సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. అంతకంతకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. శుక్రవారం సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పలు జిల్లాల్లో వడగాడ్పులు హడలెత్తించాయి. దీనికితోడు విపరీతమైన ఉక్కపోతతో జనం అల్లాడారు. రాష్ట్రంలో అత్యధికంగా విజయవాడలో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే, బాపట్ల, జంగమహేశ్వరపురంలలో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఉంపన్ పెను తుపాను కారణంగా.. గాలిలోని తేమంతా తుడిచిపెట్టుకుపోవడం వల్లే రాష్ట్రంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు వివరించారు. రానున్న రెండు రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు ఉంపన్ పూర్తిగా బలహీనపడింది. ఉత్తర బంగ్లాదేశ్ దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం మరింత బలహీనపడి అల్పపీడనంగా మారింది. కాగా, విపరీతమైన ఎండల కారణంగా వడదెబ్బకు గురై విశాఖ జిల్లాలో శుక్రవారం ఒకరు మరణించారు. జిల్లాలోని బుచ్చెయ్యపేట మండలం కరక గ్రామానికి చెందిన గరికి గాటీలు(60) ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురై పొలంలోనే కుప్పకూలి మృతి చెందాడు.
పవర్..హీట్!
రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. తాజా పరిస్థితిని శుక్రవారం సమీక్షించిన ఉన్నతాధికారులు ముందస్తు జాగ్రత్తలపై కార్యాచరణ రూపొందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మండు వేసవిలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా చూడాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి ఆదేశించారు. ఉష్ణోగ్రతల ప్రభావాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
► రాష్ట్రంలో చాలా చోట్ల 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ట్రాన్స్ ఫార్మర్లను చల్లబరచే ఆయిల్‌ను తరచూ పరిశీలించాలి. కాలిపోయినా, వేడితో మొరాయించినా తక్షణమే మార్చాలి.
► ఉష్ణోగ్రతల పెరుగుదలతో విద్యుత్ తీగలు సాగుతుంటాయి. గాలి దుమారం సమయంలో తీగలు రాసుకుని ప్రమాదం సంభవించే వీలుంది. ఇలాంటి వాటిని గుర్తించి తక్షణమే జాగ్రత్తలు తీసుకోవాలి.
► లోడ్ పెరగడం వల్ల గ్రిడ్‌లో సమస్యలు తలెత్తకుండా లోడ్ డిస్పాచ్ సెంటర్ అప్రమత్తంగా ఉండాలి.
► పీక్ అవర్స్‌లో విద్యుత్తు వాడకం అత్యధికంగా ఉంది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో 9 వేల మెగావాట్ల డిమాండ్ నమోదైంది. ఏసీలు, కూలర్ల వినియోగమే దీనికి ప్రధాన కారణమని విద్యుత్ సిబ్బంది తెలిపారు.
► విద్యుత్ డిమాండ్ గత రెండు రోజులుగా వేగంగా పెరుగుతోంది. శుక్రవారం 187 మిలియన్ యూనిట్లు నమోదైంది. క్రితం రోజుతో పోలిస్తే ఇది 13 మిలియన్ యూనిట్లు ఎక్కువ. ఉత్పత్తి సంస్థలు, డిస్కమ్‌లు, ఎస్‌ఎల్‌డీసీల మధ్య సమన్వయం పెరగాలి.
► ప్రస్తుతం గృహ విద్యుత్ వినియోగమే పెరుగుతోంది. ఈ నెలాఖరులోగా వాణిజ్య, పారిశ్రామిక వినియోగం పెరిగితే విద్యుత్ డిమాండ్ రోజుకు 200 మిలియన్ యూనిట్లు దాటే అవకాశం ఉంది.
► మార్కెట్లో చౌకగా లభించే విద్యుత్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, కుదరని పక్షంలో ధర్మల్ విద్యుత్‌ను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. జెన్‌కో ప్లాంట్ల వద్ద 15 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. వేసవిలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని జెన్‌కో అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment