ఉక్కపోత కూడా తీవ్రం కానుందన్న వాతావరణ శాఖ
పశ్చిమ మధ్యబంగాళాఖాతంలో అల్పపీడనం
రేపు మధ్యాహ్నానికి వాయుగుండంగా మార్పు
రాష్ట్రంపై దీని ప్రభావం లేనట్టే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు మళ్లీ పెరగనున్నాయి. అకాల వర్షాల నేపథ్యంలో గత పది రోజులుగా గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతూ వచ్చాయి. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మారడం, నైరుతి సీజన్‌కు సమయం అనుకూలంగా మారుతున్న తరుణంలో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని వాతావరణ శాఖ సూచించింది. ఉక్కపోత కూడా తీవ్రం కానుందని తెలిపింది. ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్ర తీరానికి సమీప నైరుతి ప్రాంతంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బుధవారం ఉదయం అల్ప పీడనం ఏర్పడింది.
దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఈ అల్ప పీడనం ఈశాన్య దిశలో కదిలి ఈ నెల 24వ తేదీ నాటికీ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ తర్వాత ఈ వాయుగుండం ఈశాన్య దిశలో కదులుతూ మరింత బలపడి ఈ నెల 25న ఈశాన్య, దానికి ఆనుకొని ఉన్న వాయవ్య బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే దీని ప్రభావం రాష్ట్రంపై అంతగా ఉండబోదని తెలిపారు.
రుతుపవనాలకు అనుకూలంగా..
నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లోని మిగిలిన ప్రాంతాలు, ఉత్తర మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రానికి తూర్పు దిశ నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని, రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి
మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించారు. బుధవారం రాష్ట్రంలో చాలాచోట్ల సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీ సెల్సీయస్ మేర తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గరిష్టంగా ఆదిలాబాద్‌లో 41.8 డిగ్రీ సెల్సీయస్, కనిష్టంగా మెదక్‌లో 24.3 డిగ్రీ సెల్సీయస్ ఉష్ణోగ్రత నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment