visakha weather monitoring centre
-
విస్తారంగా వర్షాలు.. గోదావరి ఉగ్రరూపం
సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం వల్ల నదీ పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో నదులు వరద ప్రవాహంతో పరుగులు తీస్తున్నాయి. ఉప నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. తెలంగాణలోని ఎస్సారెస్పీ (శ్రీరాంసాగర్ ప్రాజెక్టు) నుంచి 3.50 లక్షల క్యూసెక్కులు, ఎల్లంపల్లి నుంచి 6.71 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. వాటికి ప్రాణహిత, ఇంద్రావతి వరద తోడవడంతో కాళేశ్వరంలో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీ నుంచి 9.60 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో పోలవరం ప్రాజెక్టు వద్దకు వచ్చే వరద ప్రవాహం గంటగంటకు పెరుగుతోంది. బుధవారం సాయంత్రం 6 గంటలకు పోలవరం వద్దకు 5.20 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. అంతేస్థాయిలో వరదను దిగువకు వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీలోకి 4.82 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. కాలువలకు విడుదల చేయగా మిగులుగా ఉన్న 4.80 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. గురువారం ఉదయానికి ధవళేశ్వరం బ్యారేజీ వద్దకు 9 నుంచి 10 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. శ్రీశైలంలోకి తగ్గిన వరద.. కృష్ణా బేసిన్లో వర్షపాత విరామం వల్ల కృష్ణానదిలో వరద ప్రవాహం తగ్గింది. శ్రీశైలంలోకి 89,391 క్యూసెక్కులు చేరుతుండగా.. ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ సర్కార్ నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేస్తూ 30 వేల క్యూసెక్కులు దిగువకు వదిలేస్తోంది. ప్రస్తుతం శ్రీశైలంలో 877.92 అడుగుల్లో 177.35 టీఎంసీల నీరుంది. సాగర్‌లోకి 12,200 క్యూసెక్కులు చేరుతుండగా విద్యుదుత్పత్తి ద్వారా 10,360 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం సాగర్‌లో 587.6 అడుగుల్లో 305.86 టీఎంసీల నీరు ఉంది. సాగర్ నుంచి వస్తున్న ప్రవాహానికి మూసీ వరద తోడవడంతో పులిచింతల ప్రాజెక్టులోకి 23,480 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతేస్థాయిలో వరదను స్పిల్ వే గేట్ల ద్వారా, విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల నుంచి వస్తున్న జలాలకు కట్టలేరు, మున్నేరు, వైరా ప్రవాహం తోడవడంతో ప్రకాశం బ్యారేజీలోకి 1,16,771 క్యూసెక్కుల నీరు చేరుతోంది. కృష్ణా డెల్టా కాలువలకు 9,821 క్యూసెక్కులు వదిలి, మిగిలిన 1,06,950 క్యూసెక్కులను బ్యారేజీ 60 గేట్లను రెండడుగులు, 10 గేట్లను మూడడుగుల మేర ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు. వంశధార, నాగావళిలో పెరిగిన వరద వంశధార, నాగావళి నదుల్లో వరద మరింతగా పెరిగింది. గొట్టా బ్యారేజీలోకి 12,132 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతేస్థాయిలో సముద్రంలోకి వదిలేస్తున్నారు. నాగావళి నుంచి నారాయణపురం ఆనకట్ట వద్దకు చేరుతున్న 7,400 క్యూసెక్కులను కడలిలోకి విడుదల చేస్తున్నారు. సోమశిలలోకి పెన్నా ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. సోమశిల రిజర్వాయర్‌లోకి 25,613 క్యూసెక్కులు చేరుతుండగా 10,486 క్యూసెక్కులను కండలేరుకు, దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం సోమశిలలో 71.51 టీఎంసీల నీరుంది. మరో 6.5 టీఎంసీలు చేరితే సోమశిల ప్రాజెక్టు గేట్లు ఎత్తేస్తారు. కండలేరులోకి 8,600 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 54.10 టీఎంసీలకు చేరింది. ఈ ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 14 టీఎంసీలు అవసరం. -
విస్తారంగా వర్షాలు
సాక్షి, నెట్వర్క్: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మంగళవారం కూడా విస్తారంగా వర్షాలు కురిశాయి. విశాఖ జిల్లా ఏజెన్సీలో కుండపోతగా వానలు కురుస్తున్నాయి. హుకుంపేట–అడ్డుమాండ ప్రధాన రహదారిలో వంతెనపైకి వరదనీరు రావడంతో రాకపోకలు స్తంభించాయి. తూర్పుగోదావరి జిల్లాలో గత 24 గంటల్లో సగటున 67.9 మిల్లీమీటర్ల వర్షపాతం చోటు చేసుకుంది. జిల్లావ్యాప్తంగా సింహభాగం మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కాకినాడ అర్బన్‌లో 174 మిల్లీమీటర్లు.. అత్యల్పంగా రాజోలులో 26.8 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డైంది. ఏజెన్సీలో కొండ వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రంపచోడవరం వాల్మీకిపేటకు చెందిన గొర్లె మహేష్ (చిట్టి) చేపలు పట్టేందుకు స్థానిక పంపుహౌస్ సమీపంలోని కాలువలో దిగగా ఉధృతికి కొట్టుకుపోయాడు. అతడిని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. విశాఖపట్నం రుషికొండ బీచ్‌లో కెరటాలు భారీ ఎత్తున ఎగసిపడుతున్నాయి. సముద్రం 15 అడుగులు ముందుకు రావడంతో తీర ప్రాంతం కోతకు గురైంది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరం వెంట ఉన్న కపుల్ బెడ్స్, వాచ్ టవర్స్, గొడుగులు వంటి వాటిని కెరటాలు తాకడంతో పర్యాటకులు భయాందోళనలకు గురయ్యారు. భీమిలి బీచ్ రోడ్డు, మంగమారిపేట, ఉప్పాడ, తిమ్మాపురం ప్రాంతాల్లోనూ కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అత్యధికంగా కవిటిలో 125 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పశ్చిమగోదావరి జిల్లా ఎద్దెలవాగు వంతెనపై ప్రవహిస్తున్న గోదావరి వరద పశ్చిమగోదావరి జిల్లా ఏజెన్సీలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వేలేరుపాడు నుంచి కొయిదా వెళ్లే దారిలో ఎద్దెల వాగు వంతెన సోమవారం రాత్రి నీటమునిగింది. దీంతో దిగువన ఉన్న కొయిదా, కట్కూరు, కాచారం, తాళ్లగొంది, పూసుగొంది, చిట్టంరెడ్డిపాలెం, యడవల్లి, బుర్రెడ్డిగూడెం, టేకూరు, సిద్దారం, కుంకుడుకొయ్యల పాకలుతోపాటు మరో 18 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గత 2 రోజుల నుంచి పెదవాగు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేయడంతో వేలేరుపాడు మండలం కమ్మరిగూడెం, ఒంటిబండ, రామవరం, ఊటగుంపు గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. అశ్వారావుపేట వెళ్లే రహదారిలో రామవరం వద్ద లోతు వాగు పొంగిపొర్లుతుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. వేలేరుపాడు నుంచి రుద్రమకోటకు వెళ్లే దారిలో పెదవాగు వంతెన ప్రాంతంలో రహదారి పూర్తిగా కొట్టుకుపోయింది. మద్దిగట్ల ప్రాంతంలో వాగు ఉధృతిలో కొట్టుకుపోతున్న 2,000 గొర్రెలను ఎస్ఐ సాదిక్, సిబ్బంది కాపాడారు. తహసీల్దార్ చల్లన్నదొర ఎద్దెల వాగు వద్ద నాటు పడవను ఏర్పాటు చేశారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో 0.3 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. వాగులో గల్లంతైన యువతి మృతి పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెంలో గుబ్బల మంగమ్మ తల్లి గుడికి వెళ్లి తిరిగొస్తూ సోమవారం వాగులో గల్లంతైన మనీషా వర్మ (23) మృతదేహం మంగళవారం లభ్యమైంది. సుమారు ఐదు బృందాలు ఉదయం నుంచి వాగు వెంట ఐదు కిలోమీటర్ల మేర గాలింపు చర్యలు చేపట్టాయి. చివరకు తెలంగాణలోని అశ్వారావుపేట మండలం కంట్లం సమీపంలో వాగులో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. వారంలో మరో అల్పపీడనం.. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రెండు రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తుందని విశాఖ వాతావరణ కేంద్రం, భారత వాతావరణ కేంద్రం తెలిపాయి. అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 7.6 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో వచ్చే రెండు రోజులు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయి. విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉంది. తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. రానున్న వారం రోజుల్లో మరో అల్పపీడనం ఏపీ తీరానికి సమీపంలో ఏర్పడి.. ఒడిశా వైపుగా ప్రయాణించే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం ప్రభావంతో 10 రోజుల తర్వాత మళ్లీ వర్షాలు పుంజుకుంటాయి. కాగా, గత 24 గంటల్లో తాడేపల్లిగూడెంలో 46.5, విశాఖపట్నంలో 30, పెందుర్తి, చింతపల్లిల్లో 22, అనకాపల్లిలో 18, వాయల్పాడులో 16.3, మాకవరపాలెంలో 12, కమలాపురంలో 11, సంజామలలో 10, నర్సీపట్నంలో 9, అమరపురంలో 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
నేడు రాయలసీమలో విస్తారంగా వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: కోస్తా, రాయలసీమల్లో సోమవారం, మంగళవారం అక్కడక్కడా తేలికపాటి వానలు కురిసే సూచనలున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రధానంగా రాయలసీమలో సోమవారం రాత్రి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. అరేబియా సముద్రానికి సమీపంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. దీనివల్ల తేమగాలులు రాయలసీమ వైపు కదులుతున్నాయి. అదేవిధంగా తక్కువ ఎత్తులో నైరుతి గాలులు వీస్తున్నాయి. ఈ ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. గత 24 గంటల్లో పెద్దపల్లిలో 8.9, చంద్రగిరిలో 6.7, రామచంద్రాపురంలో 6.6, తిరుపతిలో 6.2, కుప్పంలో 5.0, పెద్దారవీడులో 4.9, శ్రీరంగరాజపురంలో 4.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. -
మరో రెండ్రోజులు తేలికపాటి వానలు
సాక్షి,విశాఖపట్నం/కోడూరు(అవనిగడ్డ)/బుట్టాయగూడెం/సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో ఆదివారం, సోమవారం అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వానలు, ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తెలంగాణ, రాయలసీమ మీదుగా కోస్తా తీరం వరకు ఆవరించి ఉంది. ఇది సముద్రమట్టానికి 1.5 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. కృష్ణా జిల్లా భావదేవరపల్లిలో అత్యధికంగా 14.7 సెం.మీ వర్షం కురిసింది. నాగాయలంకలో 12.1, గణపవరంలో 9.8, అవనిగడ్డలో 9.4, పెనుమంట్ర, రేపల్లెల్లో 8.6, బైరెడ్డిపల్లెలో 8.4, రెడ్డిగూడెంలో 8.0, నిడదవోలులో 7.4, అద్దంకిలో 7.0, చింతలపూడిలో 6.7, అత్తిలిలో 6.3, గొలుగొండలో 6.1, విజయవాడలో 6.0, నున్నలో 5.9 సెం.మీ వర్షపాతం నమోదైంది. కృష్ణా జిల్లా కోడూరులో నీట మునిగిన ఆలయం.. శనివారం కురిసిన భారీ వర్షాలకు కృష్ణా జిల్లా కోడూరు మండల కేంద్రంలో శ్రీబాల త్రిపుర సుందరీ సమేత సోమేశ్వరస్వామి ఆలయం నీట మునిగింది. ఆలయం లోపల మోకాలు లోతున నీరు చేరడంతో స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించేందుకు అర్చకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో మూడు గంటలపాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి కొండవాగులు పొంగిపొర్లాయి. బుట్టాయగూడెం మండలం రెడ్డిగణపవరం సమీపంలోని జల్లేరు వాగు, పాలకుంట, కాకులవారిగూడెం, పద్మవారిగూడెం సమీపంలో వాగులు, కేఆర్ పురంలో బైనేరు వాగు ఉధృతంగా ప్రవహించాయి. జల్లేరు వాగు ఉధృతికి సుమారు రెండు గంటల పాటు వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గుంటూరు జిల్లా రేపల్లె, అమృతలూరు, గుంటూరు, మంగళగిరి, నిజాంపట్నం, పొన్నూరు, తాడేపల్లి, తాడికొండ, పెదకాకాని, నగరం, పిట్టలవానిపాలెం, తదితర మండలాల్లో భారీ వర్షం పడింది. జిల్లాలో శనివారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు రేపల్లె మండలంలో అత్యధికంగా 85.5 మిల్లీమీటర్లు, అమృతలూరు మండలంలో 52 మి.మీ, మంగళగిరిలో 46.75 మి.మీ, నిజాంపట్నంలో 46 మి.మీల వర్షపాతం నమోదైంది. ప్రత్తిపాడు మండలం గొట్టిపాడు పొలాల్లో తాటి చెట్టుపై పిడుగు పడటంతో మంటలు చెలరేగి చెట్టు నిలువునా కాలిపోయింది. గుంటూరు నగరంలో రోడ్లపై నీటితో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. తాడికొండ నియోజకవర్గం పరిధిలో చీకటి వాగు, ఎర్రవాగు, నక్కవాగు, కోటేళ్ల వాగు, కొండవీటి వాగులు పొంగిపొర్లాయి. సమీపంలోని పంట పొలాల్లో వరద నీరు చేరింది. పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. గుంటూరు–తుళ్లూరుల మ«ధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తాడేపల్లిలోని పలు లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది. -
ఆవర్తనం ప్రభావంతో. రాగల 48 గంటల్లో భారీ వర్షాలు
మహారాణిపేట (విశాఖ దక్షిణ)/సాక్షి, అమరావతి: ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాగల 48 గంటల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖలోని వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీన పడిందని, దీనికి అనుబంధంగా దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది. ఉపరితల ఆవర్తనం మధ్యస్త ట్రోపోస్ఫియరిక్ స్థాయి వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతి దిశ వైపు వంగి ఉందని, తూర్పు–పశ్చిమ షియర్ జోన్ వెంబడి సముద్ర మట్టం నుంచి 2.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల మధ్య కొనసాగుతూ ఎత్తుకు వెళ్లేకొద్దీ దక్షిణం వైపు వంగి ఉందని వెల్లడించింది. ఈ ప్రభావం వల్ల ఉత్తర, దక్షిణ కోస్తాలతోపాటు రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు వివరించారు. కాగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విస్తారంగా వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలసలో అత్యధికంగా 88.25 మి.మీ. వర్షపాతం నమోదైంది. -
విస్తరిస్తున్న ‘ఆవర్తనం’
సాక్షి, అమరావతి/ విశాఖపట్నం/ అవనిగడ్డ/ కర్నూలు: దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాలపై ఆవరించి ఉన్న ఉపరితల ఆవర్తనం ఆంధ్రప్రదేశ్ తీరానికీ విస్తరించింది. దీని ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో (సోమ, మంగళవారాలు) రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని తీర ప్రాంతాల పరిసరాల్లో సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. మరోవైపు అల్పపీడన ప్రభావం వల్ల రాష్ట్రంలో పశ్చిమ, వాయవ్య దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం వర్షాలు కురిశాయి. కొన్నిచోట్ల భారీ వర్షాలు కురవగా, అనేక ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. కర్నూలు జిల్లాలో తుంగభద్ర పరీవాహక ప్రాంతాలైన మంత్రాలయం, ఎమ్మిగనూరు తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురవడంతో నదిలో వరద నీరు పోటెత్తింది. గోనెగండ్ల, గూడూరు, సీ.బెళగల్, వెల్దుర్తి తదితర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడటంతో హంద్రీ నదికి వరద చేరింది. మంత్రాలయం క్షేత్రం జలమయమైంది. నల్లవాగు, తుమ్మలవాగు పొంగడంతో రాకపోకలు స్తంభించాయి. తుమ్మలవాగులో లారీ చిక్కుకుపోగా అతి కష్టం మీద బయటకు తీశారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం రాత్రి వరకు జిల్లాలోని కోడుమూరులో అత్యధికంగా 120.4 మి.మీ., ఎమ్మిగనూరులో 116.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఆదివారం ఉదయం 8 గంటల సమయానికి గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో అత్యధికంగా 54.8 మి.మీ వర్షం కురిసింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 52.5, గూడూరులో 41.5, శ్రీకాకుళం జిల్లా కోవిలంలో 39.3, రేగిడి ఆముదాలవలసలో 35.3, పాలకొండలో 34.5, బొబ్బిలిలో 32, కర్నూలు జిల్లా మంత్రాలయంలో 31.5, కృష్ణా జిల్లా గుడివాడలో 30.8, విజయనగరం జిల్లా బొండేపల్లిలో 30.5 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని 45 ప్రాంతాల్లో 15 నుంచి 30 మి.మీ. వర్షం పడగా, అనేకచోట్ల 5 నుంచి 16 మి.మీ. వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలతో మచిలీపట్నం జలమయమైంది. విజయవాడలో తేలికపాటి జల్లులు కురిశాయి. హంసలదీవి తీరంలో రాకాసి అలలు కృష్ణా జిల్లా హంసలదీవి సాగర తీరం అల్లకల్లోలంగా మారింది. పాలకాయతిప్ప బీచ్ వద్ద సముద్ర అలలు 4 మీటర్ల ఎత్తున ఎగసిపడ్డాయి. సముద్రపు నీరు సుమారు 200 మీటర్ల మేర ముందుకు చొచ్చుకువచ్చి డాల్ఫిన్ భవనం చుట్టూ చేరింది. తీరం పొడవునా పర్యాటకులు సేదతీరేందుకు ఏర్పాటు చేసిన సిమెంట్ బల్లలు సముద్ర అలల ధాటికి కొట్టుకుపోయాయి. తీరానికి వెళ్లే రహదారి ముందు భాగాన్ని అలలు బలంగా తాకడంతో ధ్వంసమైంది. తారు, మట్టి కొట్టుకుపోయి కొండరాళ్లు బయటపడ్డాయి. బీచ్ నుంచి సాగర సంగమం వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర ఇసుక తిన్నెలు కోతకు గురయ్యాయి. సముద్ర స్థితిగతుల్లో మార్పులు చోటుచేసుకున్నాయని, పర్యాటకులెవదూ తీరానికి రావద్దని అధికారులు కోరారు. -
Southwest Monsoon: 'నైరుతి' పలకరింపు
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశించాయి. రాయలసీమలోని పలు ప్రాంతాలను రుతుపవనాలు శుక్రవారం తాకాయి. గురువారం కేరళలో ప్రవేశించిన రుతుపవనాలు శుక్రవారం దక్షిణ అరేబియా సముద్రం, నైరుతి బంగాళాఖాతం, లక్షద్వీప్, కేరళ మొత్తం వ్యాపించాయి. ఏపీతో పాటు, కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లోను ఇవి వ్యాపించినట్లు అమరావతి, విశాఖ వాతావరణ కేంద్రాలు తెలిపాయి. ఈ నెల 7, 8 తేదీల్లో కోస్తాలోని కృష్ణాజిల్లా వరకు, అనంతరం నెమ్మదిగా పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు, 11వ తేదీన ఉత్తరాంధ్ర అంతటా రుతుపవనాలు ప్రవేశించనున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రుతుపవనాల ప్రభావం, వాతావరణ మార్పుల నేపథ్యంలో మూడురోజులు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. కర్ణాటక నుంచి భారీ మేఘాలు రాయలసీమ వైపుగా విస్తరిస్తుండటంతో శనివారం అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో భారీవర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపారు. మరోవైపు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం చల్లబడి అనేకచోట్ల వర్షాలు పడ్డాయి. రుతుపవనాల ప్రభావంతో రాయలసీమలోని ఎక్కువచోట్ల భారీ వర్షాలు కురిశాయి. అనంతపురం జిల్లాలో 55 మండలాలకుగాను 47 మండలాల్లో గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు వర్షం కురిసింది. అనంతపురంలో 12 సెంటీమీటర్లు, నంబులిపులికుంటలో 10, రాప్తాడులో 9, రాయచోటి, సింగనమలల్లో 8, లక్కిరెడ్డిపల్లె, సెత్తూరు, అమరపురాల్లో 7, ధర్మవరంలో 6, కంబదూరు, మదనపల్లె, ఓక్‌లలో 5, నెల్లిమర్ల, అరకు, కైకలూరు, బ్రహ్మసముద్రం, ఊటుకూరు, గుర్రంకొండ, కూనుర్పి, తాడిమర్రి, కనెకల్లు, తాడిపత్రి, సంబపల్లె, కల్యాణదుర్గంలలో 4 సెంటీమీటర్ల మేర వర్షాలు కురిశాయి. . పిడుగులుపడి ఇద్దరి మృతి గుడుపల్లె/మదనపల్లె టౌన్: చిత్తూరు జిల్లాలోని గుడుపల్లె, మదనపల్లె మండలాల్లో శుక్రవారం పిడుగులు పడి ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. గుడుపల్లె మండలం తిమ్మనాయనపల్లెలో పిడుగుపాటుకు మునెప్ప (50) ప్రాణాలు కోల్పోయాడు. మదనపల్లె మండలం ఈశ్వరమ్మకాలనీకి చెందిన వారు మైదానంలో క్రికెట్ ఆడుకుంటుండగా పిడుగుపడింది. ఆడుకుంటున్న 8 మంది గాయపడ్డారు. వీరిలో ఆటోనడుపుకొంటూ జీవనం సాగించే ఎస్.రోషన్ (25) అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయిన ఆరీఫ్ (25)ను తిరుపతి ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. -
Southwest Monsoon: సకాలంలోనే రాష్ట్రానికి నైరుతి
సాక్షి, విశాఖపట్నం: ముందుగా అనుకున్నట్లుగానే రుతుపవనాలు జూన్ మొదటి వారంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాకనున్నాయి. జూన్ 5 లేదా 6వ తేదీ నాటికి రాయలసీమని నైరుతి తాకనుంది. ఆ సమయంలో ఉరుములతో కూడిన వర్షాలు విస్తరించి, దక్షిణ కోస్తాంధ్రలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు రానున్నాయి. ఆ తర్వాత గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు విస్తరిస్తాయి. అలాగే, జూన్ 11 లేదా 12 నాటికి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు విస్తరించనున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. గత పదేళ్ల రికార్డులను బట్టి చూసినా కూడా ఇదే తరహాలో నైరుతి విస్తరణ జరుగుతూ వస్తోందని వారు వివరిస్తున్నారు. గత రెండేళ్లు మాదిరిగానే.. ఈసారీ రుతుపవనాల కాలంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని, పంటలకు అనుకూలంగా వర్షాలు కురిసి అన్నదాతలకు మేలు చేకూరుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఐఎండీ భిన్న ప్రకటనల్లో వాస్తవమెంత? తొలుత మే 31న నైరుతి కేరళని తాకనున్నట్లు కొద్ది రోజుల క్రితం భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రకటన చేసింది. ఆ తర్వాత ఆ ప్రకటనను మార్చి రుతుపవనాలు కాస్త ఆలస్యమవుతున్నాయని, జూన్ 3న కేరళని తాకనున్నాయని ఐఎండీ తాజాగా మరో ప్రకటన చేసింది. వాస్తవానికి మే 27 నాటికే రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అయితే అప్పటికే రుతుపవనాలు బలహీనంగా మారటంతో విస్తరణలో జాప్యం జరుగుతోందని, మరో రెండ్రోజుల్లో తిరిగి బలపడి విస్తరణలో వేగం పుంజుకుంటాయని స్పష్టం చేస్తున్నారు. రెండు రోజులపాటు వర్షాలు సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ దక్షిణ): నాలుగు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా దడ పుట్టించిన ఎండల తీవ్రత సోమవారం తగ్గింది. అక్కడక్కడా కొన్నిచోట్ల మినహా మిగిలిన ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి.మరోవైపు రానున్న రెండు రోజులు రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి, విశాఖ వాతావరణ కేంద్రాలు తెలిపాయి. అల్పపీడనాలు లేకపోవడం వల్ల.. నైరుతి రుతుపవనాలు సకాలంలోనే రాష్ట్రంలోకి రానున్నాయి. రుతుపవనాలు వచ్చిన తర్వాత తొలకరి వర్షాలు మెల్లమెల్లగా అన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి. ఇప్పటికే కేరళని తాకిన రుతుపవనాలు బలహీనంగా ఉండటం వల్ల వర్షాలు కేరళకు మాత్రమే పరిమితమైపోయాయి. అయినా త్వరలోనే వేగం పుంచుకుంటాయి. జూన్ నెలలో తొలి రెండు వారాల వరకు బంగాళాఖాతంలో ఎలాంటి అల్పపీడనాలు ఏర్పడే అవకాశం లేనందున రుతుపవనాలు విస్తరించనున్నాయి. – సాయి ప్రణీత్, వాతావరణ నిపుణుడు -
కొనసాగుతున్న ద్రోణి
మహారాణిపేట(విశాఖ దక్షిణ): ద్రోణి, ఉపరితల ఆవర్తనాల వల్ల రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని విశాఖలోని వాతావరణ కేంద్రం సోమవారం ప్రకటించింది. బిహార్ తూర్పు ప్రాంతాల నుంచి జార్ఖండ్, ఒడిశా, విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా, దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి వ్యాపించి ఉందని, అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత పరిసరాల మీద ఉపరితల ఆవర్తనం ఉందని, వీటి ప్రభావంతో రానున్న 48 గంటల్లో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రతోపాటు రాయలసీమలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఇదే సమయంలో ఉత్తర కోస్తాలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు వేగంతో ఈదురుగాలులు వీచే వీలుందని పేర్కొంది. -
తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: తూర్పు మధ్య బంగాళాఖాతం, దాని పరిసరాల్లోని ఉత్తర అండమాన్ దగ్గర ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తూర్పు మధ్య బంగాళాఖాతంలో శనివారం మధ్యాహ్నం అల్పపీడనం ఏర్పడింది. ఇది తదుపరి 36 గంటల్లో బంగ్లాదేశ్ తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉండడంతో రాష్ట్రంపై అల్పపీడన ప్రభావం ఉండబోదని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈశాన్య పవనాలు ప్రవేశించడంతో ఉష్ణోగ్రతల్లో తగ్గుముఖం కనిపిస్తోంది. విశాఖ మన్యంలోని మినుములూరులో 16.5 డిగ్రీలు, అరకులోయలో 18.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవ్వగా ఆరోగ్యవరంలో 19.5 డిగ్రీలు నమోదైంది. రానున్న రెండు రోజులూ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. -
మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే మూడు రోజులపాటు పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం జార్ఖండ్, దాని పరిసర ప్రాంతాలలో 1.5 నుంచి నుంచి 7.6 కిలోమీటర్ల త్తు మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. ఎత్తుకు వెళ్ళేకొద్దీ నైరుతి దిశ వైపుకు వంపు తిరిగి ఉందని స్పష్టం చేసింది. సముద్ర తీరంలో ఏర్పడిన గాలుల కలయిక (షియర్ జోన్) ప్రభావంతో ఉత్తర కర్ణాటక పరిసర ప్రాంతాల్లో 3.6 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. అదేవిధంగా... నైరుతి రుతుపవనాలు కోస్తా, రాయలసీమపై చురుగ్గా ఉన్నట్లు పేర్కొంది. ఈ ప్రభావంతో మరో రెండు రోజులపాటు రాష్ర్ట వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే శ్రీకాకుళం, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులపాటు రాష్ర్ట వ్యాప్తంగా చాలాచోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రభుత్వ అధికారులను వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. (నేడు ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన ) -
నేడు ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన
సాక్షి,విశాఖపట్నం: సముద్ర తీరంలో ఏర్పడిన గాలుల కలయిక (షియర్ జోన్) ప్రభావం రాష్ట్రంపై సాధారణంగా కొనసాగుతోంది. మరోవైపు ఉత్తర కర్ణాటక పరిసర ప్రాంతాల్లో 3.6 నుంచి 4.5 కి.మీ ఎత్తు వరకూ ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. అదేవిధంగా... నైరుతి రుతుపవనాలు కోస్తా, రాయలసీమపై చురుగ్గా ఉన్నాయి. వీటన్నింటి ప్రభావంతో నేడు, రేపు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బుధవారం ఉత్తర కోస్తా, యానాం పరిసరప్రాంతాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. 18వ తేదీన రాయలసీమలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. తిరువూరులో 17 సెం.మీ, విశాఖపట్నంలో 10 సెం.మీ, చోడవరంలో 8 సెం.మీ, ధవళేశ్వరంలో 7 సెం,మీ, పిడుగురాళ్ల, తణుకు, కందుకూరులో 6 సెం.మీ, బద్వేల్, ఆత్మకూరు, అవనిగడ్డ, కాకినాడ, విజయవాడ, రాజమండ్రి, సంతమాగులూరు, బొబ్బిలిలో 5 సెం.మీ వర్షపాతం నమోదైంది. -
నేడు, రేపు వర్షాలే
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్ వరకూ ఏర్పడిన ఉత్తర–దక్షిణ ఉపరితల ద్రోణి బలహీనపడింది. దీనివల్ల గాలుల కలయికతో ఏర్పడిన షియర్ జోన్ ప్రభావం రాష్ట్రంపై కొనసాగుతోంది. మరోవైపు నైరుతి రుతు పవనాలు కోస్తా, రాయలసీమపై చురుగ్గా ఉన్నాయి. వీటన్నింటి ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో.. నేడు, రేపు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. వెంకటగిరి, చిత్తూరులో 8 సెం.మీ., జియ్యమ్మవలస, తంబాలపల్లె, పలమనేరులో 5, తాడేపల్లిగూడెంలో 4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. -
కొనసాగుతున్న ఉపరితల ద్రోణి
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్ వరకు ఉత్తర–దక్షిణ ఉపరితల ద్రోణి 5.8 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. అదేవిధంగా ఉపరితల ద్రోణి ప్రభావం దక్షిణ ద్వీపకల్పంపై చురుగ్గా కొనసాగుతోంది. ద్రోణి ఏర్పడటంతో నైరుతి రుతుపవనాలు కోస్తా, రాయలసీమలపై చురుగ్గా కదులుతున్నాయి. వీటన్నింటి ప్రభావంతో.. నేడు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే 13, 14 తేదీల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంది. గడిచిన 24 గంటల్లోనూ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వానలు కురిశాయి. అమలాపురంలో 10 సెం.మీ, చిత్తూరులో 6, పాలకోడేరులో 5, రాయచోటిలో 5, కైకలూరు, భీమవరం, అచ్చంపేట, రాజంపేట, పుంగనూరు, పాలసముద్రంలలో 4 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. -
రాష్ట్రంలో 3 రోజులు వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వాయవ్య బంగాళాఖాతంలో ఆదివారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది ఒడిశా, దాన్ని ఆనుకొని ఉన్న పశ్చిమబెంగాల్ తీరాలకు సమీపంలో కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఈ ప్రాంతంలో 7.6 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపు వంగి ఉంది. అల్పపీడనం ఏర్పడటంతో కోస్తా, రాయలసీమలపై నైరుతి రుతుపవనాల ప్రభావం చురుగ్గా కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ► అల్పపీడన ప్రభావంతో.. కోస్తా, రాయలసీమల్లో సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. ► ఈ నెల 7, 8 తేదీల్లో ఉత్తరాంధ్ర, యానాం పరిసర ప్రాంతాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. ► అల్పపీడనంతో పాటు ఉపరితల ఆవర్తనం ఏర్ప డటంతో సముద్రం అల్లకల్లోలంగా ఉండనుంది. ► తీరం వెంబడి నైరుతి దిశగా ఉత్తర కోస్తా తీరంలో నేడు, రేపు గంటకు 45 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. అదేవిధంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. ► సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు రెండు రోజుల పాటు వేటకు వెళ్లకూడదని విశాఖ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ► గడిచిన 24 గంటల్లో కోస్తాంధ్రలో విస్తారంగా వానలు కురిశాయి. ► చింతూరు, వరరామచంద్రాపురం, కూనవరంలో 6 సెం.మీ, పార్వతీపురం, నర్సీపట్నంలో 5, సీతానగరం, చింతలపూడి, పోలవరం, తిరువూరులో 4 సెం.మీ వర్షపాతం నమోదైంది. -
మూడు రోజుల పాటు వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: ఉత్తర కర్ణాటక పరిసర ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. మరోవైపు నైరుతి రుతుపవనాల ప్రభావం కోస్తాపై బలహీనంగానూ, రాయలసీమ ప్రాంతాల్లో చురుగ్గానూ ఉంది. వీటి ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే.. కోస్తా, రాయలసీమల్లో 29, 30 తేదీల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని పేర్కొంది. గత 24 గంటల్లో ఎమ్మిగనూరులో 4 సెం.మీ, నల్లమడ, కాకినాడ, నందవరంలో 2 సెం.మీ వర్షపాతం నమోదైంది. -
రాష్ట్రంలో చురుగ్గా నైరుతి
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా కదులుతున్నాయి. రాగల 48 గంటల్లో కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాలు, రాయలసీమలోని ఇతర జిల్లాలకు, మధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించనున్నాయి. 76 గంటల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు, కోస్తాలోని ఇతర ప్రాంతాలకు, సిక్కిం, ఒడిశా, పశ్చిమబెంగాల్ మొదలైన ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ► తూర్పు మధ్య బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుంది. ► నేటి నుంచి మూడ్రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయి. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ► రాగల 4 రోజుల పాటు ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ఆయా జిల్లాల యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ► తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ట్రోపోస్పియర్ వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం వల్ల వచ్చే 12 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని, 24 గంటల్లో బలపడే అవకాశం ఉందని ఐఎండీ అమరావతి శాఖ తెలిపింది. ► నాలుగు రోజులు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ కమిషనర్ కన్నబాబు సూచించారు. పిడుగుల పడే ప్రమాదం ఉన్నందున రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు చెట్ల కిందకు, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని హెచ్చరించారు. -
కోస్తాంధ్రకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళవారం తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ మరింత బలపడనుందని పేర్కొంది. దీని వల్ల తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. అల్ప పీడన ప్రభావంతో రేపు కోస్తాంధ్ర అంతటా విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయన్నారు. (చదవండి: ఏపీ: మూడు రోజులు భారీ వర్షాలు) ఈ సందర్భంగా మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు రాయలసీమలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. రుతుపవనాల ఆగమనానికి సంకేతంగా రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ రుతుపవనాలు రాగల రెండు రోజుల్లో రాయలసీమతోపాటు కోస్తాంధ్రలోనూ విస్తరించనున్నాయి. మరోవైపు ఈ నెల 10 నుంచి 12వరకు కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. (రెండు రోజుల్లో రానున్న నైరుతి) మరోవైపు తెలంగాణలోకి రుతుపవనాల ప్రవేశం సమీపిస్తున్న వేళ భారీ వర్షాలకు అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళ, బుధవారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురుస్తాయని, గురువారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని సోమవారం తెలిపింది. -
రెండు రోజుల్లో రానున్న నైరుతి
సాక్షి, విశాఖపట్నం: చల్లని కబురు మరో రెండు రోజుల్లో రాష్ట్రాన్ని పలకరించనుంది. చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు 2, 3 రోజుల్లో తమిళనాడులోని మొత్తం ప్రాంతాలకు విస్తరించి.. కోస్తా, రాయలసీమల్లోని కొన్ని ప్రాంతాలకు రానున్నాయి. అదేవిధంగా.. నైరుతి బంగాళాఖాతంలోని మొత్తం ప్రాంతాలు, ఈశాన్య భారత దేశంలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించనున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు తూర్పు విదర్భ, దాని పరిసర ప్రాంతాల్లో, అలాగే తూర్పు మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉన్న అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో 8వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. – నైరుతి రుతుపవనాల ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో రానున్న 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. 9, 10 తేదీల్లో ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయి. – గడిచిన 24 గంటల్లో విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయి. -
అరేబియా సముద్రంలో అల్పపీడనం
-
కోస్తా, రాయలసీమకు వర్షసూచన
సాక్షి, విశాఖపట్నం: రాయలసీమ, తెలంగాణ మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో జూన్ 1, 2 తేదీల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు మబ్బులతో కూడిన వాతావరణం కారణంగా పగటి ఉష్ణోగ్రతలు ఆదివారం 1 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో భీమిలిలో 3 సెం.మీ, సాలూరు, వెంకటగిరి కోటలో 2 సెం.మీ వర్షపాతం నమోదైంది. మరోవైపు ఆగ్నేయ అరేబియా సముద్రం, దాన్ని ఆనుకొని తూర్పు మధ్య అరేబియా సముద్రం, లక్షదీవుల్లో ఆదివారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. సోమవారం ఇదే ప్రాంతంలో వాయుగుండంగా మారనుందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తదుపరి 24 గంటల్లో తుపానుగా మారుతుందని పేర్కొంది. తుపానుగా మారిన తర్వాత ఉత్తర దిశగా ప్రయాణించి ఈ నెల 3వ తేదీ నాటికి ఉత్తర మహారాష్ట్ర, గుజరాత్ తీరాలకు చేరుకునే అవకాశం ఉంది. -
రేపు కేరళలోకి నైరుతి!
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: నైరుతి రుతు పవనాలు తీరం వైపు చురుగ్గా కదులుతున్నాయి. ఇవి జూన్ 1న కేరళలో ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం ప్రకటించింది. దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమెరిన్ ప్రాంతాలు, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతు పవనాలు విస్తరిస్తున్నాయి. రాగల 36 గంటల్లో అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది 48 గంటల్లో బలపడి వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో జూన్ 1న కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు ఛత్తీస్‌గఢ్, దాని పరిసర ప్రాంతాల్లో 2.1 కి.మీ. ఎత్తువరకూ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 0.9 కి.మీ. ఎత్తులో తెలంగాణ, రాయలసీమ, ఇంటీరియర్ కర్ణాటక, కేరళ పరిసరాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ► దీని ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఆది, సోమవారాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి లేదా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ► ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలో మూడు రోజులపాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయి. ► రాయలసీమలో ఒకట్రెండు చోట్ల 41 నుంచి 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ► గడచిన 24 గంటల్లో సి.బెలగలో 10 సెం.మీ., పత్తికొండలో 6, బలిజపేట, హోలగుండలో 5, గరివిడి, మెరకముడిదాం, తెర్లాం, గూడూరు, డోన్‌లో 4 సెం.మీ., బొబ్బిలి, పాలకొండ, చీపురుపల్లి, మందస, భీమిలి, గరుగుబిల్లి, బనగానపల్లి, రామగిరి, ఓక్, ఆరోగ్యవరంలో 3 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. ► తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని అమలాపురం, అంబాజీపేట, అయినవిల్లి, పి.గన్నవరం, ముమ్మిడివరం, కొత్తపేట మండలాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ► రాజమహేంద్రవరం రూరల్ మండలంలో అక్కడక్కడా జల్లులు పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయి. తండ్రీ బిడ్డల్ని కబళించిన పిడుగులు పిడుగులు పడి తండ్రి, ఇద్దరు కుమార్తెలు మృతి చెందిన దుర్ఘటన చిత్తూరు జిల్లా పెద్దపంజాణిలో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కృష్ణప్ప (50) వ్యవసాయం చేస్తూ.. పొలంలోనే పశువుల్ని పోషిస్తున్నాడు. శనివారం సాయంత్రం పాలు పితికేందుకు ఇద్దరు కుమార్తెలు రమాదేవి (24), మీనా (22)తో కలసి పొలం వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో భారీ వర్షంతో పాటు పిడుగులు పడ్డాయి. వర్షం తగ్గినా ఎంతసేపటికీ వారు తిరిగి రాకపోవడంతో కృష్ణప్ప భార్య గ్రామస్తులతో కలసి పొలం వద్దకు వెళ్లి చూడగా.. ముగ్గురూ విగతజీవులై పడి ఉన్నారు. ఈ దుర్ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. -
10న రాష్ట్రానికి నైరుతి
సాక్షి, విశాఖపట్నం/హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, జూన్9, 10 తేదీల్లో తెలుగు రాష్ట్రాలను పలకరించనున్నాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నైరుతి ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. అలాగే 48 గంటల్లో ఆగ్నేయ, నైరుతి బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో జూన్ 1వ తేదీకి కేరళ తీరాన్ని తాకనున్న రుతుపవనాలు.. జూన్ 9, 10 తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించనున్నట్లు తెలిపారు. ఆగ్నేయ అరేబియా సముద్రం, దాన్ని ఆనుకొని ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఈ నెల 31న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది ఏర్పడిన తర్వాత.. నైరుతి పవనాలు మరింత వేగంగా కదలనున్నాయని అధికారులు తెలిపారు. మరోవైపు దక్షిణ తమిళనాడు, తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో నేడు, రేపు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో రానున్న రెండు రోజుల పాటు 41 నుంచి 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి. -
తగ్గుతున్న ఉష్ణతాపం
సాక్షి,విశాఖపట్నం: రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. వడగాడ్పుల తీవ్రత ఒకట్రెండు రోజులున్నా.. ఎండలు మాత్రం అంతగా ఉండవని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాయలసీమ నుంచి తమిళనాడు వరకూ సముద్రమట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో ఉపరితల ద్రోణి విస్తరించి ఉండటమే దీనికి కారణమంటున్నారు. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో మాత్రం గురు, శుక్రవారాల్లో ఒకట్రెండు చోట్ల 40 నుంచి 43 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదులుతున్నాయి. కేరళ తీరాన్ని ఎప్పుడు తాకుతాయన్నదానిపై రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని అధికారులు చెప్పారు. -
24 గంటల్లో దేశంలోకి ‘నైరుతి’
మహారాణిపేట (విశాఖ దక్షిణ): నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వచ్చే 24 గంటల్లో దేశంలోకి ప్రవేశించనున్నాయి. రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం అండమాన్ సముద్రం, దానిని ఆనుకుని ఉన్న బంగాళాఖాతం మధ్య ప్రాంతాలకు విస్తరిస్తున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ తెలిపారు. ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు మధ్య ప్రాంతం వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఛత్తీస్‌గఢ్ పరిసరాల్లో 1.5 నుంచి 3.1 కిలోమీటర్ల మధ్య ఉపరితల ఆవర్తనం విస్తరించింది. దీని ప్రభావంతో బుధవారం దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఒకటిరెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వడగాలుల ప్రమాదం రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు కాస్త తగ్గినా వచ్చే మూడు రోజలపాటు రాష్ట్రంలో పలుచోట్ల ఎండ నిప్పుల వానలా ఉంటుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. వడగాలులు వీస్తాయని, 41 నుంచి 43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటికి రావొద్దని సూచించారు.