిక్మగళూర్ల నుంచి దిగుమతి అయ్యే టమాటాలపై ఆధారపడాల్సి వస్తోంది. అక్కడి నుంచి సైతం దిగుబడి తగ్గింది. మదనపల్లె మార్కెట్లో టమాటా ధరలు కొన్ని రోజులుగా పుంజుకున్నాయి. పదిరోజుల కిందట అత్యల్పంగా కిలో ధర రూ.4 నుంచి అత్యధికంగా రూ.10 వరకు మాత్రమే పలికింది. దిగుబడి తగ్గడంతోపాటు సీజన్ ప్రారంభం కావడంతో టమాటా మార్కెట్‌కు 100 టన్నుల నుంచి 140 టన్నుల వరకే వస్తోంది. డిమాండ్ పెరుగుతున్న కారణంగా మదనపల్లె టమాటా ధర పుంజుకుంటుంది. ప్రస్తుతం మార్కెట్లో నాణ్యమైన టమాటా కిలో రూ.22 వరకు పలుకుతోంది. ఈ ప్రభావం మన రాష్ట్రంపై పడుతోంది. ఈ నెల 29న పొరుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ మార్కెట్‌కు 1,510 క్వింటాళ్లు టమాటా రాగా, సోమవారం కేవలం 884 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం రైతుబజార్లోనే టమాటా కిలో ధర రూ.24 పలకగా, బహిరంగ మార్కెట్లో కిలో ధర రూ.30కి చేరింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి దిగుమతులు పెరగాల్సిన అవసరం ఉంది. గత ఏడాది ఇదే సమయంలో రాజస్థాన్ నుంచి పెద్ద సంఖ్యలో టమాటా రాష్ట్ర మార్కెట్లోకి వచ్చింది. ప్రస్తుతం అక్కడి నుంచి రావడం లేదు. ఈ దిగుమతులు పెరిగితే ధరలు కొంత తగ్గే అవకాశం ఉంటుందని, లేని పక్షంలో మరో 3 నెలలపాటు ధరల్లో పెరుగుదల తప్పదని మార్కెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. -
ఈ సమ్మర్ సలసల!
సాక్షి, విశాఖపట్నం: భానుడు ఈ ఏడాది సెగలు కక్కనున్నాడు. మార్చి ఆఖరు నుంచి మొదలు కావలసిన ఎండలు ఫిబ్రవరి మూడో వారం నుంచే ప్రతాపం చూపడం మున్ముందు వేసవి తాపాన్ని తెలియజేస్తోంది. వాస్తవానికి మార్చి ఆఖరు నుంచి రాష్ట్రంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కానీ అనూహ్యంగా నెల రోజుల ముందే ఆ పరిస్థితి (సాధారణంకంటే 4–5 డిగ్రీలు ఎక్కువగా) మొదలైంది. ఉత్తర భారతదేశంలో ఉష్ణ ప్రభావం మన రాష్ట్రంపై చూపుతుంది. ఈ సీజనులో కోస్తాంధ్రలో సాధారణకంటే సగటున ఒక డిగ్రీ ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదవుతుందని ఐఎండీ తాజాగా అంచనా వేసింది. ఇదేమీ తేలిగ్గా తీసుకోవలసిన అంశం కాదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లోలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే ఐఎండీ అంచనా వేసింది. అటు నుంచి వీచే ఉత్తర గాలుల వల్లే రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడానికి కారణం కానున్నాయి. గత సంవత్సరం నైరుతి రుతుపవనాలు కేరళ మినహా మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో అంతగా ప్రభావం చూపలేదు. ఈశాన్య రుతుపవనాలు కూడా మరింతగా దెబ్బతీయడంతో అరకొర వానలే కురిశాయి. ఫలితంగా భూమి నుంచి ఆవిరి రూపంలో తాపం పెరగడానికి దోహదపడనుంది. మరోవైపు పసిఫిక్ మహా సముద్రంలో ఎల్‌నినోకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇవన్నీ వెరసి ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడానికి దోహదపడతాయని విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం వాతావరణం, సముద్ర అధ్యయన విభాగం మాజీ అధిపతి ఓఎస్ఆర్యూ భానుకుమార్ ‘సాక్షి’కి చెప్పారు. ఈ సంవత్సరం ఎండలతో పాటు వడగాడ్పుల తీవ్రత కూడా అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ రిటైర్డ్ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ తెలిపారు. -
రాష్ట్రంలో తగ్గిన సెగలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. సాధారణంకంటే 2 నుంచి 5 డిగ్రీలకు పైగా క్షీణించాయి. ఫలితంగా కోస్తాంధ్ర, రాయలసీమల్లో వేసవి ఛాయలు కనిపించలేదు. ఈ పరిస్థితి మరో రెండ్రోజులు కొనసాగవచ్చని వాతావరణ అధికారులు చెబుతున్నారు. నిన్నటి దాకా 43 డిగ్రీల వరకు నమోదైన ఉష్ణోగ్రతలు మంగళవారం నాటికి 38 డిగ్రీలకంటే తక్కువకు పడిపోయాయి. రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా జంగమహేశ్వరపురం(రెంటచింతల)లో 38.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణంకంటే 3.3 డిగ్రీలు తక్కువ. అనంతపురంలో 34 డిగ్రీలు (5.3 డిగ్రీలు తక్కువ) రికార్డయింది. మిగతా ప్రాంతాల్లో 33, 36 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. గత నెలరోజుల్లో ఇంత తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే ప్రథమం. ప్రస్తుతం దక్షిణ తమిళనాడు నుంచి కొమరిన్ ప్రాంతం వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు తూర్పు, దక్షిణ గాలులు వీస్తున్నాయి. ఫలితంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతున్నాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు ‘సాక్షి’కి చెప్పారు. మరోవైపు బుధ, గురువారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో అకాల వర్షాలు పడతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం రాత్రి నివేదికలో తెలిపింది. అదే సమయంలో అక్కడక్కడ పిడుగులకు ఆస్కారముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గడచిన 24 గంటల్లో నర్సీపట్నంలో 6, అచ్చంపేట 5, రాచెర్ల 4, పాడేరు, తనకల్, ఆత్మకూరులలో 3, పొదిలి, పులివెందులల్లో 2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. -
పగలు మండే ఎండలు.. సాయంత్రం పిడుగులు
సాక్షి, న్యూఢిల్లీ/విశాఖపట్నం : రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న కొద్దిరోజులపాటు వాతావరణంలో పెనుమార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు అకాల వర్షాలతో అతలాకుతలమైన ఈ రెండు రాష్ట్రాల్లో మళ్లీ ఈనెల 11 నుంచి రెండు మూడు రోజులపాటు ఉరుములు, ఈదురుగాలుతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరిస్తోంది. ప్రధానంగా రాష్ట్రంలోని రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, సాయంత్రానికల్లా క్యుములోనింబస్ మేఘాలేర్పడి ఆయా ప్రాంతాల్లో ఈదురుగాలులు, పిడుగులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. మధ్య మధ్యలో భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని తెలిపింది. వర్షం పడే సమయంలో చెట్ల కింద, బస్‌షెల్టర్ లాంటి ప్రదేశాలకు దూరంగా ఉండాలని ఐఎండీ డైరెక్టర్ జనరల్ కేజే రమేష్ మంగళవారం ఢిల్లీలో మీడియాకు తెలిపారు. విశాఖ వాతావరణ శాఖ విభాగం ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీచేస్తుంటుందని, ప్రజలు వాటిని గమనిస్తుండాలని సూచించారు. రాష్ట్రంలో భగభగలు ఇదిలా ఉంటే.. గత వారం అకాల వర్షాలతో ఆహ్లాదకరంగా మారిన వాతావరణం కొద్దిరోజులుగా మళ్లీ వేడెక్కింది. ఇందుకు నిదర్శనంగా గుంటూరు జిల్లా రెంటచింతల (జంగమహేశ్వరపురం)లో మంగళవారం 44.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. రాష్ట్రంలోకెల్లా ఇప్పటిదాకా ఇదే అత్యధిక ఉష్ణోగ్రత కావడం విశేషం. ఇలాగే, రాష్ట్రంలో ముందుముందు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం రాత్రి నివేదికలోనూ వెల్లడించింది. కోస్తాంధ్రకంటే రాయలసీమల్లో వీటి పెరుగుదల ఒకింత ఎక్కువగా ఉంటుందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు ‘సాక్షి’తో చెప్పారు. సాధారణంకంటే 2–3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయన్నారు. -
గద్వాల నెత్తిన నిప్పుల కుంపటి
సాక్షి, గద్వాల: సూర్య భగవానుడు ఉగ్రరూపం దాల్చడంతో జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శనివారం ఉష్ణోగ్రత 43.4డిగ్రీల సెల్సియస్‌కు చేరడంతో మధ్యాహ్నం 12గంటలకే రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఈ నెలలోనే పరిస్థితి ఇలా ఉంటే వచ్చే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందో తలచుకుని జనం ఆందోళన చెందుతున్నారు. పగటి ఉష్ణోగ్రత సాధారణం కంటే 5డిగ్రీ సెల్సియస్ వరకు ఎక్కువ నమోదవుతోంది. దీంతో ఎండవేడికి బయటి రావాలంటే ప్రజలు జంకుతున్నారు. అధిక ఉష్ణోగ్రతకు తోడు వేడిగాలులూ వీస్తుండటంతో జనంఇబ్బందులకు గురవుతున్నారు. ఉపశమనం కోసం శీతల పానీయాలను తాగుతున్నారు. ఎండలను నుంచి తట్టుకునేందుకుగాను గొడుగులు, తువ్వాలు కప్పుకొని బయటకు వస్తున్నారు. ఎండదెబ్బకు దుకాణ సముదాయాలు సైతం కొనుగోలుదారులు లేక వెలవెలబోతున్నాయి. వ్యాపార సముదాయాలకు సాయంత్రం వేళ మాత్రమే ప్రజలు వస్తున్నారు. కొన్నిరోజుల క్రితం పగలు ఎండకొట్టినా రాత్రివేళ వాతావరణం చల్లగానే ఉండేది. ప్రస్తుతం రాత్రివేళా ఉక్కబోత భరించలేనంతగా ఉంటోంది. కూలర్లు పెట్టినా ఉపశమనం దక్కట్లేదంటే పరిస్థితి ఏమిటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. పెరిగిన ఉష్ణోగ్రతలతో వాహనదారులు సైతం తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. జాగ్రత్తలు తీసుకుంటేనే ఆరోగ్యం గత వేసవి కాలంలో నడిగడ్డలో 44 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పుడే 42డిగ్రీల సెల్సియస్ దాటడం ఆందోళన కలిగిస్తోంది. వేసవితాపం నుంచి విముక్తి పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సూచించారు. ఈసారి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు పేర్కొంటున్నారు. ఒకవైపు భానుడి భగభగలు, మరోవైపు ముఖాన్ని మాడ్చేలా వడగాలులు.. ఇలా జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 15రోజుల క్రితం 37డిగ్రీల సెల్సియస్‌లోపు ఉష్ణోగత్ర నమోదైన సమయంలో లేని వడగాలులు ప్రస్తుతం 40డిగ్రీలు దాటిన క్రమంలో వేడిగాలులు ఉత్పన్నమవుతున్నాయి. మామూలు ఎండల కంటే వడగాలులు ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తీవ్రమైన ఎండలో తిరిగే వారికి ప్రధానంగా వడదెబ్బ తగలడం, బాగా నీరసించి పోవడం, కండరాలు పట్టుకుపోతాయంటున్నారు. దీనివల్ల తరచూ వాంతులు, విరేచనాలు, హైఫీవర్, చర్మం పొడిబారడం, డీ–హైడ్రేషన్, బీపీ పెరగడం, కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. మధ్యాహ్నం వేళ బయటికి రాకుండా ఉండటం, ఒకవేళ వెళ్లినా తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నీళ్లు, కొబ్బరిబొండాలు ఎక్కువగా తాగాలని వారు సూచిస్తున్నారు. -
వడదెబ్బ తగలకుండా నివారించే మందులున్నాయా?
నేను సేల్స్‌మేన్‌గా పనిచేస్తుంటాను. ఈ వేసవికాలం ఎండతీవ్రత ఎక్కువగా ఉంది. ఎండదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ మాలో కొందరికి వడదెబ్బ తగిలే అనారోగ్య పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తోంది. వడదెబ్బకు గురికాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. దీనిబారిన పడకుండా ఉండేందుకు హోమియోలో ఏదైనా ముందస్తుగా వాడే నివారణ మందులు ఉన్నాయా? తెలుపగలరు. – ఆర్. రవికుమార్, విజయవాడ వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్సి సందర్భాల్లో ఎండలో పనిచేయాల్సి రావడంతో వడదెబ్బకు గురై అనారోగ్యం బారిన పడే పరిస్థితి ఉంటుంది. అయితే హోమియోలో ఎండదెబ్బకు గురికాకుండా రక్షించుకునే నివారణ మందులు (ప్రివెంటివ్ మెడిసిన్) అందుబాటులో ఉండటమే కాకుండా... దీని బారిన పడ్డవారికి మంచి చికిత్స కూడా అందుబాటులో ఉంది. వడదెబ్బ ప్రాణాంతకమైన పరిస్థితి అని చెప్పవచ్చు. ఏ వయసు వారిపైనైనా ప్రతాపం చూసే ఈ వడదెబ్బ ఎక్కువగా చిన్నపిల్లలు, వృద్ధులపై తన ప్రభావం ఎక్కువగా చూపుతుంది. వడదెబ్బ అంటే : అధిక ఉష్ణోగ్రతకు ఎక్స్పోజ్ కావడం వల్ల శరీర ఉష్ణోగ్రత 102 డిగ్రీల ఫారెన్‌హీట్‌కు పెరిగి, అది కేంద్ర నాడీ వ్యవస్థపై దుష్ప్రభావం చూపే పరిస్థితిని వడదెబ్బగా పరిగణిస్తారు. సాధారణంగా వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు చెమటలు పట్టడం ద్వారా శరీరం తన సాధారణ (నార్మల్) ఉష్ణోగ్రతకు తిరిగి చేరుతుంది. అయితే ఇలా చెమటలు పట్టే సమయంలో నీరు, ఇతర కీలకమైన లవణాలను శరీరం ఎక్కువగా కోల్పోతుంది. ఇలా కోల్పోయిన వాటిని భర్తీ చేసేలా మళ్లీ నీరు, లవణాలను పొందనప్పుడు శరీరం డీ–హైడ్రేషన్‌కు గురవుతుంది. అలాంటి సమయాల్లో శరీరంలోని కణాలు రక్తంలోని నీటిని ఉపయోగించుకుంటాయి. దాంతో రక్తం పరిమాణం తగ్గి, గుండెతో పాటు మెదడు వంటి ఇతర కీలక అవయవాలకు తగినంత రక్తప్రసరణ అందకపోవడం వల చర్మం తాలూకు శీతలీకరణ వ్యవస్థ దెబ్బతిని శరీర ఉష్ణోగ్రత అనియంత్రితంగా పెరిగిపోతుంది. దాంతో వడదెబ్బ లక్షణాలు కనిపిస్తాయి. లక్షణాలు : వడదెబ్బ లక్షణాలు చాలా ఆకస్మికంగా కనిపిస్తాయి. చర్మం పొడిబారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండెదడ, వాంతులు, వికారం, విరేచనాలు, కండరాల తిమ్మిర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. పరిస్థితి విషమిస్తే కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు : ∙నీటితో పాటు మజ్జిగ, కొబ్బరినీళ్లు, పండ్లరసాల వంటి ద్రవపదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ∙ఎక్కువ ఎండ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ ఎండలోకి వెళ్ల్సాన పరిస్థితి ఉంటే పల్చటి, లేతరంగు దుస్తులు వేసుకోవాలి. కాటన్ దుస్తులు ధరిస్తే మంచిది. తలపై ఎండ పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ∙మద్యం, కెఫిన్ ఎక్కువగా ఉండే పానియాలు తీసుకోకూడదు. అవి మూత్రం ఎక్కువగా విసర్జితమయ్యేలా చేసి, డిహైడ్రేషన్కు గురిచేస్తాయి. కాబట్టి వాటిని అసలు తీసుకోకపోవడమే మంచిది. ∙వడదెబ్బ తగిలినప్పుడు బాగా గాలి తగిలేలా రోగిని ఉంచి, శరీరాన్ని చల్లబరచాలి. చికిత్స : హోమియోపతి వైద్యవిధానంలో వడదెబ్బకు గురికాకుండా చేసే నివారణ చికిత్స అందుబాటులో ఉంది. అంతేగాక వడదెబ్బకు గురైన వ్యక్తికి తగిన ప్రాథమిక చికిత్సతో పాటు అవసరమైన తదనంతర చికిత్స కూడా అందించి త్వరగా కోలుకునేలా చేసే మందులు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ పేను కొరుకుడుకు చికిత్స ఉందా? మా అమ్మాయి వయసు 25 ఏళ్లు. ఈమధ్య జుట్టులో ఒకేచోట వెంట్రుకలు రాలిపోతున్నాయి. అందరూ పేనుకొరుకుడు అంటున్నారు. హోమియోలో పరిష్కారం చెప్పండి. – వెంకటలక్ష్మి, ఏలూరు పేను కొరుకుడు సమస్యను వైద్యపరిభాషలో అలొపేషియా అంటారు. ఈ కండిషన్లో ఒక నిర్ణీత స్థలంలో వెంట్రుకలు పూర్తిగా రాలిపోయి, నున్నగా మారుతుంది. శరీరం తనను తాను రక్షించుకోగలిగే శక్తిని కోల్పోయినప్పుడు జుట్టు రాలిపోతుంటుంది. అలాంటప్పుడు చాలాసార్లు తలపై అక్కడక్కడ ప్యాచ్‌లలాగా ఏర్పడతాయి. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే తన సొంత వ్యాధి నిరోధక శక్తి తన వెంట్రుకలపైనే ప్రతికూలంగా పనిచేయడం వల్ల వచ్చే సమస్య అన్నమాట. ఇది తలలోగానీ, గడ్డంలోగానీ, మీసాలలోగాని ఇది రావచ్చు. ఇది అంటువ్యాధి కాదు. సాధారణంగా 60 ఏళ్లు పైబడిన వారిలో ఈ సమస్య కనిపించదు. కారణాలు : ∙మానసిక ఆందోళన ∙థైరాయిడ్ సమస్య ∙డయాబెటిస్, బీపీ వంటి సమస్య ఉన్నవాళ్లలో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది వంశపారంపర్యంగా ∙కవలల్లో ఒకరికి ఉంటే మరొకరికి వచ్చే అవకాశం ఉంటుంది. లక్షణాలు : ∙తలపై మొత్తం జుట్టు ఊడిపోయి, బట్టతల లక్షణాలు కనిపిస్తాయి. ∙తలపై అక్కడక్కడ గుండ్రంగా ప్యాచ్‌లలా జుట్టు ఊడిపోతుంది ∙సాధారణంగా గుండ్రగా లేదా అండాకృతితో ఈ ప్యాచ్‌లు ఉంటాయి. నిర్ధారణ : ఈ సమస్య నిర్దిష్టంగా ఏ కారణం వల్ల వచ్చిందో తెలుసుకోవాలి. ట్రైకోస్కోపీ, బయాప్సీ, హిస్టలాజిక్ పరీక్షలు, పిగ్మెంట్ ఇన్‌కాంటినెన్స్ వంటివే మరికొన్ని పరీక్షలు. చికిత్స : పేనుకొరుకుడు సమస్యకు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వైద్యులు వ్యాధి కారణాలు, లక్షణాలను పరిగణనలోకి తీసుకొని మందులను సూచిస్తారు. దీనికి హోమియోలో యాసిడ్ ఫ్లోర్, సల్ఫర్, ఫాస్ఫరస్, గ్రాఫైటిస్, సెలీనియమ్, సొరినమ్, తుజా వంటి మందులను డాక్టర్ల పర్యవేక్షణ లో వాడాల్సి ఉంటుంది. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ పైల్స్ తగ్గుతాయా? నా వయసు 47 ఏళ్లు. నాకు కొంతకాలం నుంచి మలద్వారం వద్ద బుడిపెలా బయటకు వస్తోంది. మల విసర్జన సమయంలో రక్తం కూడా పడుతోంది. అప్పుడప్పుడు సూదితో గుచ్చినట్లుగా నొప్పి వస్తోంది ఉంది. కూర్చోడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. డాక్టర్‌ను కలిస్తే పైల్స్ అని చెప్పారు. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. – శ్రీనివాసరావు, సంగారెడ్డి ఈ మధ్యకాలంలో తరచూ వినిపించే సమస్యలలో ఇది ఒకటి. మలద్వారపు గోడల మార్పుల వల్ల ఆ చివరన ఉండే రక్తనాళాలు (సిరలు) ఉబ్బి మొలలుగా ఏర్పడతాయి. ఇవి మలాశయం లోపల, వెలుపల చిన్న చిన్న బుడిపెల రూపంలో ఏర్పడి ఇబ్బంది పెడతాయి. తీవ్రతను బట్టి వీటిని నాలుగు దశలుగా వర్గీకరించవచ్చు. మొలల దశలు : గ్రేడ్–1 దశలో మొలలు పైకి కనిపించవు. నొప్పి కూడా ఉండదు. కానీ రక్తం మాత్రం పడుతుంది. గ్రేడ్–2లో రక్తం పడవచ్చు, పడకపోవచ్చు కానీ మల విసర్జన సమయంలో బయటకు వస్తాయి. వాటంతట అవే లోపలకు వెళ్లిపోతుంటాయి. గ్రేడ్–3లో మల విసర్జన చేసేటప్పుడు మొలలు బయటకు వస్తాయి. కానీ మల విసర్జన తర్వాత వాటంతట అవి లోపలికి పోకుండా వేలితో నెడితే లోనికి వెళ్తాయి. గ్రేడ్–4 దశలో మొలలు మలద్వారం బయటే ఉండిపోతాయి. నెట్టినా లోనికి వెళ్లవు. కారణాలు : ∙మలబద్దకం ∙మలవిసర్జన సమయంలో గట్టిగా ముక్కడం వల్ల అక్కడే ఉండే కండరబంధనం సాగిపోతుంది. తద్వారా మొలలు బయటకు పొడుచుకుని వస్తాయి. ∙సరైన వ్యాయామం, శారీరక శ్రమ లేకపోవడం ∙స్థూలకాయం (ఒబేసిటీ) ∙చాలాసేపు కూర్చొని పనిచేసే ఉద్యోగులకు ఈ సమస్య ఎక్కువ ∙మలబద్దకం మాత్రమే గాక అతిగా విరేచనాలు కావడం కూడా ఈ సమస్యకు దారితీయవచ్చు ∙మంచి పోషకాహారం తీసుకోకపోవడం ∙నీరు తక్కువగా తాగడం ఎక్కువగా ప్రయాణాలు చేయడం ∙అధిక వేడి ప్రదేశంలో పనిచేస్తుండటం ∙మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి వచ్చే అవకాశాలు ఎక్కువ. లక్షణాలు : నొప్పి, రక్తస్రావం, కొన్నిసార్లు దురద, ఏదో గుచ్చుతున్నట్లుగా నొప్పి ∙మలవిసర్జన సమయంలో ఇబ్బంది కలగడం. నివారణ : ∙మలబద్దకం లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం ∙సమయానికి భోజనం చేయడం ముఖ్యం ∙ఆహారంలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం కొబ్బరినీళ్లు ∙నీరు ఎక్కువ మోతాదులో తీసుకోవడం మసాలాలు, జంక్‌ఫుడ్, మాంసాహారం తక్కువగా తీసుకోవడం ∙మెత్తటి పరుపు మీద కూర్చోవడం వంటివి పైల్స్ నివారణకు తోడ్పడే కొన్ని జాగ్రత్తలు. హోమియోలో రోగి శారీరక, మానసిక లక్షణాలను బట్టి వ్యాధి నిరోధక శక్తి పెంచేలా ఇచ్చే మందులు ఇచ్చి వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
