రాష్ట్రంలో వేగంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతున్నాయి. ప్రస్తుత సమయంలో నమోదు కావాల్సిన సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీ సెల్సియస్ వరకు తక్కువ నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. బుధవారం రాష్ట్రంలో అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
ఒకవైపు ఉష్ణోగ్రతలు తగ్గడం, మరోవైపు రాష్ట్రానికి తూర్పు, ఈశాన్య దిశల నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తుండడంతో చలి తీవ్రత పెరిగింది. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకోవటంతో జ్వరాలు, జలుబు, దగ్గులాంటి అనారోగ్య సమస్యలు పెరుగుతున్నట్లు వైద్యారోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
రాష్ట్రమంతా పడిపోతున్న ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో బుధవారం కనిష్ట ఉష్ణోగ్రత 9 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 9 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో 9.7 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 ప్రాంతాల్లో 13 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రధాన పట్టణాల్లో కూడా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.
బుధవారం నిజామాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 32.1 డిగ్రీలు నమోదుకాగా, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 11.8 డిగ్రీల సెల్సియస్‌గా రికార్డయ్యింది. ఆదిలాబాద్, హనుమ కొండ, మెదక్, పటాన్‌చెరు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీలు.. హైదరాబాద్, ఖమ్మం, రామగుండం, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో 3 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యాయి. రానున్న మూడురోజులు ఇదే తరహా వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment