
సాక్షి, న్యూఢిల్లీ/విశాఖపట్నం : రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న కొద్దిరోజులపాటు వాతావరణంలో పెనుమార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు అకాల వర్షాలతో అతలాకుతలమైన ఈ రెండు రాష్ట్రాల్లో మళ్లీ ఈనెల 11 నుంచి రెండు మూడు రోజులపాటు ఉరుములు, ఈదురుగాలుతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరిస్తోంది. ప్రధానంగా రాష్ట్రంలోని రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, సాయంత్రానికల్లా క్యుములోనింబస్ మేఘాలేర్పడి ఆయా ప్రాంతాల్లో ఈదురుగాలులు, పిడుగులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. మధ్య మధ్యలో భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని తెలిపింది. వర్షం పడే సమయంలో చెట్ల కింద, బస్‌షెల్టర్ లాంటి ప్రదేశాలకు దూరంగా ఉండాలని ఐఎండీ డైరెక్టర్ జనరల్ కేజే రమేష్ మంగళవారం ఢిల్లీలో మీడియాకు తెలిపారు. విశాఖ వాతావరణ శాఖ విభాగం ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీచేస్తుంటుందని, ప్రజలు వాటిని గమనిస్తుండాలని సూచించారు.
రాష్ట్రంలో భగభగలు
ఇదిలా ఉంటే.. గత వారం అకాల వర్షాలతో ఆహ్లాదకరంగా మారిన వాతావరణం కొద్దిరోజులుగా మళ్లీ వేడెక్కింది. ఇందుకు నిదర్శనంగా గుంటూరు జిల్లా రెంటచింతల (జంగమహేశ్వరపురం)లో మంగళవారం 44.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. రాష్ట్రంలోకెల్లా ఇప్పటిదాకా ఇదే అత్యధిక ఉష్ణోగ్రత కావడం విశేషం. ఇలాగే, రాష్ట్రంలో ముందుముందు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం రాత్రి నివేదికలోనూ వెల్లడించింది. కోస్తాంధ్రకంటే రాయలసీమల్లో వీటి పెరుగుదల ఒకింత ఎక్కువగా ఉంటుందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు ‘సాక్షి’తో చెప్పారు. సాధారణంకంటే 2–3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయన్నారు.