భగ భగ ...సూర్య@ 42.4
నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు మళ్లీఠారెత్తిస్తున్నాయి. మంగళవారం గరిష్టంగా 42.4 డిగ్రీలు, కనిష్టంగా 28.7 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఎండతీవ్రత అధికంగా ఉండడంతో మధ్యాహ్నం ఇంటి నుంచి బయటికి వెళ్లిన పలువురు వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. కొందరు వడదెబ్బ బారిన పడ్డారు. రాగల 24 గంటల్లో ఉష్ణోగ్రతల్లో స్వల్ప హెచ్చుతగ్గులుంటాయని బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. -
కానరాని కనికరం
► వడదెబ్బ మృతులకు పరిహారానికి ఎన్నో నిబంధనాలు ► ఉష్ణోగ్రత 52 డిగ్రీలు దాటితేనే చెల్లించే ప్రతిపాదనలు ► పేద కుటుంబాలకు తీవ్ర అన్యాయం నర్సీపట్నం: ఈ ఏడాది ఎండలు ప్రజలను ఠారెత్తిస్తున్నాయి. ఏటేటా భూతాపం పెరిగి ఎండలు మండిపోతున్నాయి. వడగాడ్పులకు పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే కేంద్రం వడగాడ్పులను ప్రకృతి విపత్తుగా పరిగణించలేమని చెబుతోంది. ఇలా వారికి రావాల్సిన పరిహారం ఇవ్వటం లేదు. స్థానిక విపత్తుగా లెక్కించి సహాయక చర్యలు, పరిహారం అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు చేస్తోంది. పనులు చేసే రైతులు, కార్మికులే ఎక్కువగా ఈ వడగాడ్పులతో ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో మృతులకు పరిహారం అందక అనేక కుటుంబాలు వీధిన పడుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు భానుడి ప్రతాపానికి మార్చి నుంచే ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం పది గంటలు దాటితే బయట తిరగలేని పరిస్థితి. అడవులు అంతరించిపోవడంతో వేడి, వడగాడ్పులు అధికంగా ఉంటున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు కారణంగా వృద్ధులు, పనులు చేసుకునే వారు పిట్టల్లా రాలిపోతున్నారు. బీడుబారిన పొలాలు, నీటి చుక్క కన్పించని దయనీయ పరిస్థితితో పొలం పనులకు వెళ్లిన రైతులు, కూలీలు, ఇతర పనులు చేసే వారు పదుల సంఖ్యలో వడగాడ్పులతో ప్రాణాలు కోల్పోతున్నారు. నిబంధనతో దాటవేత 43 డిగ్రీల ఉష్ణోగ్రతకే వేడి గాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం పది గంటలు దాటితే చాలా మంది ఇళ్లకే పరిమితమవుతున్నారు. అటువంటిది కేంద్రం 52 డిగ్రీల ఉష్ణోగ్రత దాటితేనే విపత్తుగా పరిగణిస్తామని ప్రకటించటం వల్ల వడగాడ్పులకు మరణించే వారి కుటుంబాల వారికి పరిహారం విషయంలో అన్యాయం జరుగుతుంది. అదే కేంద్రం విపత్తుగా గుర్తిస్తే బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం అందుతుంది. కొత్తగా వచ్చిన నిబంధనలు ప్రకారం 52 డిగ్రీలు దాటితేనే విపత్తుగా లెక్కిస్తామని చెబుతోంది. దీంతో సాధారణ ఉష్ణోగ్రత నమోదైన సమయంలో మృతి చెందిన వారికి లక్ష రూపాయలు పరిహారం కాకుండా ఆపద్బంధు పథకం కింద కేవలం రూ.50 వేల మాత్రమే అందజేయనున్నారు. ఈ నిబంధన వల్ల మృతుల కుటుంబాలకు పెద్దగా ఆర్థిక ఆసరా అందే అవకాశాలు లేవు. కమిటీ నిర్ధారణతో పరిహారం వడదెబ్బతో మృతిచెందారని నిర్ధారించేందుకు ప్రభుత్వం తహసీల్దార్, వైద్యుడు, ఎస్ఐతో కమిటీ ఏర్పాటు చేసింది. వీరు పూర్తిస్థాయి విచారణ చేపట్టి ప్రభుత్వానికి నివేదిస్తే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మృతులకు లక్ష రూపాయలు పరిహారం అందజేస్తుంది. దీంతో ఏటా పదుల సంఖ్యలో మృతి చెందుతున్నా నిబంధనల కారణంగా అరకొరగా పరిహారం అందుతుంది. కమిటీకి సమాచారం అందజేయాలి వడదెబ్బతో ఎవరైనా మృతి చెందితే కమిటీకి త్వరగా సమాచారం అందజేయాలి. వెంటనే కమిటీ సభ్యులు సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు నమోదు చేస్తారు. పోస్టుమార్టం నిర్వహించి నివేదిక అందజేస్తారు. - వి.వి.రమణ, తహసీల్దార్ -
సుర్రుమంటున్న సూరీడు
♦ జిల్లాలో పెరిగిన ఎండ తీవ్రత ♦ అధిక ఉష్ణోగ్రతలు నమోదు ♦ మోగుతున్న మృత్యుఘంటికలు విజయనగరం గంటస్తంభం/ఫోర్టు: భానుడు భగ్గుమంటున్నాడు. జిల్లా ప్రజలపై నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. సాహసించి ప్రయాణించేవారిని మృత్యు ఒడికి చేర్చుతున్నాడు. రోజురోజుకూ ఎండల తీవ్రత పెరగడంతో ఉదయం 8 గంటలేతై చాలు ఇంటి నుంచి బయటకు వచ్చేం దుకు జనం భయపడుతున్నారు. జిల్లాలో గతేడాది మార్చిలో అత్యధికంగా 33.8 డీగ్రీలు ఉష్టోగ్రత నమోదైతే... ఏప్రిల్‌లో 35.2 డిగ్రీలు... మేలో అత్యధికంగా 38.4 డిగ్రీల ఉష్టోగ్రత నమోదైంది. తర్వాత క్రమేపీ ఎండలు తగ్గుముఖం పట్టాయి. ఈఏడాది మార్చిలో అత్యధికంగా 34 డీగ్రీలు ఉష్టోగ్రత నమోదుకాగా ఏప్రిల్ నెలలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఏప్రిల్ 22న 40 డిగ్రీలు అత్యధిక ఉష్టోగ్రత నమోదుకాగా 23న 41 డీగ్రీలు నమోదైంది. 24 నుంచి 27వ తేదీ వరకు మళ్లీ 40 డిగ్రీలు ఉష్టోగత్ర నమోదైంది. ఆ తర్వాత మేఘాలు మూలంగా ఎండలు కాస్తా తగ్గాయి. గాలిలో కలిసిపోతున్న ప్రాణాలు వేసవిలో ఎండలు సహజం. అలాగని పనులు మానుకుని ఇంటి వద్ద కూర్చుని ఉండలేని పరిస్థితి. సాహసించి ఎండలో ప్రయాణిస్తే ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి. గతేడాది వేసవిలో జిల్లాలో ఏకంగా 155 మంది వడదెబ్బకు గురై మృతిచెందగా 115 మంది మృతిచెందినట్టు అధికారులతో కూడిన త్రిసభ్యకమిటీ లెక్కతేల్చింది. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో మార్చి నుంచి వడదెబ్బ కారణంగా 8 మంది మృతి చెందినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇందులో ఆరుగురు మృతిని త్రిసభ్య కమటీ ధ్రువీకరించింది. వాస్తవంగా చూస్తే జిల్లాలో ఇప్పటివరకు 30 మందికిపైగా మృతి చెందారు. మృతుల కుటుంబాలకు అవగాహన లేకపోవడం, త్రిసభ్య కమిటీ అభ్యంతరాలు నేపథ్యంలో వేపాడ, విజయనగరం, దత్తిరాజేరు తదితర మండలాల్లో కొన్నింటిని అధికారులు తిరస్కరిస్తున్నారు. వీరంతా ఎండ తీవ్రత తట్టుకోలేక మృతి చెందిన వారే. ఉపశమన చర్యలు నామమాత్రం ఎండలు తీవ్రత ఎక్కువగా ఉన్నా ఉపశమన చర్యలు నామమాత్రంగా ఉన్నాయి. చలివేంద్రాలు ఏర్పాటు అర్భాటంగా మారింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో ఏర్పాటు కాలేదు. ఏర్పాటు చేసినా నీరు తప్ప మజ్జిగ పంపిణీ చేయడంలేదు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం దీనికి కారణం. మార్చి నెల చివర్లో రూ.65 లక్షలు బడ్జెట్ రిలీజ్ చేసినా ఖజానాపై ఆంక్షలతో ఆ నిధులు వెనుక్కి పోయాయి. కలెక్టర్ ఖాతా నుంచి నిధులు వినియోగించాలని నిర్ణయించినా ఫలితం లేదు. ముందుగా ఖర్చు చేసి యూసీలు ఇస్తే ఆనిధులు విడుదల చేసే అవకాశం ఉండడంతో చలివేంద్రాలు ఏర్పాటు నామమాత్రంగా మారింది. జనాలకు దాహం మిగులుతోంది. -
కిడ్నీలో రాళ్లు రాకుండా నివారించవచ్చా?
హోమియో కౌన్సెలింగ్ మా నాన్నగారి వయసు 47 ఏళ్లు. ఆయన చాలాకాలంగా కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఎండాకాలంలో ఈ సమస్య తరచూ ఉత్పన్నమవుతోంది. దీనికి చికిత్స ఉందా? తెలియజేయగలరు. – ఎన్. శ్యామ్, నకిరేకల్ వేసవి కాలంలో ఎండ తీవ్రత వల్ల ఒంట్లో నీరు చెమట రూపంలో బయటకు వెళ్లిపోతుంది. దీనివల్ల రక్తంలో నీటి శాతం తగ్గిపోతుంది. దీనికి తగినట్లుగా ఎక్కువ నీటిని తాగాలి. అలా తాగకపోవడం, కూల్‌డ్రింక్స్ తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య వేసవిలో తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. హోమియో చికిత్సలో కిడ్నీలో రాళ్ల సమస్యను పూర్తిగా తగ్గించవచ్చు. మళ్లీ తిరగబెట్టకుండా నయం చేయవచ్చు. మూత్రపిండాలు రక్తాన్ని వడపోసి వ్యర్థాలను, అదనపు నీటిని మూత్రం ద్వారా బయటకు పంపించి శరీరంలోని లవణాల సమతౌల్యతను కాపాడతాయి. మూత్రంలో అదనంగా ఉండే లవణాలు స్ఫటికరూపంలోకి మారతాయి, వాటిని రాళ్లు అంటాం. అవి మూత్ర విసర్జక వ్యవస్థలోని ఏ భాగంలోనైనా (మూత్రపిండాలు, మూత్రనాళాలు, మూత్రకోశం) ఏర్పడే అవకాశం ఉంది. లక్షణాలు : విపరీతమైన నడుమునొప్పి, కడుపునొప్పి, వాంతులు, మూత్రంలో మంట ప్రధానమైనవి. కొందరిలో ఏదో ఒకవైపు నడుమునొప్పి, జ్వరం రావచ్చు. ఇంకొందరిలో నడుము, ఉదరం మధ్య భాగాలలో నొప్పి వచ్చి పొత్తికడుపు, గజ్జలు, కాళ్లలోకి పాకుతుంది. కండరాలు బిగువుగా మారడం, కడుపు ఉబ్బరం ఉంటుంది. కొన్నిసార్లు ఎలాంటి లక్షణాలు, నొప్పి లేకుండానే కిడ్నీలో రాళ్లు ఉండవచ్చు. నివారణ / జాగ్రత్తలు : రోజుకు 2 – 3 లీటర్ల నీళ్లు తాగాలి. ఉప్పు మితంగా తీసుకోవాలి. విటమిన్ సి, క్యాల్షియమ్ సప్లిమెంట్ల వంటి మాత్రలను కేవలం వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. శీతల పానియాలను మానేయాలి. చికిత్స : రోగి శారీరక, మానసిక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని జెనెటిక్ కాన్స్టిట్యూషన్ చికిత్స ద్వారా కిడ్నీ స్టోన్స్ కండిషన్‌కు చికిత్స చేయవచ్చు. కిడ్నీలోని లవణాల సమతౌల్యతను కాపాడి, వాటి పనితీరును మెరుగుపరచడం ద్వారా కిడ్నీలలో మళ్లీ మళ్లీ రాళ్లు రాకుండా చేయవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండ్‌డి హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్